సంస్మరణలే కాదు.. సంస్కరణలూ అవసరమే!
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:36 AM
అక్టోబర్ 21వ తేదీని ‘వృత్తి నిర్వహణలో అమరులైన పోలీసువారి సంస్మరణ దినం’గా దేశమంతటా జరుపుకోవడం ఆనవాయితీ. నేడు పోలీసుల దుస్థితి చూస్తే హృదయం ద్రవిస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టి...
అక్టోబర్ 21వ తేదీని ‘వృత్తి నిర్వహణలో అమరులైన పోలీసువారి సంస్మరణ దినం’గా దేశమంతటా జరుపుకోవడం ఆనవాయితీ. నేడు పోలీసుల దుస్థితి చూస్తే హృదయం ద్రవిస్తుంది. ప్రాణాలను పణంగా పెట్టి ఎండనకా, వాననకా కరుడుగట్టిన దొంగలతో, నేరస్థులతో పోరాటాలు చేస్తుంటారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారినప్పుడు, జనం రాళ్లు విసిరినప్పుడు దెబ్బలు భరించాలి. ఒకవేళ ప్రాణ రక్షణలో భాగంగా కాల్పులు జరిపితే– హక్కుల సంఘాలు, పత్రికలు, న్యూస్ చానెళ్లు... పోలీసులను దుర్మార్గులుగా చిత్రీకరిస్తాయి. ఎంక్వయిరీలు, నిజ నిర్ధారణ కమిటీలు, కేసులు, శిక్షలు ఎదుర్కోక తప్పదు. అదే చట్ట వ్యతిరేక శక్తులు జరిపిన కాల్పుల్లో పోలీసులు మరణిస్తే ఇవేమీ కనబడవు, వినపడవు. విధి నిర్వహణలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసు సిబ్బంది గురించి, వారి కుటుంబాల గురించి ప్రసారం చేయరు. పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి ఉంది. కానీ అవినీతి పక్షపాతం, బంధుప్రీతి లేనిదెక్కడ? రెవెన్యూ, రిజిస్ట్రేషన్, ట్రాన్స్పోర్ట్, ఎండోమెంట్స్, సేల్స్ టాక్స్, ఇన్కమ్ టాక్స్, ఎక్సైజ్... ఇలా ఏ డిపార్ట్మెంట్లో లేదు అవినీతి? ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు, డ్రగ్స్ నివారణలోనూ పోలీసుల పాత్ర ప్రముఖంగా నిలిచింది. ఈ విషయంలో వారి కృషి, పట్టుదల, నిరంతర శ్రమను మనసారా అభినందించాల్సిందే!
‘పోలీసులంటే ప్రభుత్వానికి కాపలాకాసే చౌకీదార్లు’ అనే విధంగా ఉన్న ప్రభుత్వం మెంటాలిటీ మారేవరకు ఈ డిపార్ట్‌మెంట్‌పై నిందలు, అపనిందలు తప్పవు. అంతేకాదు, పోలీసు శాఖ సమర్థవంతంగా పనిచేయాలంటే ముందు ‘పోలీసులే గవర్నమెంట్... గవర్నమెంటే పోలీసులు’ అనే ప్రజా దృక్పథం మారాలి. పోలీసులంటే గవర్నమెంట్‌కు కొమ్ముకాయడానికి నియామకమైన ఫోర్స్ కాదు. వీవీఐపీలకు బాడీగార్డులుగా ఉండడానికి నిర్దేశించిన సిబ్బంది కాదు. పోలీసు వ్యవస్థ అనేది ప్రజాసైన్యం. సమాజంలో శాంతిభద్రతలు కాపాడటం దీని విధి. ప్రభుత్వాన్ని, ప్రజల ఆస్తులనూ సంరక్షించడమే ఖాకీల లక్ష్యం. ప్రభుత్వ నియంత్రణ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ను తప్పించి, స్వతంత్ర ప్రతిపత్తి గల ఒక ప్రత్యేక వ్యవస్థగా దానిని మలచాలి. పోలీసు సిబ్బంది కూరుకుపోయి ఉన్న అమానవీయ పరిస్థితుల నుంచి వారికి విముక్తి కల్పించాలి. ప్రజలే ‘‘బెస్ట్ పోలీస్’’ అవార్డును ఏర్పాటు చేసి, అర్హులకు ఇచ్చే ప్రక్రియ అన్ని గ్రామాల్లో ప్రారంభం కావాలి.
గుర్రపు సత్యనారాయణ
ఈ వార్తలూ చదవండి:
విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో