Share News

చదరంగ భీష్మ

ABN , Publish Date - May 21 , 2026 | 12:18 AM

మన దేశంలో చెస్ అనగానే విశ్వనాథన్‌ ఆనంద్, కోనేరు హంపి తదితర క్రీడాకారుల పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ డెబ్భై ఏళ్ల క్రితమే దేశంలో చెస్‌కు బలమైన పునాదులు పడ్డాయి. ఇందుకు తెలుగువాడైన ...

చదరంగ భీష్మ

మన దేశంలో చెస్ అనగానే విశ్వనాథన్‌ ఆనంద్, కోనేరు హంపి తదితర క్రీడాకారుల పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ డెబ్భై ఏళ్ల క్రితమే దేశంలో చెస్‌కు బలమైన పునాదులు పడ్డాయి. ఇందుకు తెలుగువాడైన దర్భా వెంకయ్య విశేష కృషి చేశారు. 1955లో తొలిసారి జాతీయ స్థాయి చెస్ పోటీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరులో జరిగాయి. అంతకు ముందు వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ స్థాయి చెస్ పోటీలు జరిగేవి. ఏలూరులో జరిగిన జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రామచంద్ర సప్రేతో పాటు దర్భా వెంకయ్య కూడా పాల్గొని విశేషంగా రాణించారు. ఇద్దరు హోరాహోరీగా తలబడి సంయుక్త విజేతలుగా నిలిచారు. అయితే రామచంద్రకు మాత్రం గుర్తింపు వచ్చింది. ఆయన జీవిత చరిత్ర ఇండియన్ చెస్ హిస్టరీ పేరుతో బయటకు వచ్చింది. తర్వాత కాలంలో వెంకయ్యకు ఇతర దేశాల్లో ఆడటానికి అవకాశం వచ్చింది. అయితే ఆర్థిక భారం కారణంగా ఆయన విదేశాలకు వెళ్లలేకపోయారు. వెంకయ్యను ‘చదరంగ భీష్మ’ అని కూడా పిలుస్తారు. 1950 నుంచి 1985 వరకు దేశంలో చెస్ అభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారు.

దేశంలో తొలితరం చెస్ క్రీడాకారుడైన వెంకయ్యకు ఎటువంటి గుర్తింపు రాకపోవడం విచారకరం. రామచంద్ర పేరుతో ఇప్పటికీ మహారాష్ట్రలో పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2024లో ఆంధ్రా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో 62వ జాతీయ స్థాయి చెస్ పోటీలు జరిగాయి. దీన్ని పురస్కరించుకొని అసోసియేషన్ ప్రతినిధులు వెంకయ్య పేరును ప్రస్తావించారు.

దర్భా వెంకయ్య తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత కాకినాడ జిల్లా)లోని తునిలో అప్పన్నశాస్త్రి, వెంకటసుబ్బమ్మ దంపతులకు 1916 ఆగస్టు 16న జన్మించారు. ఆయన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. కాకినాడలోని యంఎస్ఎన్ చారిటీస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయులుగా 35ఏళ్ల పాటు పనిచేశారు. ఆయనకు బోధన అంటే చాలా ఇష్టం. బోధనకు ఆటంకం కలుగుతుందని ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించినా, తిరస్కరించారు. ఖాళీ సమయంలో చెస్ ఆడేవారు. ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిలో నిరంతరం బిజీగా ఉంటూనే, మరోవైపు చెస్‌లో ప్రతిభను కనబర్చేవారు. వెంకయ్య ఆధ్వర్యంలో ఏలూరు కేంద్రంగా రాష్ట్ర స్థాయిలో తొలి చెస్ సంఘం 1953లో ఏర్పడింది. వెంకయ్య అనేక మంది చెస్ ఆటగాళ్ళను ప్రోత్సహించారు. మాజీ ప్రపంచ ఛాంపియన్ గారీ కాస్పరోవ్ సైతం వెంకయ్య ప్రతిభను ప్రశంశించారు.


35 ఏళ్లు సైన్స్ టీచర్‌గా పనిచేసి 1985లో వెంకయ్య పదవీ విరమణ చేశారు. తీవ్ర అనారోగ్యంతో 1986మే 21న కాకినాడలో తుదిశ్వాస విడిచారు. చెస్ ఆడితే మేధాశక్తి పెరుగుతుందని, కాబట్టి విద్యార్థులకు తప్పనిసరిగా చెస్ నేర్పించాలని ఆయన ఎప్పుడూ అంటూ ఉండేవారు. అటువంటి మహనీయుడిని గుర్తించి, గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

m యం. రాంప్రదీప్

జెవివి సభ్యులు, తిరువూరు

(నేడు దర్భా వెంకయ్య వర్ధంతి)

ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

టీజీ పీజీఈసెట్ పరీక్ష షెడ్యూల్ మార్పు.. కొత్త తేదీ ఇదే

అక్రమాస్తుల కేసులో జలమండలి జనరల్ మేనేజర్ అరెస్ట్

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 12:18 AM