Share News

వాణిజ్య లబ్ధి..!

ABN , Publish Date - May 01 , 2026 | 01:39 AM

న్యూజిలాండ్‌తో భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంమీద పలు అనుమానాలు, విమర్శలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ తరహా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు ఇది...

వాణిజ్య లబ్ధి..!

న్యూజిలాండ్‌తో భారతదేశం కుదుర్చుకున్న స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంమీద పలు అనుమానాలు, విమర్శలు ఉన్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఈ తరహా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు ఇది కొనసాగింపు. దేశాలన్నీ ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) నియమ నిబంధనలకు లోబడి చేసుకొనే వ్యాపారానికి పలుకారణాల రీత్యా ఉల్లంఘనలు, వ్యతిరేకతలతో ఆ వ్యవస్థ బలహీనపడుతున్న తరుణంలో, ఓ రెండు దేశాలు తమ అవసరాలు, ప్రయోజనాలకు లోబడి కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమైన ఎఫ్‌టీఏలను కుదర్చుకోవడం పెరిగింది. కేవలం ఐదువిడతల చర్చలతో, తొమ్మిది నెలల్లోనే భారత్‌–న్యూజిలాండ్‌ ఈ ఒప్పందానికి రావడం విశేషం. భారత్‌ అతివేగంగా కుదర్చుకున్న ఎఫ్‌టీఏల్లో ఇదీ ఒకటి.

న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ ఆమోదంతో ఈ ఏడాదిలోనే అమలులోకి రాబోతున్న ఈ స్వేచ్ఛావాణిజ్యాన్ని ఉభయదేశాలు చరిత్రాత్మకమైన ముందడుగుగా అభివర్ణించాయి. దిగుమతి సుంకాన్ని న్యూజిలాండ్‌ పూర్తిగా రద్దుచేయడం వల్ల భారత వ్యవసాయ ఉత్పత్తులు, మందులు, తోలు, ఆభరణాలు, వస్త్రాలు తదితర రంగాలు లాభపడతాయి. సిరామిక్స్‌, కార్పెట్లు, ఆటోమొబైల్‌ విడిభాగాల ఎగుమతులు జోరందుకుంటాయి. వీసా నిబంధనల్లో మూడేళ్ళ మినహాయింపుతో ఐటీ, హెల్త్‌కేర్‌, ఇంజనీరింగ్‌ రంగాల్లో భారతీయ నిపుణులకు న్యూజిలాండ్‌లో తాత్కాలిక ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయట. న్యూజిలాండ్‌ మద్యం పరిమిత సుంకంతో భారత్‌కు దిగుమతి అయితే, ఇక్కడ తయారైన వైన్‌ సుంకాలు లేకుండా అక్కడకు ఎగుమతి అవుతుంది. ఇక, దాదాపు అరవైశాతం న్యూజిలాండ్‌ ఉత్పత్తులపై భారత్‌ దిగుమతి సుంకాలను సున్నా చేసింది. గొర్రె మాంసం, ఉన్ని, బొగ్గు, కలప ఉత్పత్తులు వంటివి అందులో కొన్ని. యాపిల్‌, కివి, అవకాడో, బ్లూబెర్రీ వంటి పండ్లు, తేనె, కొన్ని రకాల పాల ఉత్పత్తులు మంచి రాయితీతో దిగుమతి అవుతాయి. రాబోయే ఏడేళ్ళలో సముద్ర ఉత్పత్తులపై మనం భారీ రాయితీలు ఇవ్వాల్సి ఉందట. ఈ ఎఫ్‌టీఏతో ఇరుదేశాల మధ్య వస్తుసేవల వాణిజ్యం ఐదు బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా.


