Share News

‘అన్నా’ అవస్థలు

ABN , Publish Date - May 16 , 2026 | 02:10 AM

అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులు ఇచ్చిన పక్షంలో నైతికంగా దిగజారినట్టేనని వీసీకే పార్టీ శుక్రవారం ఓ హెచ్చరిక తరహా వ్యాఖ్య చేసింది. జయలలితపార్టీని నిలువునా చీల్చి, తనతో చేతులు కలిపిన...

‘అన్నా’ అవస్థలు

అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలకు మంత్రిపదవులు ఇచ్చిన పక్షంలో నైతికంగా దిగజారినట్టేనని వీసీకే పార్టీ శుక్రవారం ఓ హెచ్చరిక తరహా వ్యాఖ్య చేసింది. జయలలితపార్టీని నిలువునా చీల్చి, తనతో చేతులు కలిపిన రెబెల్‌ నాయకులకు టీవీకే అధినేత విజయ్‌ మంత్రి పదవులు పంచుతారన్న ప్రచారం ఒకటి సాగుతున్న నేపథ్యంలో, క్లీన్‌ పాలిటిక్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన కొత్త ముఖ్యమంత్రి తప్పటడుగులు వేయకూడదని కొందరు హితవు చెబుతున్నారు. మంత్రులను చేస్తామన్న హామీతో తన పార్టీని రెండుగా చీల్చారని అన్నాడీఎంకె అధినేత ఎడప్పాడి పళనిస్వామి ఆరోపించగానే రెబెల్స్‌కు పదవులు ఇచ్చే ఆలోచన తమకు లేదని టీవీకే ఇప్పటికే స్పష్టంచేసింది. కాంగ్రెస్‌, వీసీకే, లెఫ్ట్‌పార్టీలు, ఐయుఎంఎల్‌ చేయూతతో అతికష్టంమీద కనీస సంఖ్యాబలాన్ని దాటిన జోసెఫ్‌ విజయ్‌ను పాతికమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆఖరునిముషంలో ఆదుకొని ఒడ్డునపడేసిన విషయం తెలిసిందే. తమకు ఏ పదవులూ అక్కరలేదంటూ ప్రభుత్వం ఏర్పాటుకు మొదటగా సహకరించిన పార్టీలకంటే, పాతికమంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు విజయ్‌కు ప్రధానం అయిపోతారన్న ప్రచారాలు, అనుమానాలూ సహజం. విప్‌ను ఉల్లంఘించి విజయ్‌తో చేతులు కలిపిన రెబెల్స్‌మీద కచ్చితంగా అనర్హత వేటుపడుతుంది కనుక, వారికి మంత్రిపదవులు ఇస్తే విజయ్‌కు మరింత చెడ్డపేరు వస్తుందన్నది వీసీకే వ్యాఖ్యల సారాంశం. అన్నాడీఎంకే సభ్యుల కొనుగోలుతో విజయ్‌ ఆదిలోనే డర్టీ పాలిటిక్స్‌ మొదలెడితే, అంతం ఎలా ఉండబోతోందో అని స్టాలిన్‌ కూడా అంటున్నారు.

