Share News

అటకెక్కిన ‘ప్రధాని 15 సూత్రాల పథకం’

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:02 AM

దేశంలోని మైనార్టీల సంక్షేమం కోసం 2005లో ‘ప్రధాని 15 సూత్రాల పథకం’ను ప్రకటించారు. అల్పసంఖ్యాక వర్గ ప్రజల సంక్షేమం కోసం ఈ పథకంలో నిర్దేశించిన కచ్చితమైన లక్ష్యాలు అమలు చేస్తామని...

అటకెక్కిన ‘ప్రధాని 15 సూత్రాల పథకం’

దేశంలోని మైనార్టీల సంక్షేమం కోసం 2005లో ‘ప్రధాని 15 సూత్రాల పథకం’ను ప్రకటించారు. అల్పసంఖ్యాక వర్గ ప్రజల సంక్షేమం కోసం ఈ పథకంలో నిర్దేశించిన కచ్చితమైన లక్ష్యాలు అమలు చేస్తామని అప్పటి ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా చెప్పారు. మైనార్టీలకు విద్యావకాశాలు పెంపొందించడం, ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగాలలో మైనార్టీలకు సమాన వాటా కల్పించేందుకు కొత్త పథకాలు–ప్రస్తుత పథకాల ద్వారా కృషి చేయడం వంటివి ఈ పథకం లక్ష్యాలు. ఇవేగాక స్వయం ఉపాధికి అవసరమైన రుణ సదుపాయాలను కల్పించడం, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో అవకాశాలు పెంపొందించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మైనార్టీలకు తగిన వాటా కల్పించి, వారి జీవన స్థితిగతులను మెరుగుపరచడం, మతసామరస్యం దెబ్బతీసే సంఘటనలను నియంత్రించడం కూడా ఉన్నాయి.

ప్రధానమంత్రి 15 సూత్రాల కార్యక్రమం అమలుకు, ప్రస్తావించిన తగినంత మైనార్టీ జనాభా ఏదైనా జిల్లాలోని ఒక యూనిట్‌ ప్రాంతం పరిధిలో 25 శాతం మంది ఉండాలి. 1992లో జాతీయ మైనార్టీ కమిషన్‌ చట్టంలోని 2(ఓ) సెక్షను ప్రకారం ఈ కార్యక్రమాల లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఈ సెక్షన్‌ ప్రకారం– ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు (జోరాస్ట్రియన్లు) తదితరులను మైనార్టీలుగా గుర్తిస్తారు. ఆ వర్గాలకే ప్రయోజనాలు అందేలా లక్ష్యాలు నిర్దేశిస్తారు. మైనార్టీగా గుర్తింపు పొందిన ప్రజలు మరో రాష్ట్రంలో మెజార్టీ వర్గమైనప్పుడు, వివిధ పథకాల ప్రయోజనాలు మైనార్టీలుగా నోటిఫై చేసిన ఇతర గ్రూపులకు మాత్రమే వర్తిస్తాయి. జమ్మూ- కశ్మీర్‌, పంజాబ్‌, మేఘాలయ, సిక్కిం, మిజోరం, నాగాలాండ్‌ ఈ కేటగిరీ కిందకు వస్తాయి. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ కూడా ఇదే కేటగిరికి వస్తుంది.


మైనార్టీల బతుకులను మార్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి 15 సూత్రాల పథకం అటకెక్కి ఎక్కడా పూర్తిగా అమలవుతున్న దాఖలాలు లేవు. క్షేత్రస్థాయిలో ఇది పూర్తిగా పడకేసింది. ముస్లింల సంక్షేమం దృష్ట్యా ఈ పథకం అమలుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయాలి. మైనార్టీలలో చాలా వరకు తక్కువ స్థాయి పనుల్లో ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా చేతి వృత్తుల మీదనే జీవనం గడుపుతున్నారు. వారికి సాంకేతిక శిక్షణ అందించడం ద్వారా నైపుణ్యాలను పెంపొందించే కృషి జరగాలి. మైనార్టీల ఆర్థికాభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో జాతీయ మైనారిటీల అభివృద్ధి, ఆర్థిక సహాయం సంస్థ 1994లో ఏర్పాటయింది. అది కూడా లక్ష్యాలను సాధించడంలో విఫలమైంది. ప్రధాని 15 సూత్రాల పథకం అమలు మాత్రమే మైనార్టీ వర్గాలకు చేయూత ఇస్తుంది.

షేక్‌ అబ్దుల్‌ సమద్‌

ఇవి కూడా చదవండి..

మందు కొడితే ఇలాగే ఉంటుందేమో.. సముద్రంలో చనిపోయిన తిమింగలంతో..

గేదెను చుట్టుముట్టిన సింహాల గుంపు.. ప్రాణం తీసే సమయంలో షాకింగ్ ట్విస్ట్..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 30 , 2026 | 02:02 AM