పీఎస్‌యూల పునరుజ్జీవనానికి కొత్త స్ఫూర్తి
ABN , Publish Date - Feb 03 , 2026 | 03:14 AM
దేశంలో అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారు, కోలిండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఈ సంవత్సరం జనవరి 19న ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా....
దేశంలో అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారు, కోలిండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్, ఈ సంవత్సరం జనవరి 19న ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఆశాజనకంగా లేనప్పటికీ ఈ సంస్థ ఐపీఓ చరిత్ర సృష్టించింది. రూ.1,070 కోట్లను సేకరించడానికి ఆఫర్‌లో ఉన్న 46 కోట్ల షేర్ల కోసం 147 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్ అయింది. 90 లక్షలకు పైగా అప్లికేషన్లు దాఖలయ్యాయి. భారత ప్రభుత్వరంగ సంస్థల విజయవంతమైన ఐపీఓ లిస్టింగ్ ఇదొక్కటే కాదు. ఈ ఒరవడి గత కొన్నేళ్లుగా ఇలాగే స్థిరంగా కొనసాగుతోంది. గత 7–8 సంవత్సరాల కాలంలో దాదాపు 15 ప్రభుత్వరంగ సంస్థలు భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ అవడంతోపాటు అవసరమైన మూలధనాన్ని సేకరించగలిగాయి. వాటాదారుల షేర్ల విలువను పెంచడంతో పాటు రిటైలర్ల సంపదను కూడా సృష్టించగలిగాయి. 2017 నుంచి, భారతదేశంలో ఇంజనీరింగ్, నిర్మాణం, రైల్వే, రక్షణ, ఇంధన సంబంధిత రంగాలలో 10కి పైగా అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థలు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. తద్వారా, దిగువ పేర్కొన్న కంపెనీలలో, మూలధన మార్కెట్ విలువ రూ. 1.40 లక్షల కోట్ల నుంచి రూ. 8.53 లక్షల కోట్లకు పెరిగింది– ఇది 513 శాతం భారీ పెరుగుదల.
ఆగస్టు, 2017లో రూ.7,096 కోట్లతో లిస్టింగ్ అయిన కొచ్చిన్ షిప్‌యార్డ్ మార్కెట్ మూలధనం 31 డిసెంబర్, 2025 నాటికి రూ.42,634 కోట్లకు (501 శాతం) పెరిగింది. అక్టోబర్, 2020లో రూ.3,489 కోట్లతో లిస్టింగ్ అయిన మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ మార్కెట్ మూలధనం 31 డిసెంబర్, 2025 నాటికి ఏకంగా రూ.1,00,000 కోట్లకు (అంటే 2,766శాతం!) పెరిగింది. అదేవిధంగా, జూలై, 2018లో రూ.4,254 కోట్లతో లిస్టింగ్ అయిన RITES లిమిటెడ్ మార్కెట్ మూలధనం రూ. 11,652 కోట్లకు (174శాతం) పెరిగింది. IRCON ఇంటర్నేషనల్ సెప్టెంబర్, 2018లో రూ.3,919 కోట్ల నుంచి రూ.16,704 కోట్ల (326 శాతం)కు పెరిగింది. రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఏప్రిల్, 2019లో రూ.3,972 కోట్ల నుంచి రూ.74,508 కోట్లకు (1,776శాతం) పెరిగింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ జనవరి, 2021లో రూ.32,475 కోట్ల నుంచి రూ.1,63,000 కోట్లకు (402శాతం) పెరిగింది. అంతేగాక, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్– అక్టోబర్, 2019లో రూ.11,658 కోట్ల నుంచి రూ.54,764 కోట్లకు (370శాతం), రైల్ టెల్ కార్పొరేషన్ (ఫిబ్రవరి, 2021) రూ.3,896 కోట్ల నుంచి రూ.11,924 కోట్లకు (206శాతం), హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (మే, 2017) రూ.14,514 కోట్ల నుంచి రూ.45,683 కోట్లకు (215 శాతం), హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (మార్చి, 2018) రూ.37,731 కోట్ల నుంచి రూ.2,93,000 కోట్లకు (676శాతం), ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (నవంబర్, 2023) రూ.16,124 కోట్ల నుంచి రూ.39,301 కోట్లకు (144శాతం) పెరిగింది. ఈ పీఎస్‌యూలు అన్నీ మొత్తంగా తమ మూలధన మార్కెట్ విలువను రూ.1,39,128 కోట్ల నుంచి రూ. 8,53,170 కోట్లకు (అంటే దాదాపు 513 శాతానికి) పెంచుకున్నాయి. భారీ పెరుగుదల ఇది.
