Share News

‘పాలమూరు రంగారెడ్డి’తో ఫాయిదా ఎంత?!

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:59 AM

తెలంగాణ ఎత్తైన పీఠభూమి ప్రాంతం కావడంతో ఎత్తిపోతల పథకాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాలపై దాదాపు రూ. 1,80,000 కోట్లకు పైగా...

‘పాలమూరు రంగారెడ్డి’తో ఫాయిదా ఎంత?!

తెలంగాణ ఎత్తైన పీఠభూమి ప్రాంతం కావడంతో ఎత్తిపోతల పథకాలపై అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రాల్లో ముందు వరుసలో ఉంది. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాలపై దాదాపు రూ. 1,80,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు అంచనా. ఇలాంటి భారీ వ్యయాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. ఇంత చేసినా ఈ ప్రాజెక్టుల ద్వారా కలిగే ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. కృష్ణా నీటి ఆధారంగా ప్రస్తుతం నిర్మిస్తున్న ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల’ పథకానికి సంబంధించి లాభ నష్టాలపై విశ్లేషణ చేద్దాం.

పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (PRLIS)కు 2015 జూన్ 10న నాటి ప్రభుత్వం జీవో 105 ద్వారా పరిపాలనా పరమైన అనుమతులు ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని ఎగువ ప్రాంతాలకు సాగునీటిని అందించడం. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా 10 లక్షల ఎకరాలకు నీరందించాలని తొలుత భావించినా, ఆ తర్వాత ఆయకట్టును 12.30 లక్షల ఎకరాలకు పెంచారు. సాగునీరు, ఇతర అవసరాల కోసం శ్రీశైలం జలాశయంలో నీటినిల్వ 240 అడుగులకు మించినప్పుడు కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు గ్రామ సమీపం నుంచి 120 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఆ ప్రకారం.. వర్షాకాలంలో రెండు నెలల పాటు, రోజుకు 2 టీఎంసీల నీటిని పంపింగ్ చేయాలని ప్రతిపాదించింది. కృష్ణానది నుంచి ఈ నీటిని సుమారు 450 మీటర్ల ఎత్తుకు అయిదు దశల్లో ఎత్తిపోస్తూ.. నార్లాపూర్‌, ఏదుల, వట్టె, కరివెన, ఉద్ధండాపూర్‌, లక్ష్మీదేవిపల్లి వద్ద నిర్మించే ఆరు జలాశయాల్లో ఈ నీటిని నిల్వ చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈ జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం సుమారు 65 టీఎంసీలు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఎత్తిపోసే 120 టీఎంసీల కృష్ణా నీటితో మహబూబ్‌నగర్‌ (4,13,000 ఎకరాలు), రంగారెడ్డి (3,64,000 ఎకరాలు), వికారాబాద్ (3,23,000 ఎకరాలు), నాగర్‌కర్నూల్ (1,00,000 ఎకరాలు), నల్లగొండ (30,000) జిల్లాల్లోని మొత్తం 12.30 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందించాలని ప్రభుత్వ లక్ష్యం.


2015లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించినప్పుడు అంచనా వ్యయం సుమారు రూ. 35వేల కోట్లు. కాగా, 2022 నాటికి రూ. 55,086 కోట్లకు పెరిగింది. అంటే ప్రారంభ అంచనాతో పోలిస్తే సుమారు 57శాతం ఎక్కువ! తాజా అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం (ఆయకట్టు అభివృద్ధి, భూ సేకరణ వ్యయాలను మినహాయించినా) సుమారు రూ.70 నుంచి 80 వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంతేగాక, ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 23,779 హెక్టార్ల అటవీయేతర భూమితో పాటు, 229 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతుంది.

ఈ PRLIS ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతికంగా, ఆర్థికంగా కొన్ని ప్రధాన సమస్యలు ఉన్నాయి. ప్రస్తుత నీటి కేటాయింపు విధానం ప్రకారం, ఈ ప్రాజెక్టుకు 120 టీఎంసీల నీటిని కేటాయించడం చాలా కష్టం. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, విధానపరమైన కారణాల వల్ల ఈ కేటాయింపులు సాధ్యం కాకపోవచ్చు. సరే, ఆ విషయాన్ని పక్కనపెడదాం. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరిగినా జరగకపోయినా, భారీ వరదలు సంభవించే సమయాల్లో మాత్రం నీటిని ఎత్తిపోయడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఏదో విధంగా పంపింగ్‌ సాధ్యమవుతుందని అనుకున్నా, కేవలం రెండు నెలలు మాత్రమే పంపింగ్ చేయాల్సి ఉండడంతో, ఆయా జలాశయాల్లోని 65 టీఎంసీల నిల్వ సామర్థ్యం సరిపోదు. సాధారణంగా వర్షాకాలంలో శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిగా నిండినప్పుడు మాత్రమే నీటిని పంపింగ్‌ చేయడం సాధ్యం. కానీ ఆ సమయంలో వర్షాల కారణంగా అప్పటికే సాగు భూములు చిత్తడిగా ఉండడంతో, పంపింగ్‌ ద్వారా అందించే ఈ నీటితో రైతులకు అంతగా అవసరం ఉండకపోవచ్చు.

ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం.. ఈ ప్రాజెక్టు వార్షిక నిర్వహణ వ్యయం రూ.8,246 కోట్లు. అంటే (కష్టమే అయినప్పటికీ, ఏదో విధంగా 12.3 లక్షల ఎకరాలకు నీరు అందిస్తారని భావించినా) ఒక ఎకరానికి, ఒక పంటకుగానూ ప్రభుత్వం రూ.67,040 ఖర్చు చేయాలి! ఆ ఎకరం భూమిలో పండించే ఏ పంట రాబడితో పోల్చినా ఇది చాలా ఎక్కువ మొత్తమే. ఈ అధిక ఖర్చును సమర్థించుకోవడానికి ‘ఈ నీటి ద్వారా రైతులు ఒక సీజన్‌కు, ఒక ఎకరానికి గానూ రూ.1,15,000 పంట రాబడి పొందుతారు’ అని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది! వ్యవసాయం గురించి కనీస అవగాహన ఉన్న ఎవరికైనా ఇది హాస్యాస్పదంగానే అనిపిస్తుంది. అదీగాక, ఈ పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయ్యే నాటికి మొత్తం వ్యయం కనీసం 80వేల కోట్లకు మించిపోయే అవకాశం ఉంది. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి, ప్రజలకు పెనుభారంగా మారే ప్రమాదముంది. అంతేగాక, ఆశించిన స్థాయిలో ఇది రైతులకు ప్రయోజనం కలిగించకపోవచ్చు.


ఈ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలపై దృష్టిసారించాలి. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధాన ఎత్తిపోతల పథకాలపై (ముఖ్యంగా, ఇప్పటికే పూర్తయిందని చెప్పుకుంటున్న కాళేశ్వరంతో పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై) స్వతంత్ర సాంకేతిక సమీక్షను నిర్వహించాలి. ఈ సమీక్షలో ఏఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలంటే.. ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుల కోసం వాస్తవంగా ఎంత ఖర్చు పెట్టారు? ఆయకట్టు అభివృద్ధి వంటి అంశాలను కూడా కలుపుకుంటే, వీటన్నింటినీ పూర్తి చేయడానికి ఇంకా ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది? అప్పులు, వడ్డీ రేట్లు, విద్యుత్‌, మరమ్మతులు తదితర ఖర్చులతో పాటు, సాగునీటి సరఫరాకు వాస్తవంగా అయ్యే వార్షిక ఖర్చు ఎంత? ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన యంత్రాలు, భవనాల వంటి మౌలిక సదుపాయాల జీవితకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే, పదేళ్ల తర్వాత (ఆయా ప్రాజెక్టుల నిర్వహణ సమస్యతో పాటు, పలు ప్రదేశాల్లోని కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నాయంటూ నివేదికలు వచ్చే సందర్భాలను దృష్టిలో ఉంచుకుని) ఎదురయ్యే ఖర్చులు, సమస్యలు ఏమిటి? నాడు ప్రాజెక్టు ప్రతిపాదనలో చూపించిన వ్యయ, ప్రయోజనాలను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తవ వ్యయ, ప్రయోజనాల పరిస్థితిని స్పష్టంగా వివరించడం. రైతుల నికర ఆదాయం పెరగడానికి అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించడం... వంటివి అవసరం.

తెలంగాణ ప్రభుత్వం ఈ సమీక్ష కోసం అత్యున్నత, అంతర్జాతీయ స్థాయి నిపుణులను నియమించినప్పటికీ, ఇది పూర్తవడానికి మూడు నెలల కంటే ఎక్కువ సమయం పట్టదు, ఖర్చు కూడా పది కోట్లకు మించదు. అవసరమైతే కొన్ని అంతర్జాతీయ సంస్థలను సంప్రదించడం ద్వారా, వీలైనంత తక్కువ ఖర్చుతోనే ప్రభుత్వం ఈ సమీక్షను నిర్వహించుకోవచ్చు కూడా.

ఈ సమీక్ష పూర్తయ్యే వరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలి. రైతులకు ఇబ్బంది కలుగకుండా, వారికి నేరుగా నగదు సాయం చేయాలి. తద్వారా రైతులకు అధిక ప్రయోజనం కలగడమేగాక, ప్రభుత్వానికి ఖర్చూ తగ్గుతుంది, రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటుంది.

డా. బిక్షం గుజ్జా

డా. కె.శివకుమార్

జల విధాన నిపుణులు

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం రేవంత్‌రెడ్డికి అరుదైన అంతర్జాతీయ ఆహ్వానం..

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: సీఎం రేవంత్‌‌రెడ్డి

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 24 , 2026 | 01:00 AM