Rayalaseema Lift Irrigation Project: టీడీపీపై బురద చల్లుతున్న రేవంత్, జగన్
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:36 AM
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అడ్డం పెట్టుకొని, చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అనవసరంగా...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని అడ్డం పెట్టుకొని, చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అనవసరంగా బురద చల్లుతున్నారు. రేవంత్‌రెడ్డి ప్రయత్నం అధికారం కాపాడుకోవడంలో భాగమేమో కానీ, జగన్మోహన్‌రెడ్డిది మాత్రం– అధికారాన్ని తిరిగి పొందాలంటే చంద్రబాబును బదనాం చేయాలనే శుష్క తాపత్రయం.
కేంద్ర అనుమతులు తీసుకోకుండా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును మొదలు పెట్టి; ఆ తర్వాత కేంద్రం, కృష్ణా బోర్డు, ఎన్జీటీ ఆదేశాలతో రూ.2.65 కోట్లు జరిమానా కట్టి, చివరకు విధిలేక ప్రాజెక్టు అమలును ఆపేసిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రబాబే ఆపేశారని అంటున్నారు. ప్రాజెక్ట్ కట్టేటప్పుడు అసలేమీ మాట్లాడని రేవంత్‌రెడ్డి, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబుతో మాట్లాడి, రాయలసీమ లిఫ్ట్ పథకాన్ని ఆపించేశానని తెలంగాణ అసెంబ్లీలో అన్నారు.
వీరిద్దరూ కావాలని మర్చిపోతున్నది ఏమిటంటే.. ప్రజలకు ఏ మాత్రం జ్ఞానం ఉండదని, వారు పూర్తి మతిమరుపుతో ఉంటారని, తాము ఏమి చెప్పినా చెల్లిపోతుందని! తెలంగాణలో రేవంత్, ఆంధ్రాలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాతే, కేంద్రం తుదిగా లిఫ్ట్ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వబోమని కరాఖండిగా చెప్పేసింది. 2025 ఫిబ్రవరి 27న ఆన్‌లైన్‌లో జరిగిన 25వ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశంలో, ఎన్జీటీ విధించిన బ్యాన్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని, తాము రాయలసీమ లిఫ్ట్ పథకానికి పర్యావరణ అనుమతులు నిరాకరిస్తున్నామని స్పష్టంగా చెప్పి, ఆ మేరకు రాష్ట్రానికి లేఖ కూడా రాసింది. అంతేకాకుండా తదుపరి పర్యావరణ అనుమతులు కోరే ముందు, ప్రాజెక్ట్ సవివర నివేదిక (డీపీఆర్) మినహా, ప్రాజెక్ట్ సైట్‌లో ఎలాంటి పనులు చేయలేదని, పర్యావరణ అంచనా నివేదిక ప్రకారం ప్రాజెక్ట్ ప్రస్తుత ప్రదేశాన్ని, ప్రాజెక్ట్ పూర్వస్థితికి తేవాలని, ఆ మేరకు ఫొటోలతో సహా పూర్తి ఆధారాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది.
ఇంత సాధికారికంగా కేంద్ర పర్యావరణ శాఖ 2025 ఫిబ్రవరిలో చెప్పినప్పుడు, నేనే చెప్పి ఆపించేశాను అని ఒకరు, చంద్రబాబే ఆపేశారు అని ఇంకొకరు మాట్లాడ్డం కేవలం స్వప్రయోజన రాజకీయం మాత్రమే. రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం.. సాగునీటి వనరులు 17వ క్రమసంఖ్యలో రాష్ట్రాల పరిధిలోనే ఉన్నా కూడా; యూనియన్ లిస్టు ప్రకారం 56వ ఎంట్రీలో అంతర్రాష్ట్ర నదీ జలాలు, లోయలు తదితరాల మీద కేంద్ర ప్రభుత్వానికే అధికారం ఉంటుంది. ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ జలాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఇంత స్పష్టంగా రాజ్యాంగంలో నిర్వచించి ఉండగా, భారతదేశ ఫెడరల్ వ్యవస్థ విధి విధానాలనే సవాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి కానీ, వైసీపీ నుంచి జగన్ కానీ, చంద్రబాబే ఆపేశారు అని చెప్పడం హాస్యాస్పదమే.
కేంద్ర ప్రభుత్వం, జలసంఘం నుంచి ఏ విధమైన అనుమతులు తీసుకోకుండానే సంగమేశ్వరం నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తోడి శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో పోసే లక్ష్యంతో జగన్మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని మొదలుపెట్టారు. 2020 ఆగస్టులో టెండర్ల ప్రక్రియకు ముందే కృష్ణా బోర్డు... కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవు కాబట్టి, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్‌ను ఆపేయాలని ఆంధ్రప్రదేశ్‌కు లేఖ రాసింది. 2020 మే నెలలోనే జాతీయ హరిత ట్రిబ్యునల్, రాయలసీమ లిఫ్ట్ మీద వేసిన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ, కేవలం డీపీఆర్ మాత్రమే తయారు చేసుకోవచ్చని, ప్రాజెక్ట్ కట్టుబడి పనులు చేపట్టకూడదని ఆదేశించింది. కానీ జగన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం ‘ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్‌కు మేము ఆధునికీకరణ మాత్రమే చేస్తున్నాం’ అంటూ రూ.3,800 కోట్లకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.
