సంగీత సామ్రాజ్ఞి
ABN , Publish Date - Sep 16 , 2026 | 02:28 AM
పాఠశాల ఆవరణలో తోటి పిల్లలతో ఓ పదేళ్ళ అమ్మాయి ఆడుకుంటోంది. ఎవరో వచ్చి బట్టలకు చేతులకు అంటుకున్న దుమ్ము దులిపి తీసుకువెళ్ళి వేదిక మీద వీణావాదన చేస్తున్న తల్లి పక్కన కూర్చోబెట్టారు....
పాఠశాల ఆవరణలో తోటి పిల్లలతో ఓ పదేళ్ళ అమ్మాయి ఆడుకుంటోంది. ఎవరో వచ్చి బట్టలకు చేతులకు అంటుకున్న దుమ్ము దులిపి తీసుకువెళ్ళి వేదిక మీద వీణావాదన చేస్తున్న తల్లి పక్కన కూర్చోబెట్టారు. ఆ పాపను దగ్గరగా తీసుకున్న తల్లి పాడమని చెప్పింది. ఏవో రెండు పాటలు రాగరంజితంగా పాడిందా చిన్నారి. పసివయసులోనే పాప ప్రావీణ్యతకు అక్కడున్నవారంతా సంభ్రమాశ్చర్యాలతో అభినందించారు. అయిదు దశాబ్దాల తర్వాత– ఒక అంతర్జాతీయ సంగీత వేదిక ఎందరో విశ్వఖ్యాతి గాంచిన సంగీతజ్ఞలతో నిండి ఉంది. ఆ వేదికపై అప్పుడే ‘ఆమె’ కచేరీ ముగిసింది. తన్మయభావనతో అందరికళ్ళలోనూ ఓ స్వచ్ఛమైన ఆధ్యాత్మిక వెలుగు కనబడుతోంది. ఆమె తర్వాత సుప్రసిద్ధ సంగీతకారుడు జుబిన్ మెహతా కచేరీ చేయాలి. ఆయన కనీసం 150 వాయిద్యాలతో వేదికను అలంకరించి కచేరీ చేస్తారు. కానీ ఆరోజు ఆయన వేదికను ఎక్కడానికి సంకోచించారు. ఒకేఒక్క స్వరంతో వేలమంది సంగీతాభిమానులను పారవశ్యంలో తేలియాడించిన ఆమె ప్రతిభ ముందు తన వందలాది వాద్యసమ్మేళనం ఏ పాటిదిగా నిలుస్తుందని ఆయన సందేహం. వేదిక దిగుతున్న ఆమె ముందు జుబిన్ మెహతా భక్తి వినయాలతో నిలిచి చేతులు జోడించి తర్వాత వేదిక నెక్కారు. ఆ పదేళ్ల అమ్మాయి, ఆమె ఇద్దరూ ఒకరే: అనితర సాధ్య గాత్ర సంగీత సామ్రాజ్ఞి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.
