Share News

ఇద్దరు మిత్రుల కథ!

ABN , Publish Date - Apr 03 , 2026 | 01:55 AM

బుద్ధభూమి బిహార్‌ రాజకీయ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయానికి తెరపడింది. వాస్తవంలో ఆ రాష్ట్ర చరిత్రనే కొత్తగా తిరగరాసిన అధ్యాయమిది. చేయిచేయి కలిపి ఒకే కేంద్ర బిందువు నుంచి బయలుదేరిన ఇద్దరు...

ఇద్దరు మిత్రుల కథ!

బుద్ధభూమి బిహార్‌ రాజకీయ చరిత్రలో ఒక విశిష్ట అధ్యాయానికి తెరపడింది. వాస్తవంలో ఆ రాష్ట్ర చరిత్రనే కొత్తగా తిరగరాసిన అధ్యాయమిది. చేయిచేయి కలిపి ఒకే కేంద్ర బిందువు నుంచి బయలుదేరిన ఇద్దరు యువకులు, అనంతర కాలంలో తమ తీరులూ, దారులూ మార్చుకొని రాజకీయ చాణక్యంతో దేశ రాజకీయ భవితవ్యాన్ని సైతం ప్రభావితం చేసిన సందర్భానికి ఇప్పుడిక తెరపడింది. ఇద్దరిలో ఎవరు ఉన్నత శిఖరాలకు చేరారు, ఎవరు అధఃపాతాళానికి దిగజారారు అనడానికి చరిత్రే సాక్షి.

నిన్నమొన్నటి ముచ్చటే. బిహార్‌ అసెంబ్లీకి హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటంలో మరో ఘనవిజయం నమోదు చేసుకొని పాతికేళ్లలో పదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్‌కుమార్‌ పీఠమెక్కిన ఘటన ఇంకా స్మృతిపథంలోనే ఉంది. అయిదారు నెలల్లోనే రాష్ట్రంలో తనవంతు పాత్ర ముగించుకొని ఆయన రాజ్యసభకు బయలుదేరడం– అనూహ్యమే కానీ, ఆషామాషీ పరిణామమేమీ కాదు. మరో దిగ్గజ బిహార్‌ నేత లాలూప్రసాద్‌ యాదవ్‌ బుద్ధి ‘గడ్డి’తిన్న పర్యవసానంగా రకరకాల కేసుల్లో కోర్టుల మెట్లెక్కి, జైలు–బెయిళ్ల చక్రబంధంలో చిక్కి ఇదివరకే రంగం నుంచి నిష్క్రమించారు. మంచి మిత్రులుగా ప్రయాణం ప్రారంభించి, పరిస్థితుల్ని బట్టి శత్రువులుగానో, మిత్ర శత్రువులుగానో రాజకీయ జీవితాలు కొనసాగించి, చివరకు శుభం పలికిన ఈ ఇద్దరు నాయకులు... బిహార్‌పై వేసిన ముద్ర... మంచో చెడో, చెరిపివేయలేనిది. ముఖ్యంగా శాసన వ్యవస్థకు సంబంధించి చతుర్విధ (లోక్‌సభ, రాజ్యసభ, శాసనసభ, విధానమండలి) సభల్లోనూ అడుగుమోపిన అరుదైన ఘనత ఇప్పుడు నితీశ్‌కుమార్‌ సొంతం!

ఇందిరాగాంధీ ప్రభుత్వం 1975లో విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ సారథ్యంలో బిహార్‌లో ‘సంపూర్ణ విప్లవం’ పేరుతో ప్రారంభమైన అహింసాత్మక సామాజిక, రాజకీయ ఉద్యమం– యావద్దేశంలో ప్రకంపనలు సృష్టిస్తున్న సమయమది. బిహార్‌లో అప్పటి విద్యార్థి నాయకులైన లాలూప్రసాద్‌ యాదవ్‌, నితీశ్‌కుమార్‌ సైతం రంగంలోకి దూకి, చురుగ్గా చొచ్చుకెళ్లారు. చేయీ చేయీ కలిపి, చైతన్యఝరిలా ముందుకు కదిలారు.


ఇందిరకు ఘోర పరాజయ, పరాభవాలు మిగిల్చిన 1977 నాటి సార్వత్రక ఎన్నికల ద్వారానే ఇద్దరూ ఒకేసారి రాజకీయ రంగస్థలంపై అరంగేట్రం చేశారు. బిహార్‌లోని చాప్రా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు లాలూ ఎన్నికయ్యారు. తరవాత మూడేళ్లకే సోనేపట్‌ అసెంబ్లీ సీటు గెలుచుకొని, రాష్ట్ర రాజకీయాల్లో అడుగుమోపారు. మరోవైపు, నితీశ్‌కుమార్‌ మాత్రం వరుస ఓటములతో డీలాపడిపోయారు. 1977, 1980లో నలందా జిల్లాలోని హర్నౌత్‌ అసెంబ్లీ సీటుకు పోటీచేసి పరాజయాలే మూటగట్టుకొన్నారు. అయినా, మరొక్క అవకాశం కోసం ఎదురుచూడసాగారు. ఆ అవకాశం తలుపుతట్టింది. 1985లో మళ్లీ అదే సీటు నుంచి పోటీచేసి, ఘనవిజయం సాధించారు. అసెంబ్లీలో తన సత్తా చాటుకోవడం మొదలుపెట్టారు.

అది 1990 మార్చి 18. పట్నాలోని చారిత్రక గాంధీ మైదానం. బిహార్‌లో మరో చరిత్రకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైన వేదిక. ఆ రోజు లాలూప్రసాద్‌ యాదవ్‌ మొట్టమొదటిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుంటే– పార్టీ సహచరుడు నితీశ్‌కుమార్‌ చప్పట్లు కొడుతూ వెనకే నిలబడ్డారు. కానీ, ఎప్పటికీ వెనకే నిలబడిపోలేడు కదా...!

1992 నాటికి వారి స్నేహబంధం బీటలువారింది. సుపరిపాలనపై దృష్టిపెట్టాలంటూ నితీశ్‌ తరచూ చేసే సూచనలు లాలూలో అసహనం పెంచాయి. ‘నువ్వు నాకు చెప్పొచ్చేదేంటి... నాకు తెలీదా? అధికారం ఓటు బ్యాంకుతో వస్తుంది కానీ, సుపరిపాలనతో వస్తుందా...’ అంటూ తిప్పికొట్టడం మొదలైంది. ఇక పొసగదన్న నిర్ణయానికి నితీశ్‌ వచ్చేశారు.

1994 ఫిబ్రవరి 12... మళ్లీ అదే మైదానం అన్నీ యాదవులకే దోచిపెడుతున్న లాలూ ప్రభుత్వం, తమకు పూచికపుల్లపాటి విలువైనా ఇవ్వడం లేదంటూ రగిలిపోతున్న కుర్మీల వంటి ఇతర వెనకబడిన తరగతులవారు ఆ రోజు అక్కడ భారీ బహిరంగసభ నిర్వహించారు. ‘మేమేమీ బిచ్చం అడుక్కోవడం లేదు... భాగస్వామ్యం కోరుకుంటున్నాం. మా ప్రయోజనాల్ని కాదనే ప్రభుత్వం ఇంకెంత మాత్రం కొనసాగడానికి వీల్లేదు...’ అంటూ ఆ సభావేదిక పైనుంచి నితీశ్‌ చేసిన రణగర్జన– అనంతర కాలంలో బిహార్‌తో పాటు దేశ రాజకీయాల రూపురేఖల్నే మార్చేసింది.

ఆనాటి సభ తరవాత సొంతంగా సమతా పార్టీ (తరువాతి కాలంలో అదే జేడీ–యుగా మారింది) ఏర్పాటు చేసుకొన్న నితీశ్‌– తన తరహా రాజకీయాలు ప్రారంభించారు. లాలూ మాటల మాంత్రికుడు కాగా, పాచికలు విసరడమెలాగో శకుని మామకే నేర్పగల జిత్తులమారి నితీశ్‌. 2015, 2022లలో అవసరార్థ పొత్తుల్ని మినహాయిస్తే మొత్తం రాజకీయ జీవిత కాలమంతా ఎవరిదోవ వారిదే. రాష్ట్రంలో కింగ్‌లుగా, సంకీర్ణయుగంలో కేంద్రస్థాయిలో కింగ్‌మేకర్లుగా తమ శక్తి–యుక్తుల్ని ఇద్దరూ చాటుకున్నారు. కానీ, కాలం ఎప్పడూ ఒకేలా ఉండదు కదా! అవినీతి ఆరోపణలకు అనారోగ్యం తోడై లాలు రాజకీయ జీవితం పదేళ్లనాడే ముగిసిపోగా, నితీశ్‌ తన చాణక్యంతో నేటిదాకా కొనసాగగలిగారు.


నితీశ్‌, తన ‘పల్టూరామ్‌’ పేరు సార్థకం చేసుకొంటూ 2024లో ఎన్డీఏతో జట్టుకట్టారు. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయానంతరం మరోసారి పీఠమెక్కారు. గతేడాది నవంబరు 20న మళ్లీ అదే గాంధీ మైదానంలో పదోసారి బిహార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అంతలోనే అంతా వదిలేసి రాజ్యసభాముఖం పట్టడం ద్వారా రాజకీయ భూకంపం సృష్టించారు. దీంతో బిహార్‌లో ‘ఛోటాభాయ్–బడాభాయ్‌’ల శకం ముగిసింది. కానీ, తాజా పరిణామం వెనుక అంతఃపుర రహస్యం ఏమిటన్నది ఇప్పటికైతే మిస్టరీగానే మిగిలింది!

పి. దత్తారాం ఖత్రీ

సీనియర్‌ జర్నలిస్టు

ఈ వార్తలు కూడా చదవండి..

పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి.. ఇంజనీర్లను సన్మానించిన మంత్రి

పార్లమెంట్‌లో అమరావతి బిల్లు ఆమోదం.. చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

For More AP News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 01:55 AM