పరిశోధనా భూముల జోలికి రాకండి!
ABN , Publish Date - Apr 28 , 2026 | 12:55 AM
నేటి అభివృద్ధి వేగం వ్యవసాయ పరిశోధనా సంస్థల భూముల పాలిట సమస్యగా మారుతున్నది. పాలకులు, అధికారులు అందరూ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలను భూములుగా మాత్రమే పరిగణిస్తూ వాటిని...
నేటి అభివృద్ధి వేగం వ్యవసాయ పరిశోధనా సంస్థల భూముల పాలిట సమస్యగా మారుతున్నది. పాలకులు, అధికారులు అందరూ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలను భూములుగా మాత్రమే పరిగణిస్తూ వాటిని ఇతరత్రా అవసరాలకు వాడేందుకు సిద్ధమవుతున్నారు. పలు సందర్భాల్లో తాత్కాలిక ప్రయోజనం కోసం ఈ భూములను బలవంతంగానే తీసుకుంటున్నారు.
బాపట్ల, రాజేంద్రనగర్, మారుటేరు, జగిత్యాల, నంద్యాల, కరీంనగర్, అనకాపల్లి, రుద్రూరు, తిరుపతి, నంద్యాల, రాగోలు, కూనారాం, సంగారెడ్డి, మల్లేపల్లి... ఇలా ఎన్నో ప్రాంతాలలోని పరిశోధనా క్షేత్రాలలో జరిగిన పరిశోధనలు, అక్కడ శోధించి సాధించిన పద్ధతులు, అభివృద్ధి అయిన వంగడాల ద్వారా ఎంతో సామాజిక అభివృద్ధి జరిగింది. ఉదాహరణకు బాపట్ల పరిశోధన కేంద్రం నుంచి వచ్చిన BPT 5204 గురించి ప్రపంచం అంతా తెలుసు. దీనిని ప్రామాణికంగా చేసుకుని రాజేంద్రనగర్ వారు తెచ్చిన డయాబెటిక్ రకం ఎంతో ప్రసిద్ధి పొందింది. ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి పంటలోనూ ఈ వ్యవసాయ పరిశోధనా క్షేత్రాలు కాలానుగుణంగా రైతులోకానికి అందించిన వంగడాలు ఎన్నో ఉన్నాయి. వాణిజ్యపరంగా సాగుచేసే పత్తి, పసుపు, మిరప, చెరకు పంటలేగాక, కొబ్బరి, మామిడి, నిమ్మ, నేరేడు, జామ, అరటి, సీతాఫలం పండ్లలో కూడా ఈ క్షేత్రాలు మంచి ఫలితాలు అందించాయి. కానీ ఈ పరిశోధనా క్షేత్రాలకు చెందిన భూములను ప్రభుత్వాలు సాధారణ భూమిగా పరిగణిస్తూ కొందరు అధికార బలంతో చాలా సులువుగా ఆధీనపరచుకొని ఇతరత్రా సేవలకు వాటిని వినియోగిస్తున్నారు. భూముల ధరలకు రెక్కలు వచ్చిన ప్రాంతాల్లో వీటిని కేవలం రియల్ ఎస్టేట్ కోణంలోనే చూస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన ఔషధ వనాలు పోయాయి. దశాబ్దాల తరబడి శ్రమించి, కోట్లాది రూపాయలు వెచ్చించి రూపొందించిన జీవ వైవిధ్య పార్క్ నేలమట్టం అయింది. కారణాలు ఏవైనా ఒక్కో పరిశోధన క్షేత్రం తన ఉనికిని కోల్పోతూ రావటం బాధాకరం.
ఇప్పుడు సరికొత్తగా 5204 వరి వంగడం పురుడుపోసుకున్న భూముల్లో బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని నిర్మిస్తున్నామంటూ బోర్డు పెట్టారు. పాలకులు, అధికారులు అధికారంతో కాకుండా రైతు నేస్తాలుగా ఆలోచించాలి. మీరు నిర్మించే భవనాలు జీవం లేని కట్టడాలు. కానీ వీటి కోసం మీరు తీసుకునే వ్యవసాయ కళాశాల, విశ్వవిద్యాలయం, పరిశోధనా క్షేత్రాల భూములు కేవలం భూములు కావు. అవి జాతి జీవన రహదారులు. దేశం ఇంతవరకు సాధించిన ఆహార భద్రత, వ్యవసాయరంగంలో సాధించిన స్వయం పోషకత్వం ఈ భూముల్లో జరిగిన పరిశోధనల సారంతోనే సుసాధ్యమయింది. మరోవైపు, పెరుగుతున్న జనాభాకు సరిపడా తిండి గింజల ఉత్పత్తి జరగాలి. ఆహార భద్రతతో పాటు పోషకాహార భద్రతా కావాలి. దీనికి తోడు వాతావరణంలో వస్తున్న మార్పులు కలవరపెడుతున్నాయి. ఈ ఖరీఫ్ సీజన్‌లో తీవ్ర వర్షాభావం తప్పదన్న నిపుణుల అంచనాకు అన్ని దేశాల వాతావరణ శాస్త్రజ్ఞులూ మద్దతు పలుకుతున్నారు. ఇటువంటి విపత్కర సమయంలో పరిశోధన క్షేత్రాలలో అధికార భవనాలు కట్టడం మంచిదేనా? అదే భూముల్లో పరిశోధనలు కొనసాగితే ఎన్నో సమస్యలకు సానుకూల పరిష్కారం లభిస్తుంది.
గతాన్ని పరిశీలిస్తే జెన్నారెడ్డి రఘోత్తమరెడ్డి వంటి వారు తమ 150 ఎకరాల మామిడి తోటను పరిశోధనల కోసం విశ్వవిద్యాలయానికి దానం చేశారు. మల్యాల ప్రాంత అభివృద్ధిలో ఆ భూమిలో వచ్చిన పరిశోధన కేంద్రం, కృషి విజ్ఞాన కేంద్రం భాగస్వామ్యం ఎంతో ఉంది. భూముల విలువ పెరిగేకొద్దీ ఏర్పడే ముప్పును ముందుగానే ఊహించి డా. ఐవీ సుబ్బారావు విశ్వవిద్యాలయం భూములు అన్యాక్రాంతం కాకుండా సర్వే చేయించి కట్టుదిట్టం చేశారు. రాను రాను నిధుల కొరత, తదితర సమస్యలతో సాగుతున్న వ్యవసాయ కళాశాలలకు, పరిశోధన క్షేత్రాలకు భూములు కోల్పోవటం మరో పెద్ద సమస్యగా మారింది. దీనిని ఎదుర్కొనే శక్తి వాటికి లేదు. కేవలం ప్రభుత్వ దయా దాక్షిణ్యాల మీదనే అవి ఆధారపడి ఉన్నాయి. ఈ సమయంలో ప్రభుత్వాలు ముందు చూపుతో ఆలోచించాలి. వ్యవసాయ పరిశోధనలకు కేటాయించిన భూములను సంరక్షించే విధంగా ప్రత్యేక చట్టం తీసుకురావాలి
వలేటి గోపీచంద్
ఈ వార్తలు కూడా చదవండి..
తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్
కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్
For More AP News And Telugu News