India Bangladesh Relations,: దౌత్య చొరవలు..
ABN , Publish Date - Jan 02 , 2026 | 01:35 AM
భారత విదేశాంగమంత్రి జయశంకర్ ఢాకాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదాజియా అంత్యక్రియలకు హాజరై, ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఖలీదా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ....
భారత విదేశాంగమంత్రి జయశంకర్ ఢాకాలో బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదాజియా అంత్యక్రియలకు హాజరై, ఆమెకు ఘన నివాళులు అర్పించారు. ఖలీదా కుమారుడు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారిఖ్ రహ్మాన్‌తో జైశంకర్ కరచాలనం చేస్తున్న చిత్రాన్ని అక్కడి భారత హైకమిషనర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశారు. భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యకార్యాలయంలో కాలూని, ఖలీదా కన్నుమూత మీద ఆవేదన ప్రకటిస్తూ సంతాపవాక్యాలు రాశారు. మంగళవారం ఉదయం ఆమె మరణవార్త వెలువడగానే భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకసారి గతాన్ని కూడా గుర్తుచేసుకుంటూ బేగం ఆధ్వర్యంలో భారత్–బంగ్లా బంధం బలపడటానికి కృషిజరిగిందని ప్రస్తుతించారు. 2015లో ఆమెతో భేటీ అయ్యాయని, ఆమె దార్శనికురాలని శ్లాఘించారు. ఖలీదాజియా అనారోగ్యంతో ఆస్పత్రిలోచేరగానే ఆమె చికిత్సకు అవసరమైనంత సాయం చేయడానికి తాము సిద్ధమంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసినందుకు బీఎన్‌పి కృతజ్ఞతలు కూడా తెలియచేసింది. భారత్ వైఖరిమారిపోతోందా? అంటూ రేగుతున్న ప్రశ్నలను, సాగుతున్న చర్చలనూ అటుంచితే, బంగ్లాదేశ్‌తో భవిష్యత్ సంబంధాలను కాస్తంత మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి దౌత్యపరమైన చొరవలూ చర్యలూ ఉపకరిస్తాయి.
బేగమ్‌లు ఇద్దరూ లేని బంగ్లాదేశ్ కొత్త ప్రయాణం ఆరంభించిందని మీడియా వ్యాఖ్యానిస్తోంది. పదిహేడేళ్ళుగా బ్రిటన్‌లో ఉంటున్న తారిఖ్ రాకతో బంగ్లాదేశ్ దశదిశ మారిపోబోతున్నాయని కూడా అంటున్నారు. ఎప్పుడెప్పుడని అంతా ఎదురుచూస్తున్నా, ఫిబ్రవరి 12నాటి ఎన్నికల ప్రకటన వెలువడేంతవరకూ వ్యూహాత్మకంగా ఆగి, ఆ తరువాత కానీ ఆయన రాకను బీఎన్పీ ఖరారుచేయలేదు. తారిఖ్ దేశంలో కాలూనిన ఐదురోజుల్లో ఖలీదా కన్నుమూశారు. జైలునుంచి విడుదలయ్యేప్పటికే తన తల్లి తీవ్ర అస్వస్థతతో ఉన్నారంటూ తారిఖ్ చేసిన వ్యాఖ్యలూ విమర్శల వెనుక షేక్ హసీనా మీద కక్షమాత్రమే కాదు, రాబోయే ఎన్నికలు, భవిష్యత్ రాజకీయ వ్యూహం కూడా ఉన్నాయి. వచ్చేనెల జరగబోయే ఎన్నికల్లో బిఎన్‌పి ఘనవిజయం సాధిస్తుందన్న ప్రచారంలో అతిశయోక్తి ఏమీ లేదు. బరిలో బలమైన ప్రత్యర్థి లేనందున అది సునాయాస విజయం. జమాత్–ఎ–ఇస్లామీ సైతం అతిబలంగా ఉన్నందున బిఎన్‌పి తరువాతస్థానంలో ఇదే ఉంటుందట. హసీనాకు వ్యతిరేకంగా సాగిన జూలై తిరుగుబాటులో కీలకభూమిక నిర్వహించిన నేషనల్ సిటిజన్‌పార్టీ (ఎన్‌సిపి)తో పొత్తు సాధించిన ఉత్సాహంలో జమాతే ఉంది. పాకిస్థాన్‌తో యుద్ధాన్ని, బంగ్లాదేశ్ విముక్తిని తీవ్రంగా వ్యతిరేకించిన ఈ పాక్ అనుకూల ఇస్లామిక్ పార్టీ 2001–2006మధ్యకాలంలో బిఎన్‌పి ప్రభుత్వంలో భాగస్వామిగా కరుడుగట్టిన భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శించింది. తన ఏలుబడిలో జమాతేతో హసీనా నిత్య యుద్ధం చేశారు. ఎన్నికల్లో పాల్గొనడానికి అనర్హమైనదని 2013లో కోర్టు ప్రకటించడంతో వెనక్కుపోయిన ఈ సంస్థను 2024లో నోబెల్ విజేత మహ్మద్ యూనిస్ ప్రభుత్వం తిరిగి రక్షించింది. రేపటి ఎన్నికల్లో అద్భుత విజయం సాధించబోతున్న ఈ సంస్థ పూర్తి ఇస్లామిక్ పాలనకోసం పట్టుబట్టకపోయినా, ప్రభుత్వ భాగస్వామిగా పాలనమీదా, దేశం పాటించబోయే విలువలమీదా ఎంత ఒత్తిడితేగలదో ఊహించుకోవచ్చు.
ఫిబ్రవరి తరువాత పొరుగుదేశంలో పాలన ఎవరిచేతుల్లో ఉండబోతోందో వారితో సత్సంబంధాలు కలిగివుండటం భారత్‌కు అవసరం. హసీనా పాత్రలేని, అవామీలీగ్‌కు చోటులేని భవిష్యత్ బంగ్లాదేశ్‌తో వ్యవహారం సాగించాలంటే అక్కడ ఉన్నవాటిలోనే వెతుక్కోవాలి. దాదాపు అన్ని పార్టీలతో సత్సంబంధాల కోసం భారత్ ప్రయత్నాలు సాగిస్తోందని వార్తలు వింటున్నాం. భారత ప్రతినిధి ఒకరు తనతో ఇప్పటికే భేటీ అయ్యారనీ, అయితే ఆ విషయాన్ని రహస్యంగా ఉంచమని కోరారని జమాతే అధ్యక్షుడు షఫీఖుర్ రహ్మాన్ బుధవారం ఓ వ్యాఖ్యచేశారు. మీకు పాకిస్థాన్‌తో చారిత్రక అనుబంధం ఉన్నది కదా? అన్న ప్రశ్నకు తాము ఎవరిపక్షమూ కాదని, అన్ని దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని మాటవరుసకైనా అన్నందుకు సంతోషించాల్సిందే. బిఎన్‌పి తప్ప బరిలో మరో ప్రత్యామ్నాయం లేనందున, నచ్చినా నచ్చకున్నా రేపటిపాలకులనూ, ప్రభుత్వంలో భాగస్వాములనూ భారత్ ఇప్పటినుంచే మచ్చికచేసుకోవడం తప్పదు. భారత్–బంగ్లా సంబంధాలు ఎవరి ఆధ్వర్యంలో ఒక వెలుగువెలిగాయో తెలిసికూడా, కన్నుమూసిన ఖలీదాను ప్రత్యేకంగా శ్లాఘించకా తప్పదు.
ఇవి కూడా చదవండి...
రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..
సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్
Read Latest AP News And Telugu News