Share News

దేశ రక్షణకు ‘దివ్యాస్త్రం’

ABN , Publish Date - May 12 , 2026 | 12:23 AM

దేశ రక్షణరంగ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవలి అగ్ని క్షిపణి ప్రయోగం ఉపకరిస్తుంది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో అనేక లక్ష్యాలను ఛేదించగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న...

దేశ రక్షణకు ‘దివ్యాస్త్రం’

దేశ రక్షణరంగ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇటీవలి అగ్ని క్షిపణి ప్రయోగం ఉపకరిస్తుంది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో అనేక లక్ష్యాలను ఛేదించగల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న అతికొద్దిదేశాల సరసన భారత్‌ నిలిచింది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ) టెక్నాలజీ ఉపయోగించి హిందు మహాసముద్ర ప్రాంతంలో వేర్వేరు చోట్లలో విస్తరించి ఉన్న అనేక లక్ష్యాలను అగ్ని క్షిపణి ఛేదించింది. నేల, నింగి, సముద్రం మీదనుంచి ఈ క్షిపణి గమనాన్ని, చురుకుతనాన్ని పరీక్షించిన రక్షణశాఖ అధికారులు పరీక్ష లక్ష్యాలు పరిపూర్ణమైనాయని ప్రకటించారు.

ఐదు పెద్ద దేశాల దగ్గర మాత్రమే ఉన్న ఒక అత్యాధునిక పరిజ్ఞానాన్ని మనం సొంతంగా వృద్ధి చేసుకొని, వాటికి దీటుగా నిలవగలగడం గర్వించదగ్గ అంశం. ఒకే క్షిపణిలో భాగంగా ఉండే ఈ రీ ఎంట్రీ వెహికల్స్‌ సంప్రదాయ, అణు వార్‌హెడ్లను మోసుకుపోగలవు. రోదసిలో క్షిపణి ప్రవేశించిన తరువాత ఈ రీ ఎంట్రీ వాహనాలు దానినుంచి వేరుపడి, ధ్వనికి అనేక రెట్ల వేగంతో భూవాతావరణంలోకి ప్రవేశించి, నిర్దేశించిన లక్ష్యాలను ఛేదిస్తాయి. అతివేగంతో వచ్చే అస్త్రాలను అడ్డుకోవడం శత్రుదేశాల గగనతల రక్షణవ్యవస్థలకు అగ్నిపరీక్షే. ఒకే క్షిపణిలోని ఎంఐఆర్‌వీలు తమకు తాముగా మార్గనిర్దేశనం చేసుకుంటూ వందలాది కిలోమీటర్ల దూరంలో, భిన్నదిక్కుల్లో ఉన్న లక్ష్యాలను ధ్వంసం చేయగలగడం ఓ అద్భుతం. ప్రయోగానికి దివ్యాస్త్ర అని పేరుపెట్టడం దాని పలు రకాల శక్తిసామర్థాలకు తగినట్టుగానే ఉంది. భిన్న ప్రదేశాలు, దూరాల్లోని శత్రుస్థావరాలను వివిధ వేగాలతో పోయి ఢీకొట్టే పలు వార్‌హెడ్లను ఒక ఖండాంతర క్షిపణి ద్వారా ఒకేమారు రోదసి నుంచి సంధించగల ఈ సామర్థ్యం మన భద్రతను మరింత పెంచుతుంది. తొలి అణ్వస్త్ర దాడికి దూరంగా, ‘నో ఫస్ట్‌ యూజ్‌’ ఆదర్శానికి ఇప్పటికీ మనం కట్టుబడే ఉన్నప్పటికీ, కయ్యానికి కాలుదువ్వే దేశాలకు ఈ సాంకేతికత ఒక బలమైన హెచ్చరిక. అంతకంతకూ అభివృద్ధిపరుస్తూ వచ్చిన ఎంఐఆర్‌వీ సాంకేతికతను 12,000 కిలోమీటర్ల దూరం పోగలిగే అగ్ని–6 నుంచి వర్తింపచేయాలని అనుకున్నప్పటికీ, అగ్ని–5తోనే దాని పూర్తి సామర్థ్యాన్ని పరీక్షించారు. ఈ ప్రయోగం సంపూర్ణంగా విజయవంతమైన తరుణంలో, త్వరలో అగ్ని–6ను కూడా ఆ టెక్నాలజీతో అభివృద్ధి చేసేందుకు దేశం సిద్ధపడుతుందని సామాజిక మాధ్యమాల్లో చర్చలు జరుగుతున్నాయి. తాజా పరీక్షలో వాడిన పరిజ్ఞానాలు అగ్ని–6కు అత్యంత కీలకం. ఐదువేల కిలోమీటర్ల వరకూ పోగలిగే అగ్ని–5 పరిధిలోకి చైనాలోని కొన్ని నగరాలు వస్తాయి. ప్రభుత్వం అనుమతించి, డీఆర్‌డీవో కనుక ఆరోదశ అస్త్రాన్ని అభివృద్ధిపరిచిన పక్షంలో యావత్‌ చైనా సహా, ఉత్తర అమెరికాలోని కొన్ని ప్రాంతాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి.


