Share News

పొదుపు సరే, విదేశీ మదుపులు ఏవీ?

ABN , Publish Date - May 16 , 2026 | 02:23 AM

‘దేశ ఆర్థిక వ్యవస్థకు నానా సమస్యలు సంచితమవుతున్నాయి. దిగుమతి సుంకాలపై అమెరికాతో మన సంబంధాలు సజావుగా లేవు. అవి కలహశీలంగా పరిణమిస్తున్నాయి. సకల...

పొదుపు సరే, విదేశీ మదుపులు ఏవీ?

‘దేశ ఆర్థిక వ్యవస్థకు నానా సమస్యలు సంచితమవుతున్నాయి. దిగుమతి సుంకాలపై అమెరికాతో మన సంబంధాలు సజావుగా లేవు. అవి కలహశీలంగా పరిణమిస్తున్నాయి. సకల కార్యకలాపాలకు విస్తరిస్తూ, విజృంభిస్తున్న కృత్రిమ మేధ సాంకేతికతను స్వంతంగా సమకూర్చుకోవడంలో మనం వెనుకబడి ఉండడమే కాకుండా తప్పుదోవలో కూడా ఉన్నాము. ఎన్నికలలో జయపతాక నెగురవేసే విషయమై ఎంతగా శ్రద్ధాసక్తులు చూపుతున్నారో అంతకంటే మిన్నగా విదేశీ పెట్టుబడిని మళ్లీ దేశానికి తీసుకువచ్చేందుకు దృష్టి పెట్టాలి, అందుకు దీక్షాదక్షతలు చూపాలి. ప్రైవేట్‌ పెట్టుబడి స్తబ్దమైపోయింది. కారణమేమిటి? వ్యాపారరంగ క్షేత్రస్థాయి వాతావరణం అంతులేని కష్టనష్టాలకు మాత్రమే ఆస్కారమిచ్చేదిగా ఉన్నది. అడుగడుగునా కఠిన నిబంధనలు, దర్యాప్తు సంస్థలు వ్యాపారవేత్తలను అమితంగా భయపెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపార సౌలభ్యం ఎలా సాధ్యమవుతుంది? భారత ఆర్థిక వ్యవస్థ శక్తిసామర్థ్యాల పట్ల ఆశావాదులూ ఉన్నారు, నిరాశావాదులూ ఉన్నారు. అయితే ఈ ఇరువురినీ భారత్‌ ఒకేలా అసంతృప్తికి లోనుచేస్తోంది మనకు ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్టాక్‌ మార్కెట్‌ ఉన్నది. దానిని కాపాడుకునేందుకైనా మనం జాగరూకత చూపకపోతే ఎలా?’

పాఠక మహాశయా, ఇవి నా మాటలు అనుకుంటున్నారా? నావి కావు. పోకిరీ వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం నెమ్మదించండి. ఇవి రుచిర్‌ శర్మ (The Rise and Fall of Nations, What went wrong with Capitalism మొదలైన సుప్రసిద్ధ పుస్తకాల రచయిత) వ్యాఖ్యలవి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరుతెన్నులకు తీవ్ర అభిశంసనే ఆ వ్యాఖ్యలు. ఆ వ్యాఖ్యలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ఒప్పుకుంటున్నాను. అమెరికాతో సన్నగిల్లిన సంబంధాలు, విదేశీ పెట్టుబడులను మళ్లీ ఆకర్షించవలసిన ఆవశ్యకత, వ్యాపార సౌలభ్యానికి సానుకూలంగా లేని పరిస్థితులు, దర్యాప్తు సంస్థల పాత్ర గురించి రుచిర్‌ శర్మ వ్యాఖ్యలతో విభేదించవలసిన అవసరమేమున్నది? ఆ విషయాలేవీ ప్రజల దృష్టికి రావడం లేదు. పార్లమెంటరీ, ప్రజా చర్చలలో వాటిని తెలివిగా ఉపేక్షిస్తున్నప్పుడు ప్రజలకు వాస్తవాలు ఎలా తెలుస్తాయి?


నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. రెండు రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనంద డోలికలలో ఉండగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టనష్టాల నెదుర్కొంటున్న వాస్తవాన్ని ఆయన గుర్తించారు. ఆ కఠోర సత్యాన్ని ఆయన అసాధారణంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వం చేసిన తప్పులు, చేయని ప్రజాహిత పనులకు సంభవించిన, ఇంకా సంభవిస్తోన్న ఎనలేని కష్టనష్టాలకు ఉపశమనంగా ప్రజలు త్యాగాలు చేయాలని ప్రధానమంత్రి అభిలషిస్తున్నారు. ఆ మేరకు పిలుపునిచ్చారు కూడా. వాస్తవాలు ఎంత కఠినంగా ఉన్నాయో చూడండి: ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్‌ సంయుక్త యుద్ధం ప్రారంభమై ఈ నెల 31 నాటికి మూడు నెలలు పూర్తవుతాయి. యుద్ధం ఆగిపోయే సూచనలు కానరావడం లేదు; పశ్చిమాసియాలోని దేశాలన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆ యుద్ధంలో పాల్గొంటూనే ఉన్నాయి; బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 107 డాలర్లుగా ఉన్నది; రూపాయి మారకం విలువ డాలర్‌కు రూ.95.70గా ఉన్నది. రూపాయి విలువ ఎన్నడూ ఇంతగా పతనం కాలేదు; అధికారికంగా వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణం 3.5శాతం కాగా ఆహార ద్రవ్యోల్బణం 4.33శాతం; గృహావసరాల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.913 కాగా కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.3077 నుంచి రూ.3237 దాకా ఉంటోంది; డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 8.3శాతం; ఏప్రిల్‌–డిసెంబర్‌ 2025లో నికర విదేశీ పెట్టుబడి ఇలా ఉన్నది: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు– 300 కోట్ల డాలర్లు (ఇది చాలా స్వల్పం) కాగా, విదేశీ సంస్థాగత పెట్టుబడులు 4.3 బిలియన్‌ డాలర్ల కంటే తక్కువ; 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్‌ మూలధన పెట్టుబడుల ప్రతిపాదనల మొత్తం విలువ రూ.6.6 నుంచి 6.8 లక్షల కోట్లు; 2025–26లో బంగారం దిగుమతుల విలువ 7200 కోట్ల డాలర్లు; ఏడాదికి 50 రోజుల పని కల్పించే గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దుచేసిన తరువాత పేద ప్రజలకు లబ్ధి చేకూర్చే వేతన ఉపాధి కార్యక్రమం ఏదీ అమల్లో లేదు.

ఈ సమస్యలన్నిటినీ అధిగమించడమెలా? ప్రస్తుత ఆపత్కాలాన్ని అధిగమించేందుకు చేయవలసిన వాటి విషయమై ఆయన నేరుగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవేమిటో చూద్దాం. బంగారం దిగుమతులను నిలిపివేయాలి లేదా గణనీయంగా తగ్గించాలి? అన్ని విషయాలలోను పొదుపు పాటించి తీరాలి. ఇంధన వినియోగం, వంటనూనెలు, ఎరువులు మొదలైన వాటి వినియోగంలో ఆత్మసంయమనం వహించాలి. అనవసర దిగుమతులను పూర్తిగా నిరోధించాలి. ఇంకా ఇలాంటివే మరికొన్ని. మంచిదే. ప్రజలు పాటిస్తారు. కొన్ని విషయాలలో ప్రభుత్వ సూచనలు రాకముందే వారు వాటిని పాటిస్తున్నారని కూడా చెప్పవచ్చు. మరీ ముఖ్యమైన విషయమేమిటంటే ప్రధానమంత్రి తక్షణమే చేయవలసింది ఒకటి ఉన్నది: తన ప్రభుత్వ పనితీరును నిశితంగా విశ్లేషించుకోవడం. ఆత్మపరిశీలనతోనే అన్ని మంచి పనులు ప్రారంభమవుతాయి మరి.


అడ్డూ అదుపూ లేకుండా ఇంధన వినియోగానికి కారకుడుగా మొదట ప్రధానమంత్రినే చెప్పాలి. ఆయన ఇంచుమించు ప్రతి రోజూ ఢిల్లీ నుంచి సుదూర ప్రాంతాలలో ప్రాంభోత్సవాలకు లేదా కొత్త ప్రభుత్వ పదవీ ప్రమాణ స్వీకారోత్సవాలకు విమానంలో వెళ్లుతుంటారు (తిరిగి ఢిల్లీకి వస్తారు). ఆయన కాన్వాయ్‌ చాలా పొడవుగా ఉంటుంది. ఇప్పుడు దానిని కుదించారనుకోండి. ఇక ఆయన ఆర్థికమంత్రి దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత దుర్గతి గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదు (యూపీఏ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ఒకటి భారత్‌ను నాలుగు బలహీన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా పేర్కొన్నదని ఆమె మహదానందంతో చెప్పుతుంటారు). 2013–14లో ప్రపంచవ్యాప్త ఆర్థిక సంక్షోభానికి ట్యాపర్‌ టాంట్రమ్‌ (ఒక కేంద్ర బ్యాంకు–సాధారణంగా అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌– తన ఆర్థిక ఉద్దీపనను తగ్గిస్తుందని లేదా పెంచుతుందని సంకేతం ఇచ్చినప్పుడు ఆర్థిక మార్కెట్లలో కనిపించే అస్థిర ప్రతిచర్య) దారి తీసిందని, యూపీఏ ప్రభుత్వం వెన్వెంటనే ప్రతిస్పందించి పటిష్ఠ చర్యలతో పరిస్థితిని చక్కదిద్దిందని ఆమె చెప్పనే చెప్పరు. స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేట్లే యూపీఏ ప్రభుత్వ సమర్థతకు ఒక తిరుగులేని నిదర్శనం. 2012–13లో జీడీపీ వృద్ధిరేటు 5.5శాతం కాగా, సంక్షోభ సంవత్సరంలో అంటే 2013–14లో ఆ వృద్ధిరేటు 6.4శాతంగా ఉన్నది. వాణిజ్య మంత్రి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడంలో మహా బిజీగా ఉంటున్నారు. గత ఐదేళ్ల కాలంలో ఆయన మొత్తం తొమ్మిది స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. అయితే ఈ ఒప్పందాలు హామీ ఇస్తున్న వాటికి, నిబంధనలు అనుమతించే వాటికి మధ్య చాలా అంతరం ఉన్నదని ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతమెదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు విదేశీ మారకద్రవ్యం నిల్వలను మళ్లీ సమృద్ధం చేయాలని, రూపాయి మారకం రేటుకు స్థిరీకరించాలని ప్రధానమంత్రి సంకల్పించారు. ఇది సరైన, సత్ఫలితాల నివ్వగల ఆలోచనే, సందేహం లేదు.


సరే, మళ్లీ రుచిర్‌ శర్మ వద్దకు వెళదాం. ప్రధానమంత్రి చేయవలసిన కృషి చాలా ఉన్నది. ఆయన తలపడవలసిన సమస్యలు, సవాళ్లు అనేకమున్నాయి. తొట్ట తొలుత ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాల నియంత్రణ వ్యవస్థల (రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెబీ, సీబీడీటీ, సీబీఐటీ, వాణిజ్య మంత్రిత్వ శాఖ, కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మొదలైనవి) పని విధానాన్ని పునఃపరిశీలించాలి; ప్రస్తుత విధానాలు, నిబంధనలను ఉపసంహరించాలి. ఇవి, సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి రాకముందు అంటే 1990ల ముందు కాలంలో వలే నియంత్రణ – ఆధారిత స్వభావంతో ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపార సౌలభ్యానికి దోహదం చేసేవిగా కాకుండా ఆ రంగంలోని వ్యక్తులు, సంస్థలను నిరుత్సాహపరిచేవిగా ఉన్నాయన్నది ఒక కఠోర వాస్తవం; దర్యాప్తు సంస్థలను కఠినంగా అదుపుచేయాలి. వాటిని ఎలాంటి సంకుచిత, రాజకీయ ప్రయోజనాలకు ఎవరిపైనా ఉసిగొల్పకూడదు; రూపాయి మారకం రేటు స్థిరపరచాలి. మరింత స్పష్టంగా చెప్పాలంటే రూపాయి విలువను దృఢతరం చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు, జరిగినప్పుడే విదేశీ పెట్టుబడులు మళ్లీ మన దేశానికి వస్తాయి. అవి మళ్లీ వెల్లువెత్తేలా ప్రధాని మోదీ పటిష్ఠ చర్యలు చేపడతారా? ప్రస్తుత మంత్రులలో చాలామంది మార్కెట్‌ సంశయవాదులే అయినందున ఆయన ఆ ఆవశ్యక చర్యలను అంత సులభంగా చేపట్టలేరు. మరి ఆ చర్యలు విధిగా చేపట్టవలసినవి కనుక అందుకు అర్థశాస్త్ర ప్రాజ్ఞులు, వివేకశీలురు అయిన వ్యక్తుల సహాయాన్ని తప్పక తీసుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణ ప్రాతిపదికన చేపట్టవలసిన చర్యలపై సలహాలు ఇచ్చేందుకు మార్కెట్‌–స్నేహపూర్వక ఆర్థికవేత్త ఒకరి నేతృత్వంలో ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రికి సూచిస్తున్నాను. ఆ బృందంలోని సభ్యులను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను ఆ నాయకుడికి విధిగా కల్పించాలి. ఆ నిపుణుల బృందం 15 రోజులలోగా తన సలహాలు నివేదించాలి. ప్రధానమంత్రి వాటిపై అంతే శీఘ్రంగా కార్యాచరణకు పూనుకోవాలి.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి...

రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది: మంత్రి తుమ్మల

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం.. కేటీఆర్ సహా ముగ్గురికి ఏసీబీ కోర్టు సమన్లు

Read Latest Telangana News And AP News And International News

Updated Date - May 16 , 2026 | 02:23 AM