Share News

చేజారిన లెఫ్ట్‌ కోట

ABN , Publish Date - May 06 , 2026 | 02:53 AM

అధికారంలో ఉన్న పార్టీని దించేయడం కేరళ ఓటర్లకు అలవాటే కానీ, ఈ మారు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఓటమి మీద ప్రత్యేక చర్చ జరుగుతోంది. పినరాయ్‌ పాలన ముగిసిపోవడంతో ఇప్పుడు దేశంలో...

చేజారిన లెఫ్ట్‌ కోట

అధికారంలో ఉన్న పార్టీని దించేయడం కేరళ ఓటర్లకు అలవాటే కానీ, ఈ మారు అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఓటమి మీద ప్రత్యేక చర్చ జరుగుతోంది. పినరాయ్‌ పాలన ముగిసిపోవడంతో ఇప్పుడు దేశంలో ఏ ఒక్క రాష్ట్రమూ వామపక్షాల చేతిలో లేకుండా పోయిన సంగతిని మీడియా గుర్తుచేస్తోంది. దేశ వామపక్ష రాజకీయాల్లో ఇది ఒక ప్రత్యేకస్థితి. ఏడుదశాబ్దాలక్రితం, 1957 ఏప్రిల్‌లో సీపీఐ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తూ ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడంతో స్వతంత్ర భారతంలో వామపక్షాల రాజకీయ అధికారం ఆరంభమైంది. తుపాకీ గొట్టంతో కాక, బ్యాలెట్‌ పెట్టె ద్వారా కమ్యూనిస్టులు అధికారం చేపట్టడం ప్రపంచంలో ఇదే మొదలు. తీవ్ర సామాజికార్థిక ఆసమానతలున్న, కొత్తగా స్వాతంత్ర్యం పొందిన ఒక విశాలమైన దేశంలో ఎన్నికలద్వారా అధికారంలోకి రావడం వల్ల కేరళ ప్రయోగం ప్రపంచచరిత్రలో నిలిచిపోయింది. అయితే, మరో రెండేళ్ళలోనే ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్టికల్‌ 356ను ప్రయోగించి నంబూద్రిపాద్‌ ప్రభుత్వాన్ని రద్దుచేయడం వేరే సంగతి. మరో పదేళ్ళకు ఈఎంఎస్‌ మళ్ళీ కేరళలో సంకీర్ణప్రభుత్వం ఏర్పాటు చేయడం, ఆ తరువాత దేశంలో అనేకచోట్ల వామపక్షాలు పాలనాపగ్గాలు చేపట్టడం, ఓడిగెలవడం తెలిసిందే. పశ్చిమబెంగాల్‌, త్రిపుర దశాబ్దాలపాటు వామపక్షాలకు కంచుకోటలు. 2011లో పశ్చిమబెంగాల్‌, మరో ఆరేళ్ళకు త్రిపురలో అధికారాన్ని కోల్పోయిన లెఫ్ట్‌, ఎన్నికల రాజకీయాలద్వారా తొలిసారిగా గద్దెనెక్కిన చోటే ఇప్పుడు దిగిపోయింది.

కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రాటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌)ను జనం ఇంత బలంగా గెలిపించడం ఆశ్చర్యం. దశాబ్దానికి పైగా అధికారంలో ఉన్న పార్టీమీద వ్యతిరేకత సహజం కూడా. అయితే, యూడీఎఫ్‌కు వందసీట్లకు పైగా కట్టబెట్టడం, బీజేపీ మూడుస్థానాలు సాధించడం, విజయన్‌ కాబినెట్‌లో చాలామంది మంత్రులు ఓడిపోవడం వంటి పరిణామాలు తేలికగా తీసివేయగలిగేవి కావు. పశ్చిమబెంగాల్‌లో వీరోచిత పోరాటంతో తృణమూల్‌ను బీజేపీ ఓడించిన రీతిలో కేరళలో కాంగ్రెస్‌ పోరాడి గెలిచిందని కూడా అనలేం. కేరళ రాజకీయాలు, ఓటర్ల మనోభావాలు వేరన్న విషయాన్ని అటుంచితే, అద్భుతమైన ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్‌ ఈ ఘనవిజయాన్ని సాధించిందని కూడా ఎవరూ అనడం లేదు. కమ్యూనిస్టు పాలనమీద జనం ఆగ్రహించారని కాక, పినరాయ్‌ విజయన్‌ వ్యవహారశైలి, వైఖరులతోనే ఎల్‌డీఎఫ్‌ కూలిందన్నది చాలామంది అంచనా. పదేళ్ళ ఏలుబడిలో ఆయన ప్రభుత్వం క్రమంగా వామపక్ష లక్షణాలను కోల్పోయినందున ఎల్‌డీఎఫ్‌ ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం కావాల్సివచ్చిందని అంటారు.


కరోనా కాలంలో తమ ఆశావర్కర్లు అద్భుతంగా పనిచేశారని అంతర్జాతీయ వేదికలమీద ఘనంగా చెప్పుకున్న ప్రభుత్వమే వారిపట్ల అన్యాయంగా వ్యవహరించింది. నెలకు ఏడువేలరూపాయలు అందే ఆశావర్కర్లు తమ జీవనభృతిని 21వేలకు పెంచాలంటూ పదినెలలపాటు సెక్రటరేయట్‌ ఎదురుగా నిరసనలు చేపడితే ఆఖరుకు కేవలం వెయ్యిరూపాయలు పెరిగింది. అంగన్‌వాడీ వర్కర్లు, నర్సులు, రైతులు తదితర రంగాలకు చెందినవారు ఉద్యమాలు చేసినప్పుడు విజయన్‌ ప్రభుత్వం వాటిని కాంగ్రెస్‌ కుట్రలుగా అభివర్ణించడం ఎన్నికల్లో ఎదురుదెబ్బతీసిందని అంటారు. నిరుద్యోగికత జాతీయ సగటు కంటే మూడురెట్లున్న రాష్ట్రంలో, నాలెడ్జ్‌ ఎకానమీ మిషన్‌ ద్వారా ఐదేళ్ళలో 20లక్షల ఉద్యోగాల కల్పన హామీ కూడా పూర్తిగా నెరవేరలేదు. ఘనంగా నిర్వహించిన పెట్టుబడుల సదస్సుల ద్వారా దక్కింది కూడా తక్కువే. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బాండ్లతో రక్షించుకోవడానికి రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోకాలడ్డి వుండవచ్చు గానీ, ప్రతీ సమస్యకూ కేంద్రాన్ని బూచిగా చూపడం కూడా జనానికి నచ్చలేదు. కార్మికులు, కౌలురైతులు, దళితులు, మత్స్యకారులు, మహిళలు తదితర వర్గాల ప్రయోజనాలకోసం నిలవాల్సిన విజయన్‌ ప్రభుత్వం వారికి దూరం కావడం ఈ ఓటమికి కారణం. ముఖ్యమంత్రి కుటుంబం మీద ఆరోపణలు రావడం నుంచి పార్టీలో అసమ్మతి, సహాయనిరాకరణ వరకూ చాలా అంశాలు పనిచేశాయి. కాంగ్రెస్‌ పార్టీ హామీలు సైతం ఓటర్లను ప్రభావితం చేసివుండవచ్చు. విజయన్‌ పాలనమీద ఉన్న అసమ్మతి, అసంతృప్తి ఆధారంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ప్రజల మనసుకు నచ్చినట్టుగా నడుచుకోకపోతే మళ్ళీ కేరళలో ఎర్రజెండా ఎగురావచ్చు.

ఈ వార్తలు కూడా చదవండి..

పాస్టర్లకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలపై విచారణ.. వాయిదా వేసిన హైకోర్టు

హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్.. 56 మంది అరెస్ట్

For More AP News And Telugu News

Updated Date - May 06 , 2026 | 02:53 AM