గాయాల గేయం.. కలేకూరి
ABN , Publish Date - May 16 , 2026 | 02:13 AM
కాలం కొందరి త్యాగాలను సదా మోయదు. మనిషికి మతిమరుపు ఉన్నట్లు, కాలానికీ ఉంటుందేమో. మారుతున్న ‘కొత్త బంగారు లోకానికి’ త్యాగధనుల త్యాగాల ఛాయాచిత్రాలు గుర్తుకు రావు. రానివ్వదు కూడా. అలా కాలం మరిచిపోయే...
‘నా కనుగుడ్లు కన్నీరై ద్రవిస్తే,/ ఈ దేశంలో జీవనదులు ప్రవహించాయి./ నా సిరల నుండి జీవధాతువులు స్రవిస్తే,/ ఈ దేశం సస్యశ్యామలమై సిరులు కురిసింది./ నేను జన సమూహాల గాయాన్ని,/ గాయాల గేయాన్ని’
కలేకూరి
కాలం కొందరి త్యాగాలను సదా మోయదు. మనిషికి మతిమరుపు ఉన్నట్లు, కాలానికీ ఉంటుందేమో. మారుతున్న ‘కొత్త బంగారు లోకానికి’ త్యాగధనుల త్యాగాల ఛాయాచిత్రాలు గుర్తుకు రావు. రానివ్వదు కూడా. అలా కాలం మరిచిపోయే జ్ఞాపకాలలో ఎప్పటికీ గుండె గుర్తుగా ఉండే అరుదైన జ్ఞాపకం ‘కనుకొలను’ కలేకూరి. కవి, సినీ గీత రచయిత, సాహిత్య విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు, అనువాదకుడు, జర్నలిస్టు, వాగ్గేయకారుడు, తత్వవేత్త ఇన్ని పార్శ్వాలు కలపోతగా చెక్కిన దళిత ఉలి కలేకూరి. సామాజిక దొంతరలు, అసమానతల అసమానతావాదం ఉన్నంత కాలం సజీవ శిల్పంగా ఉండేందుకు ఆయన అర్హుడు.
కలేకూరి స్వస్థలం ఉమ్మడి కృష్ణా జిల్లా కంచికచర్ల. 1969లో జరిగిన మానని అమానవీయ గాయంగా చరిత్రకెక్కిన ‘కంచికచర్ల కోటేశు’ వ్యథ కలేకూరిపై బలంగా పడింది. ఆనాటి భూస్వామ్య క్రౌర్యం 22 ఏళ్ళ యువకుడిని పందిరి గుంజకు కట్టేసి, కిరోసిన్ పోసి కాల్చేస్తే, దేశం నిర్ఘాంతపోయింది. వాషింగ్టన్ పత్రిక ఆశ్చర్యపోయింది. ఎంతో మంది జ్ఞానవంతులను కదిలించినట్లే, కలేకూరినీ కదిలించి, ఆయన కలానికీ, కథన కుతూహలానికీ సత్తువ ఇచ్చింది. అలా కలం పట్టిన కలేకూరి కన్నవారి కలలను, కోరికలను కాలదన్ని జీవిత చరమాంకం వరకు దళిత ‘అన్నమయ్య’ అయ్యాడు. బహుజన తాత్విక బోధనల లాలిపాటల్లో, జోల పాటల్లో తడిసి ముద్దయ్యాడు. ఊరొదిలి బహుదూరపు బాటసారిలా, బైరాగిలా, అంటరానోళ్ళ సైనికుడిలా... బయలుదేరాడు. తొలుత విప్లవోద్యమం వైపు పరుగు. తరువాత విప్లవ రచయితల సంఘం వైపు ఎదుగు. తుదకు దళిత రాజ్యాధికారం దిశగా పరుగో పరుగు. ఈ పరుగు పందెంలో తనకంటూ ఏదీ మిగుల్చుకోలేదు. ఏదీ దాచుకోలేదు. ఒక చేత్తో పుస్తకం, మరో చేతిలో సిగరెట్ తప్ప వ్యక్తిగత జీవితం లేదు. కుటుంబ జీవితం లేదు. సొంత ఆస్తి లేదు. ఆఖరికి సొంతింటి కల కూడా లేదు. అన్నీ ఉద్యమాల అడుగు జాడలే. రాష్ట్రంలో దళితులపై ఏ మూల ఏ దాష్టీకం జరిగినా, ఏ ఘోరం, ఏ నేరం జరిగినా పక్కనున్న వారి నుంచి దారి ఖర్చులు తీసుకుని వెళ్ళేవాడు. వెళ్ళిన చోటే తినేవాడు. బాధితులతోనే సావాసం, సహవాసం చేసేవాడు. వారి పోరాటమే తన ఉచ్ఛ్వాస, నిశ్వాసలుగా ఆనందించేవాడు. కవితలు రాశాడు. పాటలు రాశాడు. పాటలకు బాణీలు కట్టాడు. అనువాద రచనలు చేశాడు. కానీ నిర్మాణాత్మకమైన కార్యాచరణలో ఒదగలేకపోయాడు. క్రమశిక్షణాయుత పని విధానాన్ని పొందుపరుచుకోలేకపోయాడు.
బహుజన అధినేత కాన్షీరాం నీలి రంగు పవనాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడాడు. కుటుంబ జీవనంలో తగిలిన ఎదురుదెబ్బకు కోలుకోలేక కాలం ఎటు రంకె వేస్తే, అటువైపు దౌడు తీశాడు. ఆఖరికి అలసి సొలసి చావును హృదయపూర్వకంగా ముద్దాడాడు. చివరి దశలో ఆయన జీవితం మహా విషాదంగా మారింది. అలా ఐదు పదుల వయసులోనే దళిత మేధావిగా పేరుగాంచి భువి నుంచి దివికి వెళ్ళిపోయాడు. శ్రీరాములయ్య సినిమాలో రాసిన ‘భూమికి పచ్చని రంగేసినట్టు...’ అన్న పాటను, ‘కర్మభూమిలో పూసిన ఓ పువ్వా...’ అన్న కవితను, పూలాందేవి అనువాద పుస్తకాన్ని... ఇలా కొన్ని ఆణిముత్యాల జ్ఞాపకాలను భావితరాలకు బహుమతిగా ఇచ్చి వెళ్ళాడు.
‘నాకు జాలి జాలి మాటలొద్దు/ కన్నీటి మూటలొద్దు/ నేను బాధితున్ని కాదు/ అమరుణ్ణి... ఎగిరే ధిక్కార పతాకాన్ని’ అని పదేపదే ఆలపించే కలేకూరి బొమ్మను విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసి ‘నేను ఎరిగిన మా కలేకూరికి’ నివాళులు అర్పించాలన్న ప్రయత్నం జరుగుతోంది. ఇది అందరి బాధ్యత. ఎలాంటి సత్కారాలకు, సన్మానాలకు నోచుకోని ధిక్కార ఉలి బొమ్మను ప్రతిష్ఠిస్తే, అదే తగిన బహుమతి అవుతుంది. సదా కలేకూరి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి.
పోతుల బాలకోటయ్య
చైర్మన్, ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ బోర్డు
(మే 17: కలేకూరి ప్రసాద్ వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి...
రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు
Read Latest Telangana News And AP News And International News