Share News

పిల్లల పెంపకం వృత్తి ఎందుకు కాదు?

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:03 AM

వృత్తి అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ చాలా ముఖ్యమైన భాగం. దాదాపు వృత్తులేవీ సమాజం మొత్తం చేపట్టేవి కాదు. అయితే సమాజం మొత్తంగా చేపట్టే, పాల్గొనే ఒక వృత్తిని, ఆ సమాజ దిశ దశలనే నిర్ణయించే...

పిల్లల పెంపకం వృత్తి ఎందుకు కాదు?

వృత్తి అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనూ చాలా ముఖ్యమైన భాగం. దాదాపు వృత్తులేవీ సమాజం మొత్తం చేపట్టేవి కాదు. అయితే సమాజం మొత్తంగా చేపట్టే, పాల్గొనే ఒక వృత్తిని, ఆ సమాజ దిశ దశలనే నిర్ణయించే కీలకమైన వృత్తిని, మనం అసలు వృత్తిగానే పరిగణించం– అదే పిల్లల పెంపకం. పిల్లల పెంపకాన్ని మనం వ్యక్తిగత విషయంగా పరిగణిస్తాం. సమాజం మీద దీని ప్రభావ తీవ్రతను పరిగణనలోకి తీసుకోం. దీనికి ఎటువంటి అధికారిక శిక్షణా లేదు.

పిల్లలను పెంచడం అంటే వారి శారీరక, మానసిక, నైతిక అభివృద్ధికి తోడ్పడడం. ఒక కొత్త తరాన్ని పెంచి సమాజానికి అందించడం. ఆ విధంగా గత, వర్తమానాల్ని భవిష్యత్తు వైపు నడిపించడం. సమాజ భవిష్యత్తును నిర్మించడం. దీనికి చదువు, సంస్కారం కావాలి. అందుకే భాస్కర శతకంలో ‘చదువది ఎంత కల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకంబు’ అన్నాడు. చదువు కంటే సంస్కారం మిన్న. చదువు మానవత్వాన్ని ప్రసాదిస్తుందని హామీ లేదు. సంస్కారం మాత్రం మనిషిని ‘సంఘజీవి’గా మారుస్తుంది. మానవత్వానికి పెద్దపీట వేస్తుంది. ఈ సంస్కారమనే శాస్త్రాన్ని ఇంటి నుంచే అభ్యసించాలి. తల్లిదండ్రుల పెంపకం మీదే పిల్లల ప్రవర్తన ప్రధానంగా ఆధారపడి ఉంటుంది కాబట్టే, తల్లిదండ్రులను ఆదిగురువులు అన్నారు. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన దానికంటే వాళ్ళు చేస్తున్న దానినే ఎక్కువగా ఆచరిస్తారు. కాబట్టి పిల్లల సమక్షంలో తల్లిదండ్రుల కర్మాచరణ, సంభాషణలు ఆదర్శప్రాయంగా ఉండాలి. తైత్తిరీయ ఉపనిషత్తులో ‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ’ అన్నారు. ఇది పూజనీయక్రమాన్నే కాదు, పిల్లలు నేర్చుకునే క్రమాన్ని కూడా సూచిస్తుంది.

పిల్లల పెంపకం అనే పనికి ఆదాయం ఉండదని, ఎటువంటి జీతం రాదని, ఇది కుటుంబ సహజ బాధ్యత కాబట్టి దీనిని వృత్తిగా పరిగణించలేమని ఎవరైనా వాదించవచ్చు. కాని ఇక్కడ అర్థం చేసుకోవలసింది ఈ పెంపకం ఫలితాలు ఒక్క కుటుంబానికే కాదు, మొత్తం సమాజానికి వివిధ రూపాలలో అందుతుంది. ఈ ఆదాయాన్ని లెక్కకట్టడం కూడా కష్టతరమైన పనే. ఈ ఆదాయం సంపద రూపంలోనే గాక, క్రమశిక్షణ, నీతి, నిబద్ధత, సమర్థత, దేశభక్తి లాంటి వివిధ రూపాలలో సమాజానికి అందుతుంది. అయితే ఇవి దీర్ఘకాలిక ఫలితాలు. పెంపకం మీద వెచ్చించే సమయం, ఖర్చులు మొదలైనవి దీర్ఘకాలిక పెట్టుబడులు.


అదేవిధంగా చాలామంది దీన్ని తల్లిదండ్రుల బాధ్యతగా పరిగణిస్తారు. అది కూడా సరైన అభిప్రాయం కాదని నా ఉద్దేశం. ఆ పిల్లలు పెరిగి ప్రయోజకులైన తరువాత వారి సేవలు ఒక్క కుటుంబానికే పరిమితం కావు, దేశం మొత్తానికీ సంపదలే. అదేవిధంగా వారి పెంపకం సరైన రీతిలో లేక చెడుమార్గంలో పయనిస్తే వారు ఆ కుటుంబానికే కాదు ఆ దేశానికే భారంగా మారతారు. ఇప్పటికే మనం దావూద్ ఇబ్రహీం, లారెన్స్ బిష్ణాయ్‌ లాంటి వాళ్ళ వలన దేశానికి ఎంత నష్టమో, వారు ఈ సమాజానికి ఎంత అపకీర్తిని తెస్తున్నారో చూస్తున్నాం. మరోవైపు నరేంద్ర మోదీ, వెంకటరామన్ రామకృష్ణన్, అమర్త్యసేన్, సి.ఎన్.ఆర్.రావు, టెండూల్కర్, సత్య నాదెళ్ళ, సుందర్ పిచ్చాయ్ లాంటి వాళ్ళనూ చూస్తున్నాం. కాబట్టి, పిల్లలు ఒక్క కుటుంబం సొత్తు కాదు. వారు దేశానికే ఆస్తులు. వారి పెంపకం బాధ్యత ఒక్క కుటుంబానిదే కాదు, సమాజానిది కూడా. ప్రభుత్వం కూడా ఈ విషయంలో దూరంగా ఉండకూడదు. తగిన చర్యలు, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల పెంపకాన్ని వృత్తిగా భావించినప్ప్పుడే అది వీలవుతుంది.

పిల్లల పెంపకాన్ని వృత్తిగా పరిగణించి ప్రభుత్వం దానికి వృత్తిపరమైన నియమావళిని తయారుచేయాలి. దాని పర్యవేక్షణకు, సంప్రదింపులకు మండలవారీగా కొందరు అధికారులను నియమించాలి. ప్రభుత్వం ఒక సలహాదారుగా, మద్దతుదారుగా ఉంటూ అవసరమైన సహాయాన్ని కుటుంబాలకు అందించాలి. ఏ విధంగా అయితే జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ కోసం జనాభా నిర్వహణా విధానాన్ని ఈ మార్చిలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా విడుదల చేసిందో, అదేవిధంగా పిల్లల పెంపకం కోసం కూడా ఒక ప్రభుత్వ విధానాన్ని రూపొందించాలి. అలా దేశానికే ఈ విషయంలో మనం మార్గదర్శిగా నిలవాలి.


పిల్లల పెంపకం అంశంలో డెన్మార్క్, స్వీడన్, నార్వే లాంటి స్కాండినేవియన్ దేశాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలిచాయి. అయితే ఈ దేశాలు పిల్లల పెంపకంలో అమలుపరచే విధానాలన్నీ మన ప్రాచీన గ్రంథాలలో కొన్ని వేల ఏళ్ళ క్రితం పొందుపరిచినవే. ఉదాహరణకు 7–7–7 పేరెంటింగ్ రూల్ పెంపకం విషయంలో ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని ప్రకారం మొదటి ఏడేళ్ళు ఆటకు, వినోదానికి; రెండో ఏడేళ్ళు (8–14) బోధనకు; మూడో ఏడేళ్ళు (15–21) పెద్దలు పిల్లలకు సలహాదారుగాను ఉండాలి అని చెప్తుంది. దీనినే మన చాణక్య నీతి సూత్రాలు ‘రాజవత్ పంచవర్షాణి, దశ వర్షాణి దాసవత్‌; ప్రాప్తేషు షోడశే వర్షే, పుత్రం మిత్రవ దాచరేత’ అని చెప్పాయి. (పిల్లలను మొదటి ఐదేళ్ళూ రాజులాగ, తరువాత పదేళ్ళు దాసుడిలాగ, 16 సంవత్సరాల నుంచి మిత్రుడిలాగ చూడాలి). వేమన శతకాల్లాంటి గ్రంథాలలో ఇలాంటివి ఎన్నో సూత్రాలు ఉన్నాయి. వాటిని మనం వెలుగులోకి తీసుకురావాలి. ప్రపంచానికి తెలియజేయాలి.

నేటి పిల్లల పెంపక విధానమే రేపటి సమాజపు స్వభావాన్ని నిర్దేశిస్తుంది. ఒక మంచి విలువలు కలిగిన సమాజం ఏర్పడాలన్నా, మంచి పౌరులు తయారవాలన్నా, సమాజంలో సమానత్వం పెరగాలన్నా, ఆదర్శవంతమైన నాయకులు రావాలన్నా, నేరాల స్థాయి తగ్గాలన్నా... తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు, ప్రభుత్వం, సమాజం యావత్తు పిల్లల పెంపకం మీద దృష్టి పెట్టాలి. శాస్త్రీయ పద్ధతులను రూపొందించి, తగిన కార్యాచరణను ఏర్పరచుకోవాలి.

ఆచార్య ముర్రు ముత్యాలనాయుడు

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

కాళేశ్వరం ప్రాజెక్టులో గేట్లు మూసి నీటిని నిల్వ చేసే అవకాశం లేదు: మంత్రి తుమ్మల

సజ్జనార్ ఆస్తుల కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రాజాసింగ్

Updated Date - Nov 17 , 2026 | 02:03 AM