ఉనికి కోసం సగరుల భగీరథ ప్రయత్నం!
ABN , Publish Date - Apr 23 , 2026 | 01:16 AM
సగరుల గతమెంతో ఘనం! ఎందుకంటే షట్ చక్రవర్తులలో ఒకరైన సగర చక్రవర్తి వారసులు వారు. కానీ వర్తమానం అగమ్యగోచరం! భగీరథుడి వంశస్థులైన వారు దశాబ్దాలుగా ఉనికి లేని ఉప్పరులుగా కొనసాగారు...
సగరుల గతమెంతో ఘనం! ఎందుకంటే షట్ చక్రవర్తులలో ఒకరైన సగర చక్రవర్తి వారసులు వారు. కానీ వర్తమానం అగమ్యగోచరం! భగీరథుడి వంశస్థులైన వారు దశాబ్దాలుగా ఉనికి లేని ఉప్పరులుగా కొనసాగారు. ఇప్పుడిప్పుడే అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో తమకంటూ ఒక గుర్తింపు సాధిస్తున్నారు.
సగరుల జీవన ప్రయాణం సముద్రుడితో ముడిపడి ఉంటుంది. ఆ సాగరాన్ని నమ్ముకొని ఉప్పు తయారీదారులుగా వాసికెక్కి ఉప్పరులుగా పిలవబడే సగరుల జీవితాలు శతాబ్దాలుగా సముద్రంలో అలల మాదిరిగా ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న తీరుగా సాగుతూ వచ్చాయి. కొన్ని దశాబ్దాల క్రితం వరకు ప్రభుత్వ రికార్డుల్లో తప్ప బయటకు పరిచయం లేని ఒక వెనుకబడిన కులంగా ఉన్న ఉప్పర కులం రిజర్వేషన్లలో మాత్రం అగ్రకులాలకు ఏ మాత్రం తీసిపోకుండా ఇప్పటికీ బీసీ–డి గ్రూప్‌లో ఉనికి చాటుకుంది.
పురాణాల ఆధారంగా షట్ చక్రవర్తులలో ఒకరైన సగర చక్రవర్తి హరిశ్చంద్ర వంశంలో ఎనిమిదోతరంవాడు. సగరుడికి పుట్టినవారు అసమంజనుడు, అతని వారసుడు అంశుమంతుడు, ఆయన కుమారుడు దిలీపుడు, దిలీపుడి కుమారుడే భగీరథుడు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ సప్తమి రోజు ఆయన జయంతిని యావత్ భారతావని జరుపుకుంటుంది. సగరుడు అయోధ్యనగరానికి రాజుగా కొనసాగుతూ సమస్త రాజ్యాలను జయించి చక్రవర్తి అయ్యాడు. ప్రజా సంక్షేమం కోసం వశిష్ట మహాముని ఆజ్ఞానుసారం అశ్వమేథ యాగానికి సంకల్పించి యాగాశ్వం వెంట తన సంతానమైన అరవైవేల కుమారులను పంపుతాడు. ఇంద్రుడు ఈ అశ్వాన్ని తస్కరించి పాతాళలోకంలో తపస్సు చేస్తున్న కపిల మహర్షి చెంత దానిని కట్టివేయగా వెతుకుతూ వెళ్లిన సగర కుమారులు సమస్త భూమండలాన్ని గాలించే సమయంలో భూమిని ఏడుపాయలుగా తవ్వినట్లు చరిత్ర చెబుతోంది. చివరికి పాతాళంలో కపిల మహర్షి చెంత ఉన్న అశ్వాన్ని చూసి.. కావాలనే తమ అశ్వాన్ని కట్టి పడేశాడనుకొని మహర్షితో వాదనకు దిగి, చివరికి అతని శాపానికి లోనై భస్మీపటలం గావించబడుతారు. ముత్తాతలు భస్మం కాబడ్డ విషయాన్ని తెలుసుకున్న భగీరథుడు వారి కోసం కైలాస గంగను సాధించడానికి హిమవత్ పర్వతాలలో ఉన్న గోకరమునకు చేరి ఏకాగ్రతతో ఏకపాదంపై ఆరువేల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై తన జటాజూటంలో గంగను ధారగా వదలగా.. బిందు సరోవరం నుంచి నాడు సగర పుత్రులు తవ్విన ఏడు పాయలలో గంగ ప్రవహించినది. భగీరథుడి ముత్తాతల భస్మీపటలంపై పారిన గంగతో వారు విముక్తి పొందారు. భగీరథుడి అనంతరం అతని వారసులుగా కకుక్షడు, రఘువు, ప్రవృద్ధుడు, శంఖనుడు, సుదర్శనుడు, తీగ్రవర్ణుడు, యయాతి, భాగుడు, అజమహారాజు వచ్చారు. అజమహారాజు కుమారుడే దశరథ మహారాజు, దశరథ మహారాజు కుమారులే శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