ఈ ఒప్పందంతో మన రైతులు, యువత, మహిళలు, ఎంఎస్‌ఎంఈలు, చేతివృత్తుల నిపుణులు, స్టార్టప్‌ కంపెనీలు, నవీన ఆవిష్కర్తలకు ఎంతో మేలు జరుగుతుందని ప్రధాని సంతోషిస్తున్నారు. ఇక్కడి రైతుల, చిన్నతరహా పరిశ్రమల ప్రయోజనాలకు నష్టంచేకూర్చే అంశాలు ఇందులో లేవని ప్రభుత్వం చెబుతోంది. 140కోట్ల మంది భారతీయులకు న్యూజిలాండ్‌కు చెందిన పలురకాల ఉత్పత్తులను అందించగలిగే అద్భుత అవకాశం తమకు దక్కిందని, అనేక రంగాలకు చెందిన తమ ఉత్పత్తిదారులకు ఈ ఒప్పందంతో ప్రయోజనం చేకూరుతుందని ఆ దేశ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌ ఆనందిస్తున్నారు. ఇక, భారత ప్రభుత్వం వివరణలు ఇచ్చినా ఈ ఒప్పందంపై విమర్శలు తప్పడం లేదు. దేశ పాడిపరిశ్రమకు, మరీ ముఖ్యంగా యాపిల్‌ రైతులకు హానికరమైన రీతిలో ఈ ఒప్పందం జరిగిందని ఏఐకేఎస్‌ వంటివి విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా సున్నా సుంకంతో న్యూజిలాండ్‌ యాపిల్‌ దిగుమతి కావడం వల్ల, దేశంలో యాపిల్‌ ఉత్పత్తిమీద ఆధారపడిన లక్షలాది రైతు కుటుంబాలు దెబ్బతింటాయనీ, న్యూజిలాండ్‌ అధికారులు తమ దేశంలో చేస్తున్న ప్రకటనల ప్రకారం 80శాతం ఉత్పత్తులు భారత్‌లోకి కారుచవుకగా ప్రవేశిస్తాయని ఆ సంఘాల ఆరోపణ. ఒప్పందానికి సంకల్పించడం నుంచి సంతకాలు చేయడం వరకూ సాగే మొత్తం ప్రక్రియలో ఏ దశలోనూ వివరాలు బయటకు తెలియకపోవడం ఇటువంటి వాదనలకు తావిస్తుంది. ఒప్పందంపై సంతకాలు జరిగిన అనంతరం కూడా పూర్తి సమాచారం వెల్లడికాకపోతే మరోదేశం పాలకులు, అధికారులు, మీడియా ప్రచారం చేసే అంశాలకు విలువ, విశ్వాసం ఏర్పడతాయి. యూరోపియన్‌ యూనియన్‌, యూకె వంటి పెద్ద పెద్ద భాగస్వాములతో వాణిజ్య ఒప్పందాల కోసం ఏళ్ళతరబడి మంతనాలు సాగడం తెలిసిందే. అమెరికాతో అయితే వ్యవహారం ఇప్పటికీ కొలిక్కిరాలేదు. తాము చొచ్చుకుపోయేందుకు వీలుగా భారతదేశం తన మార్కెట్‌ పూర్తిగా తెరిచి ఎర్రతివాచీతో స్వాగతం పలకాలని ఈ పెద్దదేశాలు దబాయిస్తుంటాయి. మారిషస్‌, అరబ్‌ ఎమిరేట్స్‌, ఒమాన్‌ వంటి దేశాలతో ఇటీవల కుదిరిన ఎఫ్‌టీఏలు పరిమాణం రీత్యా పెద్దవి కాకున్నా వాణిజ్యం కోసం మనం పెద్దదేశాల మీద ఆధారపడే అవసరాన్ని తగ్గిస్తాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దెబ్బకు ప్రపంచ వాణిజ్యక్రమం మారిపోతున్న తరుణంలో ఇటువంటి ఎఫ్‌టీఏలు తప్పడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

హైకోర్టును ఆశ్రయించిన నటి అషురెడ్డి.. ఎందుకంటే..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 01 , 2026 | 01:39 AM