1916 సెప్టెంబర్ 16న మధురైలో జన్మించిన ఆమె కళావంతుల వర్గానికి చెందినవారు. అసలు పేరు కుంజమ్మ. అమ్మమ్మ అక్కమ్మాల్ వయోలిన్ వాదకురాలు. తల్లి షణ్ముఖ వడువు వీణావాదన. తరచూ ఇంట్లో జరిగే సంగీత చర్చలు ఆమెను కళా ప్రపంచంలోకి తీసుకువచ్చాయి. ఉత్తర భారతదేశంలో వీరిని ‘బాయీస్’ (bais) అని పిలిచేవారు. 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో ఉత్తర భారత సంగీత వేదికలను కేసర్ బాయి, మొగుబాయి, రసూలన్ బాయి, హీరాబాయిలు ఎలా ఏలారో దక్షిణాన కూడా అదే రీతిలో దేవదాసీ వర్గానికి చెందిన బెంగుళూరు నాగరత్నమ్మ, మద్రాస్ లలితాంగి, కంచి జయమ్మాళ్, కోయంబత్తూర్ తాయి, సేలం గోదావరి వంటివారు కళారంగాలను ఏలారు. ఈ పరంపరలో కె.బి. సుందరాంబాళ్, ఎస్.డి. సుబ్బులక్ష్మి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి, ఎం.ఎల్. వసంతకుమారి వంటివారు దక్షిణ భారత శాస్త్రీయ సంగీతాన్ని ముందుకు నడిపించారు. ‘బెనారస్ బాయ్స్’లాగే అపారమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం కలిగిన ఈ గాయనులు అప్పటివరకు పురుషాధిక్యంగా ఉన్న సంగీత కచేరీలను ఏలి స్వతంత్ర భారతదేశపు సంగీత కచేరీ విధానాన్ని పునర్నిర్వచించారు. దేవదాసీల కళాత్మక పరంపర, లౌకిక – దైవిక ‘ప్రేమ’ అనే అంశమూ ఎమ్మెస్ గాత్రంలో ముడివడి వారి సౌందర్య శక్తికి మూలంగా నిలిచింది. దీనికి తోడు శ్రుతిని పట్టుకోవడంలో జన్మతః వచ్చిన నైపుణ్యం, లయపై పట్టుతో శబ్దాలలోని కఠినత్వాన్ని సున్నితంగా మార్చే సామర్థ్యం వారి ప్రత్యేకతలు.
1940లో స్వాతంత్ర్య సమరయోధుడు, టి. సదాశివంతో వివాహం ఎం.ఎస్ జీవితంలో ఒక మహత్తరమైన మలుపు. అది దక్షిణ భారత సంగీతాన్ని నడిపించింది. కస్తూర్బా మెమోరియల్ ట్రస్ట్ కోసం ఎం.ఎస్. ఉత్తర భారతదేశమంతటా విరాళాల సేకరణకు కచేరీలు చేయడం వల్ల గాంధీ, నెహ్రూ, సరోజినీ నాయుడు, రాజేంద్ర ప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి నాయకులు ఆదరించారు. ఫలితంగా ఎం.ఎస్. ఉత్తర భారత శ్రోతలకు, కేంద్ర రాజకీయ వర్గాలకు పరిచయమైంది. సిద్ధేశ్వరిదేవి వద్ద ఎమ్మెస్ టుమ్రీలు, ఖయాల్స్ నేర్చుకోగా, గురువు శెమంగుడి శ్రీనివాస అయ్యర్ ఆమె ప్రతిభకు మరింత పదును పెట్టాడు. పాపనాశం శివన్, ముసిరి సుబ్రమణ్య అయ్యర్, జి.ఎన్. బాలసుబ్రమణ్యం వంటి ప్రముఖుల వద్ద కూడా ఆమె సంగీతం అభ్యసించింది.
‘సేవాసదనం’, ‘సావిత్రి’, ‘శాకుంతలై’ వంటి తమిళ చిత్రాల తర్వాత– సి. రాజాజీ, ‘కల్కి’ కృష్ణమూర్తి, సదాశివంల త్రయం ఎం.ఎస్‌ను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని, అందుకు గాను 16వ శతాబ్దపు భక్తి కవయిత్రి ‘మీరా’ జీవితంపై సినిమా తీశారు. 1945లో వచ్చి విశేష ఆదరణ పొందిన ఈ సంగీత చిత్రాన్ని 1947లో హిందీలో పునర్నిర్మించారు. ‘మీరా’ చిత్రం రాత్రికి రాత్రే ఎం.ఎస్.ను దేశమంతటా పరిచయం చేసింది. ఒక రకంగా చెప్పాలంటే టి. సదాశివం ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. దేవదాసి నేపథ్యం ఉన్న ఎం.ఎస్‌ను సంప్రదాయ ‘అయ్యర్’ ఇల్లాలిగాను, శృంగార భావంతో సంగీతం నేర్చుకున్న కళాకారిణిని భక్తిభావానికి ప్రతీకగాను, ఒక తమిళ అమ్మాయిని జాతీయ ఐకాన్‌గాను క్రమపద్ధతిలో తీర్చిదిద్దాడు. ఆమెను 20వ శతాబ్దపు భక్తి ప్రవక్తగా కొనియాడినా, స్త్రీ స్వేచ్ఛకు, గౌరవానికి ప్రతీకగా నిలిచిన కళాకారిణిగానూ గుర్తించాల్సిన అవసరం ఉంది.
