Share News

పరీక్షహాల్లో ‘ఏఐ’ భూతం

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:47 AM

దక్షిణకొరియా విద్యామంత్రి రాజీనామా మనకు పెద్ద విషయం కాకపోవచ్చును కానీ, అందుకు దారితీసిన పరిణామాలు, కారణాలు ముఖ్యమైనవి. చోయ్‌ క్యోజిన్‌ రాజీనామా...

పరీక్షహాల్లో ‘ఏఐ’ భూతం

దక్షిణకొరియా విద్యామంత్రి రాజీనామా మనకు పెద్ద విషయం కాకపోవచ్చును కానీ, అందుకు దారితీసిన పరిణామాలు, కారణాలు ముఖ్యమైనవి. చోయ్‌ క్యోజిన్‌ రాజీనామా ఈ కృత్రిమమేధ యుగంలో చదువు, పరీక్షల విషయంలో దేశాలన్నీ ఎదుర్కొంటున్న ఒక పెను సమస్యకు నిదర్శనం. ఆ దేశపు జాతీయ కళాశాలల ప్రవేశపరీక్ష ‘సునెంగ్‌’కు అత్యంత కఠినమైనదని పేరు. ప్రభుత్వం దీనిని ప్రతిష్ఠాత్మకంగా, అమిత జాగ్రత్తల మధ్య నిర్వహిస్తూంటుంది. అయితే, ఈ ఏడాది దాని నిర్వహణలో తలెత్తిన గందరగోళంతో విద్యామంత్రి రాజీనామా చేయకతప్పలేదు. టెక్నాలజీ వేగాన్ని అందుకోవడంలోనూ, ఏఐ ఉచ్చునుంచి తప్పించుకోవడంలోనూ ప్రభుత్వాలు వెనకబడుతున్నాయనడానికి ఈ పరీక్ష ఒక ఉదాహరణ.

ఈ పరీక్షకు నాలుగురోజుల ముందు ఒక విద్యార్థి చేసిన ప్రకటన ఆ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. జాతీయస్థాయి టాక్స్‌ ఎకౌంటింగ్‌ పరీక్షలో అతడు 160కు 159మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. ఆ స్కోరు మీద తోటి విద్యార్థులకు అభ్యంతరాలు, అనుమానాలు ఉన్నాయి కూడా. ఆ తరువాత స్వయంగా అతనే ఒక యూట్యూబ్‌ వీడియో ద్వారా తన మార్కుల రహస్యాన్ని కక్కేశాడు. షర్టులో అమర్చిన ఒక సూక్ష్మస్థాయి కెమెరాతో ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి, జనరేటివ్‌ ఏఐ సహాయంతో సమాధానాలు రాబట్టానని అతడు అంగీకరించడం కలకలం రేపింది. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం విఫలం కావడంమీద ప్రజలనుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు ఐదున్నర లక్షలమంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ‘సునెంగ్‌’ పరీక్షకు కాస్తముందు ఈ గతపరీక్ష రహస్యం బయటపడటం ప్రభుత్వానికి మరో పరీక్ష. తొమ్మిదిగంటలపాటు జరిగే సునెంగ్‌ను ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికీ, ఆ తరువాత అధికవేతన ఉద్యోగాలూ చక్కని వివాహ అవకాశాలకూ రహదారి అని కొరియన్లు భావిస్తారు. పరీక్షరోజున ఉద్యోగులను ఇంటినుంచి పనిచేయమంటూ ప్రభుత్వం ట్రాఫిక్‌ రద్దీ లేకుండా చూసుకుంటుంది. విద్యార్థులు ఇంగ్లిష్‌ లిజనింగ్‌ పరీక్షను ఎదుర్కొంటున్న సమయంలో విమానాల రాకపోకలు కూడా నిలిచిపోతాయట. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం ఈ ఏఐ చీటింగ్‌ ఉదంతం నేపథ్యంలో, సునెంగ్‌ పరీక్ష విషయంలో మరిన్ని కఠిన నిబంధనలు అమలుచేసింది. పరీక్షార్థుల చొక్కా గుండీలమీద స్టిక్కర్లు అంటించడం నుంచి కళ్ళజోళ్ళతో సహా ప్రతీదానినీ స్కాన్‌ చేయడం వరకూ అన్నీ జరిగాయి. అయినా, ఏమాత్రం పొరపాటు జరగకూడదన్న పట్టుదలతో ఉన్న ప్రభుత్వం మరో అడుగుముందుకు వేసి, దేశవ్యాప్తంగా అన్ని మొబైల్‌ఫోన్లకు ఆ పరీక్షా సమయంలో మూడుసార్లు, వేర్వేరు వేళల్లో ఎమర్జెన్సీ ఎలర్ట్‌లు పంపింది. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, యుద్ధహెచ్చరికలు చేయడానికి అత్యంత అరుదైన సందర్భాల్లోనే దీనిని వాడతారు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఫోన్లు పెద్దశబ్దంతో మోగి వాటితో అనుసంధానించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలను గుర్తించడం లక్ష్యంగా ఈ ఎమర్జెన్సీ అలర్ట్‌ను సునెంగ్‌ పరీక్షలో తొలిసారిగా వాడి ఏఐతో కాపీకొడుతున్న వందకు పైగా విద్యార్థులను పట్టుకున్నారట. అయినప్పటికీ, పరీక్షల్లో ఏఐ మోసాలను పూర్తిగా నిరోధించగలనన్న నమ్మకం తనకు ఏమాత్రం మిగల్లేదని పార్లమెంటరీ కమిటీముందు మనసు విప్పిచెప్పి సదరు విద్యామంత్రి రాజీనామా చేశారు.


మైక్రో కెమెరాలు, ఇయర్‌పీస్‌లు రానురాను కంటికి కనిపించనంత చిన్నవైపోతున్నాయి. ఏఐ ఆధారిత స్మార్ట్‌ గ్లాసెస్ ఏ పని అయినా చేయగలుగుతున్నాయి. అతివేగంగా మారిపోతున్న ఆధునిక పరికరాలూ సాంకేతికతల వల్ల, కాపీయింగ్‌ను అరికట్టడం ప్రభుత్వాలకు ఉన్న వ్యవస్థలు, సిబ్బందితో సాధ్యం కావడం లేదు. కఠిననిబంధనల పేరిట అవి చేపడుతున్న చర్యలు మరోపక్క నిజాయితీగా పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ఏకాగ్రతను దెబ్బతీస్తూ వారికి శిక్షగా పరిణమిస్తున్నాయి. ఇటీవల అమెరికా, ఫ్రాన్స్‌, చైనా, బ్రిటన్‌ ఇత్యాది చాలాదేశాల్లోనూ పరీక్షల్లో కృత్రిమమేధ దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. కోటిమంది విద్యార్థులు రాసే చైనా జాతీయస్థాయి ప్రవేశపరీక్ష ‘గావోకావో’ కూడా ఏఐ వాడకంనుంచి తప్పించుకోవడానికి తంటాలుపడుతోంది. పరీక్షల నిర్వహణలో ఏఐ ఆధారిత మోసాలను అరికట్టడం ప్రభుత్వాలకు విషమపరీక్షగా పరిణమిస్తున్న కాలం ఇది. నిఘా పెంచడం కంటే, పరీక్షావిధానాలు ఏఐకు అందనిరీతిలోకి మారితే తప్ప సమస్యకు పరిష్కారం ఉండదు.

ఈ వార్తలు కూడా చదవండి...

మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Nov 26 , 2026 | 01:47 AM