సేద్యం.. సమరం.. మహిళ!
ABN , Publish Date - Mar 05 , 2026 | 04:47 AM
అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం నడుస్తున్న వేళ భారత్ స్థూల దేశియోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్టు కొత్త జీడీపీ గణాంకాలు వెల్లడించాయి. అత్యధికులకు...
అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం నడుస్తున్న వేళ భారత్ స్థూల దేశియోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా గత అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్టు కొత్త జీడీపీ గణాంకాలు వెల్లడించాయి. అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న సేద్య రంగ ఆధునికీకరణ విషయమై మరింత నిబద్ధత చూపేందుకు అది ప్రేరణ కావాలి. పశ్చిమాసియాలో జ్వలిస్తున్న యుద్ధాగ్నులు మన ఆర్థిక వ్యవస్థను మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని కుదిపివేసే ప్రమాదమున్నదన్న కఠోర వాస్తవాన్ని మనం విస్మరించకూడదు.
ఒక దేశ ఆర్థిక కార్యకలాపాల విలువను మదింపు వేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా అంగీకృతమైన ప్రమాణమే స్థూల దేశియోత్పత్తి (జీడీపీ). స్వాతంత్ర్యానంతరం తొలి దశాబ్దాలలో మన స్థూల దేశియోత్పత్తిలో వ్యవసాయరంగం వాటా 50శాతం కంటే ఎక్కువగా ఉండేది. పారిశ్రామికాభివృద్ధి, సేవల రంగం పురోగతి కారణంగా ఆ వాటా క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇది ఆరోగ్యకరమైన పరిణామమే. అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో వ్యవసాయరంగ వాటా తక్కువగా ఉంటుంది. అమెరికా జీడీపీలో వ్యవసాయం వాటా 0.8 నుంచి 0.9శాతం మాత్రమే కాగా చైనాలో అది 6.7 నుంచి 7 శాతంగా ఉన్నది. మన జీడీపీలో సేద్య రంగం వాటా ప్రస్తుతం 16 నుంచి 18శాతంగా ఉన్నది. కానీ దీనిపై ఆధారపడే జనాభా 40 శాతం వరకూ ఉంది. అందుకే ఆ రంగంలో దరిద్రాల శాతం ఎక్కువగా ఉంది. అది తగ్గాలంటే ఉపాధి కల్పనకు కల్పతరువుగా వ్యవసాయాన్ని అధునాతన రంగంగా రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలి. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను, నవీన వ్యవసాయ వ్యాపార సామర్థ్యంతో మిళితం చేయాలి. తద్వారా ఆహార ఉత్పత్తిదారులు అయిన రైతుల శ్రేయస్సు, వినియోగదారుల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధ్యమవుతుంది.
వ్యవసాయ ఆధారిత సమాజాలలో అసమానతలను రూపుమాపేందుకు జీవనాధార వ్యవసాయాన్ని వాణిజ్య వ్యవసాయంగా సత్వరమే పరివర్తన చెందించవలసిన అవసరమున్నది. వ్యవసాయరంగంలోని మహిళల స్థితిగతులను పరిశీలిస్తే ఆ అసమానతలు ఎంతగా ఉన్నాయో అర్థమవుతుంది. ఆ అసమానతల నిర్మూలన విషయమై ప్రపంచ ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఆహారోత్పత్తిలో పాల్గొంటున్న వారిలో 60 నుంచి 80శాతం దాకా మహిళలే కావడం విశేషం. అయితే భూ యాజమాన్యం, ఆదాయాలలో స్త్రీ పురుషుల మధ్య తీవ్ర అంతరాలు ఉన్నాయి. మన దేశంలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటున్న భారతీయ మహిళల్లో 80శాతం మంది వ్యవసాయరంగంలోనే ఉన్నారు.
అయితే చిన్నవో పెద్దవో సొంత భూకమతాలు ఉన్నవారు కేవలం 8 నుంచి 14శాతం మంది మాత్రమే. వ్యవసాయరంగంలోని మహిళల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాలు రూపొందించి అమలుపరుస్తున్నప్పటికీ అసమానతలు ఎంతకూ తగ్గిపోవడం లేదు. పురుషుల కంటే ఎక్కువగా శ్రమిస్తున్న మహిళా రైతులు, రైతు కూలీలకు న్యాయం జరగడమే లేదు. వీటికి తోడు వాతావరణ మార్పు విషమ ప్రభావాలు వ్యవసాయరంగంలోని మహిళలను బాగా కుంగదీస్తున్నాయి. ఆర్థిక నష్టాలకు మరింతగా గురవుతున్నారు. తమ జీవనోసాధికి మరో గత్యంతరం లేకనే ఈ అసంఖ్యాక శ్రామికులు వ్యవసాయరంగంలో కొనసాగుతున్నప్పటికీ ఆహారోత్పత్తిలో వారి దీక్షాదక్షతలు ఎనలేనివని అనడంలో సందేహం లేదు. ఈ వాస్తవాన్ని గుర్తించి వ్యవసాయరంగ మహిళలకు న్యాయం చేయడం సమాజాల, ప్రభుత్వాల నైతిక కర్తవ్యం.
ఒక పక్క వాతావరణ మార్పుతో పర్యావరణ వ్యవస్థలు ఛిద్రమవుతుండగా మరో పక్క యుద్ధాలు విరుచుకుపడుతున్న తరుణమిది. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా–ఇజ్రాయెల్ దాడులు, తత్ఫలితంగా పశ్చిమాసియా అంతటా వ్యాపిస్తున్న యుద్ధ జ్వాలలు మన ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయరంగంపై ప్రతికూల ప్రభావాలను చూపనున్నాయి. వీటిలో ముఖ్యమైనది ఎరువుల కొరత. భారత వ్యవసాయరంగానికి కీలకమైనవి యూరియా, అమ్మోనియా. వీటి ప్రధాన ఉత్పత్తిదారు ఇరాన్. ప్రస్తుత పరిస్థితులలో ఆ దేశం నుంచి ఈ ఎరువుల దిగుమతికి ఏర్పడే అంతరాయం సత్వరమే తొలగిపోకపోవచ్చు. ఫలితంగా సాగు వ్యయాలు పెరిగిపోయి, లాభాలు తగ్గుతాయి. రైతుల సంక్షేమం సంక్షోభంలో పడుతుంది. కొత్త జీడీపీ గణాంకాల ఆశాభావం పశ్చిమాసియా యుద్ధాగ్నుల తాకిడికి చెదిరిపోవడం ఖాయం. ఈ విషమ పరిస్థితుల్లో ఆహార ఉత్పత్తిదారుల శ్రేయస్సుకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి తీరాలి.
ఇవీ చదవండి:
ఈ నిర్ణయంతో అనేక మార్పులు వచ్చాయి: సీఎం చంద్రబాబు
వైసీపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది: లోకేశ్