పార్టీ ఫిరాయింపు చట్టం కింద రెబెల్స్‌ మీద చర్యలు తీసుకోవాలంటూ పళనిస్వామి (ఈపీఎస్‌) మనుషులు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, 22మంది ఈపీఎస్‌ వర్గ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని తిరుగుబాటు వర్గం స్పీకర్‌కు విజ్ఞప్తిచేయడం జయలలిత పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభ తీవ్రతకు నిదర్శనం. విజయ్‌ విజయం రెండాకుల పార్టీని రెండుగా చీల్చింది. ఈ ప్రమాదం ఉన్నది కనుకనే, విజయ్‌కు కొన్ని సీట్లు తక్కువపడగానే, ఆయనను అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు అన్నాడీఎంకే–డీఎంకే మధ్య పొత్తు కుదిర్చే ప్రయత్నాలు ఢిల్లీనుంచి జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. అది ఫలించకపోవడంతోపాటు, గవర్నర్‌ కూడా వ్యవహారాన్ని ఎక్కువకాలం సాగదీయలేకపోయారు. చివరకు విజయ్‌ ప్రమాణస్వీకారం అన్నాడీఎంకే పాలిట ప్రమాదంగా మారింది. ఏ హామీలూ, బేరసారాలు లేకుండానే పాతికమంది విజయ్‌వైపు పరిగెత్తుకుంటూ వచ్చారని ఎవరూ అనుకోరు. కానీ, పెద్ద దుష్ప్రచారం జరగకుండా, తనకు నేరుగా చెడ్డపేరు రాకుండా విజయ్‌ జాగ్రత్తపడటం విశేషం. ఐదుదశాబ్దాలపాటు రాష్ట్రాన్ని ఏలిన రెండు ద్రవిడపార్టీలను ఎన్నికల్లో వెనక్కునెట్టడమే కాక, జయ పార్టీని చీల్చి, రాబోయే రోజుల్లో చిన్న పార్టీల దయాదాక్షిణ్యాలమీద ఆధారపడవలసిన అవసరం లేకుండా చేసుకున్నారు విజయ్‌.


తానే సీఎం కావాలన్న ఈపీఎస్‌ మొండితనం వల్లే ఈ పరిణామాలు సంభవించాయని చీలికవర్గం అంటోంది. రెండు వర్గాలు విప్‌లను నియమించుకొని ఎదుటిపక్షం ఆదేశాలు చెల్లబోవని సభ లోపలా, వెలుపలా యుద్ధం సాగిస్తున్నాయి. ఇటీవలికాలంలో అన్నాడీఎంకే ఇంతటి విపత్కర పరిస్థితిని ఎదుర్కోలేదు. మహారాష్ట్రలో శివసేన రెండుగా చీలిన ఘట్టాన్ని రాజకీయ విశ్లేషకులు దీనితో పోల్చుతున్నారు. స్పీకర్‌, గవర్నర్‌ స్థాయినుంచి సర్వోన్నత న్యాయస్థానం వరకూ ఆ చీలికవర్గాలు సాగించినటువంటి పోరాటం రేపటిరోజుల్లో తమిళనాడులో పునరావృత్తం కావచ్చునని అంటున్నారు. ఏది అసలు శివసేన అన్నది నిర్ణయించడంలో ఎన్నికల సంఘం అనుసరించిన విధానాలు, సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు చివరకు స్పీకర్‌ శాసనసభలో అధిక ఎమ్మెల్యేలు ఉన్న పక్షాన్నే గుర్తించడం వంటి పరిణామాలు తెలిసినవే. తమిళనాట జయలలిత మరణం తరువాత తానే సీఎం కావచ్చునని అనుకున్న శశికళ జైలుపాలవడం, చివరకు ఆమే పార్టీకి దూరంకావడం, పార్టీపై పెత్తనం కోసం పన్నీరుసెల్వం పళనిస్వామి మధ్య వివాదాలు, ఓపీఎస్‌ను సైతం బయటకునెట్టి, అన్ని పోరాటాల్లోనూ పైచేయి సాధించి పార్టీని ఈపీఎస్‌ తనవైపు నిలబెట్టుకోవడం చూసినవే. విజయ్‌ రాకడతో ఇప్పుడు ఆయన చేతినుంచి కూడా పార్టీ జారి రెండు ముక్కలైంది. విస్పష్టమైన తీర్పు ఇచ్చే తమిళనాడు ప్రజలు ఈ మారు రాజకీయ అనిశ్చితికి తావిచ్చారు కనుక, సుదీర్ఘకాలం పాటు అక్కడి రాజకీయాలమీద దాని ప్రభావం ఉండక తప్పదు.

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 02:11 AM