గాంధీజీకి ఎమ్మెస్ గానం చాలా ఇష్టం. గాంధీజీ హత్యకు కొన్ని నెలల ముందు ఆయన నుంచి సదాశివంకి ఒక కబురు వచ్చింది– ఎమ్మెస్ నోట ‘హరితుమ్ హారో’ పాటను వినాలని ఉందని. ఆ పాట ఆమెకు రాదని తిరుగు సమాచారం పంపగా, గాంధీజీ ‘‘ఈ పాట ఎమ్మెస్ నోట మాటల్లో చదివినా చాలు ఆమె పాడాలని’’ మళ్ళీ కబురు పంపారు. ఆయన కోరిక మేరకు ప్రత్యేకంగా పాడి చేసిన రికార్డును పంపారు. సరిగ్గా ఆ రోజు అక్టోబర్ 2. అలా ఆ పాట గాంధీకి జన్మదిన కానుకైంది. ఆ తరువాత 1948 జనవరిలో మహాత్ముని మరణ వార్తను ప్రసారం చేసిన ఆకాశవాణి వారు వెంటనే ఆయన కోసం ఎమ్మెస్ గానం చేసిన ‘హరితుమ్ హారో’ ప్రసారం చేసారు. ఇది విన్న సుబ్బులక్ష్మి స్పృహతప్పి పడిపోయింది. ఏడు దశాబ్దాల కాలంలో ఎమ్మెస్ చేసిన కచేరీల సంఖ్య రెండువేల పైచిలుకే. వాటిలో స్వలాభం కోసం చేసినవి పాతికశాతమే. మిగతా కచేరీలన్నీ ప్రజాసంక్షేమం కోసం సేకరించే నిధుల కోసం చేసినవే. 1960లలో ఎడిన్‌బరో ఫెస్టివల్, ఐక్యరాజ్యసమితి సాధారణ సభ, తర్వాతి కాలంలో విదేశాల్లో జరిగిన ‘ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా’ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆమె చేసిన కొన్ని ప్రత్యేక ప్రదర్శనలు కర్ణాటక సంగీతానికి ఆమెను నిజమైన రాయబారిగా నిలబెట్టాయి. భారతరత్న, పద్మవిభూషణ్, రామన్ మెగసెసే వంటి అత్యున్నత పురస్కారాలు, పలు గౌరవ డాక్టరేట్లు ఆమెను గుర్తించి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి.
2004 డిసెంబరు 11న తన 88వ ఏట ఎమ్మెస్ మరణించిన తర్వాతి రోజుల్లో చెన్నై దినపత్రికలకు వచ్చిన ఉత్తరాలు ఆమె తన సంగీతం ద్వారా అందరినీ ఎలా ఆకట్టుకుందో నిరూపిస్తాయి. శంకరాభరణంలో ‘సరోజ దళ నేత్రి’, బృందావన సారంగలో ‘శ్రీరంగపుర విహార’, రాగమాలికలో ‘భావయామి రఘురామం’ వంటి కీర్తనల నాదం ద్వారా ఎంతగా గుర్తుండిపోయిందో, సౌజన్యానికి మారుపేరైన కళాకారిణిగా కూడా ఎమ్మెస్ అంతే గుర్తుండిపోయింది.
హెచ్. రమేష్ బాబు
(నేడు ఎమ్మెస్ సుబ్బులక్ష్మి 110వ జయంతి)
ఈ వార్తలు కూడా చదవండి..
ఆళ్ల నాని మృతిని తొలుత గుర్తించింది ‘మ్యాక్సీ’నే: వాచ్‌మన్
మాట తప్పడం, మడమ తిప్పడమే సీఎం రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్: కవిత
For More TG News And Telugu News