‘శైశవ గీతి’ నిండుగా..!
ABN , Publish Date - May 30 , 2026 | 03:01 AM
వ్యత్యాసాలు బాగా తగ్గించగలిగే వృద్ధే లక్ష్యం కావాలి. తేడాలు విపరీతంగా ఉన్న ప్రగతి నిరర్థకమవుతుంది, కొత్త సమస్యలకు దారితీస్తుంది. జనాభా గణాంకాలపై శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్)–2024 నివేదిక...
వ్యత్యాసాలు బాగా తగ్గించగలిగే వృద్ధే లక్ష్యం కావాలి. తేడాలు విపరీతంగా ఉన్న ప్రగతి నిరర్థకమవుతుంది, కొత్త సమస్యలకు దారితీస్తుంది. జనాభా గణాంకాలపై శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (ఎస్‌ఆర్‌ఎస్)–2024 నివేదిక శిశు మరణాలను తగ్గించడంలో పురోగతిని నమోదు చేసింది. ఇది సంతృప్తికరమే అయినప్పటికీ సాధించిన సత్ఫలితాలు సమరీతిలో లేవన్న వాస్తవాన్ని ఉపేక్షించకూడదు.
పుట్టిన పాపాయి మొదటి పుట్టిన రోజును జరుపుకోకుండానే తల్లిదండ్రులకు, ఈ లోకానికి శాశ్వతంగా దూరం కావడమే శిశు మరణం. ప్రతి 1000 సజీవ జననాలలో మొదటి సంవత్సరంలో సంభవించే మరణాలను శిశుమరణాల రేటుగా పరిగణిస్తారు. మానవ జీవన నాణ్యతకు ఇదొక ప్రధాన సూచిక. ఎందుకంటే ఒక సమాజపు జీవన ప్రమాణాలకు అది అద్దం పట్టుతుంది. శిశు మరణాల రేట్లు అధికంగా ఉండడమనేది అనేక వైఫల్యాలకు తార్కాణం. అవి సాధ్యమైనంత తక్కువగా ఉండడం, లేదా అసలు లేకపోవడమనేది అభిలషణీయమే కాదు, అనివార్య కర్తవ్యం కూడా. ప్రామాణిక ఆరోగ్య భద్రతా సదుపాయాలు; ప్రసవ పూర్వం, ప్రసవ సమయంలోను, ఆ తరువాత తల్లికి, నవజాత (మొదటి నెల రోజుల పాటు) శిశువుకు అందించే వైద్య సంరక్షణ; తల్లికి, బిడ్డకు పోషకాహార లభ్యత, పారిశుద్ధ్యం, పేద కుటుంబాల మహిళలకు ఆర్థిక, సామాజిక మద్దతు మొదలైనవాటికి శిశు మరణాల రేటు తగ్గింపులో నిర్ణయాత్మక పాత్ర ఉన్నది. ఈ కారణంగానే శిశు మరణాల రేటును మానవ జీవననాణ్యతకు ఒక గీటురాయిగా పరిగణిస్తున్నారు.
శిశు మరణాల రేటు తగ్గుదల సమాజాల పురోగతికి నిదర్శనంగా ఉన్నది. పారిశ్రామిక విప్లవానికి పూర్వం ప్రపంచవ్యాప్తంగా అన్ని సమాజాలలోను శిశు మరణాల రేటు చాలా అత్యధికంగా ఉన్నదనేది ఒక క్రూర వాస్తవం. యూరోప్‌లో వైజ్ఞానిక పరిశోధనలు శిశు మరణాల తగ్గుదలకు ఇతోధిక దోహదం చేశాయి. అయినప్పటికీ 1850 నాటికి కూడా యూరోప్, అమెరికాలో శిశు మరణాల రేటు వందల సంఖ్యలో ఉండేది. ఆ తరువాతనే వాటి తగ్గుదలలో శీఘ్ర పురోగతి సంభవించి, ఇప్పుడు ఆ రేటు 5, అంతకంటే తక్కువగా ఉండడం సాధ్యమయింది. ఆ సంపన్న సమాజాలలోని ఈ అల్ప శిశుమరణాల రేటులో సైతం అక్కడి ఆర్థిక అసమానతలు ప్రతిబింబిస్తున్నాయనేది విస్మరించలేని వాస్తవం. మరి స్వతంత్ర భారతదేశంలో శిశు మరణాల తగ్గుదల అంత వేగవంతంగా లేకపోవడంలో ఆశ్చర్యం లేదు.
ఐదున్నర దశాబ్దాల క్రితం కూడా మన దేశంలో శిశు మరణాల రేటు (ప్రతి 1000 సజీవ జననాలకు) 129గా ఉండేది. ఇది ఇప్పుడు అంటే 2024 సంవత్సరం నాటికి 24కి తగ్గిందని ఎస్‌ఆర్‌ఎస్ తాజా నివేదిక వెల్లడించింది. 2014–19 సంవత్సరాల మధ్య 39గా ఉన్న ఈ రేటు ఐదేళ్లలో 24కి తగ్గడం చెప్పుకోదగిన శుభ పరిణామమే, సందేహం లేదు. ప్రజారోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వాలు దశాబ్దాలుగా చేస్తున్న భారీ వ్యయాల కారణంగానే ఈ పురోగతి ఫలించింది. అయితే శిశు మరణాల తగ్గుదలలో రాష్ట్రాల వారీగా, ప్రాంతాల వారీగా అంతరాలు ఉన్నాయి. కేరళలో 8కి, తమిళనాడు, ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌లో 11కు అవి తగ్గిపోయాయి. ఈ సంతృప్తికర పరిస్థితికి విరుద్ధంగా ఛత్తీస్‌గఢ్‌లో 36గా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లో 35 చొప్పున శిశుమరణాల రేటు నమోదయింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య కూడా ఇటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 2024 గణాంకాల ప్రకారం ప్రతి 1000 సజీవ జనాలకు గ్రామీణ సీమలలో 27, పట్టణ ప్రాంతాలలో 17 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ వ్యత్యాసాలు సూచిస్తున్నదేమిటి? మన ప్రజల, ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల పేదల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరింత దూరం ప్రయాణించవలసి ఉందనే కాదూ? తల్లీ బిడ్డల శ్రేయస్సుకు ఉద్దేశించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యక్రమాలను మరింత చిత్తశుద్ధితో అమలుపరచినప్పుడు మాత్రమే ఆ వ్యత్యాసాలు తొలగిపోతాయి.
పాపాయిలు ఆరోగ్యకరమైన వ్యక్తులుగా ఎదిగేందుకు పుట్టిన మొదటి సంవత్సరంలో అందుకు దృఢమైన పునాది వేసేందుకు కూడా ప్రాధాన్యమివ్వాలి. శిశు మరణాల తగ్గింపు కృషి కొనసాగింపుగానే కాకుండా అందులో భాగంగా కూడా ఇది జరగాలి. పుట్టిన ప్రతి బిడ్డ మనుగడలో శ్రీశ్రీ ‘శైశవ గీతి’ నిండుగా ప్రతిఫలించడమే సార్థకమైన పాపాయి ప్రగతి అవుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మహానాడు 2026 విజయం.. మీ అందరికీ అంకితం: మంత్రి లోకేశ్
మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి కన్నుమూత
For More AP News And Telugu News