India Foreign Policy Critique: విధాన వైకల్యాలలో భారత దౌత్యనీతి
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:44 AM
భారత విదేశాంగ విధానం ఎవరి పర్యవేక్షణలో అమలు అవుతున్నది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని స్ఫుటంగా వ్యక్తీకరించడంలో, గట్టిగా సమర్థించడంలో...
భారత విదేశాంగ విధానం ఎవరి పర్యవేక్షణలో అమలు అవుతున్నది? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని స్ఫుటంగా వ్యక్తీకరించడంలో, గట్టిగా సమర్థించడంలో ప్రభావదాయక పాత్ర నిర్వహిస్తోన్న విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నది ఆ ప్రశ్నకు స్పష్టమైన సమాధానంగా కనిపిస్తోంది. అయితే సౌత్ బ్లాక్ (విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ నెలవు) విధానాలను నిర్ణయిస్తున్నది, నిర్దేశిస్తున్నది ఎవరు అని జైశంకర్ సైతం ఆశ్చర్యపోక తప్పని పరిణామాలు సంభవిస్తున్న రోజులివి. బంగ్లాదేశ్‌తో సంబంధాల విషయంలో నెలకొన్న దౌత్యపరమైన గందరగోళ పరిస్థితులే అందుకొక తాజా నిదర్శనం.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియాకు నివాళులర్పించేందుకు జైశంకర్ 2025 డిసెంబర్ 31న ఢాకా వెళ్లారు. ఖలీదా మృతిపట్ల సంతాపం తెలుపుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన ఒక వ్యక్తిగత లేఖను ఆమె కుమారుడు తారిక్ రెహమాన్‌కు జైశంకర్ అందజేశారు. బంగ్లాదేశ్ భావి ప్రధాని అని అందరూ విశ్వసిస్తున్న తారిక్ రెహమాన్‌తో జైశంకర్ కరచాలనం చూస్తే, క్షీణించిన భారత్–బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడే సూచనలు కనిపించాయి. ఇది జరిగిన రెండు రోజులకే బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తాను కాంట్రాక్ట్ తీసుకున్న క్రీడాకారుల జాబితా నుంచి తొలగించాలని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)ను భారత్ క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదేశించింది. ఆ ప్రైవేట్ ఫ్రాంచైజీ మరో ఆలోచన చేయకుండా ఆ ఆదేశాన్ని శిరసావహించింది. దీనిపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్తాఫిజుర్ రెహమాన్ తొలగింపునకు నిరసనగా తాము టీ 20 మ్యాచ్‌లు భారత్‌లో ఆడబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది.
సహజంగానే ఒక ప్రశ్న అనివార్యమవుతోంది: కేవలం 48 గంటల వ్యవధిలో–అత్యున్నత స్థాయి దౌత్య సమావేశం, ఒక క్రికెటర్‌ను లక్ష్యంగా చేసుకున్న ఒక నిష్కారణ నిర్ణయం తీసుకోవడానికి మధ్య ఏమి జరిగింది? బంగ్లాదేశ్ ఆగ్రహపూరిత ప్రతిస్పందనను ప్రేరేపించింది ఏమిటి? చోటుచేసుకున్న మార్పుకు కారణమేమిటి? అంటే, హిందూత్వ తీవ్రవాదులు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రారంభించిన ప్రచారోద్యమమేనని చెప్పక తప్పదు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఢాకాలో ఎటువంటి రాజీ లేకుండా కఠిన వైఖరితో వ్యవహరించాలని మోదీ ప్రభుత్వాన్ని ఈ హిందూత్వ శక్తులు గట్టిగా డిమాండ్ చేశాయి. కేకేఆర్‌పై ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ శాసనసభ్యుడు సంగీత్ సోమ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి దాని యజమాని, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్‌ను తీవ్రంగా తప్పుపట్టారు. ముస్తాఫిజుర్ రెహమాన్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్న షారుఖ్ ఖాన్‌ను ‘దేశ ద్రోహి’ అని సంగీత్ సోమ్ ఆరోపించారు. అయితే కేకేఆర్‌కు షారుఖ్ ఖాన్ ఒక్కడే యజమాని కాదని, ఇంకా ఇద్దరు యజమానులున్నారని, వారు బాలీవుడ్ నటి జూహీ చావ్లా, ఆమె భర్త జై మెహతా అనే విషయాన్ని సంగీత్ సోమ్ తెలివిగా విస్మరించారు. మీ పేరులో ఖాన్ అని ఉంటే చాలు హిందూత్వ తీవ్రవాదుల కోపావేశాలకు మీరు తప్పక లక్ష్యమవుతారు సుమా!
