Share News

దిక్కుతోచని ట్రంప్‌!

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:46 AM

అమెరికా అధ్యక్షుడు ఆ ప్రసంగం చేయకపోతేనే బాగుండేది. పొద్దున్న లేచినదగ్గరనుంచి పొద్దుపోయేవరకూ ఆయన ఏదేదో మాట్లాడేవారు, మీడియా నచ్చింది రాసుకొనేది, ఎవరు మెచ్చింది వాళ్ళు నమ్మేవాళ్ళు....

దిక్కుతోచని ట్రంప్‌!

అమెరికా అధ్యక్షుడు ఆ ప్రసంగం చేయకపోతేనే బాగుండేది. పొద్దున్న లేచినదగ్గరనుంచి పొద్దుపోయేవరకూ ఆయన ఏదేదో మాట్లాడేవారు, మీడియా నచ్చింది రాసుకొనేది, ఎవరు మెచ్చింది వాళ్ళు నమ్మేవాళ్ళు. మార్కెట్లు కిందిమీదా పడుతూండేవి. ఎప్పుడైతే ఆయన యుద్ధం గురించి శ్వేతసౌధంలో ప్రత్యేక ప్రసంగం చేయబోతున్నారని తెలిసిందో, అప్పటినుంచీ ప్రపంచానికి కొత్త టెన్షన్‌ ఆరంభమైంది. ఆయన ఎన్నడూ చెప్పింది చేయడన్నది నిజమే కానీ, యుద్ధంపై ఈ కీలకసందేశంతో అమెరికా విధానం స్పష్టమైపోతుందని ప్రపంచం నమ్మడంతోనే చిక్కు వచ్చిపడింది. ఇంతకూ ట్రంప్‌ తన పందొమ్మిది నిముషాల ప్రసంగంలో ఏం చెప్పారు, ఏం తేల్చారు? ఆ బుర్రలో ఎంత గందరగోళం ఉన్నదో లోకానికి మరింత స్పష్టమైంది తప్ప, యుద్ధం ఎప్పుడు, ఎలా ముగుస్తుందో, ఈ ఉత్పాతంనుంచి ప్రపంచం ఎన్నటికి బయటపడుతుందో ఎవరికీ అర్థంకాలేదు.

అవే ఊకదంపుడు మాటలు, చర్విత చర్వణాలు, స్వభుజతాడనాలు. టీవీ ముందు కూచొని, ప్రసంగాన్ని విన్నవారు కొత్త పదజాలం దట్టించిన ఆ పాత గొప్పల్ని మళ్ళీ విని భరించలేకపోయి ఉంటారు. స్పష్టత, దిశ లేని ఆ ప్రసంగం ఒక విషయాన్ని మాత్రం తెలియచెప్పింది. పూర్తిగా యుద్ధంలో మునిగిన డోనాల్డ్‌ ట్రంప్‌ కాలువెనక్కుతీసుకొనే మార్గం లేక మల్లగుల్లాలు పడుతున్నారని. ప్రసంగిస్తున్న సమయంలో ఆయన వెలిబుచ్చిన హావభావాల ఆధారంగా సాగిన విశ్లేషణలు సైతం ఆయన ఆత్మవిశ్వాసం నీరుగారిందన్నాయి. తన లక్ష్యాలు నెరవేరాయని అంటూనే మరో రెండు మూడువారాలపాటు యుద్ధం మరింత తీవ్రతరం చేయబోతున్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహంమీద కొత్త ప్రశ్నలు లేవనెత్తాయి. కొత్త లక్ష్యాలమీద, సైన్యం ప్రత్యక్షప్రవేశం సహా సరికొత్తదారుల్లో ఇరాన్‌ను తీవ్రంగా మొత్తేయాలని ఆయన అనుకుంటున్నట్టు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు, ఒనగూరే నష్టంమీద ఆయనకు అనుమానాలున్నాయి. మరోమారు, ఈ ప్రసంగంలోనూ ఆయన అమెరికా మిత్రదేశాలను, మరీ ముఖ్యంగా నాటోను ఆడిపోసుకున్నాడు, అవమానించాడు. తనతో కలిసిరాని, తనకు ఇక అవసరం లేని నాటోతో పూర్తి కటీఫ్‌ అన్నరీతిలో వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్‌ ప్రసంగం ఎవరికి అర్థమైనా, కాకున్నా మార్కెట్‌ను మాత్రం మాయచేయలేకపోయింది. ప్రసంగం ముగిసిన వెంటనే అమెరికా మార్కెట్‌ ఇంకా చతికిలబడింది. ట్రంప్‌ తన ప్రసంగంలో, అమెరికన్లకు తనపై ఉన్న విశ్వాసం కంటే, ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకం గురించి మాట్లాడి, అదే తన యుద్ధానికి విస్తృతామోదంగా చెప్పుకున్న కొద్దిసేపట్లోనే మార్కెట్‌ పడిపోయింది. యుద్ధం ముగింపు, హార్ముజ్‌ విముక్తి ఇత్యాది విషయాల్లో పెట్టుబడిదారులకు నమ్మకం కలగలేదని అర్థం.


