చెంపచెళ్లుమనేలా నానా నటనాశైలి!
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:14 AM
‘సాలా ఏక్ మచ్ఛర్, ఆద్మీ కో హిజ్డా బనా దేతా హై!’.. ఈ సినిమా డైలాగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. మనిషి బలహీనతలు తమ గౌరవాన్ని, బలాన్ని ఎలా హరించివేస్తాయో తెలియజెప్పే ఓ...
‘సాలా ఏక్ మచ్ఛర్, ఆద్మీ కో హిజ్డా బనా దేతా హై!’.. ఈ సినిమా డైలాగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో తెలిసిందే. మనిషి బలహీనతలు తమ గౌరవాన్ని, బలాన్ని ఎలా హరించివేస్తాయో తెలియజెప్పే ఓ కఠోరసత్యాన్ని తన నటనాశైలితో చెంపచెళ్లుమనేలా చెప్పిన తీరు ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు. కథావస్తువు ఒక్కటే సక్సెస్‌కు కారణం కాదు. సరైన నటీనటులు తోడైనప్పుడే సినిమా అయినా, నాటకమైనా చిరకాలం నిలిచిపోతుంది. రంగస్థలంపై తనదైన విభిన్న నటనాశైలితో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే అద్భుతమైన నటుడు నానా పాటేకర్.
తండ్రి వ్యాపారంలో నష్టపోవడంతో, తిండి గడవని పరిస్థితుల్లో నానా పదమూడేళ్లకే పనిచేయడం మొదలుపెట్టారు. ముంబైలోని సినిమా థియేటర్లకు పోస్టర్లు గీస్తే ముప్పై ఐదు రూపాయలు వచ్చేవి. అలా పనిచేస్తూనే చదువును కొనసాగించారాయన. ఆ సమయంలో అవమానం, ఆకలి తనకు ఎంతో నేర్పించాయని, సమాజంలో భిన్న పాత్రలను అర్థం చేసుకోవడానికి ఏ యాక్టింగ్ స్కూల్‌కూ వెళ్లాల్సిన అవసరం రాలేదని అంటాడు నానా. ముంబైలోని రహేజా స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో, సర్ జె.జె.ఇన్స్టిట్యూట్ నుంచి అప్లైడ్ ఆర్ట్స్ (చిత్రకళ)లో పట్టభద్రుడయిన తర్వాత అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ, రంగస్థలంపై తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. పాత్రలో లీనమైపోవడమే సహజమైన నటన అని నమ్మిన నానా పాటేకర్, నాటక రంగ వృత్తిలోకి ప్రవేశించడం యాదృచ్ఛికంగా జరిగింది. 1970లో ఒక మరాఠీ నాటక రిహార్సల్స్ జరుగుతుండగా స్నేహితుడిని కలవడానికి వెళ్లి, ఆ నాటక దర్శకుడి కోరిక మేరకు ఒక పాత్రలో నటించారు. రాష్ట్రస్థాయి పోటీలో ఉత్తమ నటుడి అవార్డు ఆయనను ప్రొఫెషనల్ నటుడిగా మార్చింది. పూణేలోని కళాశాల నాటక సంస్కృతితో మమేకమై ప్రయోగాత్మక నాటకాలలో రాణించారు. ‘పురుషోత్తం కరందక్’ అనేది ఒక ప్రసిద్ధ నాటక పోటీ కార్యక్రమం. ఇది ఆ తరానికి ఒక ప్రసిద్ధ శిక్షణా కేంద్రం. నానా పాటేకర్‌తో పాటు స్మితా పాటిల్, రోహిణి హట్టంగడి, సోనాలి కులకర్ణి, జబ్బర్ పటేల్, సతీశ్ అలేకర్, మోహన్ గోఖలే వంటి వారు తమ నటనకు మెరుగులు దిద్దుకున్నది ఇక్కడే. అక్కడ ‘ఆవిష్కార్’ నాటక సంస్థతో నానా అనుబంధం సాగింది.
నానా పాటేకర్ రంగస్థల జీవితంలో జయవంత్ దళ్వీ ‘పురుష్’ నాటకం ప్రత్యేకమైనది. అవినీతిపరుడు, రాజకీయ అధికార మదంతో విర్రవీగే ప్రతినాయకుడిగా గులాబ్‌రావు భూమికను నానా పోషించారు. పాత్రలోని క్రూరత్వం, నవ్వులో వ్యంగ్యం, అహంకారాలను అత్యంత సహజమైన రీతిలో, అతిసాధారణ సంభాషణలతో ప్రదర్శిస్తారు నానా. ‘పురుష్’ నాటకాన్ని ఏకధాటిగా 16 సంవత్సరాల పాటు 1,860 ప్రదర్శనలు ఇవ్వడం భారతీయ నాటక చరిత్రలో ఒక మైలురాయి. 1979లో అనిల్ బార్వే ‘హమీదాబాయిచీ కోఠీ’ అనే నాటకం మరాఠీ నాటక రంగంలో ఒక సంచలనం. ఈ నాటకానికి విజయా మెహతా దర్శకత్వం వహించారు. ఇందులో నానా పాటేకర్ ఒక దళారి పాత్రను పోషించి, కపటత్వం, స్వార్థం, రంగులు మార్చే ఊసరవెల్లి లక్షణాలను తనదైన శైలిలో ఆవిష్కరించారు.
