Ravipudi Venkatadri: హేతువాద, మానవవాద తాత్వికుడు
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:40 AM
హేతువాదం, మానవవాదం అనే పదాల మీద విస్తృతమైన తెలుగు సాహిత్యాన్ని సృష్టించిన రచయిత, కార్యశీలి, తాత్వికుడు– రావిపూడి వెంకటాద్రి. చదివింది ఇంటర్మీడియట్ అయినా...
హేతువాదం, మానవవాదం అనే పదాల మీద విస్తృతమైన తెలుగు సాహిత్యాన్ని సృష్టించిన రచయిత, కార్యశీలి, తాత్వికుడు– రావిపూడి వెంకటాద్రి. చదివింది ఇంటర్మీడియట్ అయినా ఆయన సృష్టించిన సాహిత్యానికి ఎన్ని డిగ్రీలు, ఎన్ని డాక్టరేట్‌లు ఇచ్చినా సరిపోవేమో! ఆయన రచనలను స్థూలంగా పరిశీలించినప్పుడు– మానవ జీవన అంతరంగాన్ని తాకే ఏ అంశాన్నీ ఆయన వదిలిపెట్టలేదు. 1946లో విశ్వాన్వేషణతో మొదలైన ఆయన రచనా ప్రస్థానం 2023 జనవరి 21న మరణానికి 20 రోజుల ముందు వరకు కొనసాగింది.
చిన్నతనం నుంచి మత సాహిత్యాన్ని చదివి పెరిగిన ఆయన మాటల్లో, రచనల్లోనూ హిందూమతం, ఇతర మత భావజాలాలపై అధిక సాధికారత కనిపిస్తుంది. అలాగే సమకాలీనంగా సాగిన శాస్త్ర పరిశోధనలను ఆసాంతం అర్థం చేసుకున్న వ్యక్తి ఆయన. మత సాహిత్యం చదివినా, విజ్ఞాన శాస్త్రాలను చదివినా ఆయన ఎక్కడా తన ఆలోచనలో ఉన్న మానవీయ తాత్విక భావజాలాన్ని వదిలిపెట్టలేదు. పైగా ప్రతీ విషయాన్ని ‘హేతువాద ఆకురాయి’తో పరీక్షించకుండా వదిలిపెట్టలేదు.
మత గ్రంథాలను, పిడివాదాలను, జడవాదాలను ఆయన ప్రశ్నించిన తీరు చాలా ఘాటైనది. ఆయన చేసిన విమర్శలు, ఆయన అడిగిన ప్రశ్నలు దశాబ్దాలుగా వివరణలకు, జవాబులకు నోచుకోలేదంటే ఆయన హేతువాద స్థాయి, ప్రశ్నల స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆయన చిన్నతనంలో చేపట్టిన మత విమర్శను మాత్రమే కొనసాగించకుండా, మతాలకు విరుగుడు ఏమిటా? అని ఆలోచించారు. మత భావాలకు సరైన సమాధానాలు ఆధునిక విజ్ఞానశాస్త్ర పరిశోధనా ఫలితాలు మాత్రమే ఇవ్వగలవని గుర్తించి, తన అధ్యయనాన్ని అటువైపుగా మళ్ళించారు. వైజ్ఞానిక వెలుగులో పురాణేతిహాసాలను చూసి అందులో ఉన్న డొల్లతనాన్ని గుర్తించి, బాహాటంగానే ప్రకటించారు. అందరూ అచంచల విశ్వాసంతో పాటించే మతభావాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి, మతం అంటే మూసుకుపోయిన ఆలోచనే అని, ‘‘అసలు మారేది మతమే కాదని, మారనిది సైన్సే కాద’’ని నిర్ధారించి, సూత్రీకరించారు. మత వ్యతిరేకత, శాస్త్రీయ విజ్ఞానం వెంకటాద్రిని నాస్తికవాదం వైపు నడిపించాయి. అయితే ఆయన సత్యాన్వేషణ అక్కడితో ఆగిపోలేదు. హేతువాద ఉద్యమానికి కేవలం ‘పురోహిత వ్యతిరేకత’, ‘దైవ నిరాకరణ’ మాత్రమే లక్ష్యంగా ఉండరాదని ఆయన భావించారు. ఆ ఉద్యమాన్ని క్రమంగా మానవవాద బాట పట్టించారు.
మానవేంద్రనాథ్ రాయ్ (ఎం.ఎన్. రాయ్) భావజాలంతో ప్రభావితుడైన వెంకటాద్రి, రాడికల్ హ్యూమనిస్ట్... మెల్లగా ఆదర్శాల వైపు మళ్లారు. వాటిని తీవ్రంగా అధ్యయనం చేసిన ఆయన, మానవవాదం అంటే– ఏ వ్యక్తీ పుట్టుకతో వివక్ష అనుభవించరాదని, మానవులందరికీ అన్ని వ్యవస్థలలో, అన్ని విధానాలలోనూ– ‘స్వేచ్ఛ’ ప్రధానమైన విలువ అని గుర్తించారు. భావవాదం, ఆధ్యాత్మికత అనేవి కవల పిల్లలని, అవి ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి వ్యతిరేకంగా మాట్లాడతాయని, కానీ ఆచరణలో మాత్రం స్వాములు, భక్తులు, బాబాలు, ప్రవచనకారులు అందరూ ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఉప ఉత్పత్తిగా వచ్చిన సాంకేతిక శాస్త్రాన్ని... అంటే టెక్నాలజీని, శాస్త్రీయ పరికరాలన్నింటినీ అందరికంటే ఎక్కువగా వాడుకుంటారని సున్నితంగా చెప్పారు.
యూరప్‌లో వచ్చినట్టుగా శాస్త్ర విజ్ఞానాల పునర్జీవనం ఇంతవరకు భారతదేశంలో మొదలే కాలేదని గుర్తు చేశారు. రాజా రామ్మోహన్‌రాయ్‌ను భారతీయులు ఆదర్శంగా తీసుకోవడం చాలా పొరపాటని, అదే బెంగాల్ రాష్ట్రంలో పుట్టిన హెన్రీ డేరాజియాను, ఆయన భావాలను వెదజల్లగలిగితే భారతదేశ స్వరూపం ఇప్పుడు మరో విధంగా ఉండేదని తన రచనల నిండా చెప్పారు. మత సాహిత్యం చాలా ఉన్నదని, అది అజ్ఞానాన్ని, ఆచారాలను, సంప్రదాయాలను వ్యవస్థీకృతం చేస్తున్నదని వెంకటాద్రి తన రచనలలో తెలిపారు. ఆ స్థాయిలో హేతువాద మానవవాద సాహిత్యం వచ్చినప్పుడే మన సమాజంలో మార్పు సాధ్యమన్నారు.
తెలుగు హేతువాద సాహిత్యంలో రావిపూడి వెంకటాద్రి పేరు ఒక రచయితగా మాత్రమే కాదు, ఒక ఆలోచనా ప్రవాహంగా నిలుస్తుంది. ఆయన చేసిన రచనలను, పుస్తకాల జాబితాగా చూస్తే సంఖ్యలు కనిపిస్తాయి. కానీ ఆ సంఖ్యల వెనుక ఒకే ప్రశ్న తిరుగుతుంది. అదేమిటంటే... మనిషి స్వేచ్ఛగా, గౌరవంగా, ఆనందంగా, వివక్ష లేకుండా బతకాలంటే– దేవుడు, మతం, ఆచారం, సంప్రదాయం, మూఢ నమ్మకాలు ఏ స్థాయిలోనూ ఉండకూడదు. ఈ ఒక్క అంశమే ఆయన జీవితాన్ని, రచనలను, ఉద్యమాన్ని ఒక తాత్విక ఏకత్వంలో నిలిపింది.
రావిపూడి వారి ప్రత్యేకత ఏమిటంటే ఆయన హేతువాద ఉద్యమాన్ని కూడా హేతువాదంతోనే పరిశీలించారు. హేతువాదం అంటే కేవలం దేవుడిని తిట్టడమా? మతాన్ని ఖండించడమేనా? అంతేనా మన లక్ష్యం? ఈ ప్రశ్నలు ఉద్యమం లోపల కన్నా, ఆయన నుంచే రావడం వల్ల అవి అసౌకర్యంగా అనిపించాయి. కానీ అవే ప్రశ్నలు ఉద్యమానికి సరైన దిశను చూపించాయి. మూసుకుపోయిన ఆలోచనలను సైతం మొగ్గ తొడిగించడం రావిపూడి వారి ప్రత్యేకత. అనేక ప్రత్యేకతలతో ప్రపంచంలో 102 సంవత్సరాలు నడయాడిన ఆధునిక హేతువాద మానవవాద తాత్వికుడు ఆయన.
ప్రపంచ తాత్విక చరిత్ర పుస్తకంపై ముఖచిత్రంగా వేయదగిన మహా‘మనీషి’ ఆయన. మన మధ్య లేకపోయినా, ఆయన ఆలోచనలు, భావాలు ఇంకా ఈ ప్రపంచ ప్రజల భావవీధుల్లో జీవిస్తూనే ఉంటాయి. మనిషిని కేంద్రంగా పెట్టని, గౌరవించని ఏ భావజాలమైనా చివరికి మనిషినే నాశనం చేస్తుంది.
l కె.శ్రీనివాసాచారి
అధ్యక్షులు, తెలంగాణ హేతువాద సంఘం
(నేడు రావిపూడి వెంకటాద్రి వర్ధంతి)
ఈ వార్తలు కూడా చదవండి.
అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News