Share News

Rabindranath Tagore Gitanjali: రవీంద్రుడు పురికొల్పిన కొత్త ప్రార్థన

ABN , Publish Date - Jan 02 , 2026 | 01:51 AM

ఋషితుల్యుడైన ఆ మహాకవి అజరామర గీతం స్ఫూర్తితో, 2026 సంవత్సరంలో సకల శుభాలతో భారతదేశం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న ఒక భారతీయుని ప్రార్థనను నివేదిస్తాను....

Rabindranath Tagore Gitanjali: రవీంద్రుడు పురికొల్పిన కొత్త ప్రార్థన

ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో/ ఎక్కడ మానవుడు సగర్వంగా తల ఎత్తుకుని తిరుగుతాడో/ ఎక్కడ జ్ఞానం స్వేచ్ఛగా మనగలుగుతుందో/ ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలై ఇరుకైన గోడల మధ్య మ్రగ్గిపోదో.../ ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి, తండ్రీ! నా దేశాన్ని మేల్కొనేట్టు అనుగ్రహించు.

– రవీంద్రుడు ‘గీతాంజలి’

ఋషితుల్యుడైన ఆ మహాకవి అజరామర గీతం స్ఫూర్తితో, 2026 సంవత్సరంలో సకల శుభాలతో భారతదేశం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్న ఒక భారతీయుని ప్రార్థనను నివేదిస్తాను. ఈ కొత్త సంవత్సరంలో, వర్తమానాన్ని, భవిష్యత్తును నిన్నటి దృక్కోణంతో చూడని కొత్త దృక్పథం భారతీయులలో ప్రభవించాలి. శతాబ్దం క్రితం వందేమాతరం గీతంలో ఏ చరణాలను ఎవరు తొలగించారనే విషయమై ఎంపీలు గంటల తరబడి చర్చలు జరపకూడదు. 1950ల్లో జవహర్‌లాల్‌ నెహ్రూ ఏమి చేశారు, ఏమి చేయలేదు అన్న విషయాన్ని అప్రస్తుతంగా పరిగణించాలి. అలాగే 17వ శతాబ్దిలో ఔరంగజేబు ఏ దురాగతాలకు పాల్పడ్డాడన్న విషయంపై కాకుండా భావితరాలకు మరింత మెరుగైన భారతదేశాన్ని అందించేందుకు ప్రస్తుత నాయకత్వం ఏమి చేస్తుందన్న దానిపైనే అందరూ దృష్టి పెట్టాలి.

ఓటర్ల మద్దతుకై కులపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టని లేదా మతపరమైన చీలికలు సృష్టించని వివేకశీల రాజకీయాలు ప్రభవించాలి. పాలనా సంబంధిత విషయాలకే ప్రాధాన్యమివ్వాలి. ఏ మసీదు కింద ఏ శతాబ్దంలో ఏ ఆలయం ఉన్నదనే విషయమై నిరాధార ఆసక్తి ప్రాధాన్యం పొందకూడదు. ఒక వాట్సాప్‌ యూనివర్సిటీ కోర్సు స్థాయికి చరిత్రను కుదించకూడదు. మరిన్ని ప్రార్థనా మందిరాలను నిర్మించడానికి కాకుండా నాణ్యమైన వసతులు ఉన్న పాఠశాలలు, ఆస్పత్రులు ఎన్నిటిని నిర్మిస్తున్నారనే విషయం పైనే దృష్టి కేంద్రీకరించాలి.


క్రిస్మస్‌ వేడుకలకు భంగం కలిగిస్తున్న, ‘లవ్‌ జిహాద్‌’ పేరిట ముస్లింలపై దురాగతాలకు పాల్పడుతున్న బజరంగ్‌ దళ్‌ లాంటి బృందాల కార్యకర్తలకు కఠిన శిక్షలు విధించాలి. అప్పటికీ ఆ సంఘం కార్యకర్తలు తమ దుర్మార్గాలకు స్వస్తి చెప్పని పక్షంలో అటువంటి స్వయం ప్రకటిత హిందూ సంరక్షక బృందాలను నిషేధించాలి. మతతత్వ ధోరణులు, హింసాకాండను నిర్ద్వంద్వంగా తిరస్కరించాలి. ఈ విషయంలో మాటలకే పరిమితం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలి.

చట్టపరమైన అధికారం లేకుండా మూక న్యాయం, హింసను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బ తీసే విజిలంటిజంను తిరస్కరించి, చట్టబద్ధ పాలనతో జవాబుదారీతనంతో వ్యవహరించే పాలనా వ్యవస్థను సమకూర్చే రాజ్యాంగ వాదానికి మరింతగా నిబద్ధమవ్వాలి. బెంగాలీ భాష మాట్లాడుతున్న కారణంగా ఎవరినీ బంగ్లాదేశీయుడుగా ముద్రవేసి దేశం నుంచి గెంటివేయని నాగరీక పాలనా పద్ధతులు వర్ధిల్లాలి. ‘చొరబాటుదారు’ అనే పదం రాజకీయ బూచి కాకూడదు. ‘విద్వేషం’ సాధారణ పరిణామం కాకూడదు. ‘మనము’, ‘వారు’ అనే తేడాలతో సామాజిక బహిష్కరణలు చోటుచేసుకోకూడదు. ఆధిపత్య ధోరణులకు స్వస్తి చెప్పి, చట్టం ముందు ప్రతి ఒక్కరూ సమానులేనన్న వైఖరితో వ్యవహరించాలి.

మనం ఆకాంక్షిస్తున్న భారతదేశంలో పర్యావరణ సంరక్షణకు ప్రతి ప్రభుత్వమూ చిత్తశుద్ధితో పూనుకోవాలి. ‘వాయు నాణ్యతా సూచీ’ (ఎక్యుఐ) ప్రాధాన్యాన్ని ముఖ్యమంత్రులు గుర్తించాలి. ప్రతి పౌరుడూ నిర్మల వాయువు శ్వాసించే పరిస్థితి కల్పించాలి. పర్యావరణ సున్నిత ప్రదేశాలు ధ్వంసమయ్యేలా మైనింగ్‌ కార్యకలాపాలను అనుమతించకూడదు. రియల్‌ ఎస్టేట్‌ మాఫియాలను కట్టడి చేయాలి. వాతావరణ మార్పు నిరోధాన్ని మాటలకే పరిమితం చేయకుండా, అందుకు కార్యసాధక ప్రణాళికలను రూపొందించి అమలుపరచాలి.

ఈ కొత్త సంవత్సరంలో రాజకీయ పార్టీలు కుటుంబ యాజమాన్య సంస్థలుగా ఉండని విధంగా ప్రగతిశీల రాజకీయాలు ప్రభవించాలి. అన్ని రాజకీయ పక్షాలలో అంతర్గత ప్రజాస్వామ్యం పెంపొందాలి. నాయకత్వ నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన వారిని అసమ్మతివాదులుగా పరిగణించకూడదు. విమర్శలు, ఆక్షేపణలను తిరుగుబాటుగా భావించకూడదు. చట్టం నుంచి రక్షణకు రాజకీయ విధేయతలు మార్చుకునే పద్ధతి పోవాలి. ప్రతిపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాలపై మాత్రమే దృష్టి పెట్టి ఎన్నికలలో ప్రయోజనాలకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ను దుర్వినియోగపరచకూడదు.


ఎన్నికల సంఘం తన రాజ్యాంగ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహించాలి. ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు పూచీపడాలి తటస్థ మధ్యవర్తిగా మాత్రమే వ్యవహరించాలి గానీ ఒక పక్షానికి బి–టీమ్‌గా పరిణమించకూడదు. ఓటర్‌ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను పారదర్శకంగా పరిపూర్తి చేయాలి. ఎన్నికలలో పోటీ చేసే అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలి. ఇందుకు ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా జాగరూకత వహించడం ఎన్నికల సంఘం విధ్యుక్త ధర్మం.

కశ్మీర్‌ నుంచి కేరళ వరకు ప్రతి భారతీయ పౌరుడినీ సమరీతిలో గౌరవించాలి. దేశంలో ఏదో ఒకచోట ఉగ్రవాద దాడి సంభవించినప్పుడు కశ్మీరీలను వేధింపులకు గురిచేయకూడదు. కశ్మీర్‌ను కేవలం ఒక భూభాగంగా పరిగణించే వైఖరికి స్వస్తి చెప్పి, సమస్త కశ్మీరీల హృదయాలు, మనసులు గెలుచుకునేందుకు చిత్తశుద్ధితో మరింతగా కృషి చేయాలి. ఉత్తరాది–దక్షిణాది తేడాలు, తమిళ్‌–హిందీ భాషా వివాదాలు సమసిపోయేలా వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవాలి, పటిష్ఠ చర్యలు చేపట్టాలి. వైవిధ్యాన్ని బలహీనతగా కాకుండా బలంగా భావించాలి.

ఆదాయ అసమానతలు తగ్గించడం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం కావాలి. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి ఇస్తున్న ప్రాధాన్యాన్ని హ్యూమన్‌ డిగ్నిటీ ఇండెక్స్‌కు కూడా ఇవ్వాలి. పేదలకు విద్యా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి. సమాజంలోని అన్ని వర్గాల వారికీ సమాన అవకాశాలు కల్పించాలి. సంపన్నులు, రాజకీయ పలుకుబడి ఉన్నవారి కాలనీలను క్రమబద్ధీకరిస్తూ పేదల గృహాలను బుల్డోజర్లతో కూల్చివేయడాన్ని మానుకోవాలి. ఆశ్రితులు అయిన వ్యాపార దిగ్గజాలకే ప్రభుత్వ ప్రాజెక్టులను కట్టబెట్టే అలవాటుకు స్వస్తి చెప్పాలి. కష్టపడి పనిచేస్తూ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. వారికి మరింతగా వ్యాపార సౌలభ్య పరిస్థితులను కల్పించాలి. ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ ఆవిర్భవించడం శుభ పరిణామమే. అయితే తలసరి ఆదాయం విషయంలో దేశం 130వ స్థానంలో ఉండడంపై తప్పకుండా ఆందోళన చెందాలి.


ఏడాది పొడుగునా కష్టపడి చదివి పరీక్షలు రాసే విద్యార్థులు స్వార్థపరులైన అధికారులు, ఉపాధ్యాయుల అక్రమాలకు నష్టపోకుండా జాగ్రత్త వహించాలి. పరీక్ష ప్రశ్నపత్రాలు లీక్‌ కాకుండా చూడాలి. పరీక్షల నిర్వహణ అత్యంత జాగ్రత్తగా జరగాలి. కళాశాలల్లో ప్రవేశాలు ప్రతిభ ఆధారంగా జరగాలి. సిఫారసుల మేరకు ప్రవేశాలు కల్పించడాన్ని నిషేధించాలి. నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల కల్పన కలసికట్టుగా జరగాలి. ఆకాంక్షాభరిత యువ భారతీయులు తమ లక్ష్యాల పరిపూర్తిలో నిర్విఘ్నంగా ముందుకు సాగేందుకు ప్రభుత్వాలు దోహదం చేయాలి.

‘నేను ముడుపులు తీసుకోను, ఎవరినీ తీసుకోనివ్వను’ అనేది నినాద ప్రాయంగా ఉండకూడదు. స్వార్థ ప్రయోజనాలకు, ఆర్థిక లబ్ధికి ప్రాధాన్యమిచ్చే రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు నియమ నిబంధనలు మార్చేందుకై అధికార దుర్వినియోగానికి పాల్పడడాన్ని అరికట్టి, నైతిక నిష్ఠతో వ్యవహరించే నాయకులు, అధికారులు ప్రాధాన్యం పొందే అనుకూల పరిస్థితులు ఈ కొత్త సంవత్సరంలో ఏర్పడాలి. ప్రజాప్రతినిధుల, ప్రభుత్వాధికారుల ఆస్తుల వివరాలు ప్రజల నిశిత పరిశీలనకు అందుబాటులో ఉండాలి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నాయకుల, అధికారుల ఆస్తులను స్వాధీనం చేసుకుని పేదలకు గృహ వసతిని కల్పించేందుకు వాటిని వినియోగించాలి.

భారతీయ సమాజంలో జ్ఞానకుసుమాలు వికసించాలి. మూఢనమ్మకాల కంటే వైజ్ఞానిక జిజ్ఞాసకే ప్రాధాన్యం, మరింత విలువనివ్వాలి. వంశప్రతిష్ఠ కంటే కార్యదక్షతకే గౌరవం ఉండాలి. ఒక వ్యక్తి విలువ అతని బ్యాంక్‌ బ్యాలెన్స్‌ బట్టి కాకుండా జ్ఞానసంచయం ఆధారంగా నిర్ణయమవాలి. బాక్సాఫీస్‌ వసూళ్లు కాకుండా, సృజనాత్మక ప్రతిభా పాటవాలే ఒక సినిమా సార్థకతను నిర్ణయించాలి. కేవలం ఒక సూపర్‌ స్టార్‌ సంస్కృతిని పెంచి పోషించడం కాకుండా ఊరూరా విశాల ఆటస్థలాలు ఉండేలా చేయడమే క్రీడా విజయంగా పరిగణన పొందాలి.

భారతీయ న్యాయస్థానాలు కేసుల విచారణను పదే పదే వాయిదావేయడం కాకుండా న్యాయ నిర్ణయాలు వేగవంతంగా తీసుకోవాలి. ఒక న్యాయమూర్తి నివాసంలో లెక్కలేని నగదు కట్టలు కనిపించినప్పుడు దేశం దిగ్భ్రాంతి చెందాలి. ప్రజలు కలవరపడాలి. మౌనంగా ఉండిపోవడం తగదు గాక తగదు. ఉన్నత స్థాయి న్యాయమూర్తుల నియామకాలు రాజకీయ పరపతి, భావజాల అనుబంధాల ప్రాతిపదికన కాకుండా న్యాయ విధుల నిర్వహణలో నిష్పాక్షికత, దక్షత ఆధారంగా జరగాలి.


ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠపరచడమే పత్రికారంగం పరమ ధ్యేయం కావాలి. అవును, అధికారంలో ఉన్నవారు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా చేయడమే తన విధ్యుక్త ధర్మమని మీడియా సదా జ్ఞాపకముంచుకోవాలి. అంతేగానీ పాలకులకు విధేయంగా వ్యవహరించడం ప్రజావంచనే కాక ఆత్మవంచన కూడా అవుతుందని గుర్తించాలి. అధికారంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన ప్రశ్నలు వేయడమనేది తమ వృత్తి ధర్మమని పాత్రికేయులు మరచిపోకూడదు. సత్యశోధనతో ధర్మ రక్షణకు నిబద్ధమవ్వాలి.

ఇవన్నీ నిర్నిబంధంగా జరిగే స్వేచ్ఛా ప్రపంచానికి భారత్‌ జాగృతమవాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు!

రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌)

ఇవి కూడా చదవండి...

రైతులకు గుడ్‌న్యూస్.. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

సంస్కరణల పథంలో అభివృద్ధి రథం:పవన్ కల్యాణ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 02 , 2026 | 01:51 AM