భగీరథుడి వంశస్థులు కలియుగంలో సముద్రుడిని నమ్ముకొని ఉప్పు తయారీదారులుగా జీవనం సాగించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ సాల్ట్ మేకర్స్ అసోసియేషన్ సభ్యులుగా సగరులే ఉన్నారు. తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి, ఇప్పటికీ పలు చోట్ల చెరువుల వద్ద నీరటితనం చేస్తూ, పంట పొలాలకు సమాన నిష్పత్తిలో నీరు వదిలే బాధ్యతను సగరులే నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఇక్కడ సగరులు నిర్మాణ రంగాన్ని కులవృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అనేక ప్రాంతాల్లో నిర్మాణరంగ పనులకోసం గుంపులు కట్టుకొని వలస వెళ్లిన ఉదంతాలు ఎన్నెన్నో.
చెరువులు, కాలువలు తవ్వటం, ప్రాజెక్టులు కట్టడం ఇలా కష్టాన్ని నమ్ముకొని మట్టి జీవులుగా బతుకు బండిని లాగుతున్న సగరులు పాలకుల దృష్టిలో మాత్రం బడా కాంట్రాక్టర్లు కాబోలు, అందుకే బీసీ రిజర్వేషన్లలో దాదాపు ఉన్నత కులాల సరసన బీసీ–డీగా గుర్తించబడ్డారు. మురళీధరన్, అనంతరామన్ లాంటి అనేక కమిషన్లు సగరుల జీవన స్థితిగతులను, వారి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి వీరిని బీసీ–ఏలో చేర్చాలని సిఫారసు చేసినప్పటికీ అది ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బీసీ జనగణన గణాంకాలు సగరులను ఆశ్చర్యానికి గురిచేశాయి. కేవలం ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే దాదాపు రెండున్నర లక్షలకు పైగా సగర జనాభా ఉండగా తెలంగాణ రాష్ట్రమంతా ఒక లక్షా ఇరవై నాలుగువేల జనాభా మాత్రమే ఉందని ప్రకటించడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే అందివస్తున్న అవకాశాలను స్వీకరిస్తూ, ముందుకు సాగుతూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి తమ కులగురువైన భగీరథుడి స్ఫూర్తితో ప్రయత్నం చేస్తుంటే, మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు ప్రస్తుత పాలకులు తమ జనాభాను కేవలం (0.03 శాతం)గా చూపడాన్ని సగరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ జనాభా లెక్కలను రేపు కేంద్ర ప్రభుత్వం చేసే జనగణనలో లెక్కల్లోకి తీసుకుంటే ఇలాంటి కులాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి.
సమస్త జీవకోటికి ప్రాణాధారమైన జలధారను తేవడంలో కృతకృత్యుడైన భగీరథుడి వారసులుగా జీవనం సాగిస్తున్న సగరుల జనాభాను తక్కువ చేసి చూపిన ఈ రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే పొరపాటు సరిచేసుకొని వాస్తవాలు వెల్లడించాలి. అలా చేసినప్పుడే ఇప్పుడిప్పుడే ముందుకు సాగుతున్న ఇలాంటి కులాలు అన్ని రంగాల్లో సమాన వాటాకు ఒక పక్క ప్రయత్నిస్తూనే స్వావలంబన దిశగా అడుగులు వేయగలవు. సగర కులగురువైన భగీరథుడి జయంతి ఉత్సవాలను అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలతో పాటు ఈ నెల 23వ తేదీన (నేడు) హైదరాబాద్ కేంద్రంగా రవీంద్రభారతిలో ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుంది.
ఆస్కాని మారుతిసాగర్
చైర్మన్, తెలంగాణ సగర భగీరథ ఆత్మగౌరవ ట్రస్ట్
(నేడు భగీరథ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి...
బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..
మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ
ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట
Read Latest Telangana News And AP News And International