తిరుగుబాటు ‘తిరంగా’
ABN , Publish Date - Oct 16 , 2026 | 02:57 AM
ఢిల్లీ కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సిద్ధపడుతున్నారు....
ఢిల్లీ కన్నాట్‌ప్లేస్ సెంట్రల్ పార్క్‌లో శుక్రవారం సాయంత్రం ‘లెహ్రా దో తిరంగా’ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సిద్ధపడుతున్నారు. జంతర్ మంతర్ వద్ద జాతీయజెండాను ఎగరేసిన ఇద్దరు సీజేపీ నేతలను అరెస్టుచేసి, ఐదురోజుల జుడీషియల్ కస్టడీకి పంపడాన్ని నిరసిస్తూ ఈ ‘త్రివర్ణపతాకాన్ని ఎగురవేద్దాం’ కార్యక్రమాన్ని ప్రకటించారు ఆయన. జాతీయ జెండాను ప్రదర్శించడం కూడా నేరమా? అని ఆయన ప్రశ్న. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్‌ను రక్షించడం కోసం నిరసన తెలిపేహక్కును కూడా కాలరాసిన మోదీ ప్రభుత్వం చివరకు మా చేతుల్లో ఉన్న దేశజెండాను లాగేసుకుంటోందన్నారు ఆయన. పోలీసులు భారీ సంఖ్యలో మోహరించి, మరింత విస్తృతమైన ఏర్పాట్లతో సీజేపీ సరికొత్త నిరసనోద్యమాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు.
భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అంటూ ఇటీవల ఢిల్లీలో ఒక ఆర్థిక సదస్సు ఆరంభోత్సవంలో మోదీ మరోమారు నొక్కివక్కాణిస్తున్న తరుణంలోనే, మరోపక్క నిరసనకారులపై దమనకాండ సాగింది. కొడుతూ, ఈడ్చివేస్తూ, ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ పోలీసులూ, రక్షకుల ముసుగులో ఉన్న మరికొందరు గుర్తుతెలియనివారూ తీవ్ర అణచివేతకు పాల్పడ్డారు. అనుమతి లేదనడం, రాజధానికి పోయే రైళ్ళను నిలిపివేయడం, మెట్రోస్టేషన్ల మూసివేయడం, న్యాయవాదులను, పాత్రికేయులను సైతం అరెస్టుచేయడం, మహిళా నిరసనకారులతో అమానుషంగా ప్రవర్తించడం ఇత్యాది దృశ్యాలు అనేకం చూశాం. ఢిల్లీలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా తెగిపోయింది. ఇంత అణచివేత సాగిస్తూనే భారతదేశంలో ప్రజాస్వామ్యం, పౌరస్వేచ్ఛ, హక్కులు, విస్తృతచర్చ ఇత్యాది విలువల గురించి మోదీ ఘనంగా చెప్పడాన్ని మీడియా విశ్లేషిస్తోంది. దశాబ్దాలుగా నిరసనహక్కుకు నిదర్శనంగా నిలిచిన జంతర్‌మంతర్‌ను అంత హడావుడిగా ఒక నిషిద్ధస్థలంగా మార్చివేయడంలోనే ప్రభుత్వం నిరసనను ఎంతగా నిరసిస్తున్నదో తెలుస్తోంది. దేశ రాజధానికి సుదూరంగా ఉన్నవాటినీ, ఖరీదైనవాటినీ, రెండుమూడు నెలలవరకూ అందుబాటులో లేనివాటినీ ప్రత్యామ్నాయ స్థలాలుగా చూపడంలోనే కుట్ర కనిపిస్తోంది. సమాజంలోని సమస్తవర్గాలూ దేశానికి తమ గోడు తెలియచేసుకున్న వేదిక అది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి రైతు ఆందోళనలు, మహిళా రెజ్లర్ల పోరాటాలవరకూ అనేకం చూసింది అది. జంతర్‌మంతర్ వద్ద నిరసనలను నిషేధించడం కూడదని ఎనిమిదేళ్ళక్రితం విస్పష్టంగా చెప్పిన సుప్రీంకోర్టు ఈ మారు కేంద్రానికీ ఢిల్లీపోలీసులకూ నోటీసులివ్వడం వినా తక్షణ ఉపశమన చర్యలకు సంకల్పించకపోవడం ఆశ్చర్యం. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కునూ భావప్రకటనాస్వేచ్ఛనూ పరిరక్షించే విషయంలో చొరవచూపాల్సింది సర్వోన్నతన్యాయస్థానమే. పౌరులు తమ అభ్యంతరాన్నీ, అసమ్మతినీ, భిన్నాభిప్రాయాన్ని ప్రకటించడానికి కూడా వేలూ లక్షలూ ఖర్చుచేసి స్థలాన్ని అద్దెకు తీసుకోవాల్సిన అగత్యం పట్టడం సరికాదు. పార్లమెంట్‌కు కూతవేటు దూరంలో ఉన్న ప్రదేశాన్ని నిషిద్ధస్థలంగా మార్చేసి, పౌరుల గొంతు తాము ఎన్నుకున్న ప్రతినిధులకు ఏమాత్రం వినబడని, ఎన్నడూ నిరసన కార్యక్రమాలే జరగని సుదూర ప్రదేశాలకు వారిని నెట్టివేయడం నిరసనల ఉద్దేశాన్నీ, స్ఫూర్తినీ వమ్ముచేయడమే. నిరసన హక్కును పరిరక్షించాలని రాజ్యాంగం, హరించకూడదని న్యాయస్థానాలూ అంటూనే ఉంటాయి, పాలకులు, పోలీసులు ప్రజలహక్కులన్నీ లాక్కోవడానికి చూస్తేనే ఉంటారు.
ఇలా, అణచివేత వినా, చర్చలూ సంప్రదింపుల జోలికి పోవద్దని పాలకులు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. నీట్ పేపర్‌లీక్ నిరసనల సందర్భంగా ఉద్యమకారులతో మాట్లాడి, ధర్మేంద్రప్రధాన్ విషయంలో రాజీపడినందునే, అది అక్కడితో ఆగి, పెద్ద విపత్తునుంచి తాము బయటపడిన విషయాన్ని పాలకులు మరిచిపోతున్నారు. నిరసనకారులతో దూరం పెరుగుతున్నకొద్దీ సంప్రదింపుల అవకాశాలు తగ్గి, శక్తులన్నీ ఏకమై, ఏకుమేకవుతాయి. జ్ఞానేశ్‌ను వెనకేసుకొస్తూ, సర్ ప్రక్రియమీద ఉన్న వ్యతిరేకతనంతా పాలకులు తమవైపు తిప్పుకుంటున్నారు. రాజ్యాంగం హామీ ఇచ్చిన హక్కులను కూడా దక్కనివ్వకుండా చేస్తున్నారు. భారత్ గురించి బయటవేదికలమీద గొప్పగా చెబుతూ, దానిని విశ్వగురువుగా చూడాలనుకుంటున్నవారు కనీస విలువలకైనా కట్టుబడటం అవసరం. నిరసన ప్రదేశాన్ని కాక, విధానాలను మార్చుకోవడం ముఖ్యం.
Also Read:
సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల
జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు
గుజరాత్లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు