Share News

నాటి సంస్కరణోద్యమాల్లో స్త్రీ స్వరాలు

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:57 AM

మన దేశంలో జరిగిన సంస్కరణోద్యమాలు లేవనెత్తిన ప్రశ్నల్లో ప్రధానమైనవి స్త్రీల పట్ల జరిగిన అన్యాయాల గురించే. ఐతే, ఆ ఉద్యమాల ప్రస్తావనలో ముందుగా గుర్తొచ్చేవి కొందరు పురుష సంస్కర్తల పేర్లే...

నాటి సంస్కరణోద్యమాల్లో  స్త్రీ స్వరాలు

మన దేశంలో జరిగిన సంస్కరణోద్యమాలు లేవనెత్తిన ప్రశ్నల్లో ప్రధానమైనవి స్త్రీల పట్ల జరిగిన అన్యాయాల గురించే. ఐతే, ఆ ఉద్యమాల ప్రస్తావనలో ముందుగా గుర్తొచ్చేవి కొందరు పురుష సంస్కర్తల పేర్లే. ఆధునిక విద్య, సామాజిక హోదా కలిగిన పురుషులకు మాత్రమే వాటిని చేపట్టగల అవకాశం ముందుగా దొరకటమన్నది సహజమే. వారి కృషి విలువైనదీ, స్త్రీలకు ఎంతో ప్రయోజనకరమైనదీ కూడా. కానీ ఆ ఉద్యమాల చరిత్రలో స్త్రీలను బాధితులుగా, లబ్ధిదారులుగా మాత్రమే అంచనా వెయ్యటాన్ని తరచుగా చూస్తుంటాం.

ఆ అంచనా సరైనదేనా? వలస పాలనలోని ఆంధ్రదేశంలో సంస్కరణోద్యమాలకు స్త్రీలు ఎలా స్పందించారు? ఆ ఉద్యమాల దృక్పథాలను వారు పూర్తిగా అంగీకరించారా? కొత్త అవగాహనను ప్రతిపాదించారా? ఉద్యమాల నిర్వహణలో వారి పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు ప్రధాన స్రవంతి చరిత్రలో దొరికే జవాబులు స్వల్పం. వాటికి సమాధానాలు వెదికే ప్రయత్నమే– మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రొఫెసర్ షేఖ్ మహబూబ్ బాషా చేసిన పరిశోధన.

‘స్క్రిప్టింగ్ ఎ న్యూ జెండర్ పొలిటిక్: తెలుగు విమెన్స్ జర్నల్స్ 1883–1960’ (ఓరియంట్‌ బ్లాక్‌స్వాన్‌ ప్రచురణ, 2025) అనే ఈ పరిశోధనా గ్రంథంలో పై విషయాలను ఐదు అధ్యాయాల కింద విభజించి పరిశీలించారు. ముఖ్యంగా ఎనిమిది దశాబ్దాల కాలంలో వెలువడిన స్త్రీల పత్రికలను ఆధారం చేసుకుని ఈ పరిశోధన సాగింది.

స్త్రీల కోసం ప్రారంభమైన తొలి పత్రిక ‘సతీహిత బోధిని’ (1883) కందుకూరి వీరేశలింగం నిర్వహణలో, రెండవ పత్రిక ‘తెలుగు జనానా’ (1893) రాయసం వెంకట శివుడు సంపాదకత్వంలో వెలువడినాయి. స్త్రీవిద్య, బాల్యవివాహాల రద్దు, గృహ నిర్వహణలో స్త్రీల నైపుణ్యాన్ని పెంచటం వంటి అంశాలను ఈ పత్రికలు చర్చించాయి, స్త్రీల రచనలను ప్రోత్సహించాయి. ఐతే, ఈ వాదనల్లో పురుష సంస్కర్తల దృక్పథానికి, తర్వాతి రోజుల్లో స్త్రీలు స్వయంగా తమ సమస్యలను మాట్లాడిన తీరుకు స్పష్టమైన భేదం ఉండటాన్ని ఈ పరిశోధన గ్రంథం ఎత్తి చూపింది.


దేశంలో కొత్తగా ఏర్పడుతున్న పెట్టుబడిదారీ ఆధునికతకు ప్రతినిధులుగా విద్యావంతులైన పురుష సంస్కర్తలు స్త్రీలపై భూస్వామ్య వ్యవస్థ విధించిన కొన్ని ఆంక్షలను, దురాచారాలను వ్యతిరేకించటం ప్రగతిశీలమైన అంశమే అన్నది కాదనలేం. ఐతే, ఈ కొత్త వ్యవస్థ కూడా పితృస్వామికమైనదే, కుటుంబ నిర్మాణాన్ని కాపాడుకోవటమనే ప్రాధాన్యానికి లోబడినదే. కాబట్టి అది కుటుంబ ప్రయోజనాలకు భంగం కలగనంత వరకే స్త్రీల స్వేచ్ఛను అనుమతిస్తుంది. ఆ లక్షణం ఈ సంస్కరణల్లో ప్రతిచోటా కనబడుతూనే ఉన్నప్పటికీ, సంప్రదాయ వాదుల నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కోక తప్పలేదు. అందుకు పురుష సంస్కర్తలు ఒక ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకున్నారు. బాలికా వివాహాలు వేదకాలంలో లేవని; స్త్రీ విద్య, వితంతు పునర్వివాహాలూ వేద విహితమేనని ప్రామాణికంగా ఆధారాలను చూపుతూ సంప్రదాయ పండితులను ఒప్పించాలని ప్రయత్నించారు. స్త్రీలు విద్యా వంతులైతే కుటుంబాలను మరింతగా చక్కదిద్దుకుంటారని హామీ ఇచ్చారు. తమ సంస్కరణల ద్వారా రూపొందిన స్త్రీలు, ఆధునిక భావాలున్న పురుషులకు అనుకూలవతులైన భార్యలుగా, కుటుంబాలను సుస్థిరం చేయటానికి పరిమితం అవుతారే తప్ప, వాటి భద్రతను భంగపరచబోరని ఈ సంస్కర్తలు నాటి సమాజానికి భరోసా ఇచ్చారు. వీరేశలింగం వ్యాసాలు, కాల్పనిక సాహిత్యమూ ఈ ధోరణిలో సాగినవే.

స్త్రీలు నిర్వచించిన సంస్కరణల స్వరూపం ఇందుకు భిన్నమైనది. స్త్రీల చదువుకు పరమార్థం కుటుంబ నిర్వహణ, పాతివ్రత్యమూ కాదనీ, అది జ్ఞానాన్ని పొందటం కోసమూ, సామాజిక అభివృద్ధిలో భాగమవటం కోసమూననీ కనుపర్తి వరలక్ష్మమ్మ రాశారు. బాల్యవివాహాలను వేదాలు అంగీకరించాయా లేదా అన్నది విషయం కాదనీ, వాటివల్ల స్త్రీల శారీరక ఆరోగ్యం, బౌద్ధిక వికాసం కుంటుపడతాయి కాబట్టి అవి తగవనీ వాదించారు. మైదవోలు పద్మావతీ దేవి, వేదుల మీనాక్షీ దేవి, చెరుకూరి నాగభూషణమ్మ, నండూరి కామేశ్వరి వంటి మహిళలు స్త్రీలపై ఇంటాబయటా సాగే పురుషాధిపత్యాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు. ఉద్ధరణ కోసం ఎదురుచూసే పీడితుల స్థితిని దాటి, చట్టబద్ధమైన హక్కులను డిమాండ్ చేశారు. ఇంటిపనికి ఆర్థిక వేతనం ఉండాలని, స్త్రీలపై విధించే నైతిక నియమాలను పురుషులకు కూడా వర్తింపచెయ్యాలని తీవ్ర స్వరంతో నిలదీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా సజావుగా సాగిన ప్రయాణమేమీ కాదు, సంప్రదాయ వాదులైన పురుషుల నుంచి, స్త్రీలనుంచి కూడా దాడులను ఎదిరించి నిలిచారు.

సంస్కరణోద్యమాల్లోని పరిమితులపై గురజాడ, చలం వంటి తరువాతి తరాల రచయితలు, సామాజిక ఉద్యమకారులు చేసిన విమర్శలు కూడా విలువైనవే. కానీ, స్త్రీల ఆరోగ్యం, పరిసరాల శుభ్రత, వారిపై ఇంటిపని భారం వంటి విషయాలపై సంస్కర్తల శ్రద్ధను, అంకితభావాన్ని తక్కువ చెయ్యటానికి వీల్లేదు. ఈ అంశాలను వీరేశలింగం, టి. రాజగోపాలరావు, వెంపటి శారదా దేవి వంటి వారు ఎంత శాస్త్రీయంగా సూక్ష్మ పరిశీలన చేశారో ఈ పుస్తకంలో చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది.


మహబూబ్ బాషా గారి పరిశోధన ఆ చరిత్రనంతటిని నమోదు చెయ్యటమేగాక, కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. పద్నాలుగేళ్లలోపు బాలికల వివాహాలకు వ్యతిరేకంగా శారదాచట్టం వచ్చినప్పుడు వేలాది తల్లిదండ్రులు ముహూర్తాలు కూడా చూడకుండా ఏడాది దాటని పసిపాపలకు కూడా పెళ్లిళ్లు చేయటాన్ని ఈ గ్రంథంలో చదువుతాం. అంటే, హక్కుల కొరకు చట్టాలు ఎంతో అవసరమే అయినప్పటికీ, ఆ కొత్త మార్పులను స్వీకరించే సంసిద్ధత సమాజానికి లేకపోతే, మరింత ప్రమాదకరమైన పరిణామాలు ఏర్పడగలవని ఈ పరిశోధన చేసిన హెచ్చరిక ఎప్పటికీ అవసరమైనదే.

ఈ పరిశోధనలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఇక్కడ ప్రస్తావించిన ప్రతి విషయానికి సాధికారికమైన ఆధారాలను, అరుదైన ఫోటోలను చూపటం. ఉదాహరణకు వితంతు పునర్వివాహాల సంఖ్యను చెప్పటమే కాకుండా ఆ వధూవరుల పేర్లు, కులాలు, శాఖలు, అవి జరిగిన ప్రాంతాల వివరాలను పది పేజీల పట్టికలుగా ఇచ్చారు. వీటి ఆధారంగా ఆయా కులాల్లో ఈ సమస్య తీవ్రతను, మార్పుకు ఏ మేరకు సానుకూలత వ్యక్తమయిందన్న విషయాన్ని అంచనా వెయ్యవచ్చు.

ఇలా, గత చరిత్రను భిన్నమైన దృక్పథంతో చూపుతూనే, భవిష్యత్ ప్రతిపాదనలను చేస్తున్న ఈ పుస్తకాన్ని విస్తృతంగా చదివి, చర్చించాల్సిన అవసరం ఉన్నది.

కాత్యాయని

ఈ వార్తలు కూడా చదవండి..

క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు

ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 04:57 AM