Share News

పడిలేచిన రాజకీయ కెరటం

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:08 AM

దశాబ్దంన్నర రాజకీయ జీవితంలో అనేక కాలపరీక్షలను ఎదుర్కొని, ఒడుదుడుకులను తట్టుకుని, తనను తాను మలచుకుని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్న...

పడిలేచిన రాజకీయ కెరటం

దశాబ్దంన్నర రాజకీయ జీవితంలో అనేక కాలపరీక్షలను ఎదుర్కొని, ఒడుదుడుకులను తట్టుకుని, తనను తాను మలచుకుని అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొన్న యువనేత నారా లోకేశ్. కోట్లాదిమంది కార్యకర్తలు, మహోజ్జ్వల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఇటీవల జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన నారా లోకేశ్ రాజకీయ ప్రస్థానం నల్లేరు మీద ప్రయాణం కాదు. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేసిన అనంతరం 2009లో నారా లోకేశ్ స్వదేశానికి తిరిగొచ్చేనాటికి రాష్ట్రంలో, పార్టీలో పరిస్థితులు అనుకూలంగా లేవు. రాష్ట్రంలో వేర్పాటు ఉద్యమం ఊపందుకున్న సందర్భం అది. ప్రాంతీయ భావోద్వేగాలతో పార్టీ నాయకుల మధ్యనే అగాధం ఏర్పడిన పరిస్థితి. అటువంటి నేపథ్యంలో పార్టీలో లోకేశ్ రాజకీయ అరంగేట్రం ఒక సాధారణ కార్యకర్తగానే ప్రారంభమైంది. ఆ సమయంలో పార్టీలోకి నారా లోకేశ్ సాంకేతికతను తెచ్చారు. అప్పటివరకు సభ్యత్వ పుస్తకాల ముద్రణ, వాటిని నియోజకవర్గాలకు పంపడం, సభ్యత్వ నమోదు అనంతరం ఆ పత్రాలు పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం, వాటిని కంప్యూటరీకరించడం... ఈ ప్రక్రియ మొత్తం పూర్తికావడానికి 6 నెలలు పట్టేది. కానీ లోకేశ్‌, ప్రతి నియోజకవర్గానికి ట్యాబ్‌తో తన మనుషుల్ని పంపి సభ్యత్వ నమోదు సులభం చేశారు. అంతేగాక, సభ్యత్వం పొందిన ప్రతి కార్యకర్తకు ప్రీమియం కట్టే అవసరం లేకుండా రూ.2 లక్షల జీవిత బీమా సదుపాయం అందించే విధానానికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంలో లోకేశ్ మార్గాన్ని అనుసరించాయి.

2009లోనే లోకేశ్ మరో వినూత్న ప్రతిపాదన తెచ్చారు. అదే డైరెక్ట్ మనీ ట్రాన్స్‌ఫర్ స్కీమ్. లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా డబ్బు జమ చేసే ఈ ప్రతిపాదనకు పార్టీలోనే కొందరు నాయకులు పెదవి విరిచారు. అయినప్పటికీ ఆ ఏడాది పార్టీ ప్రణాళికలో ఈ అంశాన్ని చేర్చారు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం విజయం సాధించలేకపోవడం వల్ల లోకేశ్ ప్రతిపాదనకు ప్రాచుర్యం లభించలేదు. అయితే, 2011లో రాహుల్‌గాంధీ ఈ విధానాన్ని తెరమీదకు తెచ్చారు. దీనిపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చ జరిగి, పరిమిత పథకాల వరకూ నేరుగా డబ్బు జమ చేయడం మంచిదేనని ఆర్థికవేత్తలు అంగీకరించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రజల ఖాతాల్లోకి డబ్బు వేసే బటన్ నొక్కుతూ, అది తన ఘనతేనని ప్రచారం చేసుకున్నారు. కానీ, ఈ ప్రతిపాదన, ఆలోచన– ప్రపంచస్థాయి ఆర్థిక సంస్థలలో పనిచేసిన నారా లోకేశ్‌దే!


