Share News

రేపటి విజయాలకు స్ఫూర్తి

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:00 AM

ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కపిల్‌ డెవిల్స్‌, ధోనీ సేన, రోహిత్‌ బృందం అద్భుత విజయాలను మరిపిస్తూ.. మరో విశ్వకప్పును...

రేపటి విజయాలకు స్ఫూర్తి

ప్రపంచ క్రికెట్‌లో ఆధిపత్యాన్ని చాటుకుంటున్న భారత జట్టు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. కపిల్‌ డెవిల్స్‌, ధోనీ సేన, రోహిత్‌ బృందం అద్భుత విజయాలను మరిపిస్తూ.. మరో విశ్వకప్పును ఒడిసిపట్టుకుంది. టీమిండియా వరుసగా రెండోసారి, మొత్తంగా మూడో పర్యాయం టీ20 ప్రపంచకప్‌లో చాంపియన్‌గా నిలిచింది. న్యూజిలాండ్‌ను ఏకపక్షంగా నిలువరించిన సూర్యకుమార్‌ సేన యావద్భారతావని గర్వించే ప్రదర్శన కనబరచింది. రెండేళ్ల క్రితం జరిగిన టోర్నీలో టైటిల్‌ గెలిచిన భారత జట్టు ఈసారి ట్రోఫీ నిలబెట్టుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూడోసారి ఈ కప్పును దక్కించుకొని మరే జట్టుకూ సాధ్యమవని అరుదైన ఘనతను అందుకొంది. ఈ అద్భుతానికి సాక్షిగా నిలిచిన అహ్మదాబాద్‌ స్టేడియంలో మూడేళ్లక్రితం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన పరాజయ భారాన్ని దించేసుకుంది. ఆతిథ్య జట్టుకు కప్పు దక్కదన్న సెంటిమెంట్‌ను పటాపంచలు చేసింది. ఇలా ఎన్నో రికార్డుల పరంపరలు, మధురస్మృతులను క్రికెట్‌ అభిమానులకు అందించిన భారత జట్టు విజయం చిరస్మరణీయం.

రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాలోని రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజాలాంటి కీలక ఆటగాళ్లు ఇప్పుడు జట్టులో లేరు. అయినా, ఆ సీనియర్ల లోటు కానరాకుండా జట్టు మరోసారి చాంపియన్‌గా అవతరించిన తీరు అభిమానులను అబ్బురపరిచింది. టీమిండియా ఈసారి టోర్నీ ఆసాంతం అమోఘమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. టోర్నమెంట్‌ మొత్తంగా సూపర్‌–8 దశలో దక్షిణాఫ్రికాతో పరాజయం మినహా అన్ని మ్యాచుల్లోనూ విజయదుందుభి మోగించి సత్తా చాటుకుంది. మూడుసార్లు 250కి పైగా స్కోర్లు నమోదు చేయడం మన జట్టు బ్యాటర్ల నిఖార్సయిన ప్రతిభకు తార్కాణం. అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ ధనాధన్‌ ఆటతో భారత బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచారు. పేస్‌ దళపతి జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ను ముందుండి నడిపించాడు. అవసరమనుకున్న ప్రతిసారీ వికెట్‌ పడగొట్టి ప్రస్తుత తరంలో ప్రపంచ అత్యుత్తమ బౌలర్‌గా తనపేరును సార్థకం చేసుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌ ఆల్‌రౌండ్‌ మెరుపులతో టీమిండియా ఆధిపత్యానికి ఎదురులేకపోయింది. జట్టులోని ఆటగాళ్లంతా కలిసికట్టుగా కదంతొక్కి ప్రపంచకప్‌ సంగ్రామంలో భారత్‌ మరోమారు విశ్వవిజేతగా ఆవిర్భవించడంలో విశేషంగా దోహదపడ్డారు. సమర్ధ నాయకుడిగా ముందుండి నడిపించిన సూర్యకుమార్‌ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.


ఈ విజయంతో భారత్‌కు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజాలు కపిల్‌ దేవ్‌, ఎంఎస్‌ ధోనీ, రోహిత్‌ శర్మ సరసన నిలిచాడు. ఈ చిరస్మరణీయ గెలుపులో ఆటగాళ్ల పట్టుదల, ప్రతిభకు తోడు కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ పాత్ర ఎనలేనిది. రెండేళ్ల క్రితం రాహుల్‌ ద్రవిడ్‌ స్థానంలో గురువుగా బాధ్యతలు స్వీకరించిన గంభీర్‌ ఆరంభంలో భారత జట్టు వైఫల్యాలతో విమర్శలపాలయ్యాడు. ఈ ప్రపంచకప్‌నకు ముందు గంభీర్‌ శిక్షణలో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో పరాభవం పాలవడంతో పాటు టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికాకు కోల్పోయింది. ఈ తరుణంలో టీ20 ప్రపంచకప్‌ అతని శిక్షణకు పరీక్షలా నిలిచింది. జట్టులో కుర్రాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ వాళ్ల ప్రతిభకు సానబెట్టడం కలిసొచ్చింది. తనదైన వ్యూహాలు, ప్రణాళికలతో టీమిండియాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫలితాలు రాబట్టాడు. తన శిక్షణలో గతేడాది చాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌ అందించిన గంభీర్‌.. ఇప్పుడు ప్రపంచకప్‌ విజయంతో అసలైన మార్గదర్శిగా నిలిచాడు.

చాంపియన్‌ భారత్‌కే గాకుండా నేపాల్‌, జింబాబ్వేలాంటి చిరుజట్లకు ఈ ప్రపంచకప్‌ ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. లీగ్‌ దశలో నేపాల్‌ పోరాడిన తీరును మర్చిపోలేం. మాజీ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై భారీ స్కోరును ఛేదించే క్రమంలో నేపాల్‌ దాదాపు గెలిచినంత పనిచేసింది. ఫేవరెట్లలో ఒకటిగా పోటీపడ్డ పటిష్ఠ ఆస్ట్రేలియా లీగ్‌ దశలోనే వెనుదిరిగిందంటే అందుకు కారణం జింబాబ్వే. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఇలా అన్ని విభాగాల్లోనూ అదరగొట్టిన జింబాబ్వే, శక్తివంతమైన ఆస్ట్రేలియాపై, ఆతిథ్య శ్రీలంకపై గెలిచింది. ఇక, ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్టు మాజీ విజేతలు పాకిస్థాన్‌, శ్రీలంక తమ వైఫల్యాన్ని చాటుకుంటూ సూపర్‌–8లోనే వెనుదిరగగా.. ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా సెమీఫైనల్స్‌లో నిష్క్రమించాయి. ఇంతటి మహత్తర ప్రదర్శన భారత జట్టులోని యువ ఆటగాళ్లలో నూతనోత్తేజాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. ఈ విజయాన్ని ఆస్వాదిస్తూనే నవతరం ఆటగాళ్లు మున్ముందు ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లకు సన్నద్ధం కావాలి. కపిల్‌దేవ్‌, గవాస్కర్‌, ధోనీ, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీవంటి గొప్ప ఆటగాళ్ల వారసత్వాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

వీల్ చైర్ నుంచి వీర యాత్ర

రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 01:00 AM