2020 మే–జూలై మాసాల మధ్యలో కృష్ణా బోర్డు, కేంద్ర జలసంఘం, లిఫ్ట్ ప్రాజెక్ట్‌పై ముందుకు వెళ్లొద్దంటూ రాష్ట్రానికి పలు లేఖలు రాసినా జగన్ ఖాతరు చేయలేదు. పైగా, కోర్టులు, కేంద్రం వద్దని ఆదేశించే లోపే 2020 ఆగస్టు 10న టెండర్లను ఆహ్వానించి, జగన్ ప్రభుత్వం వాటికి పనులు కట్టబెట్టింది. 2020 అక్టోబర్‌లో మళ్ళీ ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇవ్వలేమని, పర్యావరణ అనుమతులు వచ్చే వరకు ముందుకు పోకూడదని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆర్డర్ ఇచ్చింది. అంతేగాక, 2021 డిసెంబర్ 17న ‘రాయలసీమ’కు సంబంధించిన అన్ని పనులను వెంటనే నిలిపేయాలని, కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చే అనుమతుల తర్వాతే తాము స్పందిస్తామని తేల్చి చెప్పి పనులు ఆపేయించింది. కానీ ఈ లోపే దాదాపు రూ.900 కోట్లతో మట్టి పనులు మాత్రం చేయించి, కొన్ని కాలువలు తవ్వారు. ముందుగా చెప్పుకొన్నట్టు, పర్యావరణ అనుమతులు కుదరవు అంటూ కేంద్ర పర్యావరణ శాఖ 2025 ఫిబ్రవరిలో తేల్చి చెప్పింది. ఈ లిఫ్ట్ మీద ఎన్జీటీ తదుపరి వాయిదా 2026 జనవరి 22న ఉంది.
ఈ ప్రాజెక్ట్ ద్వారా జగన్ గరిష్ఠంగా 34 టీఎంసీల నీటిని మాత్రమే అదనంగా తీసుకోగలరు. దాంట్లో, దాదాపు 22 టీఎంసీలు మల్యాలలో 834 అడుగుల వద్ద, ముచ్చుమర్రిలో 798 అడుగుల వద్ద ఇప్పటికే తీసుకుంటున్నాం. నాలుగువేల కోట్లతో జగన్ తలపెట్టిన ఈ లిఫ్ట్ ప్రాజెక్ట్‌తో కేవలం 12 టీఎంసీలు మాత్రమే అదనంగా వస్తున్న నేపథ్యంలో, ఇంత ఖర్చు, హంగామాతో తలపెట్టిన ఆ ప్రాజెక్ట్ ముందుకు పోదని, అనుమతులు రావని తెలిసి కూడా, కేవలం సులభంగా డబ్బులు సంపాదించడం కోసం మొదలెట్టారని అప్పట్లోనే ప్రజలకు అర్థమయింది.
పోనీ మిగతా ప్రాజెక్టుల మీద జగన్ ఖర్చు పెట్టారా అంటే, అప్పటికే మొదలుపెట్టాల్సిన 102 ప్రాజెక్టులను రద్దు చేశారు. 2014–19 మధ్య ఆ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ ప్రభుత్వం రూ.12,441 కోట్లు ఖర్చు చేయగా, జగన్ తన హయాంలో రూ.2,011 కోట్లే ఖర్చు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక రూ.3,870 కోట్లతో 100 రోజుల్లోనే 738 కి.మీ మేర హంద్రీ–నీవా కాలువ వెడల్పు పనులు చేపట్టి, కుప్పం వరకూ నీటిని తరలించింది. సీమ ప్రాజెక్టులపై ప్రస్తుతం రూ.6,613 కోట్లు ఖర్చు చేస్తోంది.
రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలతో జగన్ హయాంలోనే, ఆగిపోయిందని రేవంత్‌రెడ్డితో పాటుగా అందరికీ తెలుసు. ఎన్జీటీ ప్రాజెక్ట్ పని ఆపేసిన తర్వాత, జగన్ రెండున్నర సంవత్సరాలకు పైగా అధికారంలో ఉన్నారు. పర్యావరణ అనుమతులు తెచ్చే ప్రయత్నం చేయలేదే? అధికారం కోల్పోయిన ఈ 18 మాసాల్లో కూడా జగన్ ఏ రోజూ ఈ ప్రాజెక్టు గురించి ఒక్కసారీ మాట్లాడలేదే? తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, కూటమి ప్రభుత్వాన్ని నిందించడం సరికాదు.
నీలాయపాలెం విజయ్‌కుమార్
తెలుగుదేశం అధికార ప్రతినిధి
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News