పాత ప్రశ్నలకు కొత్త జవాబులు ఉండవు!
ABN , Publish Date - Oct 14 , 2026 | 02:28 AM
‘వ్యవస్థలో మార్పు మనిషి పరివర్తనకు హామీ ఇవ్వదు’ అనే పేరుతో వ్యాసకర్త బిక్షపతి గారు మళ్లీ పాత ప్రశ్నలనే, కొత్త వాక్యాలతో తెచ్చారు! (ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 10న). అలా రాయడానికి కారణం...
‘వ్యవస్థలో మార్పు మనిషి పరివర్తనకు హామీ ఇవ్వదు’ అనే పేరుతో వ్యాసకర్త బిక్షపతి గారు మళ్లీ పాత ప్రశ్నలనే, కొత్త వాక్యాలతో తెచ్చారు! (ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 10న). అలా రాయడానికి కారణం, ‘ఒకే కేంద్ర భావాన్ని మరోసారి పరిశీలించడం అవసరం’ అని ఆయన భావన! ఆయన ప్రశ్నలకు నా జవాబులు ఇవి.
ప్రశ్న: సమాజాన్ని మార్చిన తర్వాత మనిషి కూడా అంతే వేగంగా మారిపోతాడా?
జవాబు: మనిషి కూడా అంతే వేగంగా మారతాడు. ఎందుకంటే, సమాజాన్ని మార్చేదే మనుషులు కాబట్టి. సమాజం అంటే, ఫలానా రకపు సంబంధాలతో (ఉదా: యజమాని–శ్రామిక సంబంధాలు) ఉన్న మనుషుల సముదాయం! వారిలో ఆ సంబంధాల వల్ల దోపిడీ, పీడనలకు గురి అయ్యేవారు, వాటి నుంచి బైటపడే ప్రయత్నం ఎంత వేగంగా చేస్తే అంత వేగంగా మారతారు.
ప్రశ్న: విముక్తి ఆలోచన కలిగిన మనిషి, తనలోని అధికార ప్రవృత్తిని కూడా ప్రశ్నించగలడా?
జవాబు: ప్రశ్నించగలడు. ఎప్పుడంటే.. ‘విముక్తి అంటే, అధికారాలు లేని స్థితి’ అనే అవగాహన తెలిసి వున్నప్పుడు.
ప్రశ్న: కొత్త ఆధిపత్యం ఏర్పడకుండా ఉండాలంటే ఎలా?
జవాబు: వ్యక్తుల మధ్య శ్రమల విభజనా, ఉత్పత్తి సంబంధాలూ, పంపిణీ సంబంధాలూ వంటివాటి స్వభావాన్ని సమూలంగా మార్చుకున్నప్పుడు మాత్రమే కొత్త ఆధిపత్యం తలెత్తే అవకాశం ఉండదు. ఉదాహరణకి, సమాజానికి అవసరమైన, మురికిని శుభ్రం చేసే అట్టడుగు శారీరక శ్రమల్ని, ఏవో కొన్ని కుటుంబాలే కాకుండా, అన్ని కుటుంబాల వారూ చేసే విధంగా శ్రమ సంబంధాల్ని మార్చుకున్నప్పుడు కులాలూ, వివక్షలూ అనే వాటికి వీలే వుండదు!
ప్రశ్న: ఒక విప్లవం ఆర్థిక వ్యవస్థను మార్చగలిగినా, దాన్ని నడిపే మనిషి తనలోని పాత మానసిక నిర్మాణాలను మార్చుకోకపోతే ఆధిపత్యం రూపాన్ని మాత్రమే మార్చుకొని తిరిగిరావచ్చు. అవునా?
జవాబు: ఆ విప్లవం స్వభావం ఏమిటీ, అది ఆర్థిక వ్యవస్థను ఎంతవరకు మార్చగలిగిందీ అనే దాన్ని బట్టి ఉంటుంది ఫలితం. సమాజం గురించి, పునాది (ఆర్థికం), ఉపరితలం (మానసిక నిర్మాణాలు, ఆధిపత్య భావాలూ వగైరా) అనే పోలికతో మార్క్సు చెప్పినది ఇదే. ఉదాహరణకి, చైనాలో సాంస్కృతిక విప్లవ కాలంలో, ‘మన ఆర్థిక వ్యవస్థ సోషలిస్టు అయింది గానీ, భావజాలం ఇంకా బూర్జువా స్వభావంతోనే వుంది’ అని అక్కడి కమ్యూనిస్టులు భ్రమపడ్డారు. నిజానికి అక్కడ సోషలిస్టు పునాది ఏర్పడనే లేదు! అటువేపు కొన్ని చిన్న చిన్న అడుగులు మాత్రమే మొదలయ్యాయి. ఉత్పత్తి సాధనాల మీద హక్కు వ్యక్తులకు లేకుండా చట్టాలే మారాయి గానీ, ఉత్పత్తి సాధనాల మీదా, ఉత్పత్తి కార్యాల మీదా, శ్రామికులకు నిర్ణయాధికారం రాలేదు. అధికారం అంతా, పార్టీ నాయకులకూ, ప్రభుత్వాధికారులకే! (ఇలాంటి పరిస్థితిని రష్యాలోనూ, యుగోస్లావేకియాలోనూ చూసి, ఒక యుగోస్లావేకియా నాయకుడు, ‘కొత్త వర్గం’ అని ఒక పుస్తకం కూడా రాశాడు. కొందరు మార్క్సిస్టులేమో, అక్కడ ఉన్నది ‘ప్రభుత్వ పెట్టుబడిదారీ విధానం’ అనీ; ‘పార్టీ పెట్టుబడిదారీ విధానం’ అనీ కొన్ని ఆధారాలతో చెప్పారు). ఆ దేశాలలో, మేధా శ్రమా–శారీరక శ్రమా అనే అసమాన శ్రమ విభజనను మార్చుకోనే లేదు. ‘ఆర్థిక వ్యవస్థను సోషలిస్టుగా మార్చేశాము’ అని చెప్పుకున్న అన్ని దేశాలలోనూ, అందుకే ఆధిపత్యం కొత్త రూపాలలో కొనసాగింది. ఎంతగా అంటే, వ్యక్తిపూజలు చేయించుకునేటంతగా! కాబట్టి, అసలు జరగవలిసిన మార్పులు జరగనప్పుడు, జరగనిదానిని జరిగినట్టుగా భావించి, ‘వ్యవస్థలో మార్పు, మనిషి పరివర్తనకు హామీ ఇవ్వదు’ అనడం, ఊహాజనిత తత్వశాస్త్రం (‘స్పెక్యులేటివ్ ఫిలాసఫీ’)లోనే సాధ్యం.
రంగనాయకమ్మ
ఇవి కూడా చదవండి..
ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
Read Latest AP News And Telugu News