పాతికేళ్ళక్రితం మన సైన్యం అమ్ములపొదిలోకి ప్రవేశించిన అగ్ని శ్రేణిలోని మిగతా నాలుగు వేరియంట్ల పరిధి 700 నుంచి 3,500 కిలోమీటర్ల వరకూ ఉంది. వాటి పేలోడ్‌ సామర్థ్యం కూడా తక్కువే. అగ్ని–5 తయారీకి దశాబ్దం క్రితం సంకల్పించిన తరువాత ఈ ఖండాంతర క్షిపణుల సమర్థత మరింత హెచ్చింది. ఘన ఇంధనంతో, పదిహేడుమీటర్ల పొడవున్న ఈ మూడు దశల రాకెట్‌ నూక్లియర్‌ వార్‌హెడ్స్‌తో ఐదున్నరవేల కిలోమీటర్లు ప్రయాణించగలిగినందున పొరుగునే ఉన్న శత్రుదేశాలన్నీ దీని పరిధిలోకి వచ్చినట్టే. ఇప్పుడు ఎంఐఆర్‌వీ టెక్నాలజీ కూడా ఈ ఖండాంతర క్షిపణికి తోడైనందున ఏకకాలంలో భిన్నదిశల్లో దాడులు చేయగలగడమే కాదు, ఒకే ప్రాంతంలో నిర్దిష్టమైన విరామంతో ఆయుధప్రయోగం సాగించవచ్చు.

ఎంఐఆర్‌వీ ఉన్న మిసైళ్ళ ప్రయోగం ఇప్పటివరకూ ఏ యుద్ధంలోనూ, ఘర్షణలోనూ జరగలేదు. కానీ, ఈ సాంకేతికత జోడింపువల్ల లక్ష్య ఛేదన మరింత నిర్దిష్టంగా జరుగుతుంది. క్షిపణిరక్షణ వ్యవస్థలను ఛేదించి దాటగల సమర్థత ఉన్నదని అంటున్నారు కనుక, ఆయుధ నష్టం తగ్గుతుంది. శత్రుదేశాలు అనదగ్గవి పొరుగునే ఉన్నాయన్న భావనతో భారతదేశం క్షిపణి అభివృద్ధి కార్యక్రమం ఇటీవలి వరకూ సాగింది. అధికారికంగా చెప్పకపోయినా, ఇప్పటికే అభివృద్ధిలో ఉన్నదంటున్న ఆగ్ని–6 తయారీ కనుక పూర్తయితే సుదూర దేశాలకు కూడా భారతదేశం నుంచి విస్పష్టమైన సందేశం చేరుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి...

మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు

జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం

కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 12:23 AM