Share News

Mucharla Satyanarayana Poet: ఉద్యమ కారణజన్ముడు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:39 AM

‘‘మూల విగ్రహాలు మూలల్లో పడివుంటే, ఉత్సవ విగ్రహాలు ఊరేగుతుంటాయి’’ అనేది నిజమే అనిపిస్తుంది, చరిత్రలో మహాశక్తుల వంటి వ్యక్తులను అధ్యయనం చేస్తుంటే. ఆయన పాటల్లో పర్జన్య గర్జనలుంటాయి,,

Mucharla Satyanarayana Poet: ఉద్యమ కారణజన్ముడు

‘‘మూల విగ్రహాలు మూలల్లో పడివుంటే, ఉత్సవ విగ్రహాలు ఊరేగుతుంటాయి’’ అనేది నిజమే అనిపిస్తుంది, చరిత్రలో మహాశక్తుల వంటి వ్యక్తులను అధ్యయనం చేస్తుంటే. ఆయన పాటల్లో పర్జన్య గర్జనలుంటాయి. ఆశయసిద్ధికి త్రికరణశుద్ధి ఉంటుంది. భావాలు సత్యాలై వెల్లివిరుస్తాయి. తెలంగాణ పదాలు ముత్యాల్లా మెరుస్తాయి. భయ, సంకోచ రాహిత్యంతో ఆ పాటలు వ్యతిరేకులను బెంబేలెత్తిస్తాయి. ఆ ప్రజాకవి, వాగ్గేయకారుడు, నిఖార్సైన ప్రజానాయకుడు సంగంరెడ్డి (ముచ్చర్ల) సత్యనారాయణ. రాజీలేని తెలంగాణ ఉద్యమ సమరయోధుడై, ఆంధ్రుల్లోని ఆధిపత్య ధోరణులపై కవిత్వ సమరం, రాజకీయ సమరం రెండూ సాగించిన చతురుడాయన.

1933 జనవరి 21న– తెలంగాణలోని హన్మకొండను ఆనుకుని ఉన్న ముచ్చర్ల గ్రామంలో నర్సమ్మ, నర్సయ్యలకు జన్మించారు సత్యనారాయణ. చిన్నతనంలో సత్తెకాలపు మనుష్యుల మధ్య, ప్రాకృతిక జీవన పరిమళాల మధ్య సత్తెన్న జీవితం గడిచింది. ముచ్చర్లలో ప్రాథమిక విద్య, హన్మకొండలో పాఠశాల విద్య, భాగ్యనగరంలో ఉన్నత విద్యను అభ్యసించారు. సంగీతంతో తొలినాళ్ళ నుండే పరిచయం, హార్మోనియం వచ్చు. సమయ సందర్భాల్లో పెద్దల వద్ద పాటలు పాడి జనాకర్షణ పెంచుకున్నారు. ‘కౌలుదార్ బుర్రకథ’ రాశారు. బీసీ హాస్టల్‌లో తోటి విద్యార్థుల అసౌకర్యాలకు చలించి సమస్యల్ని పరిష్కరించే ధీరుడయ్యారు. సంగీతంలో కళాశాల విద్యలో ఒక సంవత్సరం అభ్యసించి దానిని వదలి, ఉస్మానియా విశ్వవిద్యాలయ కళాశాలలో చేరి, సంస్కృతం, ఆర్థిక శాస్త్రం, తెలుగు అంశాలున్న బీఏ పట్టా సాధించారు. సంస్కృత భాషా సంఘాన్ని స్థాపించిన తెలుగు కవి ఆయన. ఓరుగల్లులో జరిగిన నాన్ ముల్కీ ఉద్యమాన్ని దృఢపరచిన కార్యక్రమశీలి. అయ్యదేవర, తెన్నేటి, బూర్గుల వంటివారు సైతం తెలంగాణను ఏ మాత్రం వ్యతిరేకించి తక్కువపరచినా గోబ్యాక్ నినాదాలు చేసి, చేయించిన ఉద్యమ రక్తశీలం ఆయనది.


