Share News

పాలించే ‘ప్రభువు’ కాదు, కలిసి పనిచేసే ‘గుంపు మేస్త్రి’!

ABN , Publish Date - Aug 13 , 2026 | 01:16 AM

తెలంగాణ సమాజంలో దశాబ్దాలుగా అధికారం అంటే ‘పాలించడం’ అనీ, నాయకుడు అంటే ‘ప్రభువు’ అనే భావజాలం బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, తెలంగాణ మట్టి వాసన తెలిసిన...

పాలించే ‘ప్రభువు’ కాదు, కలిసి పనిచేసే ‘గుంపు మేస్త్రి’!

తెలంగాణ సమాజంలో దశాబ్దాలుగా అధికారం అంటే ‘పాలించడం’ అనీ, నాయకుడు అంటే ‘ప్రభువు’ అనే భావజాలం బలంగా నాటుకుపోయింది. ఈ నేపథ్యంలో, ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు, తెలంగాణ మట్టి వాసన తెలిసిన పోరాట యోధుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా తనను తాను ‘గుంపు మేస్త్రీ’గా అభివర్ణించుకోవడం కొందరికి కొత్తగా, మరికొందరికి ఆశ్చర్యంగా అనిపించింది. దశాబ్దాల రాజకీయ భాషకు భిన్నంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్న తీరు, స్పందిస్తున్న తీరు, ప్రజలను కలుపుకుపోతున్న తీరు సామాన్యులకు చేరువయ్యింది. తన సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి ప్రజల అవసరాలే కేంద్రంగా ప్రజోపయోగ, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ జననాయకుడిగా నిరూపించుకున్నారు రేవంత్‌రెడ్డి.

ఆయన వ్యాఖ్యలను ఆసరాగా చేసుకుని కొందరు ప్రతిపక్ష నాయకులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ‘గుంపు మేస్త్రీ’ అని సంబోధిస్తూ ఆ పదాన్ని అవహేళన చేస్తున్నారు. శ్రమించి పైకొచ్చిన నాయకుడిని, జనంలోంచి ఎదిగిన నేతను అలా హేళన చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనానికి, దొరతనపు అహంకారానికి, గడీల మనస్తత్వానికి నిదర్శనం.

దొరతనంతో ప్రజలను ఏలాలనుకునే అహంకారపు విధానాలకు కాలం చెల్లిందనీ, ప్రజల కష్టాల్లో తోడూ నీడై నిలుస్తూ, శ్రమనే అభివృద్ధికి మూలాధారంగా భావిస్తూ, ప్రజా చైతన్యాన్ని సన్మార్గంలో నడిపించే ‘గుంపు మేస్త్రీ’ భావజాలమే తెలంగాణ స్వేద సంస్కృతికి, ప్రజాస్వామ్య రక్షణకు నిజమైన ప్రతీక అనీ తెలంగాణ సమాజం భావించింది. ఇది చరిత్రలో ఎన్నోసార్లు నిరూపితమైంది కూడా. మన తెలంగాణ గడ్డ శ్రమకు, స్వేదానికి పట్టంగట్టే నేల. ఇక్కడ కోటలు, రాచరికాలు నిలబడలేదు. చెమట చుక్కల పునాదులపై నిర్మించబడే సమాజమే నిలబడింది.


ఒక భవనాన్ని నిర్మించడానికి ఇటుకలు పేర్చే కూలీల నుంచి సిమెంట్ కలిపే పనివారి వరకు అందరినీ సమన్వయం చేస్తూ, సరైన దిశానిర్దేశం చేసి నిర్మాణాన్ని పూర్తిచేసే బాధ్యత మేస్త్రీదే. అందుకే మేస్త్రీ అనేది కేవలం ఒక వృత్తిని సూచించే పదం కాదు. సమష్టి శక్తిని ఒకే లక్ష్యం వైపు నడిపించే నాయకత్వానికి, శ్రమ సంస్కృతికి ప్రతీక. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను తాను ‘గుంపు మేస్త్రీ’గా అభివర్ణించుకోవడం వెనుక ఇదే భావన ఉంది. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక ప్రధాన శ్రామికుడినే తప్ప ప్రభువును కాదని ఆయన పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. పాలనను దొరతనానికి ప్రతీకగా కాకుండా, ప్రజలందరూ కలిసి చేసే ఒక నిర్మాణాత్మక ప్రక్రియగా నిర్వచించిన తీరు ఆయనలోని శ్రమ సంస్కృతి తాత్వికతను స్పష్టంగా ప్రతిబింబిస్తోంది.

