Share News

‘జమిలి’ ఎన్నికల బిల్లునూ ఓడించాలి

ABN , Publish Date - Apr 25 , 2026 | 03:32 AM

నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని మరే ఇతర పార్టీ వంటిది కాదు. గతంలోనూ, వర్తమానంలోనూ బీజేపీ వంటి పార్టీ మరొకటి లేదు. బీజేపీ లక్ష్యం సాధ్యమైనంత తరచుగా ఎన్నికలలో...

‘జమిలి’ ఎన్నికల బిల్లునూ ఓడించాలి

నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని మరే ఇతర పార్టీ వంటిది కాదు. గతంలోనూ, వర్తమానంలోనూ బీజేపీ వంటి పార్టీ మరొకటి లేదు. బీజేపీ లక్ష్యం సాధ్యమైనంత తరచుగా ఎన్నికలలో విజయం సాధించడం కాదు; ఎన్నికలలో గెలిచి అధికారంలో శాశ్వతంగా ఉండడమే సుమా! ఈ దృష్ట్యా బీజేపీ, చైనా కమ్యూనిస్టు పార్టీ వంటిది. చైనా కమ్యూనిస్టు పార్టీ తన సుదీర్ఘ ప్రస్థానంలో జపనీస్‌ దురాక్రమణదారులతో హోరాహోరీగా పోరాడింది. 1945లో జపాన్ చిత్తుగా ఓడిపోయిన తరువాత దేశీయ కొమింగ్‌ టాంగ్‌తో తలపడింది. అంతర్యుద్ధం ప్రజ్వరిల్లింది. చైనా కమ్యూనిస్టు పార్టీ 1949లో అంతిమంగా జయపతాక నెగురవేసింది. తదాది చైనాలో కమ్యూనిస్టు పార్టీయే అధికారంలో కొనసాగుతోంది.

మావో 1949లో ఏక పార్టీ పాలనా రాజ్య వ్యవస్థను ప్రకటించాడు. భారత్‌ 1947లో వలసపాలన నుంచి విముక్తి పొందింది. లౌకికవాద, ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ఉపక్రమించింది. భారత రాజ్యాంగం 1950లో అమలులోకి వచ్చింది. ఈ రాజ్యాంగం బహుళ పార్టీ వ్యవస్థను అనుమతించింది. ప్రతి ఐదేళ్ల కొకసారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్దేశించింది. కేంద్రంలోను, రాష్ట్రాలలోను అధికార బదిలీ శాంతియుతంగా జరిగేలా చేసింది. ప్రజాస్వామ్యమే భారత్‌, చైనాల మధ్య ఉన్న కీలక వ్యత్యాసం.

తొలుత జనసంఘ్‌, పిదప భారతీయ జనసంఘ్‌, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ.. భారత రాజ్యాంగాన్ని విశ్వసించినవే. జనసంఘ్‌ గానీ, భారతీయ జనతా పార్టీ గానీ ప్రజాస్వామ్య పాదులో మితవాద పార్టీలుగా ఎదిగాయి. మధ్యేవాద వామపక్ష పార్టీగా సుప్రసిద్ధమైన భారత జాతీయ కాంగ్రెస్‌ నుంచి భిన్నంగా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ శతథా ప్రయత్నించింది. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ, అటల్‌ బిహారీ వాజపేయి, లాల్‌కృష్ణ ఆడ్వాణీ నాయకత్వంలో ఆ పార్టీ దశాబ్దాల పాటు ఒక ప్రజాస్వామిక పార్టీగా ఉన్నది. అయితే బీజేపీ రాజకీయ గురువు అయిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)కు భారతదేశ రాజకీయ వ్యవస్థ, రాజ్యపాలనా పద్ధతి గురించి భిన్న దృక్పథముండేది. భారతదేశానికి ఒకే భాష, ఒకే సంస్కృతి ఒకే రాజకీయ పార్టీ ఉండాలని, సాధ్యమైనంతవరకు ఒకే మతం ఉండాలని ఆరెస్సెస్‌ ప్రగాఢంగా విశ్వసిస్తుంది.


ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ సర్వోన్నత నాయకుడు అయిన నరేంద్రమోదీ, భారత్‌పై రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్ దక్పథాన్ని పూర్తిగా సమర్థించే సైద్ధాంతికవాది. అయితే ఆరెస్సెస్‌ లక్ష్యాన్ని ఎన్నికల విజయాల ద్వారా మాత్రమే సాధించడం అసాధ్యమని గుర్తించిన వాస్తవికవాద రాజకీయవేత్త ఆయన. ఆరెస్సెస్‌ ఆకాంక్షిస్తున్న భారతదేశ నిర్మాణం చాలా జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా చేపట్టే చర్యల ద్వారా మాత్రమే జరగగలదని మోదీ గుర్తించారు. ఈ దృక్కోణం నుంచే (2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ) మోదీ ప్రభుత్వం చేపట్టిన రాజ్యాంగ సంబంధిత, శాసన నిర్మాణ, పరిపాలనాపరమైన చర్యలు అన్నిటినీ చూడాలి. పౌరసత్వ (సవరణ) చట్టం, ఉమ్మడి పౌర స్మృతిని అమలులోకి తీసుకువచ్చేందుకు మోదీ సర్కార్ గట్టిగా ప్రయత్నిస్తోంది. జమ్మూ–కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తీసుకువచ్చి అమలుపరిచింది. అధికరణ 7, అధికరణ 162, రాజ్యాంగంలోని పదకొండు, పన్నెండు, పద్నాల్గవ విభాగాలలోని నిబంధనలకు సృజనాత్మక భాష్యాలు చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక (వన్‌ నేషన్‌–వన్‌ ఎలెక్షన్‌) బిల్లుకు పార్లమెంటు ఆమోదం సాధించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. ఇవన్నీ బీజేపీ ఘోషిస్తున్న వికసిత్ భారత్‌ను సాధించేందుకు ఉద్దేశించినవే.

2014–24 సంవత్సరాల మధ్య నరేంద్ర మోదీ ప్రాబల్య ప్రాభవాలు బాగా పెరిగాయి. అజేయుడు అనే కీర్తి హారతులూ అందుకున్నారు. ఈ కారణంగానే 2024 లోక్‌సభ ఎన్నికలలో దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీకి 400కు పైగా సీట్లు ఇస్తారని నరేంద్ర మోదీ గట్టిగా విశ్వసించారు. అయితే భారత ప్రజలు మరోలా ఆలోచించారు. 400కు పైగా సీట్లు కాదు కదా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సాధారణ మెజారిటీ కూడా ఆయనకు దక్కకుండా చేశారు. కేవలం 240 సీట్లు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై విధిగా ఆధారపడక తప్పలేదు. 2024 నుంచి ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ 2029 లోగా.. పోయిన బలాన్ని పునరుద్ధరించుకోవడానికి ఉద్దేశించినవే. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు–2026 పార్లమెంటు ఆమోదం పొందడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించి ఉంటే ఏమయ్యేదో ఊహించడం కష్టమేమీ కాదు. చట్ట సభలలో మహిళల ప్రాతినిధ్యం పెంపొందించే పేరిట డీలిమిటేషన్‌ (నియోజకవర్గాల పునర్విభజన)ను అనుమతించి ఉండేవారు. ఎన్నికలలో బీజేపీ విజయావకాశాలకు తోడ్పడే విధంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చివేసి ఉండేవారు. ఈ చర్యలు దేశ పాలనలో దక్షిణాది రాష్ట్రాల ప్రాధాన్యాన్ని గణనీయంగా తగ్గించివేసి ఉండేవి. మరీ ముఖ్యంగా, 2029లో ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ భావనను అమలుపరిచేందుకు ఉద్దేశించిన బిల్లుతో సహా ఇతర రాజ్యాంగ సవరణ బిల్లులు అన్నిటికీ పార్లమెంటు ఆమోదం పొందడంలో మోదీ సర్కార్‌ సఫలమయి ఉండేది.


