Share News

కృష్ణా డెల్టాకు ఆయువుపట్టు పట్టిసీమ

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:41 AM

కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి వంటి ప్రాజెక్టులు, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కృష్ణా జలాల హక్కులపై పలు వివాదాలు జటిలంగా మారిన నేపథ్యంలో కృష్ణాడెల్టాకు సాగునీరు సక్రమంగా రాలేదు. ఈ పరిస్థితుల్లో ...

కృష్ణా డెల్టాకు ఆయువుపట్టు పట్టిసీమ

కృష్ణానదిపై ఎగువన ఆల్మట్టి వంటి ప్రాజెక్టులు, 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో కృష్ణా జలాల హక్కులపై పలు వివాదాలు జటిలంగా మారిన నేపథ్యంలో కృష్ణాడెల్టాకు సాగునీరు సక్రమంగా రాలేదు. ఈ పరిస్థితుల్లో 13.08 లక్షల ఎకరాల కృష్ణాడెల్టా వందేళ్ల నాటి సాగు నీటి హక్కులు, రైతుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యాయి. నాగార్జునసాగర్ నుంచి కృష్ణాడెల్టాకు అందాల్సిన సాగునీరు రైతుకు అందని దుస్థితి. గలగలల కృష్ణమ్మ ఇసుక తిన్నెల ఎడారిని తలపిస్తుంటే, పొట్ట మీద ఉన్న పైరు నీరు లేక నేల రాలిపోతుంటే, అది ఏటేటా డెల్టా రైతులకు ప్రాణ సంకటంగా మారింది. దీంతో డెల్టా సాగునీటి హక్కుల కోసం రైతులు రహదారులపైకి వచ్చేవారు. కలెక్టర్ల కార్యాలయాలను చుట్టుముట్టి ఆందోళనలు చేసేవారు. రైతులను అరెస్టు చేయటం ప్రభుత్వాలకు పరిపాటైంది. దీంతో కృష్ణాడెల్టా హక్కులను కాపాడి, పంటలకు సాగునీరు ఇవ్వాల్సిన గురుతరమైన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై పడింది.


సాగునీటి ప్రాజెక్టులపై సంపూర్ణమైన అవగాహన ఉన్న చంద్రబాబు, 2014 విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తొలి ముఖ్యమంత్రి కాగానే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారు. 2015లో రూ.1300 కోట్లతో నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేశారు. కేవలం ఏడాదిలోనే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ‘పవిత్ర సంగమం’లో పోశారు. పట్టిసీమ నిర్మాణ సందర్భంలో అప్పటి విపక్షనేతగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పట్టిసీమను ఒట్టిసీమ అన్నారు. అందుకు ఖర్చు చేస్తున్న నిధులను దుర్వినియోగంగా చెప్పేవారు. పట్టిసీమను కూడా రాజకీయ అస్త్రంగా వాడారు. కానీ వైసీపీ అయిదేళ్ల పాలనలోనూ కృష్ణాడెల్టాకు పట్టిసీమ సాగునీరే దిక్కయ్యింది. పోలవరం ప్రాజెక్టు బహుళార్థక సాధక ప్రాజెక్టు కాబట్టి, దాని నిర్మాణం... నిధుల వ్యయంతోనూ, అంతర్ రాష్ట్రాల జల వివాదాల పరిష్కారాలతోనూ ముడిపడి ఉంది. కాబట్టి, పోలవరం నిర్మాణం కాలంతో పందెం వేసే పరిస్థితి ఉందని, ముందుగా గ్రహించి అప్పటి దాకా వెంటిలేటర్‌పై ఉన్న రోగికి ఆక్సిజన్ అందించినట్లు పట్టిసీమను అందించారు. పట్టిసీమ ద్వారా ఏటా 80 టీఎంసీల నీరు కృష్ణా ఆయకట్టుకు అందిస్తూ, శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా కృష్ణా ఆయకట్టుకు అందాల్సిన 80 టీఎంసీల నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ రైతులకు అందించాలి అన్న ఉభయకుశలోపరి పథకం కూడా ఇది. 1. నదుల అనుసంధానం 2. కృష్ణాడెల్టాకు నీరు 3. రాయలసీమకు సాగునీరు. ఇలా మూడు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఏర్పాటు చేసిన పట్టిసీమ... గట్టిసీమ. స్వర్ణకాంతుల గోదారమ్మ నీలిరంగు కృష్ణమ్మ గలగలలతో చెలిమి చేసే నదుల అనుసంధానాన్ని రైతులు జలహారతితో స్వాగతిస్తుంటారు. పర్యాటకులు ప్రకృతి నదుల సమ్మేళనాన్ని ఆస్వాదిస్తుంటారు.

l పోతుల బాలకోటయ్య

చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు

ఈ వార్తలు కూడా చదవండి..

ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్

లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:41 AM