‘గుంపు’ అనేది ప్రజలకు ప్రతీక అయితే, ‘మేస్త్రీ’ ఆ ప్రజల ఆకాంక్షలకు రూపమిచ్చే సమన్వయకర్తకు ప్రతీక. ప్రజాస్వామ్యం ఒక వ్యక్తి సంకల్పంతో నడిచే వ్యవస్థ కాదు. ముఖ్యమంత్రి, మంత్రులు, శాసనసభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్మికులు, యువత, పలు రంగాల నిపుణులు, కోట్లాది మంది ప్రజలు కలిసి ఒక సమష్టి శక్తిగా మారినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆ సమష్టి సంకల్పానికి దిశానిర్దేశం చేస్తూ, అందరినీ ఒకే లక్ష్యం వైపు నడిపిస్తూ, రాష్ట్ర నిర్మాణానికి రూపురేఖలు ఇవ్వడమే నిజమైన నాయకత్వం. ఒక్క వ్యక్తి కృషి కంటే అందరినీ కలుపుకొని ముందుకు సాగే నాయకత్వమే గొప్ప ఫలితాలను ఇస్తుంది. ‘గుంపు మేస్త్రీ’ అనే భావన కూడా ఇదే తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఒక భవనం నాణ్యతకు మేస్త్రీ ఎంతగా బాధ్యత వహిస్తాడో, ఒక రాష్ట్ర పునర్నిర్మాణం కూడా అంతే బాధ్యతతో ముందుకు సాగాలి. మేస్త్రీ ఎప్పుడూ ఏసీ గదుల్లో కూర్చొని ఆదేశాలు ఇవ్వడు. ఎండనకా, వాననకా పని జరిగే చోటే ఉండి పర్యవేక్షిస్తాడు. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాడు. బలహీనమైన పునాదులను బలోపేతం చేసి, బలమైన నిర్మాణానికి పునాది వేస్తాడు. అదే విధంగా ప్రజల మధ్య ఉంటూ, వారి సమస్యలను అర్థం చేసుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తూ, సమష్టి కృషితో రాష్ట్రాన్ని ముందుకు నడిపించే బాధ్యత నాయకుడిదే. గత పాలకులు ప్రజలను తమ శాసనాలకు లొంగి ఉండే పాలిత వర్గంగా చూశారు. కానీ రేవంత్‌రెడ్డి నాయకత్వం ప్రజలను రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములుగా మారుస్తోంది. ప్రజల కష్టసుఖాలు తెలిసిన నాయకుడు మాత్రమే తనను తాను ‘గుంపు మేస్త్రీ’ అని ధైర్యంగా చెప్పుకోగలడు. నాడు ఒక పార్టీ కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ఆరంభించి, జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, నేడు ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం వ్యక్తిగత విజయగాథ మాత్రమే కాదు. శ్రమను గౌరవించే సంస్కృతి, ప్రజా ఉద్యమాల స్ఫూర్తి, ప్రజాస్వామ్యం అందించే సామాజిక చలనశీలతకు ఇదొక చారిత్రక వ్యక్తీకరణ. శ్రమ, క్రమశిక్షణ, ప్రజల విశ్వాసం కలిస్తే సాధారణ మనిషి కూడా అత్యున్నత స్థాయికి చేరుకోగలడనే సత్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్థానం నిరూపిస్తుంది.


ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ‘తెలంగాణ పునర్నిర్మాణం’ అనే గొప్ప యజ్ఞంలో మేమంతా భాగస్వాములమే. ఒక మేస్త్రీ నిర్మాణ పనిలో ప్రతి కార్మికుడి శ్రమను సమన్వయం చేస్తూ లక్ష్యాన్ని చేరుకున్నట్లే, ముఖ్యమంత్రి నాయకత్వంలో మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల సహకారంతో ఒకే లక్ష్యం కోసం కృషి చేస్తున్నాం.

l కొండా సురేఖ

అటవీ, పర్యావరణ,

దేవాదాయ–ధర్మాదాయశాఖ మంత్రివర్యులు

ఇవి కూడా చదవండి...

రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్

చంద్రబాబు.. నిజమైన అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 13 , 2026 | 01:16 AM