దర్శకురాలిగా విజయా మెహతా నటులను తీర్చిదిద్దే నేర్పు నానా నటనా పరిణతికి ఎంతగానో దోహదపడింది. ఆమె దర్శకత్వంలోనే నానా పాటేకర్ 1979లో ‘మహాసాగర్’ నాటకాన్ని ప్రదర్శించారు. అది మరాఠీ నాటకరంగంలో మరో సంచలనం. విక్రమ్ గోఖలే, నీనా కులకర్ణి, భరతి ఆచ్రేకర్ తదితరులతో కలిసి ఆయన నటించిన ఈ నాటకం సుదీర్ఘకాలం ప్రదర్శితమైనవాటిలో ఒకటి. మెహతా నాటకాలు వాటిలో నాటకీయత కంటే నటులు, పాత్రల చుట్టూ కేంద్రీకృతమై ఉండేవి. ఈ విధానం నానా సహజ సామర్థ్యాలకు బాగా సరిపోయింది. నాటక సృజనలో ‘నేను ఒక శిశువును సృష్టిస్తాను, ప్రేక్షకులు దానికి ప్రాణం పోస్తారు’ అని విజయా మెహతా అంటారు. నానా పాటేకర్ పరిపూర్ణ నటుడిగా మారడానికి ఆమె
మార్గదర్శనం తోడైంది. మహారాష్ట్రలో బలమైన సాహిత్య సంప్రదాయం, సామాజిక చైతన్యం, నాటక రచనకు ఉన్న ప్రాధాన్యం, ప్రయోగాత్మక రంగస్థల ధోరణులు అక్కడి నటులను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకున్న నానా ‘ససా ఆణి కాసవ్’, ‘గౌరాయీ’ వంటి నాటకాలు ప్రదర్శించారు.
విజయ్ టెండూల్కర్ ‘పాహిజే జాతీచే’ అనే పదునైన వ్యంగ్య నాటకంలో నానా పాటేకర్ ‘బాబ్న్యా’ పాత్రను పోషించారు. కులం, అధికారం, ప్రేమ వంటి అంశాలను లోతుగా ఆవిష్కరించిన నాటకం ఇది. దీని ప్రదర్శన చూడటానికి వెళ్లిన సినీ దర్శకుడు జబ్బర్ పటేల్... యువ నానా పాటేకర్ హాస్యం, రాజకీయాలు, యవ్వనపు గందరగోళాలను ఎంతో సునాయాసంగా సమతుల్యం చేస్తున్న తీరుకు అబ్బురపడి తన సినిమాలో ఒక పాత్ర చేయమన్నాడు. అలా 1979లో పటేల్ తీసిన ‘సింహా సన్’లో పాటేకర్ నటించారు. నాటకమే లోకంగా జీవిస్తున్న ఇతడిని సినిమా రంగంలోకి ప్రోత్సహించింది స్మితా పాటిల్. అంతకుముందే ‘గమన్’ చిత్రంలో నటించిన ఆయన... ‘అంకుశ్’ (1986), ‘ప్రతిఘాత్’ (1987), ‘మోహ్రే’ (1987), ‘త్రిషాగ్ని’ (1988), ‘అవామ్’ (1987) వంటి చిత్రాలలో నటించారు. మీరా నాయర్ చిత్రం ‘సలామ్ బాంబే’ (1988)లో ఆయనది గుర్తుండిపోయే పాత్ర. 1989లో వచ్చిన ‘పరిందా’ నానా కెరీర్లో గొప్ప మైలురాయి. ‘క్రాంతివీర్’, ‘ప్రహార్’, ‘నట్‌సామ్రాట్’, ‘ప్రకాశ్ బాబా ఆమ్టే’ వంటి సినిమాలు నానా నటనా ప్రతిభకు అద్దంపట్టాయి. మరాఠీ నాటకరంగం నుంచి ఎదిగి, అనంతర కాలంలో భారతీయ సినిమాకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచి, వెండితెరపై మనలను అలరించిన నానా పాటేకర్ మరణంతో దేశం ఓ గొప్ప నటుడిని కోల్పోయింది.
డా. జె.విజయ్‌కుమార్ జీ
తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షులు
ఈ వార్తలు కూడా చదవండి..
స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. కూటమి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
మహిళలు స్వయంకృషితో ఎదిగేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత: నారా భువనేశ్వరి
ద్వారకా తిరుమలలో 21 నుంచి 28 వరకు బ్రహ్మోత్సవాలు
Read Latest AP News And Telangana News And National News