గతంలో, ప్రభుత్వరంగ సంస్థలు మూలధన పెట్టుబడులు, ఇతర విస్తరణ పనుల కోసం సంబంధిత మంత్రిత్వ శాఖల బడ్జెట్ కేటాయింపులపై ఆధారపడాల్సి వచ్చేది. దీనికోసం ఆయా మంత్రిత్వ శాఖల్లో వివిధ విభాగాలతో విస్తృతమైన చర్చలు జరపాల్సి రావడమే కాకుండా నిధులను విడుదల చేయించుకోవడానికి చాలా సమయం పట్టేది. నేడు నిర్ణయాలు అమలు చేయడంలో ఎంతో వేగాన్ని ప్రదర్శిస్తున్న ఈ సంస్థలు నిధుల కోసం ఎదురుచూసే స్థితి నుంచి.. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న కార్యక్రమాలకు నిధులు సమకూర్చే స్థాయికి ఎదిగాయి. గత పరిస్థితులతో పోలిస్తే ఇది రివర్స్ ట్రెండ్.
ఉదాహరణకు, క్రిటికల్ మినరల్స్ రంగంలో భారతదేశ దీర్ఘకాల అవసరాల దృష్ట్యా స్థిరమైన సప్లయ్ చైన్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ జనవరి 2025లో ‘నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్’ను ప్రారంభించింది. దీని కోసం రూ.34,300 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. అందులో రూ. 1,500 కోట్లు మాత్రమే బడ్జెట్ నుంచి లభిస్తున్నాయి. వివిధ మంత్రిత్వ శాఖల విభాగాల సంపూర్ణ సమన్వయం (Whole of Government Approach) విధానంతో కేంద్ర ప్రభుత్వం సమకూర్చే ఇతర పెద్ద మొత్తాన్ని అటుంచితే, 50శాతానికి పైగా నిధులు అంటే.. రూ.18,000 కోట్లు వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థలు సమకూరుస్తున్నాయి. వీటిలో గనుల మంత్రిత్వ శాఖ నుంచి KABIL, బొగ్గు శాఖ నుంచి కోలిండియా లిమిటెడ్, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్, ఉక్కు శాఖ నుంచి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, విద్యుత్ శాఖ నుంచి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పెట్రోలియం శాఖ నుంచి ఆయిల్ ఇండియా లిమిటెడ్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ వంటివి ఉన్నాయి. రానున్న రోజుల్లో కర్బన ఉద్గారాలను తగ్గించడానికి, సంబంధిత సాంకేతికతను మెరుగుపరిచేందుకు ఈ సంస్థల నుంచి సేకరించే పెట్టుబడులను ఉపయోగిస్తారు. ఎన్‌సీఎమ్‌ఎమ్ కోసం పీఎస్‌యూల నుంచి పెట్టుబడులను తీసుకొచ్చిన ఈ వ్యూహాత్మక విధానం రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టే వివిధ కీలకమైన కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమకూర్చేలా.. కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం అందించింది.
చాలా వరకు మార్కెట్లు స్థిరమైన పెట్టుబడులు కొనసాగించిన వాటాదారులకు మాత్రమే మంచి లాభాలను అందిస్తాయి. బీసీసీఎల్ విషయానికి వస్తే.. నష్టాల్లో ఉన్న పీఎస్‌యూగా ముద్రపడటం నుంచి మొదలుపెట్టి.. వ్యాల్యూ– డ్రివెన్ వ్యవస్థగా, వ్యూహాత్మకంగా కీలకమైన సంస్థగా మారడం వరకు అది సాగించిన ప్రయాణం మనందరికీ తెలుసు. ఇవాళ ఈ సంస్థకు భారతదేశ డొమెస్టిక్ కోకింగ్ కోల్ ఉత్పత్తిలో 58.5శాతం వాటా ఉంది. దీంతో కీలకమైన ఉక్కు, మౌలిక సదుపాయాల రంగంలో ఇది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ ముఖ్యమైన విషయాన్ని పెట్టుబడిదారులు గుర్తుపెట్టుకున్నారు. మౌలిక సదుపాయాల విస్తరణ, తయారీరంగ అభివృద్ధి ఆత్మనిర్భరతపై దృష్టి సారించిన ఆర్థిక వ్యవస్థలో, బీసీసీఎల్ ఒక బొగ్గు ఉత్పత్తిదారుగా మాత్రమే కాకుండా ఇంధన భద్రతలో పారిశ్రామిక పురోగతికి కీలకమైన ఇరుసుగా తన సేవలను కొనసాగిస్తోంది.
ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఈ సంస్థ సాధించిన విజయం అనుకోకుండా వచ్చినది కాదు. ప్రభుత్వరంగ సంస్థలు తమ ఆస్తులను ఎలా పొందుతున్నాయి, వాటిని ఎలా వృద్ధి చేసుకుంటున్నాయనే విషయంలో.. చోటుచేసుకుంటున్న విస్తృత మార్పుకు వివిధ సంస్థలు అనుసరిస్తున్న తీరే నిదర్శనం. ఇటీవలి కాలంలో పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాల గురించి వివేకంతో ఆలోచిస్తున్నారు. స్పష్టమైన లక్ష్యాలతో, కార్యాచరణతో ముందుకు వస్తున్న ఈ సంస్థల సామర్థ్యాన్ని, వాటి పురోగతికి ఉన్న అవకాశాలు, అంశాలను విశ్లేషిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి సామర్థ్యమున్న పీఎస్‌యూలకు రెండో ఆలోచనకు తావులేకుండా సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నారు. తమ మంత్రిత్వ శాఖల నుంచి పొందిన స్వయం ప్రతిపత్తిని పీఎస్‌యూలు పరిపాలనా నాణ్యత, వ్యూహాత్మక ప్రణాళిక, అమలులో వేగాన్ని తీసుకురావడానికి ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాయి. ఈ మార్పు మరిన్ని సంస్థలకు సరికొత్త విశ్వాసాన్ని అందిస్తోంది. మార్కెట్ భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ద్వారా తమ సత్తా చాటేందుకు ప్రభుత్వరంగ సంస్థలు ఐపీఓలతో సిద్ధమవుతున్నాయి. ఐపీఓలు పెట్టుబడులకు మంచివి కావు అనే పాతకాలపు ఆలోచనలను వెనక్కునెట్టి, ఒక కొత్త వాస్తవికతవైపు ప్రభుత్వరంగ సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ఒక సంస్థ నిజాయితీగా, పారదర్శకతతో పనిచేస్తే.. మార్కెట్ కూడా అదే తీరుగా సంపూర్ణ సహకారంతో స్పందిస్తుందనడానికి బీసీసీఎల్ ఐపీఓనే ఒక చక్కటి ఉదాహరణ.
ప్రొఫెసర్ ఎస్.మహేంద్రదేవ్
ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్
ఈ వార్తలు కూడా చదవండి..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్టులపై దాడి.. ఖండించిన ప్రెస్ క్లబ్
బుల్లెట్ ట్రైన్‌కు హబ్‌గా హైదరాబాద్: అశ్వినీ వైష్ణవ్
For More TG News And Telugu News