2024 సార్వత్రక ఎన్నికల వరకు ఎన్నికలలో విజయం సాధించేందుకు అవసరమైన శక్తియుక్తులు అన్నీ తనకు ఉన్నాయని బీజేపీ భావించేది. తొమ్మిది హిందీ భాషా రాష్ట్రాలలోను, గుజరాత్‌లోను మహా పటిష్ఠమైన పార్టీ సంస్థాగత యంత్రాంగం; హిందీ భాషకు మంచి ప్రాచుర్యమున్న మహారాష్ట్ర, పంజాబ్‌, జమ్మూ ప్రాంతంలోని పలు జిల్లాల్లో చెప్పుకోదగిన ప్రజాబలం; కొదవ లేని ఆర్థిక వనరులు; విధేయ గవర్నర్లు; ఆదేశాలను భయభక్తులతో పాటించే ప్రభుత్వ అధికారులు, దర్యాప్తు సంస్థల అనుకూలత; ఎటువంటి మినహాయింపులు లేని మీడియా మద్దతు; భారత ఎన్నికల సంఘం వ్యూహాత్మక మద్దతు, ప్రభుత్వానికి అనుకూలంగా సంయమనంతో వ్యవహరిస్తున్న న్యాయవ్యవస్థ... ఇంతకంటే ఒక అధికార పార్టీకి కావల్సినదేముంటుంది? బీజేపీకి సమకూరిన ఈ సంపూర్ణ శక్తిసామర్థ్యాలకు అవరోధాలుగా ఉన్నవి దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌.

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే ప్రతిపక్ష కూటమిలో చీలికలు వచ్చే అవకాశమున్నదని నేను భావిస్తున్నాను. కాంగ్రెస్‌తో పాటు ప్రాంతీయ పార్టీలు, ఒకే ఒక్క రాష్ట్రానికి పరిమితమైన పార్టీలు ప్రతిపక్ష కూటమిలో ఉన్నాయి. ఈ పార్టీలలో చాలా వాటికి పరస్పర విభేదాలు ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలోను, స్థానిక స్వపరిపాలనా సంస్థల ఎన్నికలలోను అవి ఒక దానిపై ఒకటి పోటీ చేస్తుంటాయి. అదే సమయంలో, 2024లో మాదిరిగానే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో కూడా అవి ఒక కూటమిగా సంఘటితమయ్యే అవకాశమున్నది.

లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు (అంతిమంగా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు) ఏకకాలంలో ఎన్నికలు జరిగిన పక్షంలో ప్రాంతీయ పార్టీలు ఏకమై ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. అలా సంఘటితమై పోటీ చేస్తేనే లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని ఓడించేందుకు వాటికొక అవకాశం లభిస్తుంది. అయితే ఏకకాలంలో ఎన్నికల నిర్వహణతో అటువంటి సదవకాశం ప్రాంతీయ పార్టీలకు ఉండదు. కనుకనే ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందేందుకు బీజేపీ అమిత ప్రాధాన్యమిస్తోంది. ఆరెస్సెస్‌ ఆకాంక్షిస్తున్న భారతదేశ నిర్మాణానికి ఆ చట్టం ఇతోధికంగా తోడ్పడగలదని బీజేపీ విశ్వసిస్తోంది.


ప్రతిపక్షాలకు 2024 లోక్‌సభ ఎన్నికల పాఠమేమిటి? అనేక పార్టీలు ‘ఇండియా’ కూటమిగా సంఘటితమైనా భారతీయ జనతా పార్టీని ఓడించలేకపోయాయి. 240 సీట్లతో లోక్‌సభలో ఏకైక పెద్ద పక్షంగా బీజేపీ ఆవిర్భవించింది. భాగస్వామ్య పక్షాల పరస్పర సర్దుబాట్ల ద్వారా ఇండియా కూటమి తననుతాను విస్తరించుకోవచ్చు. అయితే భాగస్వామ్యపక్షాలు గత లోక్‌సభ ఎన్నికల పాఠాన్ని నేర్చుకోవడంలోను, పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడంలో విఫలమైన చిన్న పార్టీలు ఉనికిని కోల్పోవచ్చు. అంతిమంగా లోక్‌సభ ఎన్నికలలో రెండు బృహత్‌ కూటములు ప్రభవించి కేంద్రంలో అధికారాన్ని బీజేపీ సంపూర్ణంగా స్వాయత్తం చేసుకోవడాన్ని నిరోధించి, ప్రత్యామ్నాయ రాజకీయ అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా లౌకికవాద, ప్రజాస్వామిక, గణతంత్రవాద భారత రాజ్యాంగం సుస్థిరంగా కొనసాగేందుకు దోహదం చేకూరుతుంది.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 03:32 AM