Share News

అప్పుల సుడిలో అమెరికా!

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:22 AM

‘వార్షిక ఆదాయం ఇరవై పౌండ్లు, వార్షిక వ్యయం పందొమ్మిది పౌండ్లు పందొమ్మిది షిల్లింగ్‌లు ఆరు పెన్నీలు, ఫలితం సంతోషం; వార్షిక ఆదాయం ఇరవై పౌండ్లు వార్షిక వ్యయం ఇరవై పౌండ్లు ఆరు పెన్నీలు, ఫలితం దుఃఖం!...

అప్పుల సుడిలో అమెరికా!

‘వార్షిక ఆదాయం ఇరవై పౌండ్లు, వార్షిక వ్యయం పందొమ్మిది పౌండ్లు పందొమ్మిది షిల్లింగ్‌లు ఆరు పెన్నీలు, ఫలితం సంతోషం; వార్షిక ఆదాయం ఇరవై పౌండ్లు వార్షిక వ్యయం ఇరవై పౌండ్లు ఆరు పెన్నీలు, ఫలితం దుఃఖం! చార్లెస్‌ డికెన్స్‌ నవల ‘డేవిడ్‌ కాపర్ఫీల్డ్‌’లోని విల్కిన్స్‌ మికాబర్‌ అనే పాత్ర ప్రబోధించిన ఈ ఆర్థిక వివేకాన్ని వ్యక్తులే కాదు, దేశాలూ పాటించవలసి ఉన్నది. ఆ ఆర్థిక సూత్రాన్ని విస్మరించినందునే అమెరికా జాతీయ రుణం అక్షరాలా 40 లక్షల కోట్ల డాలర్లను మించిపోయి ఇంకా పెరుగుతోంది. ఈ భారీ రుణంపై ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా వడ్డీ చెల్లిస్తున్నారు.

అమెరికాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నిరంతర యుద్ధ వ్యయాలు, సంపన్న వర్గాలకు పెద్ద ఎత్తున పన్ను కోతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌, ఇరాన్ యుద్ధాల మూలంగా తీవ్రమవుతున్న ఇంధన, సరఫరాల సంక్షోభాలు, అంతర్జాతీయ కరెన్సీగా డాలర్‌ ప్రాబల్యం తగ్గడం మొదలైన కారణాలు ఎన్నో ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుసరిస్తున్న అంతర్జాతీయ వాణిజ్య విధానాలు పరిస్థితిని మరింతగా దిగజార్చివేస్తున్నాయి. ఫలితంగా అమెరికా జాతీయ రుణం ఆ దేశ స్థూల దేశియోత్పత్తిలో 126 శాతంగా ఉన్నది. పోటీదారు అయిన చైనా జాతీయ రుణం జీడీపీలో 83 శాతంగా మాత్రమే ఉండగా జపాన్‌ జాతీయ రుణం జీడీపీలో ఇంచుమించు 250 శాతంగా ఉన్నది. అయితే జపాన్‌ ప్రభుత్వం తీసుకున్న రుణాలలో అత్యధికం దేశీయ బ్యాంకులు, మదుపుదారుల నుంచి తీసుకున్నవే. అమెరికా తనకు అవసరమైన నిధులను చాలా వరకు ఫెడరల్‌ రిజర్వ్‌ బాండ్లను విక్రయించడం ద్వారా సమకూర్చుకుంటున్నది. ఈ బాండ్ల కొనుగోలుదారులలో అత్యధికులు విదేశీ సంస్థలు, మదుపుదారులే కావడం గమనార్హం.

