Share News

ఆయన ఆత్మకథలో నా ప్రతిబింబం

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:55 AM

ఆంగ్ల పాఠకులకే గాక, ఇతర భారతీయ భాషల చదువరులకు కూడా చిరపరిచితుడైన రచయిత రస్కిన్ బాండ్ తన ఆత్మకథని ‘Lone Fox Dancing’ పేరిట జూన్ 2017లో వెలువరించారు. ‘స్పీకింగ్‌ టైగర్‌’ అనే ప్రచురణ సంస్థ దీనిని ప్రచురించింది....

ఆయన ఆత్మకథలో నా ప్రతిబింబం

ఆంగ్ల పాఠకులకే గాక, ఇతర భారతీయ భాషల చదువరులకు కూడా చిరపరిచితుడైన రచయిత రస్కిన్ బాండ్ తన ఆత్మకథని ‘Lone Fox Dancing’ పేరిట జూన్ 2017లో వెలువరించారు. ‘స్పీకింగ్‌ టైగర్‌’ అనే ప్రచురణ సంస్థ దీనిని ప్రచురించింది. ఆంగ్లంలో ప్రచురితమైన దాదాపు ఎనిమిదేళ్ళ తరువాత ఇది ఇప్పుడు ‘ఓ ఏకాంతజీవి బ్రతుకాట’ పేరిట తెలుగులోకి అనువాదమైంది. యాత్రా రచయిత, కథకుడు, అనువాదకుడు దాసరి అమరేంద్ర ఈ పుస్తకాన్ని అనువదించారు. ‘కథా ప్రపంచం’ దీన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా అమరేంద్రతో సంభాషణ.

ఈ ఆత్మకథ అనువదించే అవకాశం ఎలా లభించింది?

‘కథాప్రపంచం’ నిర్వాహకులు కిరణ్‌తో పదేళ్ల పరిచయం. మూడేళ్ల క్రితం ‘అనువాదాలు ప్రచురిద్దామనుకొంటున్నాం’ అని ఆయన ప్రకటించినప్పుడు, ‘నేను ఒకటి చేస్తాను’ అన్నాను. ఏది చెయ్యలి అన్న విషయంలో తర్జన భర్జన పడ్డాం. రస్కిన్ బాండ్ వీరాభిమాని అయిన కిరణ్ ఆయన ఆత్మకథను సూచించినప్పుడు ‘‘ఈ రస్కిన్ బాండ్ తేలిక బాణీలో మధ్యే మార్గంలో రాసే మనిషి గదా’’ అన్న ప్రిజుడీస్‌తో అన్యమనస్కంగానే ఆ పుస్తకం చదివాను. ముందు పర్లేదనిపించింది. రెండోసారీ మూడోసారీ చదవగా బావుందనిపించింది. ఆరునెలలు ఆ పుస్తకంతో సహవాసం, అనునాదం జరిగాక దానిని అనువదించడమన్నది ఎంత గొప్ప అవకాశమో తెలిసి వచ్చింది.

ఈ పుస్తకంలో మిమ్మల్ని ఆకట్టుకున్న ప్రధాన అంశాలేవి?

స్థూలంగా మా ఇద్దరి జాతులు, మతాలు, ప్రాంతాలు, పద్ధతులు వేరయినా– ఇవన్నీ దాటుకుని సూక్ష్మ రూపంలోకి వెళితే ఆయన ఆత్మకథలో నా ప్రతిబింబం కనిపించింది. కుటుంబ నేపథ్యాలు, ఆలోచనలు, అనుభవాలు, అభిరుచులు, అనుభూతులు – వీటన్నిటిలోనూ నాకు ఆయనతో సారూప్యం ఉంది. ఈ సారూప్యాలు నన్ను రస్కిన్ బాండ్ ఆత్మకథకు దగ్గర చేసాయి.

అలాగే ఈ ఆత్మకథలో నన్ను బాగా ఆకట్టుకున్న అంశం – నిర్మోహత్వం. తనకున్న శక్తి సామర్థ్యాలతో బతుకును నల్లేటి బాటలో నడిపే అవకాశమున్నా, ఆ ప్రలోభంలో పడకుండా తను నమ్మిన అక్షరాల ముళ్ళబాటనే ఎన్నుకుని 75 సంవత్సరాలుగా సాగిపోతున్న వైనం, అక్షరాలను నమ్ముకోవడమే గానీ అమ్ముకోవడం తెలియని నైజం నన్ను ఎంతగానో ఆకర్షించాయి!


రస్కిన్ బాండ్ నివసించిన ప్రాంతాలు మీకూ చిరపరిచితమైనవి కావడం అనువాదానికి ఏమైనా ఉపకరించిందా?

నిస్సందేహంగా! ఆయన డెహ్రాడూన్, ఢిల్లీ, ముస్సోరీలలో నివసించాడు. ఆయా ప్రదేశాలలో ఏళ్ళ తరబడి నడిచాడు. అక్కడి మనుషులు, పక్షులు, ప్రకృతి మధ్య జీవించాడు.

నేను గత యాభై యేళ్లుగా ఢిల్లీలో ఉంటున్నాను. ఊరంతా నాకు చిరపరిచితం. రస్కిన్ బాండ్ ఢిల్లీ మనుషుల గురించి రాస్తే వాళ్ళను నేను గుర్తుపట్టగలను. ఢిల్లీ కాలనీలు, ప్రముఖ ప్రదేశాలు, సినిమా హాళ్లు, సందుగొందుల గురించి ఆయన రాసిన వివరాలు నాకూ సుపరిచితం. అలాగే డెహ్రాడూన్, ముస్సోరి, లాండోర్ ప్రాంతాలతోనూ నాకు పరిచయం ఉంది. ఈ పరిచయాలు అనువాదంలో నాకు ఎంతగానో ఉపకరించాయి. ఏ విషయాన్నీ, ఏ ప్రదేశాన్నీ నేను ఊహించుకోవలసిన అవసరం లేకుండా, ఆయనతో కలసి వెళ్లి చూసాను, ఆయన కళ్ళతో, మనసుతో చూడగలిగాను. ఒక్కో చోట వాటి వివరాలు అప్‌డేట్ చేసి పొందుపరచే చొరవ చేసాను. ఉదాహరణకి కనాట్ ప్లేస్ లోని రీగల్ థియేటర్ గురించి ఆయన ప్రేమగా ప్రస్తావిస్తూ, ‘‘ఈ హాలు కూడా కాలగర్భంలో కలసిపోతుందేమో’’ అని విచారపడ్డారు. ‘‘కలసిపోయింది’’ అన్న వివరం నేను బ్రాకెట్ల మధ్య ఉంచాను.'

తెలుగు అనువాదానికి ‘ఓ ఏకాంత జీవి బ్రతుకాట’ అన్న శీర్షిక పెట్టే ముందు ఇంకేమైనా శీర్షికలు అనుకున్నారా?

శీర్షిక కాస్త ఇబ్బంది పెట్టింది. Lone Fox Dancing అన్న మూల రచన శీర్షికను ‘ఒంటరి జంబూకం నృత్యహేల’ అందామనుకున్నాను గానీ అది మూలంలోని స్ఫూర్తిని పట్టుకోలేదనిపించింది. శీర్షిక ఎంపిక కోసం మూల రచనను మరోసారి చదివినప్పుడు, ఆ ఒంటరి నక్క నాట్యమాడటం అన్న సంఘటన నిజంగా జరిగినదే అయినా, దానిని రస్కిన్ బాండ్ ఒక ప్రతీకగా తీసుకున్నాడని బోధపడింది. తన జీవితం నడచిన విధానం గురించి ఆ మాటలు పాజిటివ్ స్పిరిట్‌తో చెప్పాడని గ్రహించగలిగాను. అందుకే ‘ఒంటరి జీవి’ అనకుండా ఆ స్పిరిట్‌ స్ఫురించేలా ‘ఏకాంత జీవి’ అన్నాను.

మీరు ఒకే సమయంలో నంబూరి పరిపూర్ణ ఆత్మకథ ‘వెలుగు దారులలో..’ను తెలుగులోంచి ఇంగ్లీషులోకీ, రస్కిన్ బాండ్ ఆత్మకథను ఇంగ్లీషులోంచి తెలుగులోకీ అనువదించారు. ఈ అనుభవం గురించి?

స్థూలంగా చూస్తే అటు పరిపూర్ణ, ఇటు రస్కిన్ బాండ్ ఒకే బాణీ మనషులు. ఒకే కాలంలో జీవించిన మనుషులు. వాళ్లు చూసిన చారిత్రిక సామాజిక రాజకీయ జీవితాలు దాదాపు ఒకటే. ఇద్దరూ తమ తమ జీవితాలను తమ తమ ఎంపికలను, పట్టుదలలను ఆధారం చేసుకుని జీవించారు. జయించారు. పరిపూర్ణ ఎంపిక వెనుక భావజాల బలం ఉంది. నిలబడింది. అలాంటి భావజాలపు ఊతం లేకుండానే రస్కిన్ బాండ్ జీవితంలో నిలబడగలిగాడు. ఇది మరింత కష్టం.


ఈ రెండింటినీ ఏకకాలంలో అనువదించినప్పుడు పోల్చి చూడటం అసంకల్పితంగా జరిగిపోయింది. ఈ రెండు జీవితాలతోనూ నాకు గాఢమైన పరిచయం ఉండడం, ఆ జీవన విధానాలతో నాకు అంగీకారం ఉండటం ఆయా అనువాదాలను ప్రాణంతో నిలబెట్టే ప్రక్రియలో నాకు ఎంతగానో సాయపడ్డాయి. అవి రెండూ పరస్పర పూరకాలు. నాలాంటి వారికి బతుకంటే కాంక్ష కలిగించగల సజీవ జీవన చరిత్రలు.

ఇంటర్వ్యూ : కొల్లూరి సోమ శంకర్

ఈ వార్తలు కూడా చదవండి..

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 05:55 AM