2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక, 2016లో రాష్ట్ర ఐటీ, గ్రామీణాభి వృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన లోకేశ్‌పై జగన్ అండ్ కో పనిగట్టుకుని కొన్ని వ్యతిరేక వార్తలు, కథనాలు వండి వార్చింది. లోకేశ్‌ను బాడీ షేమింగ్ చేశారు. ఆయనకు తెలుగురాదని, ఉచ్చారణ బాగోదనీ వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. అవినీతి మరకలు అంటించాలని చూశారు. 2019 ఎన్నికలలో మంగళగిరి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పొందిన లోకేశ్ ఇక ఆ నియోజకవర్గం దరిదాపుల్లోకి కూడా రాడని జోస్యం చెప్పారు. అయితే నారా లోకేశ్ దేనికీ కుంగిపోలేదు. నియోజకవర్గం వదిలి పారిపోలేదు. ఎక్కడ ఓడామో అక్కడే గెలవాలని గట్టిగా సంకల్పించారు. నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు, ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి మనసును తట్టారు. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని భరోసా ఇచ్చారు. ఓడిపోయినప్పటికీ ఆ ఐదేళ్లలో మంగళగిరికి నారా లోకేశ్ శాసన సభ్యుడా అన్నట్లుగా అనేక పనులు చేశారు. ఆయనను గెలిపిస్తే తమ నియోజకవర్గం రూపురేఖలు మారుతాయన్న నమ్మకం మంగళగిరి ప్రజల్లో ఏర్పడిన ఫలితంగా 2024 ఎన్నికలలో అఖండ మెజార్టీతో గెలిపించారు.

తెలుగుదేశం 2024లో అధికారంలోకి రావడానికి దోహదం చేసిన కార్యక్రమం లోకేశ్ చేపట్టిన ‘యువగళం’. ఈ పాదయాత్ర ఆయనను పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. 80 రోజుల పాటు సాగిన ఆ యాత్రలో ఆయన కలవని వర్గం అంటూ ఏదీ లేదు. రైతాంగం, మహిళలు, చేతివృత్తులవారు, యువత.. ఇలా ప్రతివారి సమస్యలను సానుభూతితో విన్నారు. సమాజపు కష్టసుఖాలు, ఏ ప్రాంతపు సమస్యలు ఏమిటో ఆయనకు అర్థం అయ్యాయి. ముఖ్యంగా పార్టీ కార్యకర్తలను నేరుగా కలుసుకోవడం వల్ల క్షేత్ర స్థాయిలో పార్టీ స్థితిగతుల్ని తెలుసుకోగలిగారు. యువగళం ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలోనే తప్పుడు కేసుతో నారా చంద్రబాబు నాయుడును నాటి ప్రభుత్వం అరెస్టు చేసి, రాజమండ్రి సెంట్రల్ జైలులో బంధించినప్పుడు లోకేశ్‌ తన పాదయాత్రకు తాత్కాలికంగా ముగింపు పలికి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. కలిసి పనిచేద్దామని ప్రతిపాదించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో చేతులు కలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ తదితరుల్ని కలిసి రాష్ట్రంలోని అరాచక పరిస్థితుల్ని వివరించారు. మరోవైపు న్యాయకోవిదులతో సంప్రదింపులు జరిపారు. జాతీయ మీడియా చానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చి, నాటి వైసీపీ ప్రభుత్వ దమన కాండను ప్రజల కళ్ళకు గట్టారు. ఇక, 2024 ఎన్నికలలో తెలుగుదేశం నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రచారంలో కీలక పాత్ర పోషించి, కూటమికి చరిత్రాత్మక విజయాన్ని చేకూర్చడంలో లోకేశ్‌ తనదైన పాత్ర పోషించారు.


కూటమి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అటు రాష్ట్రం, ఇటు పార్టీ.. ఈ రెండు శ్వాస, ధ్యాసగా చేసుకొని నిర్విరామంగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తేవడానికి స్వయంగా పారిశ్రామికవేత్తలను కలిసి వారిని ఒప్పించడం ఒక్క నారా లోకేశ్‌కే చెల్లు అన్నట్లు కృషి చేస్తున్నారు. విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి సంస్కరణలు చేపడుతున్నారు. ప్రజాదర్బార్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ అవిశ్రాంతంగా ప్రజలను కలుస్తున్నారు. కార్యకర్తలకు శిక్షణ తరగతులు అందిస్తూ పార్టీని నిత్యనూతనంగా తీర్చిదిద్దుతున్నారు. సీనియర్లను గౌరవిస్తూ, పార్టీలోకి కొత్త రక్తాన్ని ఎక్కిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నారా లోకేశ్‌ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఆశాదీపంగా కనిపిస్తున్నారు. తండ్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని అనేక దశాబ్దాల పాటు దేదీప్యమానంగా నిలబెడతారన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు.

విక్రమ్ పూల

భోగాది వెంకటరాయుడు

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 01:08 AM