నెలరోజులుగా నిలిచిపోరాడుతున్న ఇరాన్‌ ఒకపక్క, ఇంటిపోరు మరోపక్క ట్రంప్‌ను ఉక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. లక్ష్యశుద్ధిలేని యుద్ధం అంటూ విపక్షాలు తప్పుబట్టడం అటుంచితే, ఈ యుద్ధాన్ని అమెరికన్లు గట్టిగా వ్యతిరేకిస్తున్నారని ఇటీవలి నిరసన ప్రదర్శనలు స్పష్టంచేస్తున్నాయి. వివిధ సర్వేల్లో కూడా అధికశాతం జనం వెంటనే దానిని నిలిపివేయాలని కోరుతున్నారు.

ట్రంప్‌ ప్రసంగం ఆరంభం కావడంతోనే ఇజ్రాయెల్‌ మీద ఇరాన్‌ క్షిపణుల మోత ప్రారంభించింది. ఇరాన్‌ వెన్నువిరిచామనీ, త్రివిధబలాల తిక్క కుదర్చామని, క్షిపణుల పనిపట్టామని ఆయన ఒకపక్క చెబుతూంటే, మరోపక్క ఇరాన్‌ తలెగరేసింది. సత్వరమే ఒప్పందానికి రాకుంటే, రాతియుగానికి పంపేస్తానన్న ట్రంప్‌ హెచ్చరికలను ఇరాన్‌ లక్ష్యపెట్టలేదని దాని చేతలే చెబుతున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధానికి దిగేముందు ఐదు లక్ష్యాలు ప్రకటించి, అవి కొద్దిరోజుల్లో నెరవేరడంతోనే సామాన్య ఇరానియన్లే రాజ్యాన్ని ఏలుకోవచ్చని గర్వంగా వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్‌ 1నాటి ప్రసంగంలో ఆ లక్ష్యాలన్నీ సాధించానని గట్టిగా చెప్పుకోలేకపోయారు. ఇరాన్‌ మీద ఎంత విరుచుకుపడుతున్నా, రెండువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌ను అది క్షిపణులతో ఎడాపెడా మోదుతూనే ఉంది. గల్ఫ్‌లో ఉన్న అమెరికా స్థావరాలను కోలుకోలేనంతగా దెబ్బతీసింది. ఇప్పుడు హౌతీల రంగప్రవేశంతో మాండెబ్‌ జలసంధి కూడా మూసుకుపోయి, ప్రపంచ ఆర్థికవ్యవస్థ మరింత కుదేలవుతుందన్న భయం సర్వత్రా ఉంది. అమెరికా తన పరువు పూర్తిగా పోగొట్టుకొనేంతవరకూ యుద్ధం ఆపనని ఇరాన్‌ చేసిన వ్యాఖ్యలో అతిశయం ఉండవచ్చుగానీ, ఆ పరిస్థితి రాకముందే తెలివిగా కాలువెనక్కు తీసుకోవాల్సిన అవసరం అమెరికాకు ఉంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

For More AP News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 01:46 AM