‘‘తెలంగాణ సోదరా! తెలుసుకో నీ బ్రతుకు/ మోసపోతివా నీవు గోసపడుతావు/ చావుబ్రతుకుల మధ్య సాగుతున్నది నావ/ ఏ దరికి చేర్చేవో సోదరా నీ నావ/ ఆంధ్రులతో కలసి నీవడుగంటి పోతావో/ ప్రత్యేకమై వుండి బ్రతుకు సాగిస్తావో/ ప్రతిభ చూపిస్తావో’’ అనే ప్రబోధ పాటలో భాష అందరికీ ఒకటి వుండడం కాదు, ముఖ్యం– బతుకంటూ ఒకటి వుండాలని ప్రజల బతుకులకై ఆరాటపడిన ఆర్థిక దృష్టి గల క్రాంతదర్శి. తెలంగాణ వ్యతిరేకులైన ఆంధ్రుల్ని తీవ్రంగా విమర్శించిన కవే కాక, తెలంగాణ ప్రజలు పోరాట పటిమలో ఏ మెళకువలు కలిగి వుండాలో కాలావసర విషయాల్ని ప్రబోధించిన ఆలోచనాశీలి.

‘జాజిరి జాజిరి రావోయ్ రావోయ్ మర్రి చెన్నారెడ్డి, సంజీవరెడ్డి మామా...’, ‘తెలంగాణ సోదరా’ వంటి పాటలు ఆయా కాలాల్లో, సందర్భాల్లో జనం నెత్తిమీద పెట్టుకుని– ఆధిపత్యంపై, దోపిడీపై తమ సమర చైతన్యాన్ని పెంచుకోగలిగారు. జాజిరి పాటలో ‘‘బాస ఒక్కటి బ్రతుకు ఒక్కటి/ కట్టు ఒక్కటి బొట్టు ఒక్కటి/ తోడు ఒక్కటి జోడు ఒక్కటి/ ఒక్కటొక్కటని కనికట్టు కట్టిరి’’ అంటూ ప్రతిపక్షుల సమర్థనలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.

మరొక ముఖ్యమైన పాటలో ‘‘పట్టణాల్లో చూడు మెట్టభూములు చూడు/ ఆఫీసులో చూడు ఆఫీసరును చూడు/ ఆంధ్రమయమే అంత, అంధకారమంత/ తెలంగాణ రక్షణలు తేల్చుకుందామురా’’ అంటూ విస్పష్టంగా వాచ్యంగా తెలంగాణ ప్రజలకు ఆనాళ్ళల్లో ప్రబోధించిన ఉద్యమ కాహళి ఆయన. సూటి విమర్శ, ఘాటు మాటలు కలిగి వుండడమే కాదు, ప్రాజెక్టుల విషయాలు తరచూ ఆయన పాటల్లో వుండి, ఆర్థిక అవగాహనను, అధ్యయనాన్ని పొదిగించుకున్నాయి. చిన్న, పెద్ద తెలంగాణోద్యమ భావ వేదికలపై సత్యనారాయణగారి పాటలు సభలో భాగంగా కాక, ముఖ్య భాగంగా ఉండడం ప్రజల చైతన్యం వల్లే జరిగింది.


ముచ్చర్ల సత్యనారాయణ తెలంగాణ ఉద్యమంలో కవిగా ఎంత పాత్ర వహించారో, అంత పాత్రా రాజకీయ క్రియా కార్యక్రమాల్లో వహించడాన్ని చరిత్ర గమనించకుండా ఉండదు. ఆయన నటుడు. చక్కని కళాకారుడు. ఒకసారి మధిరలో నాటక పోటీలు జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా కొన్ని సంస్థలు వచ్చాయి. వీరు నిర్వహించిన ప్రదర్శన చూసి, ఆంధ్ర ప్రాంతీయులు ‘మా రఘురామయ్యను సత్యనారాయణ మరపించేలా పాడారు, నటించార’న్నారట. వాణీనికేతన్ సంస్థకు సేవ చేసిన ఈయన, రాజకీయ కార్యక్రమాల వల్ల కళలకు కొంత దూరమయ్యారు.