సాధారణ సమయాల్లో వివేచనాయుతమైన ప్రభుత్వం హిందూత్వ తీవ్రవాదుల వీరాలాపాలను విస్మరించి ఉండేది. అయితే ‘న్యూ’ ఇండియాలో ఈ అప్రధాన హిందూత్వ శక్తులే ‘ప్రధాన స్రవంతి’గా భాసిల్లుతున్నాయి! విషపూరిత మతతత్వ రాజకీయాలకు వత్తాసునిస్తున్న ప్రభుత్వం, తనకు సంపూర్ణ మద్దతుదారులు అయిన సామాజిక మాధ్యమాలలో చెలరేగిపోయే సంఘ్ పరివార్ శ్రేణుల డిమాండ్లను విస్మరించలేదు. మరి ఈ సామాజిక మాధ్యమాలలో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలు విదేశాంగ విధాన నిర్ణయాలను ప్రభావితం చేయడం ఒక అవాంఛనీయ పరిణామం. అది చాలా ప్రమాదకరమైనది. విదేశాంగ విధానానికి ప్రధాన బాధ్యులలో ఒకరైన విదేశాంగ మంత్రి స్వయంగా ఢాకా వెళ్లి బాధ్యతాయుత నాయకులు, అధికారులతో చర్చలు జరపడాన్ని పరిగణనలోకి తీసుకోవల్సిన విషయం కాదన్నట్టుగా బీజేపీ మద్దతుదారులు వ్యవహరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ ప్రయోజనాల కోసం, మొరటు రాజకీయాలతో సంబంధంలేని ఒక క్రికెటర్‌తో సహా బంగ్లాదేశీయుల పట్ల వ్యతిరేకతను రెచ్చగొట్టడం సరైన విషయమేనా?
రాజకీయాల నుంచి క్రీడా రంగాన్ని వేరు చేయాలి. నిజమే. ఇదొక సర్వసాధారణమైన వాదన. అయితే భారత ఉపఖండంలో క్రీడలు, మరీ ముఖ్యంగా క్రికెట్ భారతీయ ‘సాఫ్ట్ పవర్’ (ఒక దేశ సంస్కృతి, రాజకీయాల, విదేశాంగ విధాన ప్రభావశీలత)కు స్పష్టమైన నిదర్శనంగా ఉన్నప్పుడు రాజకీయాల నుంచి క్రీడలను వేరు చేయడం అంత సులువు కాదు. ప్రపంచ క్రికెట్ వ్యవహారాలను, బీసీసీఐని నిర్దేశిస్తున్నది– అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్‌గా ఉన్న జై షా (కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు). క్రికెట్ జగత్తులో ఇప్పుడు ఆయనే మహా శక్తిమంతమైన వ్యక్తి. ఆసియా కప్ మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్థానీ క్రికెటర్లతో కరచాలనం చేసేందుకు భారతీయ క్రికెటర్లు నిరాకరించడమైనా, బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ కాంట్రాక్టు రద్దు చేయడమైనా భారతీయ క్రికెట్ అధిపతుల మాటే తుదిమాట అన్నది స్పష్టమయింది. క్రికెట్ ప్రపంచంలో తనకు లభించిన ‘సూపర్ పవర్’ హోదాను భారత్ దుర్వినియోగం చేస్తోందని చెప్పి తీరాలి. భారత ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ అలా వ్యవహరించడం గర్హనీయం. ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలన్న నిర్ణయం, ఐపీఎల్ బాధ్యులతో సంప్రదించిన తరువాత తీసుకున్నది కాదు. రాజకీయ నాయకత్వం తమకు జారీ చేసిన ఆదేశాన్ని ఎటువంటి ఆలోచన లేకుండా వెన్వెంటనే తీసుకున్నది అనడంలో సందేహం లేదు.
ఇది, మళ్లీ మనలను అసలు ప్రశ్న వద్దకు తీసుకువస్తుంది: భారత విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తున్నది ఎవరు? అనుభవజ్ఞులైన దౌత్య అధికారులా? కేంద్ర హోం మంత్రి, బీజేపీ సంఘ్ పరివార్ శ్రేణులా? కెరీర్ దౌత్యవేత్తలు తమ విధుల నిర్వహణలో తరచూ క్లిష్ట పరిస్థితుల నెదుర్కోవడం కద్దు. అయితే ఓర్పు, నేర్పుతో వారు ఆ అననుకూలతలను అధిగమించి, విస్తృత వ్యూహాత్మక లక్ష్యాల పరిధిలో జాతీయ ప్రయోజనాలను కాపాడతారు. దౌత్యవేత్తలకు భిన్నంగా నాయకులు, వారి మద్దతుదారులు వ్యవహరిస్తారు. రాబోయే నెలల్లో అసోం, పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ దృష్ట్యా బంగ్లాదేశ్ వ్యతిరేక భావోద్వేగాలను రెచ్చగొట్టడం ఓట్లను కైవసం చేసుకునే మార్గంగా వారు భావిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను వివేచనాయుతమైన దౌత్య విధానం తప్పక ఖండిస్తుంది. అయితే ఆ ఖండన మండనలు మీడియాలో పతాక శీర్షికలు కాకుండా సంయమనం పాటిస్తుంది. రాజకీయ పార్టీల నాయకులు అనుక్షణం వార్తల్లో ఉండేలా వ్యవహరిస్తారు. ఎన్నికలలో ప్రయోజనం పొందడమే లక్ష్యమైనప్పుడు అలా కాకుండా మరోలా వారు ఎందుకు వ్యవహరిస్తారు? పర్యవసానాల విషయం వారికి పట్టదు. ఢాకాతో స్నేహ వారధుల నిర్మాణానికి వారి వైఖరి తోడ్పడదు. పైగా మన పట్ల అపనమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే క్లిష్టమైన పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తుంది. బంగ్లాదేశ్‌లోని ఇస్లామిక్ ఛాందసవాదులు మరింత తెంపరితనంతో వ్యవహరించేలా ప్రోద్బలిస్తుంది. క్రికెట్ ఆడేందుకు భారత్‌కు రాకుండా, తమకు ‘భద్ర’మైన మరో పొరుగుదేశం శ్రీలంకలో ఆడేందుకే బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకున్న పక్షంలో అది మనకు ఎంతగా ఇబ్బంది కలిగిస్తుందో ఊహించండి.
