Share News

జేపీకి ఇంత అమానవీయ ఆలోచనా?

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:20 AM

‘ఓపీ‘ఎస్’ అంటే ఆర్థిక అత్యయిక పరిస్థితే!’ అన్న వ్యాసంలో (అక్టోబర్ 9, 2026) లోక్‌సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్ పచ్చి అబద్ధాలను అందంగా నగిషీలు చెక్కి, హృద్యమైన భాషలో...

జేపీకి ఇంత అమానవీయ ఆలోచనా?

‘ఓపీ‘ఎస్’ అంటే ఆర్థిక అత్యయిక పరిస్థితే!’ అన్న వ్యాసంలో (అక్టోబర్ 9, 2026) లోక్‌సత్తా వ్యవస్థాపకులు డా. జయప్రకాశ్ నారాయణ్ పచ్చి అబద్ధాలను అందంగా నగిషీలు చెక్కి, హృద్యమైన భాషలో చెప్పే ప్రయత్నం చేశారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించే పాత పెన్షన్ విధానం ఎంతో ప్రమాదకరమైనది’ అంటూ దానివలన దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది అన్న వ్యాఖ్యలు వారు ఉల్లేఖించిన అబద్ధాలలో ప్రధానమైనవి. వారు సెలవిచ్చినట్టుగానే దేశ జనాభాలో ప్రభుత్యోద్యోగులు 3శాతం అనుకుంటే వారికిచ్చే పెన్షన్ డబ్బులు సాలీనా కొన్ని వందల కోట్ల రూపాయలకు మించవు. కానీ, పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన వివరాల ప్రకారం, 11 ప్రభుత్వ రంగ బ్యాంకులలో కోటి రూపాయల కంటే ఎక్కువ రుణాలు తీసుకొని తిరిగి చెల్లించని మొత్తం డబ్బు రూ.29 లక్షల కోట్లు. ‘నేను చెప్పినవన్నీ వాస్తవాలు’ అని రాసుకొచ్చిన జయప్రకాశ్‌ నారాయణ్ ఈ వాస్తవాల గురించి పట్టించుకోరు. కానీ కొన్ని వందల కోట్లు మాత్రమే ఖర్చయ్యే పెన్షన్ల వల్ల రాష్ట్ర అప్పుల భారం పెరిగిపోతుందని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

‘ఎన్పీఎస్/ సీపీఎస్‌లో మేం పెట్టిన డబ్బులు ఏమవుతా’ యని ఉద్యోగులు ఆందోళన చెందుతారని అంటూనే, అవి ఎక్కడికీ పోవని జేపీ హామీ ఇస్తున్నారు. ఉద్యోగస్థుల, పెన్షనర్ల ముందున్న బ్యాంకర్ల, ఆర్టీసీ కార్మికుల అనుభవాలు చూస్తుంటే ఈయన భరోసా పిల్లికి ఎలుక సాక్ష్యం అన్న సామెతను గుర్తుకు తెస్తున్నది. బ్యాంక్ ఉద్యోగులు చెల్లించే ప్రావిడెంట్ ఫండ్ మొత్తాన్ని పెన్షన్ ఫండ్‌గా మారుస్తారు. వారు రిటైర్ అయిన తర్వాత పెన్షన్‌ను ఆ ఫండ్ లోంచి చెల్లిస్తారు. ప్రతి ప్రభుత్వరంగ బ్యాంక్ ఆధీనంలో వేల, లక్షల కోట్ల రూపాయల పెన్షన్ ఫండ్ జమ అయి ఉన్నది. ఉదాహరణకు ఎస్బీఐలో రూ.1,25,806.37 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.46,731.79 కోట్లు, యూనియన్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో రూ. 26,720.88 కోట్లు పెన్షన్ ఫండ్ కింద జమ అయి ఉన్నాయి. ఇలా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులలో నిల్వ ఉన్న పెన్షన్ ఫండ్ వివరాలు పార్లమెంటుకు తెలుసు. వేల, లక్షల కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్‌లో నిల్వ ఉన్నా పదవీ విరమణ పొందిన బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ పెంపు ఉండదు. దశాబ్దాలుగా అరకొర పెన్షన్‌తో జీవితాలు వెళ్లబుచ్చుతున్నారు.


దేశవ్యాప్తంగా ఆర్టీసీ, బీహెచ్‌ఈఎల్, హెచ్ఏఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు అయిదు వేల దాకా ఉంటాయి. వాటిల్లో పనిచేసి రిటైర్ అయిన వారి పరిస్థితి మరీ అధ్వానం. ఉదాహరణకు ఆర్టీసీలో పెద్ద మొత్తంలోనే పెన్షన్ ఫండ్ ఉంది. అదంతా కార్మికులుగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్. కానీ, ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన లక్షలాది ఉద్యోగులు, కార్మికులు పొందే పెన్షన్ కేవలం కనిష్ఠంగా ఒక వెయ్యి రూపాయలు, ఆపైన ఉంటుంది. అధికారిగా రిటైర్ అయితే గరిష్ఠంగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది. ఇటీవల పదవీ విరమణ పొంది, కొత్త పెన్షన్ పథకం కింద పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగి ఒకరు ఉద్యోగుల ధర్నా శిబిరం దగ్గర కుటుంబ పోషణ నిమిత్తం పల్లీలు, బఠాణీలు అమ్ముకుంటున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి జయప్రకాశ్‌ నారాయణ్ ఏమి సమాధానం చెపుతారు? పేదల పిల్లలకు సరైన చదువు అందకపోవడానికి, పేద ప్రజల జీవితాలలో అంధకారం అలుముకోవడానికి కారణం ప్రభుత్వ ఉద్యోగులే అని నెపం వారి మీద మోపి, రాజకీయ నాయకులలో నిర్ణయాత్మక పటిమ లేకపోవడం, అధికార గణంలో చిత్తశుద్ధి, పట్టుదల లేకపోవడం వంటి అసలు కారణాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు జేపీ గారు.

భారతీయుల సగటు ఆయుర్దాయం 72.7 సంవత్సరాలు. కొంతమంది పెన్షనర్లు కొంత ఎక్కువ కాలం జీవించవచ్చు. ఏమైనా రిటైర్మెంట్ తర్వాత వారు జీవిత చరమాంకానికి చేరుకున్నట్లే కదా. వారి జీవితాలలో పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న కాలమంతా ప్రభుత్వ సేవలోనే కదా వారు గడిపింది. ప్రభుత్వ సేవ అంటే ప్రజాసేవనే కదా. ప్రజలలో ఒక చిన్న సమూహమైన ఈ వృద్ధ పెన్షనర్ల పట్ల జేపీ గారికి అంత ద్వేష భావం, వారిని ముసలితనంలో రోడ్ల పైనే వదిలివేయాలన్న అమానవీయ ఆలోచన ఎందుకో అర్థం కాదు.

రాజేంద్రబాబు అర్విణి

తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 03:21 AM