తొలి, మలి తెలంగాణ ఉద్యమాల్లో సత్యనారాయణ క్రియాశీలక పాత్రలో– కాల్పులు, అరెస్టులు, కారాగారాల్లో ఎందరినో పెట్టడం, కొందరిని చంపడం వంటివెన్నో చూశారు. ప్రజాపక్ష ప్రేమికులై, ఎందరినో రక్షించడానికి స్వయంగా పాత్ర వహించారు. విద్యార్థుల హాస్టళ్ళలో కొన్ని అన్యాయాలను అరికట్టారు కూడా. విద్యార్థి నాయకునిగా, ఉద్యమ నాయకునిగా, పంచాయతీ సమితి నాయకునిగా, రాష్ట్ర మంత్రిగా... ఇలా ఏ పదవులు చేపట్టినా అవి కిరీటధారణలని కాక, ప్రజాసేవా మార్గ స్థానాలని మాత్రమే నమ్మిన నూరుపాళ్ళ ప్రజాభిమాని ఆయన. హయగ్రీవాచారి వంటి వారిపై ఎన్నికల్లో ఆయన నెగ్గడానికి ధనం గాక జనం మాత్రమే కారణం. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి సత్యనారాయణకు రవాణాశాఖా మంత్రి పదవి ఇచ్చారు. తరువాత ఎన్టీఆర్‌తో విభేదాలు పెరిగాయి. ఇమడలేక, నియంతృత్వ ధోరణి ఇష్టం కాక, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘బహుజన సమాజ్ పార్టీ’ పెట్టిన కాన్షీరాంతో కొంతకాలం కలిసి పనిచేశారు. ఆయన రాజకీయ ప్రస్థానాల్లో ఎన్నో స్థానాలు మారాయి. తెలంగాణ ఉద్యమానికి చెందిన సిద్ధాంత సృజనకారకునిగా మంచి పేరున్న జయశంకర్‌– సత్యనారాయణకు మంచి మిత్రులు. ప్రత్యేక తెలంగాణకు ఇద్దరూ కృషి చేసినవారే.


కేసీఆర్‌ తన ఉద్యమ పక్షానికి ముచ్చర్ల వారి ఆశీస్సులు, అభినందనలు తీసుకున్నా ఆలోచనా ధోరణుల్లో కొన్ని విభిన్న అంశాలున్నాయి. కేసీఆర్ ఉద్యమశీల లక్షణాలను సత్యనారాయణ కావలసిన పాళ్ళలో ప్రశంసిస్తున్నా, అవలక్షణాలనూ విమర్శించేవారు. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు వంటి అగ్రశ్రేణి నాయకుల విషయాల్లో నిజాలను నిర్భయంగా బహిరంగ పరచుకొనేవారు. తన సమకాలీనులైన హేమాహేమీలను సత్యనారాయణ నిర్ద్వంద్వంగా విమర్శించడానికి నేపథ్య భూమికలు నీతి నిజాయితీలే. ‘‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో యాస, బాస తెలిసిన మాటకారి కేసీఆర్ అనేది వాస్తవం. ఆయన తెలివికలవాడు. తెలివైన మోసగాడు కూడా. ఎన్టీఆర్‌లోని అహంకారం, చంద్రబాబులోని నియంతృత్వ ధోరణి రెండూ కేసీఆర్‌లో కలగలసి పోయాయి’’ అని తీవ్ర విమర్శ చేశారు సత్యనారాయణ.

2016 అక్టోబరు 10న భౌతిక దేహాన్ని వీడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ వైతాళిక స్థాయి నందుకొన్నారు సత్యనారాయణ. పురాణాల్లో కారణజన్ముడంటూ వుండవచ్చు, ప్రజాస్వామ్య ఉద్యమ సమరాల్లో ఎవరో ఒకరు కారణజన్ముడుగా వుండే వీలుండదు. ఉద్యమ సమరశీల భాగస్వాములంతా కారణజన్ములే. ముచ్చర్ల సత్యనారాయణ తెలంగాణ చారిత్రక ఉద్యమ ముఖ్య కారణజన్ముడు. దాచేస్తే దాగని నగ్న చరిత్ర సత్యాల పుట్ట ఆయన జీవితం.

సన్నిధానం నరసింహశర్మ

(కవి, సాహితీవేత్త)

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 12:39 AM