Share News

Road Safety Is the Key to Our Future: రోడ్డు భద్రతలోనే మన భవిత

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:46 AM

ప్రమోదం కోసమో, ఏదో ప్రయోజనం కోసమో జరిగే ప్రయాణాల్లో ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యక్తులకూ, కుటుంబాలకూ, సమాజానికీ దుఃఖదాయకమవుతున్నాయి....

Road Safety Is the Key to Our Future: రోడ్డు భద్రతలోనే మన భవిత

ప్రమోదం కోసమో, ఏదో ప్రయోజనం కోసమో జరిగే ప్రయాణాల్లో ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యక్తులకూ, కుటుంబాలకూ, సమాజానికీ దుఃఖదాయకమవుతున్నాయి. 2023 సంవత్సరపు లెక్కలు తీసుకుంటే దేశవ్యాప్తంగా జరిగిన 4.81 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, 4 లక్షల 63 వేల మంది వికలాంగులయ్యారు. ఈ లెక్కన దేశం మొత్తమ్మీద ప్రతి గంటకూ 55 ప్రమాదాలు, 20 మరణాలు సంభవిస్తున్నాయి. ఈ లెక్కలను భారత ప్రభుత్వ ‘రోడ్డు రవాణా హైవే మంత్రిత్వ శాఖ’ విడుదల చేసింది.

తెలంగాణ విషయానికొస్తే– 2014 సంవత్సరంలో 20,078 రోడ్డు ప్రమాదాల్లో 6,906 మంది మరణించగా, 21,636 మంది వికలాంగులయ్యారు. 2023లో 22,903 ప్రమాదాల్లో 7,660 మంది మరణించగా, 21,022 మంది వికలాంగులయ్యారు. 2024లో 25,934 ప్రమాదాల్లో 7,281 మంది మరణించగా 15,401 మంది వికలాంగులయ్యారు. ఈ అంకెలు చెబుతున్న సత్యం ఒక్కటే– రోడ్డు భద్రత అత్యావశ్యకం అని!

రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న అంశాల్లో ముఖ్యమైనది అతివేగం. త్వరగా గమ్యం చేరుకోవాలన్న తొందర, యువతలో ఉండే అత్యుత్సాహం, రోడ్డు నియమాలను పాటించకపోవడం, ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్య వైఖరి వంటి కారణాల వల్ల తాము మాత్రమే గాక, ఎదుటి వాహనదారులకు కూడా ఇబ్బందులు కలిగిస్తూ వెళ్తున్నారు. హెల్మెట్ ధరించడంపై ప్రభుత్వం ఎన్నో నిబంధనలు విధించినప్పటికీ వాహనదారులు వాటిని సరిగ్గా పాటించకపోవడం వల్ల 2023లో దేశవ్యాప్తంగా దాదాపు 54 వేల మంది మరణించారు. అలాగే నాలుగు చక్రాల వాహనాల విషయంలో సీటు బెల్టు నియమాన్ని సరిగ్గా పాటించకపోవడం వల్ల దేశవ్యాప్తంగా 16,251 మంది మరణించారు. దీనికితోడు రోడ్డు గుంతలు, రోడ్డు డిజైన్‌ లోపాలు, క్రాస్ఓవర్ దగ్గర సరైన సూచికలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా వాటిని వాహనదారులు ఆ వేగంలో గమనించలేక పోవడం వంటి కారణాల వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నట్టు భారత ప్రభుత్వం ప్రస్తావించింది.


అలాగే రోడ్డు ప్రమాదాలపై సర్వేలలో 18 నుంచి 45 ఏళ్ల వయసువారు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నట్లుగా తేలింది. మొత్తం రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 66.4 శాతం ఈ వయో సమూహానికి సంబంధించినవారే. దేశ ఉత్పాదకతకు ఎంతో విలువైన మానవ వనరుగా ఉండే ఈ వయో సమూహం మితిమీరిన ఆత్మవిశ్వాసంతో అతివేగంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు బలవుతున్నది.

మరోపక్క మన దేశంలో వాహనాల సంఖ్య ఏ ఏటికాయేడు విపరీతంగా పెరుగుతున్నది. వ్యాపార వాణిజ్య వ్యవహారాల విస్తరణ వంటి కారణాల వల్ల వాహనాల కొనుగోలు, రిజిస్ట్రేషన్లు పెరిగాయి. నిజానికి ఇది ఒక అభివృద్ధి సూచిక. వాహనాల సంఖ్య పెరుగుతున్నది అంటే ఆ మేరకు వాహనాలను కొనుగోలు చేసే సామర్థ్యం ప్రజలలో పెరిగినట్టు, ఆ మేరకు పర్యటన, ప్రయాణం విస్తరించినట్టు. ఇది జాతీయ అభివృద్ధి సూచికలో ప్రధానాంశం. 2023లో మనదేశంలో మొత్తం 26 కోట్ల టూ వీలర్స్‌, 5 కోట్ల పైన ఫోర్‌ వీలర్స్‌ ఉన్నట్టుగా తెలుస్తోంది. వీటిలో తెలంగాణలో 2024లో 1 కోటి 63 లక్షల వాహనాలు రిజిస్టర్ కాగా, వాటి సంఖ్య 2025 నాటికి 1 కోటి 73 లక్షలకు పెరిగింది. వీటిలో 1 కోటి 24 లక్షల టూవీలర్స్‌ ఉండగా, 50 లక్షల ఫోర్ వీలర్స్ ఉన్నాయి. ట్రాక్టర్లు, ట్రాలీల సంఖ్య 7.5 లక్షలు ఉంది. ఇలా సగటున ప్రతి రోజూ 3 వేల పైన వాహనాలు తెలంగాణలో రిజిస్టర్ అవుతున్నట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ సంఖ్య తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్న తీరుకు ఒక సూచికగా భావించవచ్చు.

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్దిష్టమైన వ్యూహంతో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డు రవాణా శాఖ సిబ్బందిని సక్రమంగా వాడడం ద్వారా ఈ ప్రమాదాలను, వాటిలో మరణాలను తగ్గించడంలో గణనీయమైన ప్రగతి సాధించింది.


రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రజా ప్రభుత్వం ఇప్పటికే ఏడు అంచెల వ్యూహాన్ని అమలు చేస్తోంది. 1) యువతలో, విద్యార్థి లోకంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. 2)వివిధ కళాశాలల్లో, పాఠశాలల్లో రోడ్డు భద్రతను సిలబస్‌లో భాగంగా చేయడం. 3) జిల్లాలవారీగా ప్రత్యేక క్యాంపెయిన్‌లను నిర్వహించడం. 4) రోడ్లు భవనాల శాఖ, మునిసిపల్, పంచాయతీరాజ్, విద్యుత్, అబ్కారీ, పోలీస్, ట్రాఫిక్ ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ రోడ్ల నాణ్యతను మెరుగు పరచడం, రోడ్లపై ప్రయాణాన్ని క్రమబద్ధీకరణ చేయడం. 5) పత్రికలు, టీవీ, సోషల్ మీడియాలలో ప్రచారం. 6) రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సదుపాయం, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలవడం. 7) డ్రంక్ అండ్ డ్రైవ్ నిరోధించడం. వీటికి తోడుగా వాహనదారులు, ప్రయివేట్ వాహన యాజమాన్యాలు, ప్రజలు, పౌరుల సహకారం ఎంతో అవసరం. ముఖ్యంగా వాహనదారులు ప్రభుత్వ నియమాలను తు.చ. తప్పకుండా పాటించాలి. రోడ్డు ప్రమాదాల వల్ల వ్యక్తుల వ్యాపార, వాణిజ్య, ఉద్యోగ కార్యక్రమాలకు విఘాతమే కాదు, అన్నిటినీ మించి వారినే నమ్ముకున్న కుటుంబాలకు పూడ్చలేని నష్టం వాటిల్లుతుంది. ‘రోడ్డు భద్రత అంటే మన భద్రత, మన కుటుంబ భద్రత, మన సమాజ భద్రత’ అనే అంశాన్ని మనం విస్మరించరాదు. ఈ దిశగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలతోపాటు నిపుణులైన సుశిక్షితులైన బాధ్యతతో కూడిన డ్రైవర్లను, బాధ్యతాయుతమైన యంత్రాంగం నిర్వహించే ఆర్టీసీ బస్సులను, ఆర్టీసీ కార్గో సర్వీసులను విస్తృతంగా అందజేస్తోంది.

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిరోజే తన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘మహాలక్ష్మి పథకం’ ద్వారా తెలంగాణలోని మహిళలు అందరికీ ఉపయోగపడే విధంగా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పించారు. ఈ విధానం వల్ల బాధ్యతాయుతమైన ప్రయాణాల సంఖ్య పెరిగి, ప్రమాదాలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైతే సరైన యంత్రాంగం, సుశిక్షితులైన డ్రైవర్లు, ఎప్పటికప్పుడు పరీక్ష చేసి సంసిద్ధంగా ఉన్న వాహనాలు అందుబాటులో ఉంటాయో అప్పుడు సహజంగానే ప్రమాదాల సంఖ్య తగ్గుతుంది.

అందుకని తెలంగాణ ఆడబిడ్డలు, ప్రజలందరి సుఖ ప్రయాణం కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అవగాహన చైతన్య కార్యక్రమాలను ఆహ్వానించి రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించి తమకు, కుటుంబానికి, సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి మేలు చేయాలని అభ్యర్థిస్తున్నాను.

పొన్నం ప్రభాకర్

తెలంగాణ రవాణా,

బీసీ సంక్షేమ శాఖ మంత్రి

ఈ వార్తలు కూడా చదవండి..

రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 12:46 AM