కనిపించని శాంతి
ABN , Publish Date - Aug 13 , 2026 | 01:11 AM
హమాస్ తన జేబులో ఉన్న ఆ చిట్టచివరి తుపాకీని కూడా ఆవల విసిరేసి, సంపూర్ణ ఆయుధవిసర్జనకు సిద్ధపడిందనే అనుకుందాం, అప్పుడు బెంజమీన్ నెతన్యాహూ తన సర్వసైన్యాలనూ గాజానుంచి వెనక్కు తోలుకుపోతారా?...
హమాస్ తన జేబులో ఉన్న ఆ చిట్టచివరి తుపాకీని కూడా ఆవల విసిరేసి, సంపూర్ణ ఆయుధవిసర్జనకు సిద్ధపడిందనే అనుకుందాం, అప్పుడు బెంజమీన్ నెతన్యాహూ తన సర్వసైన్యాలనూ గాజానుంచి వెనక్కు తోలుకుపోతారా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసిందే కనుక, అమెరికా అధ్యక్షుడు ఎంతో ఆర్భాటంగా ఇటీవల ప్రకటించిన ఆ ‘చారిత్రాత్మక ఒప్పందా’న్ని ఇజ్రాయెల్ ప్రధాని తిరస్కరించడం ఆశ్చర్యం కలిగించదు. వాళ్ళేదో అంటూంటారు, మాకు కొన్ని గిట్టవు అంటూ అత్యంత తేలికగా ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యానించారు. ఆయుధాలు వదిలి, వాటిని అప్పగించడానికి హమాస్ అంగీకరించిందనీ, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని ట్రంప్ సగర్వంగా ప్రకటించిన వారంలోనే, నెతన్యాహూ ఎంతో మార్యాదకరమైన భాషలో దానిని కొట్టిపారేశారు. మరిన్ని రక్తపుటేరులు పారించడం వినా, చొరబడిన గాజా నుంచి నెతన్యాహూ కాలువెనక్కుతీసుకోవడం జరిగేపని కాదనడానికి ఇజ్రాయెల్ చరిత్రే సాక్ష్యం.
మీరూ వచ్చి చేరండి, శాంతికోసం చేతులు కలపండి అంటూ అమెరికా అధ్యక్షుడు అనేక దేశాలమీదా ఒత్తిడితెచ్చి, ఏర్పాటు చేసిన ‘బోర్డ్ ఆఫ్ పీస్’ పట్ల నెతన్యాహూ వైఖరి అది. నలభైదేశాలు ఆర్నెల్లుగా అన్నిపక్షాలతో చర్చోపచర్చలు జరిపి, ట్రంప్ పరిభాషలో చెప్పుకోవాలంటే, ఒక చారిత్రాత్మకమైన అవగాహన కుదర్చిన వారంలోనే నెతన్యాహూ దానిని కాదు పొమ్మన్నారు. అమెరికా మధ్యవర్తిత్వంతో దాదాపు ఏడాదిక్రితం కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ఏ మాత్రం విలువ ఇచ్చిందో చూశాం. దాడులు కొనసాగిస్తూ సుమారు పదిహేనువందలమందిని అది ఈ కాలంలోనే పొట్టనబెట్టుకొంది. మూడింట రెండువంతుల గాజా భూభాగంలో నెతన్యాహూ సైన్యం తిష్టవేసుకొని కూర్చుంది. స్కూళ్ళు, ఆస్పత్రులు నేలమట్టమై కనీస వైద్యచికిత్సలు కూడా అందని స్థితిలో, ఇళ్ళులేని లక్షలాదిమంది అక్కడ టెంట్లలోనే కాలం గడుపుతున్నారు. వారికి ఆహారం సైతం సక్రమంగా అందనివ్వకుండా చేస్తున్న ఇజ్రాయెల్, పరిస్థితులను కనీసంగా మెరుగుపరచడానికి కూడా సహకరించడం లేదు.
ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదించిన పదిహేను పాయింట్ల డాక్యుమెంట్‌ను తిరస్కరిస్తూ, హమాస్ తన దగ్గరున్న అన్ని ఆయుధాలనూ వదులుకుంటే తప్ప సైన్యాన్ని ఉపసంహరించడం జరగదని నెతన్యాహూ అంటున్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసమే ఈ ప్రతిపాదనలు తయారైనప్పటికీ, వాటిని అంగీకరించడం నెతన్యాహూకు రాజకీయంగా నష్టం. హమాస్ ఎత్తుకుపోయిన ఇజ్రాయెలీ బందీలందరినీ సురక్షితంగా వెనక్కుతెస్తానని, హమాస్‌ను దుంపనాశనం చేస్తాననీ ప్రకటించి గాజామీద యుద్ధానికి దిగిన నెతన్యాహూ ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఇన్నేళ్ళ తరువాత కూడా హమాస్‌ను తుదముట్టించే పేరిట ఇజ్రాయెల్ విమానాలు సామాన్యులపై కురిపిస్తున్న బాంబులు, సైనికుల అకృత్యాలు చూస్తున్న ఇజ్రాయెలీలు నిజం ఏమిటో గ్రహించలేకపోరు. న్యాయస్థానంలో అవినీతి కేసులు ఎదుర్కొంటున్న నెతన్యాహూను ఈ యుద్ధమే రక్షిస్తున్నందున, అడపాదడపా దాడులతో ప్రస్తుత స్థితిని సాధ్యమైనంత ఎక్కువకాలం కొనసాగించడం ఆయనకు అవసరం. దీనికితోడు, మరో రెండునెలల్లో ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అంతిమంగా గాజానుంచి ఇజ్రాయెల్ సైన్యాల ఉపసంహరణ గురించి మాట్లాడుతున్న ఈ ప్రణాళికకు తాను ఏమాత్రం అనుకూలంగా ఉన్నట్టు కనిపించినా ఆయన కూటమి ప్రభుత్వంలోని మిగతా మితవాద పక్షాలకు ఆగ్రహం కలుగుతుంది, ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది.
నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్న తరుణంలో, ఇరాన్ యుద్ధం మిగల్చిన అవమానంనుంచి బయటపడడం అమెరికా అధ్యక్షుడికి అవసరం. ఆయన ఇరాన్‌తో ఆరంభించిన ఏకపక్ష యుద్ధం కష్టనష్టాలను మిగతా ప్రపంచంతో పాటు, అమెరికా కూడా అధికంగానే భరిస్తోంది. పేరుకు కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ ఇరాన్‌మీద విరుచుకుపడుతున్న ట్రంప్ మరోపక్క గాజాలో మార్పుకోసం ప్రయత్నిస్తున్నట్టుగా కనిపించదల్చుకున్నారు. గాజా పునర్నిర్మాణం పేరిట ట్రంప్ ప్రకటించిన సదరు బోర్డ్ ఆఫ్ పీస్, దాని ప్రణాళికలు పాలస్తీనియన్ల ప్రయోజనాలకోసం కాక, పెట్టుబడిదారులు గాజాను దోచుకొనేందుకు ఉద్దేశించినవన్నది వేరే విషయం. హమాస్ కూడా దిగివచ్చిన తరుణంలో, తన ప్రణాళికను తేలికగా తీసిపారేసిన నెతన్యాహూతో ట్రంప్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి.
ఇవి కూడా చదవండి...
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్
చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Latest AP News And Telugu News