అమెరికా ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసినవారు నష్టాలు వాటిల్లవచ్చనే భయంతో వాటిని విక్రయిస్తున్నారు. తక్కువ వడ్డీ రేట్లకు ఆ బాండ్లను మరిన్ని కొనడానికి నిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితి కూడా అమెరికా రుణ సంక్షోభానికి దారితీసింది. దీని నుంచి బయటపడేందుకు తాను అమ్మిన బాండ్లను తానే కొనుగోలు చేసేందుకు అమెరికా సంసిద్ధమయినప్పటికీ పరిస్థితి మెరుగుపడడం లేదు. ఫెడరల్‌ ప్రభుత్వం తీసుకునే రుణం గరిష్ఠంగా 41.1 ట్రిలియన్‌ డాలర్లకు మించకూడదని గత ఏడాది అమెరికా కాంగ్రెస్‌ పరిమితి విధించింది. అయితే అంతకంతకూ పెరుగుతోన్న జాతీయ రుణ పరిమాణం ఆ గరిష్ఠ పరిమితిని 2027 ద్వితీయార్థంలో దాటుతుందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.


అమెరికా రుణ సంక్షోభంలోని ఒక ముఖ్య విశేషం జాతీయ రుణ పరిమాణం కాదు. అది చాలా చాలా పెద్దదే, సందేహం లేదు. ఆ రుణ పెరుగుదల వేగమే కలవరపరిచే విషయం. ఇరవయో శతాబ్దాంతంలో అది కేవలం 6 ట్రిలియన్‌ డాలర్లు కాగా గత పది సంవత్సరాలలో రెట్టింపు కంటే అధికంగా పెరిగింది. గత ఒక్క ఏడాదిలోనే అది 3 ట్రిలియన్‌ డాలర్ల మేరకు అధికమయింది. ఈ పెరుగుదలలో కనీసం సగభాగం వడ్డీ చెల్లింపులకే పోతుంది. అమెరికా ప్రభుత్వ ఆదాయంలోని ప్రతి ఐదు డాలర్లలో 1 డాలర్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ బాండ్లపై వడ్డీ చెల్లింపునకే వినియోగమవుతున్నట్టు అంచనా. ప్రతిసెకనూ 90వేల డాలర్ల మేరకు, దినసరిన 7.8 బిలియన్‌ డాలర్ల మేరకు జాతీయ రుణం పెరుగుతుందని కాంగ్రెస్‌ జాయింట్‌ ఎకనామిక్‌ కమిటీ వెల్లడించింది. 2036 సంవత్సరం నాటికి ఈ రుణభారం 64 ట్రిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని కూడా ఆ కమిటీ పేర్కొంది ప్రతి అమెరిన్‌ పౌరుడిపై తలసరి రుణభారం 1,19,686 డాలర్లుగా లెక్క కట్టింది.

అమెరికాకు ఈ రుణ దుస్థితి దాపురించడానికి డెమొక్రాటిక్‌, రిపబ్లికన్‌ ప్రభుత్వాలు రెండూ కారణమయినప్పటికీ డొనాల్డ్‌ ట్రంప్‌ను మరింత ఎక్కువగా వేలెత్తి చూపవలసి ఉన్నది. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా చేస్తానన్న ట్రంప్ నిజానికి అమెరికా పతనాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. వలసలపై ఆంక్షలు, ప్రపంచ దేశాలపై విచక్షణారహిత సుంకాల సమరం అమెరికాను అన్ని విధాల దెబ్బతీస్తున్నాయి. భౌగోళిక రాజకీయాలలోను, అంతర్జాతీయ ఆర్థిక రంగంలోనూ అభ్యుదయానికి కాకుండా అరాచకానికి ఆయన కారకుడు అవుతున్నారు. భారత్‌ సహా వర్థమాన దేశాలన్నీ ఆర్థిక సంక్షోభం అంచుకు చేరుతున్నాయి.

యుద్ధక్షేత్రాలలో దక్కని విజయాలు, ఆర్థిక రంగంలో తీవ్రమవుతున్న వైఫల్యాలతో వచ్చే నవంబర్‌లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లుతున్న అమెరికా ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తుందా లేక రెండున్నర శతాబ్దాల క్రితం తమ మహోన్నత గణతంత్ర రాజ్యాన్ని వ్యవస్థాపించిన స్వాప్నికులు, దార్శనికులు, కార్యదక్షుల స్ఫూర్తితో కొత్త ప్రస్థానాన్ని ప్రారంభిస్తుందా? ప్రపంచమంతా ఎదురుచూస్తున్న విషయమిది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 02:22 AM