Share News

ధర తగ్గాలి..!

ABN , Publish Date - Nov 11 , 2026 | 12:38 AM

ఇథనాల్‌ విషయంలో రాజకీయాలు చేయకండి అని కేంద్రమంత్రి సురేష్‌గోపి రాహుల్‌గాంధీకి హితవు చెప్పారు. ఈట్వెంటీ కాదు, ఫోర్‌ట్వంటీ అని రాహుల్‌ అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది....

ధర తగ్గాలి..!

ఇథనాల్‌ విషయంలో రాజకీయాలు చేయకండి అని కేంద్రమంత్రి సురేష్‌గోపి రాహుల్‌గాంధీకి హితవు చెప్పారు. ఈట్వెంటీ కాదు, ఫోర్‌ట్వంటీ అని రాహుల్‌ అన్నందుకు బీజేపీ నాయకులకు కోపం వచ్చింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం విషయంలో ఇప్పటికే దేశప్రజల్లో కొన్ని అనుమానాలు, భయాలు ఉన్నందున రాహుల్‌ కాస్త అతిగా ఆ మాట ప్రయోగించినట్టుంది. ఆ వ్యాఖ్యకు ఆధారం కాంగ్రెస్‌ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో కొన్ని పెట్రోల్‌ సాంపుల్స్‌లో ఇథనాల్‌ శాతం నిర్దేశించినదానికంటే అత్యధికంగా ఉండటం. ఇ20అంటే 20శాతం ఇథనాల్‌ కలగలిసిన పెట్రోల్‌ అని జనం నమ్మకం. మిగతా 80శాతం పెట్రోలేనని వారు అనుకుంటున్నారు. అయితే, కర్ణాటక రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఏడు జిల్లాల్లోని వేర్వేరు పెట్రోల్‌ బంకుల నుంచి సేకరించిన 14నమూనాలను ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌లో పరీక్షిస్తే 11చోట్ల ఇథనాల్‌ హెచ్చుగా ఉన్నట్టు రుజువైంది కనుక రాహుల్‌ దీనిని ప్రజాద్రోహంగా అభివర్ణిస్తున్నారు. తాను ఒక ప్రజాసమస్యపై పోరాడుతున్నానని ఆయనకు అనిపిస్తుంటే, బీజేపీ నాయకులకు అది రాజకీయంగా కనిపిస్తున్నది. రాష్ట్రాలకు ఇంధన నాణ్యతమీద ఏమైనా అనుమానాలు ఉంటే స్వయంగా తనిఖీలు చేసుకోవచ్చునని అంటున్న బీజేపీ మంత్రులు, తనిఖీల తరువాత వస్తున్న విమర్శలను మాత్రం తీసిపారేస్తున్నారు.

ఇథనాల్‌ ఇరవై కాకపోతే అరవై కలిపినా ఆ సంఖ్య ప్రజలకు తెలియచెప్పి అమ్మడం కంపెనీల ధర్మం. అలా జరగనప్పుడు అది మోసం అవుతుంది. తామేమీ మోసం చేయలేదని, రాష్ట్రప్రభుత్వమే సరైన విధానంలోనే పరీక్షలు జరపలేదంటూ చమురు సంస్థలు ఈ ఆరోపణలను తీసిపారేశాయి. నమూనా సేకరణ విధానం నుంచి పరీక్షా పద్ధతులవరకూ ఏదీ నిబంధనల ప్రకారం జరగలేదట. తాము 27 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో 893 పరీక్షలు జరిపితే, ఎక్కడా కూడా 21శాతాన్ని మించి ఇథనాల్‌ లేదని అవి ప్రకటించాయి. ఒక అధికారిక ల్యాబ్‌ రిపోర్టు ఆధారంగా ప్రజల పక్షాన తాను కేంద్రాన్ని నిలదీస్తున్నానని రాహుల్‌ అంటారు. ఆ పద్ధతులే తప్పని కంపెనీలు, ఇదంతా రాజకీయమని బీజేపీ నాయకులు చేస్తున్న ఈ వాదనల మధ్య ఏది నిజమో, ఏది మాయో ప్రజలకు అర్థంకాదు. పరస్పర అంగీకారంతో మరో స్వతంత్ర సంస్థతో మళ్ళీ పరీక్షలు నిర్వహించడానికి ఇరుపక్షాలు సిద్ధపడతాయా? అన్నది జవాబు రాని ప్రశ్న. ఇప్పుడు కేరళం కూడా ఇదే తరహా పరీక్షలకు సిద్ధపడుతున్నది కనుక, రేపటి రోజుల్లో మళ్ళీ ఇవే వాదనలతో ప్రజలను తికమక చేయకుండా కేరళం ప్రభుత్వం ప్రతీదశలోనూ జాగ్రత్తలు తీసుకుంటేనే దాని చర్యకో అర్థంపరమార్థం చేకూరుతాయి.


ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవడం, విదేశీమారకద్రవ్యాన్ని ఆదాచేయడం, కాలుష్యాన్ని నియంత్రించడం, రైతులకు ఇథనాల్‌ ఉత్పత్తిద్వారా అదనపు ఆదాయం కల్పించడం వంటి అనేక లక్ష్యాలూ ప్రయోజనాలు తన ఇథనాల్‌ కార్యక్రమానికి ఉన్నాయని కేంద్రం చెబుతోంది. లక్షలాది కోట్ల భారీలోన్లతో అమలవుతున్న ఈ పథకంలో బాగుపడుతున్న కంపెనీలు ఏమిటో, రైతులకు ఒనగూరేది ఎంతో, జరుగుతున్న పర్యావరణ విధ్వంసం ఎంతో శాస్త్రవేత్తలు, సామాజిక ఉద్యమకారులు తెలియచెబుతూనే ఉన్నారు. ఇక, పాతతరం వాహనాల ఇంజన్‌లోని కొన్నిభాగాలపై ఇథనాల్‌ మిశ్రమం ప్రభావం స్వల్పంగా ఉంటుందని, మైలేజీ ఐదుశాతం వరకూ తగ్గుతుందని కేంద్రం విపక్షాల పలుపోరాటాల తరువాత అంగీకరించింది. ఇవన్నీ పక్కనబెట్టినా, ట్యాంకులో ఐదులీటర్ల పెట్రోల్‌ నింపుకున్న సామాన్యుడు, అందులో ఒక లీటర్‌ ఇథనాలే ఉండికూడా పూర్తిగా పెట్రోల్‌ రేటునే చెల్లిస్తున్నాడు. ఇంజన్‌ దెబ్బతిన్నా, మైలేజీ తగ్గినా, పెట్రోల్‌తో పోల్చితే మూడోవంతు ఇంధనశక్తి ఉన్న ఇథనాల్‌ను భరిస్తూ కూడా ప్రతిఫలం పొందలేకపోతున్నాడు. ఇథనాల్‌ మిశ్రమంతో ఎన్ని లక్షల మెట్రిక్‌ టన్నుల ముడిచమురు ఆదా అయిందో, ఎన్ని లక్షల డాలర్లు మిగిలాయో ప్రభుత్వం చెబుతున్నప్పుడు సంతోషం కలుగుతుంది. కానీ, ఎన్నడూ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు తగ్గిన ఆనందం మాత్రం అతడికి దక్కలేదు. రెండువేర్వేరు ఇంధనాలను కలుపుతున్నప్పుడు తక్కువ శక్తిగలదానికి కూడా అదే రేటు వసూలు చేయడం సరికాదని, ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ను తక్కువధరకు విక్రయించాలని నీతీ ఆయోగ్‌ ఎప్పుడో సూచించింది. ఇ10 నుంచి ఇ30 వరకూ ఎన్ని రకాల మిశ్రమాలు అమ్ముతున్నప్పటికీ, వాటి ఉత్పత్తి ఖర్చు ప్రజలకు తెలియాలి. దేనినైనా వద్దనుకొనే, నచ్చినదానిని ఎంచుకొనే అవకాశం వారికి ఉండాలి, ఖరీదు తగ్గి అతడి త్యాగానికి ప్రతిఫలం దక్కాలి.

ఈ వార్తలు కూడా చదవండి..

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 12:38 AM