కయ్యం నెయ్యం
ABN , Publish Date - Jun 11 , 2026 | 01:47 AM
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అనుభవరాహిత్యంతో అన్న ఆ నాలుగు మాటలూ ఆయనకు రాజకీయంగా నష్టంచేకూర్చాయని నేపాల్ నాయకుల...
నేపాల్ ప్రధాని బాలేంద్ర షా ఇటీవల పార్లమెంటులో చేసిన ప్రకటన కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. అనుభవరాహిత్యంతో అన్న ఆ నాలుగు మాటలూ ఆయనకు రాజకీయంగా నష్టంచేకూర్చాయని నేపాల్ నాయకుల బాధ. భారతదేశంతో దశాబ్దాలుగా నలుగుతున్న సరిహద్దు సమస్య గురించి పార్లమెంటులో జరుగుతున్న చర్చలో భాగంగా, భారత్–నేపాల్ సరిహద్దు వివాదం ఏకపక్షం కాదని చెప్పడం బాలెన్ ప్రధానోద్దేశం. భారత్ మాత్రమే నేపాల్ భూభాగాలు ఆక్రమించలేదని, పలుచోట్ల నేపాల్ సైతం భారత్ భూభాగంలోకి చొచ్చుకెళ్ళిందన్న అర్థంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై నేపాల్ విపక్షాలు, విద్యార్థి సంఘాలు, మీడియా విమర్శలు గుప్పిస్తున్నాయి. భారత్‌తో సరిహద్దు వివాదం అంశంమీద పార్లమెంటులో మిగతావారంతా భారత్‌ను బూచిగా చూపుతూ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు, ఇది అత్యంత సంక్లిష్టమైనదనీ, చారిత్రక అంశాలతో ముడిపడివున్నదనీ చెప్పడం బాలెన్ ఉద్దేశం కావచ్చు. అందుకోసం కాళీనదికి సంబంధించి బ్రిటిష్ హయాం నాటి పటాలను పరిశీలించాలని, అవసరమైతే బ్రిటన్ మధ్యవర్తిత్వాన్ని కోరాలని ఆయన భారత్‌కు అభ్యంతరకరమైన మరో వివాదాస్పదమైన మాట సైతం అన్నారు. సరిహద్దు వివాదాల్లో ఆయా దేశాల పాలకులు తమ విధానాన్నే సమర్థించుకోవడం సర్వసాధారణం కనుక, అందుకు భిన్నంగా తమ ప్రధాని చట్టసభలోనే భారతదేశాన్ని సమర్థిస్తున్నట్టుగా మాట్లాడటం అక్కడివారికి నచ్చలేదు.
కాలాపాని, లిపులేఖ్, లింపియాథుర లాంటి వివాదాస్పద ప్రాంతాలను కేపీశర్మ ఓలీ ప్రధానిగా ఉన్నప్పుడు నేపాల్ అధికారిక మ్యాపులో చేర్చితే, ప్రస్తుత పాలకుడు అందుకు భిన్నంగా మాట్లాడటం నేపాలీలకు రుచించకపోవడం సహజం. 1816లో ఈస్టిండియా కంపెనీ, నేపాల్ రాజు మధ్య జరిగిన సుగౌలీ ఒప్పందం ప్రకారం కాళీనది సరిహద్దుగా నిర్ణయించినప్పటికీ, దాని జన్మస్థానం మీద ఏకాభిప్రాయం లేనందున సరిహద్దు వివాదం హద్దులు దాటుతున్నది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని లిపులేఖ్ కనుమద్వారా కైలాస మానస సరోవర్ యాత్ర నిర్వహించడానికి భారత్–చైనా అంగీకారానికి వచ్చినందుకు గతనెలలో నేపాల్ ఆగ్రహించి, మా భూభాగం నుంచి పోదల్చుకున్నప్పుడు మమ్మల్ని సంప్రదించకుండా దారి ఎలా నిర్ణయిస్తారంటూ ప్రశ్నించడంతో, లిపులేఖ్ తన భూభాగమనీ, నేపాల్ వాదనకు చారిత్రక ఆధారాలు లేవనీ, డెబ్బయ్యేళ్ళుగా ఇదే మార్గాన్ని ఈ యాత్రకు ఉపయోగిస్తున్నామనీ భారత్ జవాబు ఇచ్చింది. ఈ మార్గం గుండా వాణిజ్యం సాగించాలని భారత్–చైనాలు అప్పుడెప్పుడో అనుకున్నప్పుడూ, కాలాపానీని భారత్ తన పటంలో చూపించినందుకూ నేపాల్ అభ్యంతరం పెడుతూనే వచ్చింది. ఆరేళ్ళక్రితం లిపులేఖ్‌లో ఓ 80కిలోమీటర్ల రోడ్డును భారత్ ఆరంభించినందుకు ప్రతీకారంగా పై మూడు ప్రాంతాలనూ నేపాల్ తన మ్యాపులో చేర్చుకొని అక్కసు తీర్చుకుంది.
స్నేహంతో, చర్చలతో ఒక క్లిష్టమైన వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నది బాలెన్ భావన అయినప్పటికీ, ఉభయదేశాల మధ్యా సరిహద్దు వివాదం తీవ్రంగా ఉన్నప్పుడు ఆయన వ్యాఖ్యలు నేపాలీలకు పరిష్కార మార్గంగా కాక, లొంగుబాటుగా కనిపించివుండవచ్చు. పాలనలోనూ, విదేశాంగంలో కొత్త పుంతలు తొక్కుతానని ప్రకటించిన బాలెన్ షా ఇటువంటి వ్యాఖ్యల ద్వారా వివాదం పరిష్కారం కాదని గుర్తించాలి. అనవసరపు రచ్చకు కాక చర్చలకు ప్రాధాన్యం ఇచ్చినపక్షంలో, ఉభయదేశాల మధ్యా పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ప్రధాని వ్యాఖ్యల నేపథ్యంలో, ఈ ప్రాంతాలు మావేనని నేపాల్ మంత్రులూ, నాయకులూ పాతపాట మరింత గట్టిగా పాడవలసివచ్చింది. గత రెండు వారాలుగా ఉభయదేశాల మధ్యా అధికారులు, నాయకుల రాకపోకలు విరివిగా సాగి, గతకాలపు ఘర్షణవైఖరి క్రమంగా సడలుతున్నట్టు కనిపించింది. నేపాల్ పాలకపక్షం నాయకుడు రబి లమిచ్చనే, విదేశాంగమంత్రి శిశిర్ ఖనాల్ పర్యటనలూ వారికి లభించిన గౌరవాదరణలూ సానుకూల వాతావరణాన్ని సృష్టించాయి. ఎర్రతివాచీ స్వాగతంతోపాటు, భారత్‌లోని అత్యున్నతస్థాయి నేతలు, అధికారులతో వారు భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ ఎంతో ఉన్నతంగా లమిచ్చనేతో చర్చలు జరిపారు. ఏడాదిపాటు విదేశీపర్యటనలు చేయనని, సమానస్థాయివారితో తప్ప మిగతావారితో భేటీకానని భీష్మించుకుకూర్చున్న బాలెన్ షా ఆచితూచి అడుగువేస్తూ ఉభయదేశాల సంబంధాలను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు ప్రజాస్వామ్యంపై దాడి: సీఎం రేవంత్‌రెడ్డి
కిషన్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు.. మంత్రి ఉత్తమ్ ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News