విదేశీ వ్యవహారాలలో పరిమిత ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తూ, తాత్కాలిక ప్రాతిపదికన తీసుకొంటున్న విధానపరమైన నిర్ణయాలు మనకు ప్రతికూలంగా పర్యవసిస్తున్నాయనే దానికి బంగ్లాదేశ్‌తో బెడిసిన సంబంధాలు మాత్రమే ఏకైక నిదర్శనం కాదు. 2024లో మాల్దీవులతోనూ ఇలాంటి పరిస్థితే వాటిల్లింది. పూర్తిగా నివారింపదగిన పోట్లాటే అయినప్పటికీ, ఇరువైపులా కలహశీల ట్వీట్ల వెల్లువకు కారణమయింది. అంతిమంగా మన దౌత్య దురంధరులు వివేకవంతమైన నిర్ణయాలు తీసుకోవడంతో ఆ దౌత్య వివాదం ముగిసిపోయింది. గత ఏడాది మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ సందర్భంగా విమానాశ్రయాల వ్యవహారాలకు సంబంధించి టర్కిష్ సంస్థ నొకదానికి భద్రతాపరమైన అనుమతులను ఉపసంహరించుకున్నది. జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమయిందని మోదీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గత వేసవిలో వాటిల్లిన యుద్ధంలో భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు అంకారా మద్దతునిచ్చిందనే నెపంతో టర్కిష్ సంస్థకు అనుమతులను రద్దు చేశారు. ఇది ఉన్నపాటున తీసుకున్న నిర్ణయం. మన విదేశాంగ విధానం మరింత అర్థవంతమైనది అయివుంటే అంకారాతో దౌత్య ఘర్షణను నివారించి ఉండేది.
2020లో గల్వాన్ ఘర్షణలు చోటుచేసుకున్న వెన్వెంటనే బీజింగ్‌కు వ్యతిరేకంగా న్యూఢిల్లీ చేపట్టిన చర్యలు సామాజిక మాధ్యమాల (బాధ్యతారహిత) యోధులు మన విదేశాంగ విధానాన్ని ప్రభావితం చేసిన తీరుకు స్పష్టమైన నిదర్శనమనడంలో సందేహం లేదు. గల్వాన్ ఘర్షణల కారణంగా టిక్–టాక్‌పై నిషేధం విధించారు. చైనా సరుకులను బాయ్‌కాట్ చేయాలని సంఘ్ పరివార్ శ్రేణులు పదే పదే డిమాండ్ చేశాయి. సరిహద్దుల్లో ఘర్షణలు మరింతగా పెచ్చరిల్లి పోయేలా మోదీ సర్కార్ తక్షణమే తగు చర్యలు చేపట్టాలనీ డిమాండ్ చేశాయి. ఆ చర్యలు ఎంతగా తీసుకున్నా విస్తరణవాద ఉన్మాదంలో ఉన్న చైనాను అవి ఎంతమాత్రం నిరోధించేవి కానే కావు. ఐదు సంవత్సరాల అనంతరం భారత పర్యటనకు వచ్చిన చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రతినిధి బృందానికి బీజేపీ–ఆరెస్సెస్ నాయకత్వం ఆతిథ్యమిచ్చింది. మరి బీజింగ్ రాజకీయ శ్రేణులతో కాంగ్రెస్ పార్టీ చర్చలకు పూనుకున్నప్పుడు– జాతీయ ప్రయోజనాలను కాంగ్రెస్ పూర్తిగా ఉపేక్షిస్తోందని బీజేపీ శ్రేణులు గొంతులు చించుకున్నాయి, గుండెలు బాదుకున్నాయి. ఇప్పుడు తామే చైనా కమ్యూనిస్టులకు ఆతిథ్యమివ్వడం ఒక యథావిధి కార్యక్రమమని అంటున్నాయి. ఎంత నయవంచన!
రాజ్‌దీప్ సర్దేశాయి
(వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్)
ఈ వార్తలు కూడా చదవండి...
CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ
Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News