ఇకనైనా జాగ్రత్త..!
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:34 AM
స్థాయిలోనూ, సంఖ్యలోనూ తేడాలు ఉండవచ్చును గానీ, మత, సంస్కృతీపరంగా ప్రయాగ్రాజ్ కుంభమేళా ఎంత విశిష్టమైనదో, కోల్కతా దుర్గాపూజోత్సవం కూడా అంతే ప్రాధాన్యమైనది. దేశంలో అత్యంత...
స్థాయిలోనూ, సంఖ్యలోనూ తేడాలు ఉండవచ్చును గానీ, మత, సంస్కృతీపరంగా ప్రయాగ్రాజ్ కుంభమేళా ఎంత విశిష్టమైనదో, కోల్కతా దుర్గాపూజోత్సవం కూడా అంతే ప్రాధాన్యమైనది. దేశంలో అత్యంత జనసాంద్రత గల కోల్కతా నగర వీధులన్నీ లక్షలాదిమందితో కిటకిలాడిపోతూంటాయి. బెంగాలీలే కాదు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జనం కూడా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన దుర్గాదేవి మండపాలను వరుసబెట్టి చూడటానికి కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతూంటారు. అలంకరణలోనూ, దుర్గాదేవి విగ్రహాల ఎత్తులోనూ పోటాపోటీగా తీర్చిదిద్దిన పండాల్స్ కన్నులపండువగా ఉంటాయి. విభిన్న కార్యక్రమాలతో, భజనలతో అలరిస్తున్న ఈ మండపాల్లో వివిధ అవతారాల్లో దర్శనమిస్తున్న శక్తిస్వరూపిణిని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరుతారు. ఆనందపారవశ్యంలో మునిగితేలుతున్న ఈ లక్షలాదిమందికి భద్రంగా దేవీదర్శనం చేయించి, సురక్షితంగా ఇంటికి చేరేట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. మండపాల నిర్వాహకులు, పోలీసులు, వివిధ ప్రభుత్వశాఖల మధ్య విస్తృతమైన సహకారం, సమన్వయం ఇటువంటి సామూహిక వేడుకల సందర్భంలో అత్యవశ్యం.
కోల్కతాలోని చోర్బగాన్ సర్వజనీన దుర్గామండపంలో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగి 19 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో పాతికమంది గాయపడటం బాధాకరం. మరీ ముఖ్యంగా ఇటువంటి సామూహిక ఉత్సవాల సందర్భంలో చోటుచేసుకొనే ఈ తరహా ఘటనల గురించి మాట్లాడుకోవాల్సి రావడం నిజానికి దురదృష్టకరం. ఈ ఘటనలో వర్షాన్ని తప్పుబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు ఇరుకుగా, చీకటిగా ఉండటం, అప్పటికే ప్రవేశద్వారం వద్ద అత్యధిక సంఖ్యలో ఉన్న భక్తులంతా ఒక్కసారిగా లోనికి చొచ్చుకురాకుండా నియంత్రించగలిగే సంఖ్యలో పోలీసులు, బలమైన హెచ్చరిక వ్యవస్థలు లేకపోవడం దీనికి కారణాలు. చుట్టూచీకట్లో విగ్రహం మీద పడే కాంతిని నియంత్రిస్తూ భక్తులకు ఓ అద్భుతమైన అనుభూతినివ్వాలని ఈ మండపం నిర్వాహకుల ఆలోచన. పాలకుల సంతాప ప్రకటనలు, పరామర్శలు, నష్టపరిహారాలు, అరెస్టులు, అధికారులపై చర్యలు పోయినవారి ప్రాణాలను తీసుకురాలేవు. అక్టోబర్లో వర్షాలు పడటం, సెలవు దినాల్లో రద్దీపెరగడం అనూహ్య పరిణామాలేమీ కావు. పైగా, పశ్చిమబెంగాల్లో సువేందు అధికారి అధికారంలోకి వచ్చిన తరువాత తొలిగా జరుగుతున్నవి కనుక ఈ దుర్గాపూజ వేడుకలకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇచ్చింది. ఈ ఏడాది పండాల్స్ సంఖ్య నాలుగోవంతు పెరిగి 57వేలకు చేరాయని గర్వంగా చెప్పుకోవడంతో పాటు, కోల్కతా నగరంలోని మండపాలను ఆయన వరుసబెట్టి సందర్శించారు. కేంద్ర హోంమంత్రి కూడా సువేందుకు బలం చేకూర్చేందుకు కోల్కతా వచ్చి, ఈ ఘటన నేపథ్యంలో పరామర్శలు చేయవలసి వచ్చింది. హోమ్గార్డుల స్థానంలో పూర్తి పోలీసు భద్రత, అనుభవజ్ఞులైన సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణ, జన సమూహ నియంత్రణ ఏర్పాట్లు జరిగివుంటే బాగుండేది.
వేడుకలను అద్భుతంగా నిర్వహించాలన్న తాపత్రయంలో భద్రతను విస్మరించడం ఏ స్థాయిలోనూ కూడదు. ఈ ఘటన తరువాత ప్రభుత్వం నియమించిన అత్యున్నతస్థాయి కమిటీ ఒకటి పలు ప్రధాన మండపాల్లో సైతం విభిన్నరకాల భద్రతా లోపాలు గుర్తించింది. పండాల్స్లో అత్యధికం సులువుగా తగలబడే సామగ్రితో తయారవడమే కాక, అగ్నిప్రమాదాన్ని నివారించే, నియంత్రించే కనీస ఏర్పాట్లు కూడా అక్కడ లేకపోవడం విషాదం. పాలకులే పనిగట్టుకొని ప్రోత్సహిస్తున్నప్పుడు, ఇరుకైన గల్లీల్లో మండపాల ఏర్పాటును కాదనగలిగే ధైర్యం అధికారులకు కూడా ఉండదు. భారతదేశంలో జాతరలు, తీర్థయాత్రలు, ఉత్సవాలూ ఊరేగింపుల సందర్భంలో తొక్కిసలాటలు జరగడం కొత్తేమీ కాదు. వర్షాలో, వదంతులో జనసమూహాన్ని భయపెడతాయి, ఒక్కసారిగా వారిని పరుగులుపెట్టిస్తాయి. మతవేడుకల్లో ప్రజల ప్రాణరక్షణే ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి. సాధారణ ఏర్పాట్లు సైతం విఫలమయ్యే అనూహ్యమైన పరిస్థితులకు సైతం ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలి. అప్రమత్తత, సన్నద్ధతల్లో రాజీకూడదు. ప్రతీదశలోనూ ప్రభుత్వవ్యవస్థల పర్యవేక్షణతో, ఇటువంటి విషాదాలకు తావులేకుండా, మతవేడుకలన్నీ ఆనందోత్సాహాలతో సాగుతూ ప్రజలకు చిరస్మరణీయమైన అనుభూతి మిగల్చాలి.
ఈ వార్తలూ చదవండి:
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
టైగర్ ష్రాఫ్పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో