Mumbai Politics BJP Victory: ముంబై.. బీజేపీ ముల్లె
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:26 AM
దేశ ఆర్థికరాజధాని ముంబైని బీజేపీ చేజిక్కించుకుంది. రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు సహా వివిధ కారణాలతో దాదాపు పదేళ్ళుగా వాయిదాపడుతూ వచ్చిన బృహన్ ముంబై మునిసిపల్...
దేశ ఆర్థికరాజధాని ముంబైని బీజేపీ చేజిక్కించుకుంది. రాజకీయ అవసరాలు, ప్రయోజనాలు సహా వివిధ కారణాలతో దాదాపు పదేళ్ళుగా వాయిదాపడుతూ వచ్చిన బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో బీజేపీ–శివసేన కూటమి మంచి విజయం సాధించి, ఠాక్రేల చేతుల్లో మూడుదశాబ్దాలుగా ఉన్న మహానగరాన్ని స్వాధీనం చేసుకుంది. డెబ్బైఐదువేల కోట్ల బడ్జెట్‌తో ఆసియాలో అతిఖరీదైన మునిసిపాలిటీకి తొలిసారి బీజేపీ మేయర్ రాబోతున్నారు. వివిధ సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ కూటమి ఘన విజయాన్ని, ఠాక్రేల ఘోరపరాజయాన్ని అంచనాకట్టినప్పటికీ, ఫలితాలు అంత తీవ్రంగా లేకపోవడం గమనించాలి.
మహాయుతిది మహాద్భుత విజయమూ కాదు, ఠాక్రేలది ఘోర పరాజయమూ కాదు అంటున్నవారూ లేకపోలేదు. అయినప్పటికీ, ఠాక్రే సోదరుల కలయికతో అద్భుతాలు జరిగిపోతాయని నమ్మినవారికి మాత్రం ఈ ఫలితాలు జీర్ణించుకోలేనివి. సోదరులు ఒక్కటైతే ఇక తిరుగుండదని ఇరవయ్యేళ్ళుగా అదేపనిగా వాదిస్తున్న వారు, నిజం కాబోలని అనుకున్నవారు ఇప్పుడు షాక్‌లో ఉన్నారు. కేవలం ఈ ఎన్నికల ముందు, శివసేన పుట్టినిల్లయిన ఖరీదైన ముంబైని బీజేపీ ఎత్తుకుపోకుండా ఆపడం కోసం ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఈ మధ్యనే చేయీచేయీ కలిపారు, జనం నమ్మరేమోనన్న అనుమానంతో ఈనాటి ఈ బంధం ఏనాటికీ తెగిపోదని కూడా హామీ ఇచ్చారు. ఉద్ధవ్ పార్టీ ప్రతినిధులు దీనిని మనసుల కలయికగా అభివర్ణించారు. మరాఠీ ఆస్మితను జనంలో రేపి, మరాఠీ ఓటుబ్యాంకును సుస్థిరం చేసుకొని, హిందీ పెత్తనానికి ప్రతినిధిగా ఉన్న ‘మహాయుతి’ కూటమిని తరమికొట్టడానికి ఈ సోదరుల ఏకీకరణ ఉపకరిస్తుందని నమ్మారు. 2017నాటి ఫలితాలతో, తదనంతర చీలికల నేపథ్యంలో సాధించిన ఇప్పటి ఫలితాలను పోల్చలేము కానీ, ఉద్ధవ్ మీద ముంబైవాసుల్లోనూ అంత ప్రేమాభిమానాలు పొంగిపొర్లలేదని అర్థం. ఆయనతో చేయికలిపిన సోదరుడికి ఓ మూడుస్థానాలు పెరగడం వినా పెద్ద ప్రయోజనం లేకపోయింది. గుజరాతీలు, తమిళులమీద ఠాక్రే సోదరులు చేసిన ఘాటైన విమర్శలు భూమిపుత్రుల ఓట్లు పెద్దగా సాధించిపెట్టలేక పోయాయి కానీ, మహారాష్ట్రేతరుల ఓట్లు నిర్దిష్టంగా పడి బీజేపీకి అధిక ప్రయోజనం కలిగింది. ‘హఠావో లుంగీ, బజావో పుంగీ’ వంటి నినాదాలు మరాఠీ అస్మితను ఎంత రేపిందో తెలియదు కానీ, హిందూత్వదే పైచేయి అయింది. ఇక, పవార్ కుటుంబం కూడా ఇటువంటి విన్యాసాన్నే చేసి విఫలమైంది. పై స్థాయిలో చీలిన పవార్లు స్థానిక ప్రయోజనాలకోసం చేయికలపగానే జనం ఆమోదించలేదు. ముంబైసహా అత్యధిక మునిసిపాలిటీలను బీజేపీ గెలుచుకోవడం ఫడ్నవీస్‌కు మంచి శక్తినిస్తుంది. బీజేపీ పక్షాన ప్రచారంలో నరేంద్రమోదీ, అమిత్‌షా వంటి ఉద్దండులు లేకుండా పార్టీని విజయతీరాలకు చేర్చి రాష్ట్రంలో ఆయన తిరుగులేని నాయకుడుగా అవతరించాడు. మరో పరీక్ష నెగ్గిన ఏక్‌నాథ్ షిండే సైతం కూటమిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడంతోపాటు, అసలు సిసలు శివసేన తానేనని సామాన్యజనంతోనూ అనిపించుకున్నారు. లోక్‌సభ, శాసనసభకు మాత్రమే కాక, మహాయుతి బలం స్థానిక సంస్థలకూ, మరోపక్క యావత్ రాష్ట్రానికీ విస్తరించిందని ఈ ఎన్నికలు రుజువుచేశాయి.
ముంబైని కాపాడుకోకపోయినా, తిరిగికోలుకోగలమన్న నమ్మకాన్ని ఈ ఫలితాలు ఠాక్రేలకు ఇచ్చాయి. ఉద్ధవ్ పార్టీ బీజేపీ తరువాత స్థానంలో ఉండటమే కాక, షిండేసేనతో పోల్చితే ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. సోదరుడితో చేయికలపడంకోసం మహావికాస్ అగాఢీకి దూరమైనందువల్ల ఉద్ధవ్ సెక్యులర్ ఓట్లు కోల్పోయారనీ, కాంగ్రెస్ బాగా బలహీనపడినస్థితిలో ఓట్లు బదిలీ అయివుండేవని అంటారు. అయితే, బాల్‌ఠాక్రేమీద స్థానికుల్లో ఉన్న ప్రేమాభిమానాలు పూర్తిగా చెరిగిపోలేదని ఉద్ధవ్‌కు వచ్చిన స్థానాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముంబైని గెలవడం కంటే పార్టీని రక్షించుకోవడం ఠాక్రేలకు ఇప్పుడు మరీ ప్రధానం. ప్రస్తుతానికి అధికసీట్లు దక్కకపోయినా, రేపోమాపో గాలి తన వైపు తిరగవచ్చునని ఆశ మిగిలింది. ఠాక్రే బ్రాండ్‌నూ, బాలాసాహెబ్ వారసత్వాన్ని కాపాడుకోవడమే కష్టమైపోతున్న తరుణంలో, పార్టీ, గుర్తులతో సహా సమస్తమూ కోల్పోతూ, ఓటర్లకు దూరమైపోతున్న ఉద్ధవ్‌కు ఈ ఎన్నికలు కొత్త ఆశనీ, ఆశ్వాసననూ ఇచ్చాయి.
ఇవి కూడా చదవండి...
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News