Power Struggle in Karnataka: సిద్ధ శివ కలహ కర్ణాటకం
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:28 AM
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికై కుమ్ములాటలు జరుగుతున్నాయి. తాను నిర్వహిస్తున్న ఆ ఉన్నత పదవిని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ పదవిని...
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవికై కుమ్ములాటలు జరుగుతున్నాయి. తాను నిర్వహిస్తున్న ఆ ఉన్నత పదవిని నిలుపుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ పదవిని ఆకాంక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ మధ్య పెరిగిపోతున్న విభేదాల గురించి ఇటీవలి వారాలలో కర్ణాటకలోని వార్తాపత్రికలు అన్నీ పుంఖానుపుంఖాలుగా వార్తలు ప్రచురించాయి. 2023 మేలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు– సిద్ధరామయ్య మొదటి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తరువాత డి.కె. శివకుమార్ ఆ పదవిలోకి వస్తారని కాంగ్రెస్ అధిష్ఠానవర్గం చెప్పినట్టు ఉప ముఖ్యమంత్రి అనుయాయులు గట్టిగా గుర్తు చేస్తున్నారు. ఈ వాదనతో సిద్ధరామయ్య మద్దతుదారులు ఏకీభవించడం లేదు. రెండున్నర సంవత్సరాల గడువు ముగిసిపోయింది. అయినా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మౌనంగా ఉండిపోగా బెంగళూరులో ఉదయం ఉపాహార, మధ్యాహ్న భోజన, రాత్రి విందు సమావేశాలు జోరుగా జరుగుతున్నాయి. శాసనసభ్యుల, కుల సంఘాల నాయకుల మద్దతును తమకు అనుకూలంగా కూడగట్టుకునేందుకు ప్రధాన నాయకులు ఇరువురూ ప్రయత్నిస్తున్నారు.
నాయకత్వ వివాదాన్ని దాటి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు మొత్తంగా ఎలా ఉందనే విషయాన్ని నిశితంగా పరిశీలించేందుకు ఈ కాలమ్‌ను ఉద్దేశించాను. గత శాసనసభ ఎన్నికల ముందు నెలల్లో కర్ణాటకలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తొలుత గుర్తు చేసుకుందాం. అప్పట్లో మీడియాలో అజాన్, హిజాబ్, హలాల్, లవ్ జిహాద్ తదితర అంశాలపై వార్తలే ఎక్కువగా ఉండేవి. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఎప్పటిలాగానే ప్రజల్లో మతపరమైన విభేదాలను రెచ్చగొట్టడం ద్వారా అధికారాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ఆరాటపడింది.
తమ పాలన తీరుతెన్నులను ప్రజలు హర్షించడంలేదన్న వాస్తవాన్ని గుర్తించి, ముస్లింల పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టడం ద్వారా హిందువులలో మద్దతును కూడగట్టుకుని ఎన్నికలలో విజయం సాధించేందుకు ప్రయత్నించింది. కర్ణాటక అదృష్టం బాగుండి బీజేపీ వ్యూహం విఫలమయింది. కాంగ్రెస్ మంచి మెజారిటీతో విజయం సాధించింది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. మతతత్వ ఉద్రిక్తతలను గణనీయంగా తగ్గించడంలో ఆయన ప్రభుత్వం సఫలమయిది. కర్ణాటక జనాభాలో ముస్లింలు 13 శాతం మేరకు ఉన్నారు. క్రైస్తవులు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు మైనారిటీ మత వర్గాల వారు మే 2023 నుంచి, అంతకు ముందు నెలలు, సంవత్సరాలలో కంటే నిశ్చిత భద్రతాభావంతో మనుగడ సాగిస్తున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు.
కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారానికి తీసుకువచ్చిన అంశాల్లో ముఖ్యమైనవి ఐదు హామీలు: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం; గృహిణులకు నగదు బదిలీలు; ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అదనపు ఆహార ధాన్యాలు; విద్యావంతులు అయిన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి. సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ హామీలను ఏ మేరకు నెరవేర్చింది? ఈ విషయమై సాధికారికమైన అధ్యయనాలు జరగలేదు. అయితే ఆ హామీ పథకాలు చెప్పుకోదగిన విధంగా విజయవంతమయ్యాయని, లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత సమకూరిందని స్వతంత్ర పరిశీలకులు ఘంటాపథంగా సూచిస్తున్నారు.
మత సామరస్యం, లక్ష్యిత సంక్షేమం అనేవి సిద్ధరామయ్య ప్రభుత్వ విజయాలు అనడంలో సందేహం లేదు. 31 నెలల కాంగ్రెస్ పాలన సాధించిన మరేవైనా విజయాల గురించి చెప్పడం అసాధ్యం కాకపోయినప్పటికీ, కష్టమే. పరిపాలనా పరమైన ఉదాసీనత, అసమర్థత ముఖ్యంగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో కనిపిస్తున్నాయి. అధ్వానమైన రోడ్ల పరిస్థితులు, తరచూ ట్రాఫిక్‌జామ్‌లు నగరవాసులకు నరకాన్ని చవి చూపిస్తున్నాయి. భారత్‌లో ఐటీ విప్లవానికి మారుపేరుగా ఉన్న బెంగళూరు నగరంలో ప్రగతి స్తంభించిపోయిందని, మౌలిక సదుపాయాలు క్షీణించిపోతున్నాయని జాతీయ, అంతర్జాతీయ మీడియాలో వ్యాసాలు అనేకం వెలువడ్డాయి. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండడంతో బెంగళూరు ఇన్‌చార్జి మంత్రి కూడా అయిన ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ అంతర్జాతీయ విమానాశ్రయమున్న నగర ఉత్తరప్రాంతం, సాఫ్ట్‌వేర్, బయోటెక్ కంపెనీలు ఉన్న దక్షిణ ప్రాంతం మధ్య ఒక సొరంగ మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదించారు. దీనివల్ల ఇంజినీర్లు తదితర వృత్తి నిపుణులు, వైట్‌కాలర్ ఉద్యోగుల సులభ ప్రయాణాలకు సౌలభ్యమేర్పడడంతో పాటు నగర పౌరులకు ఇతోధిక మేలు జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి విశ్వసిస్తున్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాలలో దేనినైనా ‘తెల్ల ఏనుగు’ (ప్రభుత్వానికి ఆర్థిక గుదిబండ, ప్రజలకు అల్ప ప్రయోజనమూ కలిగించేది) అని వర్ణించవలసింది ఏదైనా ఉంటే అది ఈ టన్నెల్ ప్రాజెక్టేనని చెప్పితీరాలి.
రవాణా రంగ అగ్రగామి భారతీయ నిపుణులు భారత్ ఉద్దండులు అయిన రవాణా నిపుణులు బెంగళూరులోని సుప్రసిద్ధ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఉన్నారు. ఉపముఖ్యమంత్రి ప్రతిపాదించిన సొరంగమార్గం ప్రణాళిక వివేకవంతమైనది కాదని, అది ఆచరణమోగ్యం కాదని ఆ నిపుణులు స్పష్టం చేశారు. నగర భూగర్భం చాలా సంక్లిష్టమైనది కావడంతో పాటు ప్రతిపాదిత సొరంగ మార్గం ప్రైవేట్ వాహనాల యజమానులకే ఎక్కువ అనుకూలంగా ఉన్నందున ఆ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టక పోవడమే మంచిదని వారు గట్టిగా చెప్పారు. నగర రవాణా సమస్యలకు సరైన పరిష్కారం సిటీ బస్సుల సంఖ్యను ఇతోధికంగా పెంచి ప్రస్తుతమున్న మెట్రో వ్యవస్థతో దానిని సమన్వయం చేయడమేనని ఐఐఎస్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ప్రతిస్పందన ఏమిటి? ఆ నిపుణులతో చర్చించడం కాదు కదా. వారితో సమావేశమవడానికి సైతం ఉప ముఖ్యమంత్రి శివకుమార్ నిరాకరించారు. తాను ప్రతిపాదించిన ప్రాజెక్టును అమలుపరిచేందుకే ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. దానివల్ల ప్రభుత్వ ఖజానాపై చాలా భారం పడుతుందన్న వాస్తవాన్ని ఆయన పూర్తిగా ఉపేక్షిస్తున్నారు!
శివకుమార్ రాజకీయాలలో ఆకాంక్షా తత్వం, తొందరపాటు స్పష్టంగా కనిపిస్తాయి. ఇదిలావుండగా ఆత్మ విశ్వాసంతో సదా ప్రశాంతంగా ఉండే రాజకీయవేత్త అయిన సిద్ధరామయ్య తన పదవిని నిలబెట్టుకునేందుకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. ప్రజాబలం మెండుగా ఉన్న నాయకుడు ఆయన. కర్ణాటక చరిత్రలో అత్యధిక కాలం అధికారంలో ఉన్న మొదటి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య గణుతికెక్కారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య అధికార కుమ్ములాటలు పాలనా వ్యవహారాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. పాలనాదక్షులు అయిన కేబినెట్ మంత్రులు పలువురు ఉన్నప్పటికీ ప్రధాన నాయకుల మధ్య వివాదాల మూలంగా వారూ తమ తమ మంత్రిత్వ శాఖల విధులపై దృష్టిని కేంద్రీకరించలేక పోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం అసమర్థత మూలంగా కర్ణాటకలో ఆ పార్టీ సమస్యలు మరింతగా మిక్కుటమవుతున్నాయి. కాంగ్రెస్‌లో అనేక అధికార కేంద్రాలు ఉండడమే ఇందుకు కారణం. కర్ణాటకకు చెందిన మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవీ వివాదం పరిష్కారంలో పార్టీ హైకమాండ్ వైఖరిని నిర్ణయాత్మకంగా ప్రభావితం చేయగల స్థానంలో ఆయన ఉన్నారు. అయితే ఆయన సోనియా, రాహుల్ పట్ల అమిత గౌరవ విధేయతలతో వ్యవహరించే నాయకుడు. దీనికి తోడు ప్రియాంకగాంధీ కూడా కర్ణాటక వ్యవహారాలలో ఆసక్తి చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ కారణంగా ఏఐసీసీలో నాలుగు విభిన్న అధికార కేంద్రాలు ఉన్నాయి. సిద్ధరామయ్య, శివకుమార్‌ల మద్దతుదారులు ఆ నలుగురికీ తమ వాదనలు వినిపించవలసి ఉంటుంది. మరి రాష్ట్ర కాంగ్రెస్ సమస్యలు మరింతగా సంక్లిష్టమై పోవడంలో ఆశ్చర్యమేముంది?
స్థానిక దినపత్రికలలో వెలువడుతున్న వార్తలను పరిశీలిస్తే, కర్ణాటక ప్రస్తుత వర్తమాన అభ్యుదయానికి, భావి ప్రగతికి ఎంతో ముఖ్యమైన విషయాలకు తగు ప్రాధాన్యం లభించడమే లేదు. మీడియా శ్రద్ధాసక్తులు ఎంతకూ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మధ్య నడుస్తున్న పదవీ వివాదం మీదే ఉంటున్నాయి. ఆ మాటకు వస్తే ఈ ఇద్దరు ప్రధాన నాయకులు తమ అధికార పెనుగులాటపై మినహా మరే ప్రజాసంబంధిత విషయమై రవ్వంత శ్రద్ధ చూపడం లేదని కొన్నిసార్లు అనిపిస్తున్నది. కర్ణాటక పురోగతి విషయమై సిద్ధరామయ్యకు ఒకప్పుడు ప్రగతిశీల దార్శనికత ఉండేది. ఇప్పుడు ఆయన పాలనలో అటువంటిదేమీ కనిపించడం లేదు. శివకుమార్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి కావాలనే ఆరాటాన్ని నెరవేర్చుకోవడానికే ఆయన ప్రాధాన్యమిస్తున్నారు. ఉపముఖ్యమంత్రి శద్ధ చూపుతున్న మరో ఏకైక విషయం– తాను ప్రతిపాదించిన బెంగళూరు సొరంగ మార్గం నిర్మాణమే.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన మొదటి పదవీ కాలంలో సుస్థిర, సమర్థ పాలన సమకూర్చారు. అయితే ప్రస్తుత రెండో పదవీ కాలం, మొదటి పదవీకాలానికి భిన్నంగా ఉన్నది. విధానపరమైన చొరవల కంటే రాజకీయాలకే సిద్ధరామయ్య ప్రాధాన్యమిస్తున్నారు. ఆయన ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. పార్టీలో అంతర్గత అనైక్యతతో సిద్ధరామయ్య నిర్ణయాత్మక నాయకత్వాన్ని అందించలేకపోతున్నారు. తాము అధికారమిచ్చిన పార్టీ పాలన సరైన రీతిలో లేదని భావించినప్పుడు ప్రతిపక్షాలు కలిసి పనిచేయాలని ప్రజలు కోరుకుంటారు. మే 2028లో కర్ణాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో, బీజేపీ నేతృత్వంలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే జరిగేదేమిటి? బీజేపీ కూటమి ఏర్పాటు చేసే ఏ ప్రభుత్వమైనా పాలనాదక్షత లేనిదే అవుతుంది. పైగా మైనారిటీ మత వర్గాల శ్రేయస్సుకు దోహదం చేయని విధానాలనే అది అనుసరిస్తుందని నిశ్చయంగా చెప్పవచ్చు. అయితే తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు సంవత్సరాలకు పైగా సమయమున్నది. కాంగ్రెస్ తన అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దుకుని కన్నడ ప్రజలు కోరుకుంటున్న శ్రేయో పాలనను అందించేందుకు పూనుకోవాలి. మరి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రస్థానం అటువంటి మేలు మలుపు తిరుగుతుందా అనేది పూర్తిగా మరో విషయం.
రామచంద్ర గుహ
(వ్యాసకర్త చరిత్రకారుడు)
ఇవి కూడా చదవండి..
డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి