Recognize Telangana Movement Activists: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:04 AM
పద్నాలుగేళ్లపాటు సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సబ్బండ జాతుల వారు పాల్గొన్నారు. ముఖ్యంగా కళాకారులు, గాయకులు, కవులు...
పద్నాలుగేళ్లపాటు సాగిన తెలంగాణ మలిదశ ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, సబ్బండ జాతుల వారు పాల్గొన్నారు. ముఖ్యంగా కళాకారులు, గాయకులు, కవులు, రచయితలు, బుద్ధిజీవులు తమ రచనలతో పాటలతో, ధూమ్ ధామ్‌లతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను మారుమూల గ్రామాలకూ చేరవేశారు. రాష్ట్రం ఏర్పాటై, కేసీఆర్ అధికారాన్ని చేపట్టిన తర్వాత ప్రజలకు, ఉద్యమకారులకు ప్రవేశం లేకుండా ప్రగతి భవన్ గేట్లు మూసివేశారు.
గత ప్రభుత్వం కొద్దిమంది కళాకారులకు చిన్నా చితకా అవకాశాలు కల్పించి చేతులు దులుపుకుంది, ఉద్యమకారులను విస్మరించింది. ప్రగతి భవన్‌కు చేరుకోగలిగి, అధినాయకుని దర్శనం చేసుకున్న కొందరు మేధావులు, ఉద్యోగ సంఘాల నాయకులు తగిన ఫలితాలు పొందారు. అవకాశవాదులు, వందిమాగధులు కూడా ప్రాధాన్యం పొందగలిగారు. నాటి పాలకులు తమకు నచ్చిన కొద్దిమంది ఆధిపత్య సామాజిక వర్గాల మేధావులకు ఉన్నత విద్యామండలిలో, విశ్వవిద్యాలయాల్లో చోటు కల్పించారు. గత పది సంవత్సరాలలో రాష్ట్రంలో కేసీఆర్ సృష్టించిన విధ్వంసాన్ని, అవినీతిని, ప్రభుత్వ ఆస్తుల పరాయీకరణ... వంటి వాటిని గమనించిన ఉద్యమకారులు, మేధావులు, చైతన్యవంతమైన ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికలలో కొత్త ప్రభుత్వానికి ఆహ్వానం పలికారు.
ఎన్నికల ముందు విడుదల చేసిన తమ మేనిఫెస్టోలో, ఉద్యమకారులకు తగిన విధంగా న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా, ఉద్యమకారుల ఊసే సీఎం ఎత్తడం లేదు. గత ప్రభుత్వం వలెనే వీరు కూడా ఉద్యమకారులను విస్మరించడం తగదు. ప్రస్తుత ప్రభుత్వంలోనూ తొమ్మిది మంది అగ్రశ్రేణి ఉద్యమ కళాకారులకు, రచయితలకు కొంత గౌరవం దక్కింది. ఉద్యమంలో పాల్గొని లాఠీ దెబ్బలు తిని, పోలీస్ స్టేషన్‌లో రోజుల తరబడి పస్తులుండి, జైలు జీవితం గడిపిన ఎందరో ఉద్యమకారులకు మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలోనూ నిరాశే మిగులుతోంది. తమను ఆదుకోవాలని కోరుతూ ఏడాది కాలంగా ప్రతి జిల్లాలో ఉద్యమకారులు అనేక సభలు, సమావేశాలు నిర్వహిస్తూ, ప్రభుత్వానికి అనేక విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినా ప్రభుత్వ వర్గాల నుంచి స్పందన రాకపోవడం ఉద్యమకారులకు ఆందోళనను, ఆవేదనను కలిగిస్తోంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులందరినీ గుర్తించాలి. వారికి తగిన చేయూతనివ్వాలి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి, గ్రేడింగ్ చేసి, అక్కడి ప్రభుత్వం వారికి తగిన విధంగా వివిధ రంగాల్లో అవకాశాలు కల్పించి ఆదరించింది. తెలంగాణలో కూడా ఉద్యమకారులను అదే విధంగా ఆదుకునేలా ప్రభుత్వం సంకల్పించాలి.
ప్రొఫెసర్ కూరపాటి వెంకట నారాయణ
ఇవి కూడా చదవండి..
డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి