సామాజిక న్యాయం ఎక్కడ?
ABN , Publish Date - Feb 20 , 2026 | 12:10 AM
మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఇచ్చిన అధికారంతో అందరికీ సమన్యాయం కల్పిస్తామని, కుల, మత, ప్రాంత, లింగ, పేద–ధనిక భేదాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామని ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తారు. కానీ, జరుగుతున్నది...
మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజలు ఇచ్చిన అధికారంతో అందరికీ సమన్యాయం కల్పిస్తామని, కుల, మత, ప్రాంత, లింగ, పేద–ధనిక భేదాలు లేకుండా రాజ్యాంగబద్ధంగా పాలన సాగిస్తామని ప్రజాప్రతినిధులు ప్రమాణం చేస్తారు. కానీ, జరుగుతున్నది ఏమిటి? అధికారంలోకి వచ్చే వరకు ఒక మాట, ఆ తర్వాత మరో మాట పాలకులకు అలవాటుగా మారింది. ఫలితంగా ప్రజలకు సమాన అవకాశాలు, సమన్యాయం దక్కడం లేదు. ఉపాధి అవకాశాలు సన్నగిల్లాయి. నిరుద్యోగం తీవ్ర రూపం దాల్చింది. రోజురోజుకూ ప్రజల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. మనం కుల, మతాల ఊబిలో కూరుకుపోతున్నాం. ఎవరైనా ప్రశ్నిస్తే అధికార పక్షం సహించలేకపోతోంది. కేసులు నమోదవుతున్నాయి. ఒకప్పుడు ప్రధాని, ముఖ్యమంత్రి ఒక మాట చెప్పారంటే.. అది ఒక శాసనం. ఎంతో విలువైనది. ఇచ్చిన మాట కచ్చితంగా అమలు చేస్తారన్న భరోసా ప్రజల్లో ఉండేది. కానీ ఏం జరుగుతోంది? వారి మాటకు విలువ తగ్గుతోంది. ప్రజా శ్రేయస్సు ముందు వారి ప్రచారకాంక్ష పతాక స్థాయికి చేరింది. కెమెరాల చూపును బట్టి వారి హావభావాలు, ప్రసంగాలు, నిర్ణయాలు ఉంటున్నాయి. ఇది విపరీత ధోరణి.
ఇక బడ్జెట్ లెక్కలకు, వాస్తవ లెక్కలకు పొంతన ఉండడం లేదు. పార్లమెంట్, అసెంబ్లీల సాక్షిగా చెబుతున్న ఈ లెక్కలు గాడి తప్పుతున్నాయి. వీటిని కాగ్ నివేదికలు ధ్రువపరుస్తున్నాయి. బడ్జెట్ సమావేశాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూసేవారు. తమ వర్గానికి, తమ ప్రాంతానికి ఏ విధమైన లబ్ధి చేకూరనుంది? ఏయే రంగాలపై ప్రభావం పడుతుంది? ఏ పథకాలకు కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయి? కొత్త పథకాలు ఏమైనా వస్తున్నాయా? వంటి చర్చలు జరిగేవి. నేడు సామాన్యుల్లో ఆ ఉత్సుకత కొరవడింది.
బడ్జెట్ అంటే కార్పొరేట్‌లకు, పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు ప్రధానమైంది. వారి ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఇక క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారంటే.. ఇందులో కచ్చితంగా కార్పొరేట్, ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చే విధానపరమైన నిర్ణయాల కోసమేనని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక సామాజిక న్యాయం ఎక్కడ లభిస్తుంది? ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను, ఈ బడ్జెట్‌లో మధ్య తరగతి వర్గాలకు కేటాయింపులపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు వెంటనే ఆమె సమాధానం ఇవ్వలేకపోయారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీటిని గమనించినప్పుడు బడ్జెట్ ఓ ప్రహసనంగా మారిపోయింది.
ప్రజాపాలన అంటే ఏవో ఒకటి, రెండు పథకాలు పేదల మొహాన కొట్టడం కాదు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం. ప్రశ్నించే తత్వాన్ని పాదుగొల్పడం. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలను తగ్గించడం. ప్రతి ఒక్కరికీ తిండి, గూడు, విద్య, ఉపాధి, ఆరోగ్యం మొదలైనవి కల్పించే విధంగా వ్యవస్థను రూపొందించడం. కానీ, పుట్టుకతో కుల, మత, లింగ పరమైన వివక్ష ఉన్న మన దేశంలో ఇది సాధ్యమేనా? ఓట్ల రాజకీయం నడుస్తున్నంత కాలం, ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నంత కాలం ప్రజల ఆర్థిక స్థితిగతులు మారవు. ఇవి మారకుంటే మేధో వికాసం జరగదు. ఆకలి, అనారోగ్యం జమిలిగా చుట్టేస్తాయి. పాలకులు ఒక వర్గానికే కొమ్ము కాస్తూ.. వారి ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్న వర్తమానంలో కార్పొరేట్లు మరింత వృద్ధి చెందుతున్నారు. ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే వారు అడుగుతున్న రాయితీలతో పాటు కోరిన కోర్కెలన్నీ తీర్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. చిన్న, మధ్య తరగతి పరిశ్రమల ఏర్పాటు విషయంలోనూ, ఖాయిలా పడిన వాటికి ఇదే సూత్రం వర్తించాలి. వీరికీ రాయితీలు కల్పించాలి. అప్పుడే పారిశ్రామికీకరణలో సామాజిక న్యాయం జరుగుతుంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. కానీ, వీటిపై పాలకులు ఎందుకో మక్కువ చూపరు. కార్పొరేట్లయితే ఎన్నికల వేళ కోట్లు కుమ్మరిస్తారు కదా! ఇదే విషయాన్ని ఎన్నికల బాండ్లు ధ్రువపరుస్తున్నాయి.
