చెర్నోబిల్ పాఠం
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:30 AM
నలభై ఏళ్ల క్రితం సంభవించిన చెర్నోబిల్ అణువిపత్తు ఇప్పటికీ అనేక స్థానిక ఆందోళనలకు ప్రేరణగా ఉంది. ఆ దుర్ఘటన ప్రపంచ పౌరసమాజాన్ని ఎంతగానో క్రియాశీలం చేసింది. పర్యావరణ ఉద్యమాలను..
నలభై ఏళ్ల క్రితం సంభవించిన చెర్నోబిల్ అణువిపత్తు ఇప్పటికీ అనేక స్థానిక ఆందోళనలకు ప్రేరణగా ఉంది. ఆ దుర్ఘటన ప్రపంచ పౌరసమాజాన్ని ఎంతగానో క్రియాశీలం చేసింది. పర్యావరణ ఉద్యమాలను ఉధృతం చేసింది. ప్రభుత్వాల ఏకపక్ష నిర్ణయాలనూ, నియంతృత్వ విధానాలనూ సవాల్ చేసేందుకు సామాన్యులను తెగించేలా చేస్తోంది.
ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ అణు విద్యుత్కేంద్రంలో 1986 ఏప్రిల్ 25 అర్ధరాత్రి దాటిన తరువాత సంభవించిన ప్రమాదం ప్రపంచ పౌర అణుశక్తి చరిత్రలో వాటిల్లిన మహా ఘోర విపత్తు. తక్షణ మరణాల సంఖ్య ఏమంత ఎక్కువగా లేకపోయినప్పటికీ దాని దీర్ఘకాలిక ప్రభావాలు లక్షలాది మందిని ప్రభావితం చేశాయి, వర్తమాన తరాలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. మిఖాయిల్ గోర్బచెవ్ సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు పార్టీ సారథ్యాన్ని చేపట్టి గ్లాస్ నోస్త్ (దాపరికం లేని జవాబుదారీతనం) పెరిస్త్రోయికా (పునర్నిర్మాణం) విధానాలకు నాంది పలికిన తొలిరోజుల్లో ఈ అణు ప్రమాదం సంభవించింది. అయినా సోవియట్ పాలకుల బాధ్యతారాహిత్యం, పాలనా వ్యవహారాల్లో దాపరికం, అహంకారపూరిత నిర్లక్ష్యం, మరింత స్పష్టంగా చెప్పాలంటే సోవియట్ వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ఠగా చెర్నోబిల్ విషాదం నిలిచిపోయింది. ఈ దుర్ఘటనే అంతిమంగా సోవియట్ యూనియన్ విచ్ఛిన్నాన్ని వేగవంతం చేసిందని గోర్బచెవ్ ఒప్పుకున్నారు.
చెర్నోబిల్ ఘటనతో అణుశక్తి పట్ల ప్రజల్లో ప్రబలిన వ్యతిరేకత, ప్రభుత్వాల విముఖత ఇప్పుడు అంతగా లేకపోవడం కాల మహిమగా భావించాలి. నిజానికి అణు ఇంధన రంగంలో ప్రస్తుత పరిస్థితిని ‘అణు పునరుజ్జీవం’గా అభివర్ణిస్తున్నారు. వర్తమాన భౌగోళిక రాజకీయాలు, పశ్చిమాసియాలో యుద్ధం, ఇంధన భద్రత కొరవడడం తదితర కారణాల మూలంగా అనేక దేశాలు మళ్లీ అణు విద్యుదుత్పాదన వైపు మొగ్గు చూపుతున్నాయి. అధునాతన అణు సాంకేతికతలు అభివృద్ధి చెందడం కూడా ఇందుకు విశేషంగా దోహదం చేస్తోంది. ప్రస్తుతం 31 దేశాల్లో 400 అణురియాక్టర్లు పనిచేస్తున్నాయి. మరో 70 నిర్మాణంలో ఉన్నాయి. అణు విద్యుదుత్పాదన అనివార్యమయినప్పటికీ చెర్నోబిల్ ప్రమాద పాఠాలు విస్మరించలేనివి. అణు విద్యుదుత్పాదనలో ఉన్న ప్రమాదాలను గుర్తించి, వాటిని నిరోధించేందుకు నిరంతర జాగరూకత చూపడం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా అణు సాంకేతికతల విషయంలో ప్రజలను తప్పనిసరిగా విశ్వాసంలోకి తీసుకోవాలని చెర్నోబిల్ చాటిన నిజాన్ని ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితులలోను మరువకూడదు. చెర్నోబిల్ ముగిసిన దుర్ఘటనకాదు. కొనసాగుతోన్న సవాల్; ప్రస్తుత తరమూ, ముందు తరాలవారూ ఎదర్కోవల్సిన పెను సవాల్ అది. అణు విద్యుదుత్పత్తి విషయంలో ‘ఏదైతే సవాలు అదేలే జవాబు’ అన్న వైఖరితో మనం వ్యవహరించవలసి ఉన్నది.
చెర్నోబిల్ దుర్ఘటన భారత అణు భద్రతా విధానాలను ప్రభావితం చేసింది. అణుశక్తిపై భారత ప్రజల్లో వాస్తవిక అవగాహన ఏర్పడేందుకు తోడ్పడింది. అదే సమయంలో మన తొలితరం అణు రియాక్లర్లలో నిర్మాణ లోపాలు ఉన్నాయని నిపుణులు సమర్పించిన నివేదికలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న వాస్తవమూ బహిర్గతమైంది. ఈ కారణంగానే కుడంకుళం అణు విద్యుత్కేంద్రం విషయంలో ప్రభుత్వ వివరణలను ప్రజలు విశ్వసించలేకపోయారు. తత్ఫలితంగా కుడంకుళంకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రజ్వరిల్లాయి. అణుశక్తిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వానికి, ప్రజల భద్రతను ఉపేక్షించకూడదని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్న పౌర సమాజ సంస్థలకు మధ్య ప్రయోజనకర సంభాషణకు అటువంటి ఆందోళనలు అత్యవసరం.
చెర్నోబిల్ అణు విపత్తు తొట్ట తొలుత ‘మానవ తప్పిదం’ అని, అలాగే సాంకేతిక అహంకారం (అధునాతన సాంకేతికతలు ఎలాంటి సవాలునైనా గణనీయమైన ప్రతికూతలు లేకుండా పరిష్కరించగలవని అతిగా, ఆత్మవిశ్వాసంతో నమ్మడం), రాజకీయ వైఫల్యాల, వ్యవస్థాగత అసమర్థతల కలయికకు అదొక ప్రతీక అనే వాస్తవం కూడా విస్మరించలేనిది. సాగునీటి ప్రాజెక్టులు వంటి సంప్రదాయ నిర్మాణాలలో చోటుచేసుకున్న మానవ తప్పిదాలను నిష్పాక్షికంగా నిర్ధారించుకుని సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో అణు సాంకేతికతలతో ప్రమేయమున్న ప్రాజెక్టులను భద్రంగా నిర్మించి, సురక్షితంగా నిర్వహించటానికి అసాధారణ జాగ్రత్తలను తీసుకోవాలి. నవనవీన సాంకేతికతలను ప్రవేశపెట్టటానికి రాజకీయ దార్శనికత ఒక్కటే సరిపోదు. అధునాతన వ్యవస్థల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించటానికి నైపుణ్యంతో కూడిన అవగాహనతో పాటు దాపరికాలు లేకుండా వ్యవహరించటం ప్రధాన భాగంగా ఉండి తీరాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్
కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్
For More AP News And Telugu News