కాస్తంత విరామం
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:30 AM
వేల ఏళ్ళ నాగరికతను నామరూపాలు లేకుండా చేస్తానని అమెరికా అధ్యక్షుడు గర్జించిన ఆ కాళ రాత్రి గడిచిపోయింది. ఇరాన్ పదేపదే ప్రాధేయపడితే, తమ నాయకుడు దయతో దానిని సర్వనాశనం చేయకుండా..
వేల ఏళ్ళ నాగరికతను నామరూపాలు లేకుండా చేస్తానని అమెరికా అధ్యక్షుడు గర్జించిన ఆ కాళ రాత్రి గడిచిపోయింది. ఇరాన్ పదేపదే ప్రాధేయపడితే, తమ నాయకుడు దయతో దానిని సర్వనాశనం చేయకుండా తాత్కాలికంగా వదిలేశాడని అమెరికా యుద్ధమంత్రి చెప్పుకున్నాడు. హార్ముజ్‌ను తక్షణమే, పూర్తిగా, క్షేమకరంగా తెరవడానికి ఇరాన్ దిగిరావడంతో, పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఫీల్డ్‌మార్షల్ ఆసిమ్ మునీర్‌తో మాట్లాడి, ఆ రాత్రివేళ ఇరాన్ మీద తాను సాగించబోయే విధ్వంసాన్ని రెండువారాల పాటు నిలుపుదల చేశానన్నారు ట్రంప్. అంటే, నాగరికత నాశనం కావడానికి సరిగ్గా గంటన్నరముందు ఆయన తన వినాశకర చర్యను వాయిదావేశారన్నమాట. పన్నెండు గంటల్లోనే మనసు మారేంత బలమైన కారణాలు, పరిణామాలు ఏమిటో కానీ, ఈ తాత్కాలిక విరామం యావత్ ప్రపంచానికి కొండంత ఉపశమనం ఇస్తోంది.
కాల్పుల విరమణకు అంగీకరించిన ఉభయపక్షాలూ తమదే పైచేయి అని చెప్పుకుంటున్నాయి. ఇరాన్ గతంలో తిరస్కరించిన ప్రతిపాదనలను ప్రస్తుత పదిసూత్రాల పథకంలో ఆమోదించినందునే ట్రంప్ దిగివచ్చారని అంటారు. అమెరికా ఒత్తిడికి లొంగి చర్చలకు సిద్ధపడటం, హార్ముజ్‌ను రెండువారాల పాటు తెరవడంమీద ఇరాన్ నాయకత్వంలో భేదాభిప్రాయాలున్నాయన్న వార్తలను అటుంచితే, పూర్తిగా యుద్ధాన్ని నిలిపివేసిన పక్షంలోనే చర్చలకు సిద్ధమన్న ఇరాన్, అందుకు భిన్నంగా కాల్పుల విరమణకు సరేననడం ఆశ్చర్యం. ట్రంప్ తీవ్రమైన బెదిరింపు గతంలో తాము తిరస్కరించినదానికే ఒప్పుకొనేలా ఇరాన్‌మీద ఒత్తిడి తెచ్చిందా? ఆ భయానక, అమానుష వ్యాఖ్యలే ఇరాన్‌ను లొంగదీశాయని వైట్ హౌస్ సమర్థించుకోవచ్చు. పాకిస్థాన్ కంటే, ప్రధానంగా చైనా ఒత్తిడి ఇరాన్ మీద పనిచేసి ఉండవచ్చు. ఇరాన్ ప్రతిపాదించిన పదిసూత్రాల ఆధారంగా ముందడుగు వేయవచ్చునని మొదట్లో ప్రకటించిన అమెరికా, ఆ తరువాత అందులో గతంలో తాము తిరస్కరించిన ప్రతిపాదనలు కొన్ని లేకపోలేదని కూడా అంటోంది. దీనితో, చర్చల ఆరంభం, కొనసాగింపు మీద అనుమానాలూ అపనమ్మకాలూ లేకపోలేదు. యురేనియం శుద్ధి, జలసంధి, ఇరాన్ మద్దతుదారుల భవిష్యత్తు, గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాల ఉనికి ఇత్యాది విషయాలపై అంగీకారానికి రావడం అంత సులభమైన విషయం కాదు. ఒప్పందంలో లెబనాన్ లేదని వాదిస్తూ ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగించడం ఇరాన్‌కు ఆగ్రహం కలిగిస్తోంది. హార్ముజ్ తెరుస్తూ మూస్తూ అది తన విన్యాసాలను ఇంకా కొనసాగిస్తూనే ఉంది.
కాల్పుల విరమణ నిలబడుతుందా, శాంతి ఒప్పందం కుదురుతుందా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగేది యుద్ధంలో ఉన్న మూడుదేశాలే తప్ప మరెవ్వరూ కాదు. దశాబ్దాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉన్న ఉప్పూనిప్పూ తెలిసిందే కనుక, చైనా సహా ఎన్ని దేశాలు ఒత్తిడి తెచ్చినా, ఇప్పుడు తప్పిజారి కుదరబోయే ఆ సయోధ్య సైతం బలహీనమైనదీ, తాత్కాలికమైనదే. ఏళ్ళతరబడి పోగుబడిన అపనమ్మకాలు, వివక్షలూ ఎప్పుడైనా ఈ స్థాయిలో భగ్గుమనేట్టు చేస్తాయి. ఇక, నలభైరోజుల యుద్ధానికి అరలక్షకోట్లు ఖర్చుచేసి ట్రంప్ సాధించిందేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం కష్టం. కానీ, అమెరికా దాష్టీకానికి ఇరానియన్లు ఇన్ని రోజులూ దీటుగా సమాధానం చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అధినాయకుల, సైనికాధికారుల శిరస్సులు వరుసగా తెగిపడినా ఇరాన్ పాలకవర్గం కుప్పకూలకుండా నిలబడింది. అంతటి భయానకమైన వాతావరణంలో కూడా ఇరానియన్లు మొఖాల్లో బతుకు భయమే కనిపించనివ్వకుండా అమెరికాకు ఎదురొడ్డి నిలిచారు. మౌలిక వ్యవస్థలను, సాధించుకున్న అభివృద్ధినీ అగ్రరాజ్యం పునాదులతో సహా పెకిలించబోతున్నందున ప్రజలందరూ ఇళ్ళలోనే తలదాచుకుంటూ సహకరించాలని ఇరాన్‌కు భావిపాలకుడు కావాలనుకుంటున్న పహ్లవీ నిస్సిగ్గుగా ఇచ్చిన పిలుపును ఇరానియన్లు తిప్పికొట్టారు. పవర్‌ప్లాంట్ల నుంచి వాటర్ ప్లాంట్ల వరకూ ప్రతీచోటా వందలాదిమంది జెండాలతో సహా గుమిగూడి ఉగ్రరూపంతో విరుచుకుపడతానన్న అగ్రరాజ్యాన్ని చేతనైనది చేసుకోమన్నారు. విభిన్న కళారూపాలతో ఆ కాళరాత్రిని హోరెత్తించి నాగరికతనే నాశనం చేస్తానన్న దురహంకారిని వెనకడుగువేసేట్టు చేశారు. యుద్ధంలో ఉన్న రెండు పక్షాలూ ఇప్పుడు దొరికిన నిష్క్రమణ మార్గాన్ని మొదటగా సద్వినియోగం చేసుకొని, కాల్పుల విరమణను నిలబెట్టుకోవడం ముఖ్యం.
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News