147 కోట్ల జనాభా ఉన్న సువిశాల భారతదేశంలో అప్పులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇవి సుమారు 200 లక్షల కోట్లకు చేరుకోనున్నాయి. అదే సమయంలో కార్పొరేట్ సంస్థల ఆదాయం వృద్ధి చెందుతోంది. వీరు ప్రపంచ ధనవంతులతో పోటీ పడుతున్నారు. దేశ సంపదలో 46శాతం, ఒక శాతం మంది దగ్గర గుట్టగా పడి ఉంది. పది శాతం మంది దగ్గర 75శాతం సంపద పోగు పడింది. మిగిలిన 90 శాతం మంది వద్ద కేవలం 25 శాతం సంపదే ఉంది. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం, ప్రపంచంలోని టాప్–100 మంది సంపన్నుల్లో 25 మంది భారత్‌లోనే ఉన్నారు. 2025 నాటికి దేశంలో వంద కోట్లకు పైబడి సంపద ఉన్న సంపన్నులు 284 మంది వరకు ఉంటారని ఆ నివేదిక తేల్చింది. ఈ సంఖ్య ఏటికేడాది పెరుగుతూనే ఉంటుంది. అదే సమయంలో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల జీవన స్థితిగతులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. వీరి పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించాలి. సంపద పునఃపంపిణీ జరగాలి. కేంద్ర బడ్జెట్‌లో పేదలకు ఇచ్చే సబ్సిడీలు– రాయితీలు 4–5 లక్షల కోట్లకు మించడం లేదు. బడ్జెట్‌లో పేదలు కట్టే పన్నులలో తగిన వాటా శ్రమజీవులు పొందాలి. ఎక్కువ సంపద ఉన్న వారిపై పన్నులు వేసి, పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలి. పేదరిక నిర్మూలనకు ఈ మార్గాన్ని అనుసరించాలి. కానీ, అలా జరగడం లేదు. మోదీ పాలనలో కార్పొరేట్‌లపై పన్నును 35 నుంచి 22శాతానికి తగ్గించారు. సంపద పన్ను, వారసత్వ పన్ను చట్టాలను రద్దు చేశారు. కార్పొరేట్లకు 20 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు. పేదలు, సామాన్యులపై మాత్రం పన్నుల వడ్డన కొనసాగుతూనే ఉంది. దీనిని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? దేశంలో సామాజిక న్యాయం ఎక్కడ కనిపిస్తోంది?!
ఐక్యరాజ్యసమితి 2009 నుంచి ఏటా ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. సమాజాల మధ్య సంఘీభావం, సామరస్యం, సమాన అవకాశాలను ప్రోత్సహించేందుకు పేదరికం, నిరుద్యోగాన్ని తొలగించేందుకు కావాల్సిన ప్రాముఖ్యతను గుర్తించడం దీని లక్ష్యం. భారత రాజ్యాంగం సైతం ఇదే విషయాన్ని బోధపరుస్తోంది. కానీ, మన ప్రభుత్వాలు వీటిని పట్టించుకోవడం లేదు.
గౌతమ బుద్ధుడు చెప్పినట్లు ‘నాయకుడు ఆదర్శంగా ఉండాలి. ధర్మపాలన సాగించాలి. హింసను తగ్గించాలి. శాంతి మార్గం పాటించాలి.’ ప్రజలు పాలకుడిని నిశితంగా గమనించి, అనుసరిస్తారు. పాలకుడు ధర్మంగా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. పాలకుడు కుటిల ఆలోచనలతో ఉంటే ప్రజలు అదే మార్గం పడతారు. అది చివరకు పాలకుడి నెత్తిన భస్మాసుర హస్తంగా మారుతుంది. యథా రాజా తథా ప్రజా!
దేవగళ్ల రామకృష్ణ
జర్నలిస్ట్
(నేడు సామాజిక న్యాయ దినోత్సవం)
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ కోర్టు నోటీసులు..
నకిలీ మద్యం కేసు.. నిందితులకు రిమాండ్ పొడిగింపు
Read Latest Telangana News And AP News And Telugu News