బాలెన్ నిర్ణయం మనకూ ఆచరణీయమే!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:24 AM
నేపాల్‌లోని విశ్వవిద్యాలయాల్లో రాజకీయ సంబంధిత విద్యార్థి సంఘాలను రద్దుచేస్తూ ఆ దేశ నూతన ప్రధాని బాలెన్ షా తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే...
నేపాల్‌లోని విశ్వవిద్యాలయాల్లో రాజకీయ సంబంధిత విద్యార్థి సంఘాలను రద్దుచేస్తూ ఆ దేశ నూతన ప్రధాని బాలెన్ షా తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనది. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశపు యువత చేతిలో పార్టీ జెండా కాదు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి. విద్యా వ్యవస్థను రాజకీయాల నుంచి వేరు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. నేపాల్ వేసిన ఈ అడుగు మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక దిక్సూచి వంటిది.
నేపాల్ రాజకీయ చరిత్రలో విద్యార్థి సంఘాల పాత్ర చాలా కీలకం. రాచరికాన్ని అంతం చేయడంలోనూ, మావోయిస్టుల తిరుగుబాటులోనూ విద్యార్థులే సైనికులుగా మారారు. అయితే, ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత అవే సంఘాలు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారి, విశ్వవిద్యాలయాలను రణక్షేత్రాలుగా మార్చాయి. ‘‘యూనివర్సిటీలు జ్ఞాన కేంద్రాలు, రాజకీయ కుస్తీ పోటీల అడ్డా కాదు. రాజకీయ బంధనాల నుంచి వాటికి విముక్తి అవసరం’’ అని ప్రధాని బాలెన్ షా స్పష్టంగా చెప్పారు. పార్టీల అనుబంధ సంఘాలను నిషేధించడం ద్వారా, విద్యార్థులు తమ మేధస్సును కేవలం అకడమిక్ అంశాలకే పరిమితం చేసేలా పునాది వేశారు.
మన దేశంలోని పలు ఉన్నత విద్యాసంస్థలు (జేఎన్‌యూ, హెచ్‌సీయూ, ఓయూ, ఢిల్లీ యూనివర్సిటీ... వంటివి) నిత్యం వార్తల్లో ఉండటానికి కారణం అక్కడి విద్యా ప్రమాణాలు కాదు, రాజకీయ గొడవలు కూడా. ఎందుకంటే, మన దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమకంటూ ఒక విద్యార్థి విభాగాన్ని కలిగి ఉన్నాయి. ఈ సంఘాలు విద్యార్థుల సమస్యల పరిష్కారం కంటే, తమ మాతృసంస్థల (రాజకీయ పార్టీల) ఎజెండాను నెరవేర్చడానికే ప్రాధాన్యం ఇస్తాయి. తమ పార్టీ వారిపై ఎవరైనా ఎలాంటి వ్యాఖ్యలు చేసినా, ఆ పార్టీ నాయకుడు వెంటనే ఆర్ట్స్ కాలేజీ దగ్గర వంద మందిని పోగేసి, కొందరు విద్యార్థులను భయపెట్టి నిరసనల్లో పాల్గొనేలా చేస్తారు. ఇలాంటి వాటితో క్యాంపస్ వాతావరణం డిస్టర్బ్ అవడమే కాదు, విద్యార్థులకూ ఇబ్బందులు తలెత్తుతాయి. ఇదే సదరు రాజకీయ గొంతుక– క్యాంపస్‌లో సమస్యలు, అనుబంధ కళాశాలల్లో ఫీజుల దోపిడీ, ఆహారంలో నాణ్యతా లోపాలపై చేసే పోరాటాల్లో మాత్రం అంతగా ధ్వనించదు! ప్రతి చిన్న రాజకీయ పరిణామానికి యూనివర్సిటీల్లో ధర్నాలు చేయడం వల్ల సామాన్య విద్యార్థులు నష్టపోతున్నారు. సెమిస్టర్లు లేట్ అవ్వడం, పరీక్షలు వాయిదా పడటం సాధారణమైపోయింది. నేపాల్ మోడల్ అమలు చేస్తే, విద్యా క్యాలెండర్ గాడిలో పడుతుంది.
రాజకీయ పార్టీల జెండాలు మోయడం వల్ల నాయకులకు పదవులు వస్తాయి తప్ప, విద్యార్థులకు ఉద్యోగాలు రావు. ఈ నిజాన్ని విద్యార్థులు గ్రహించాలి. హాస్టల్ సౌకర్యాలు లేకపోయినా, లైబ్రరీలో పుస్తకాలు లేకపోయినా ప్రశ్నించాలి. కానీ ఆ ప్రశ్న ఒక రాజకీయ పార్టీ రంగును పులుముకోకూడదు. యూనివర్సిటీ అంటే కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి. నేపాల్ నిర్ణయం వల్ల అక్కడ పరిశోధనలు పెరిగే అవకాశం ఉంది. మన యూనివర్సిటీల్లో కూడా రాజకీయాల కాలుష్యం తగ్గితేనే ‘విశ్వగురువు’ దిశగా భారత్ దూసుకుపోగలదు.
ఆకం శివసాయి (నిజామాబాద్)
ఈ వార్తలు కూడా చదవండి...
గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..
కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్
33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి
Read Latest Telangana News And AP News And International